భారతీయ దార్శినిక చింతనాధోరణులను, సంస్కృతిని పాశ్యాత్య దేశాలకు తనదైన శైలిలో రచనలద్వారా తెలియజేసిన గొప్పరచయిత, విద్యావేత్త, వేదాంతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు. సంస్కృత భాషలోని భవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులకు (ప్రస్థానత్రయ) ఆంగ్లంలో గొప్ప వ్యాఖ్యానాలు రాసి భారతీయ దర్శనానికి గల విశిష్టతను తాత్విక మూలాలను ఆవిష్కరించి భావవాద కోణంలో భారతీయదర్శనాన్ని రచించి పాశ్చాత్యులు ఆ దర్శనాన్ని ఆసక్తితో అధ్యాయనం చేసేలా కృషిచేసిన వేదాంతి రాధాకృష్ణన్.
ఆయన వల్లనే భారతీయ దర్శనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందనడంలో అతిశయోక్తిలేదు. వారి మేధోసంపత్తిని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా వున్న వివిధ దేశాల్లోని విశ్వవిద్యాలయాలు 110 డాక్టరేట్ పురస్కారాలు అందజేశాయి. ఆయన సుమారు 150 గ్రంథాలు రచించారు. వీటిలో ముఖ్యమైనవి ‘ఇండియన్ ఫిలాసఫీ’, ‘ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్’, ‘ద ఐడియల్ వ్యూ ఆఫ్ లైఫ్’, ‘ఫ్రీడమ్ అండ్ కల్చర్’, ‘మహాత్మాగాంధీ’, ‘గ్రేట్ ఇండియన్’, ‘ది దమ్మపద గౌతమబుద్ద’, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి.
రాధాకృష్ణన్‌గారు మనదేశానికి 1952 నుండి 1962 వరకు ఉపరాష్ట్రపతిగా రెండు పర్యాయాలు పనిచేశారు. 1962లో దేశంలోనే అత్యున్నతమైన పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించారు. ఆ సందర్భంలో దేశవిదేశాల్లో వున్న తనశిష్యులు శ్రేయోభిలాషులు ఆయనను కలిసి మనసారా అభినందించి తన జన్మదినమైన సెప్టెంబర్ 5ను ఆ సంవత్సరం ఘనంగా జరిపేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానీ తన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే తాను ఆనందిస్తానని రాధాకృష్ణన్ అన్నారు. దాంతో నాటినుండి సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయదినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకోవటం ప్రారంభమైంది.
రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుత్తణి పట్టణంలో జన్మించారు. ప్రాథమిక విద్యను తిరువళ్లూరులో, పాఠశాల, ఉన్నత విద్యను రేణిగుంటలో.. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసుకొని మద్రాసు యూనివర్సిటీలో తన అభిమాన విషయమైన తత్వ శాస్త్రంలో ఎమ్మే పట్టా పొందారు. 1921లో ప్రతిష్ఠాత్మకమైన 5వ కింగ్‌జార్జ్ ఆచార్యపీఠాన్ని కలకత్తా విశ్వవిద్యాలయంలో అధిష్టించారు. 1929లో ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ కాలేజి ప్రిన్సిపల్‌గా, ఆ పిదప ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆచార్యుడుగా పనిచేశారు. 1931లో సర్వేపల్లికి ‘సర్’ బిరుదు లభించింది. ఆయన మైసూరు, కలకత్తా, మద్రాసు, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలలో ఆచార్యుడుగా పనిచేసి 1931లో ఆంధ్రాయూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
1954లోనే దేశంలో అత్యున్నత ప్రభుత్వ పురస్కారమైనటువంటి భారతరత్నను అందుకొని 1962లో రాష్ట్రపతిగా ఎన్నికయినప్పుడు.. ‘ప్లేటో కలలుగన్న ఫిలాసఫర్ కింగ్’ అనే ఊహ సాకారమైనట్లుగా పలువురు విద్యావేత్తలు అమితానందం పొందారు. ఉపాధ్యాయునికి ఉండాల్సిన లక్షణాలు, ఆశయాలు, విధులకు సంబంధించిన అంశాలన్నింటిని రాధాకృష్ణన్ తాను సమర్పించిన ‘విశ్వవిద్యాలయాలు విద్యావిధానం’ అనే నివేదికలో స్పష్టంగా వివరించారు.
విద్యాబోధనలో మాతృభాషకు ప్రాధాన్యతనిచ్చి స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం, సహజన్యాయం వంటి ప్రజాస్వామ్య విలువలను వర్సిటీలు సంరక్షించాలి. తద్భిన్నంగా నేడు పలువురు ఉపాధ్యాయులు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ ప్రభావాలతో స్వప్రయోజనాలకు అధిక ప్రాధాన్యతనివ్వడంతో ఉపాధ్యాయవృత్తి మసకబారుతుంది. బోధన ప్రమాణాలు, విద్యాప్రమాణాలతోపాటు సామాజిక, నైతిక విలువలు క్షీణించిపోతున్న ఈ తరుణంలో ఉపాధ్యాయదినోత్సవం ఉపాధ్యాయులకు తమ విధులను, బాధ్యతలను గుర్తు చేయడంలో స్ఫూర్తిదాయకంగా నిలవాలి. (నేడు ఉపాధ్యాయ దినోత్సవం)
వ్యాసకర్త: ప్రొఫెసర్ జి. లక్ష్మణ్,
తత్వశాస్త్ర విభాగాచార్యులు, ఓయూ
మొబైల్ : 98491 36104
Comments
Please login to add a commentAdd a comment