ఆయన ఓ తత్వవేత్త.. ఓ రాజనీతిజ్ఞుడు... అన్నింటికీ మించి ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు. విద్యార్థులంటే ఆయనకు అంతులేని ప్రేమ.. ఆయన అంటే విద్యార్థులకు ఎనలేని గౌరవం. విద్యార్థుల్ని ఉత్తమపౌరులుగా తీర్చినప్పుడే భవిష్యత్తు భారతం బాగుంటుందని భావించిన ఉత్తమ టీచర్ ఆయన.. అందుకే ఆయన పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం.
సెప్టెంబరు 5 అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పుట్టిన రోజును ఏటా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఉన్నతమైన ఆదర్శాలు నెలకొల్పిన ఉపాధ్యాయుడిగా, విద్యావేత్తగా సర్వేపల్లికి అందించే నిజమైన నివాళిగా దీనిని అభివర్ణిస్తారు. ఆయనకు 77 ఏళ్లు వచ్చినప్పటి నుంచి అంటే 1962 సెప్టెంబరు 5 నుంచి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. .
► సెప్టెంబరు 5న 1888లో జన్మించిన సర్వేపల్లి ... దేశం గర్వించదగ్గ మేధావిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన సర్వేపల్లికి విద్యార్థులంటే పంచప్రాణాలు. విద్యార్థులకు కూడా ఆ మాస్టరుగారంటే చెప్పలేంత గౌరవం. అలా విద్యార్థుల ఆదరాభిమానాలు పొందిన ఉత్తమ ఉపాధ్యాయుడు సర్వేపల్లి.
► విలువైన విద్యకు సర్వేపల్లి ప్రతిరూపం. విలువలున్న విద్యను ప్రోత్సహించాలన్నది ఆయన జీవితాశయం. అక్షరాశ్యతలో దేశం దూసుకుపోవాలన్నది ఆయన ఆకాంక్ష. యువతకు విద్యాబుద్ధులు నేర్పించడంలో... వారిని సరైన దిశలో పయనించేలా చేయడంలో పాటించిన నిబద్ధతకు గౌరవసూచికంగా ఆయనను గౌరవించుకుంటున్నాం. అందుకే ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
► మైసూరు, కలకత్తా యూనివర్శిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా పనిచేసిన సర్వేపల్లి...ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలోనూ తత్వశాస్త్రాన్ని బోధించారు. బెనారస్, ఆంధ్రా యూనివర్శిటీలకు వైస్ చాన్సలర్‌గా పనిచేశారు. తత్వశాస్త్రంపై ఎన్నో పుస్తకాలు రాశారు. సాహిత్యంలో 16 సార్లు, శాంతి కేటగిరీలో 11 సార్లు... ఇలా 27 సార్లు ప్రతిష్ఠాత్మక నోబెల్ ప్రైజ్ కోసం సర్వేపల్లి పేరు నామినేట్ కావడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవం.
► సోవియట్ యూనియన్‌కు రాయబారిగా కూడా ఆయన పనిచేశారు. అన్నింటికన్నా మిన్నగా దేశానికి తొలి ఉపరాష్ట్రపతిగా ...రెండో రాష్ట్రపతిగా పదవీబాధ్యతలు చేపట్టి ఆ పదవులకే వన్నెతెచ్చారు సర్వేపల్లి. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు అందుకున్న భారత రత్నం ఆయన.
-బొబ్బిలి శ్రీధరరావు
Comments
Please login to add a commentAdd a comment