Best Teacher
-
చదువులో కాదు.. అనుభవంలో ...
త్యాగరాజ స్వామి ఒక కీర్తనలో...‘‘గురులేక ఎటువంటి గుణికి తెలియగబోదు... కఱుకైన హృద్రోగ గహనమును గొట్ట....’’ అంటారు. ఎటువంటి గుణాలయినా ఉండొచ్చు. ఎంత తెలివిగలవాడయినా కావొచ్చు. ఏది తెలియాలో అది తెలియాలంటే మాత్రం గురువు ఉండి తీరాలి. ఏది తెలియాలి... అంటే.. కరుకైన హృద్రోగమును గహనమును కొట్ట... హృద్రోగం చాలా కరుకైనదే.. ఊపిరి అందని వాడికి అది పరీక్షాకాలం... ఇంతమందిని విడిచిపెట్టి పోతున్నానన్న భావన.. అది కరుకైనది... దానిని గహనమున కొట్ట... అంటే అరణ్యంలా.. ఎలా చేస్తున్నాడో తెలియకుండా దానిని కొట్టగలిగినవాడు గురువు... అన్నాడు. తెలియని విషయాలు తెలియుకుండా పోవడం... తెలియవు అన్నంత వరకు పనికొస్తాయేమో గానీ.. ఆత్మ అనుభవం లోకి రావడం... అద్వైతానుభూతిని పొందడం... అన్న దగ్గరకు వస్తే అది గురువుగారి వీక్షణములచేత మాత్రమే సాధ్యమవుతుంది.. అంటాడు త్యాగయ్య. అమ్మవారిని మూడు రకాలుగా – కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అని... అక్షి సంబంధంగా పిలుస్తారు. ఆమె గురు మండల రూపిణి. గురువులు కూడా మూడు రకాలుగా అను గ్రహిస్తారు. కామాక్షి–కుక్కుట న్యాయం.. అలాగే గురువు హస్త మస్తక సంయోగంలో శిష్యుడి బ్రహ్మస్థానం లో తన చేతిని ఉంచి అనుగ్రహిస్తాడు. అది పక్షి గుడ్డును పొదిగి దాని నుంచి పిల్ల వచ్చేటట్లుగా చేయడంలాగా ఉంటుంది. అలా పొదుగుతాడు శిష్యుడిని. అదే స్పర్శ దీక్ష. రెండవది మీనాక్షి. విజ్ఞాన శాస్త్రంలో ఎలా ఉందనే విషయం పక్కనబెడితే యోగశాస్త్రంలో చెప్పిన ప్రకారం చేపగుడ్లు పెట్టి, వాటిని ప్రేమగా చూసిన మాత్రం చేత అవి పిల్లలవుతాయి.. అంటుంది. అలా గురువు కేవలం తన చూపులతో శిష్యుణ్ణి అనుగ్రహిస్తాడు. అలా భగవాన్ రమణులు ఒకసారి అనుగ్రహించారు. అది మీనాక్షి. మూడవది విశాలాక్షి. బ్రహ్మాండం ఎంతవరకు ఉంటుందో అంతవరకు పరదేవత చూస్తుంటుంది. అందరూ తన బిడ్డలే అన్న స్మరణతో అనుగ్రహిస్తుంటుంది. ‘వాడు వృద్ధిలోకి రావాలి’ అని గురువు గారు సంకల్పించినంత మాత్రం చేత శిష్యుడు ఆ స్థితిని పొందుతాడు. అది విశాలాక్షీ తత్త్వం. నిజానికి కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి... ఈ మూడూ కూడా శిష్యుడి వైపునుంచి గురువుకు, గురువు వైపునుంచి శిష్యుడికి ఉంటాయి. అదొక విచిత్రం. తెలిసినా తెలియక పోయినా నన్ను గురువుగారు ఒకసారి ముట్టుకుంటే చాలు, చూస్తే చాలు, స్మరిస్తే చాలు.. అన్న నమ్మకం ఉంటే... వాడు గురి కలవాడు. ఎవరి మీద అది ఉందో వారు గురువయిపోతారు. వాడి కరుకైన హృద్రోగమును గహనమును కొట్ట... అంటే అలా కొట్టగలిగినవాడు గురువు.. అంటున్నాడు త్యాగరాజు. అజ్ఞాన గ్రంథులను తొలగించి జ్ఞానాన్ని కలుగ చేయాలి అంటే... ఒక సద్గురువు ఉండాలి. అప్పుడు భగవంతుని దర్శనం.. ఆత్మ అనుభవంలోకి వచ్చి... శాశ్వతమైనది, సత్యమైనది, నిత్యమైనది, నిరంజనమైనది, నిష్కళంకమైనది... అయిన ఆత్మ నేను తప్ప శరీరం కాదు... అని శ్లోకాల్లో చెప్పినవి, నోటితో చెప్పినవి కాక.. అనుభవంలో తెలుసుకుంటాడు శిష్యుడు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Teachers Day 2022: ఆచార్య దేవోభవ!
ఆయన ఓ తత్వవేత్త.. ఓ రాజనీతిజ్ఞుడు... అన్నింటికీ మించి ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు. విద్యార్థులంటే ఆయనకు అంతులేని ప్రేమ.. ఆయన అంటే విద్యార్థులకు ఎనలేని గౌరవం. విద్యార్థుల్ని ఉత్తమపౌరులుగా తీర్చినప్పుడే భవిష్యత్తు భారతం బాగుంటుందని భావించిన ఉత్తమ టీచర్ ఆయన.. అందుకే ఆయన పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. సెప్టెంబరు 5 అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పుట్టిన రోజును ఏటా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఉన్నతమైన ఆదర్శాలు నెలకొల్పిన ఉపాధ్యాయుడిగా, విద్యావేత్తగా సర్వేపల్లికి అందించే నిజమైన నివాళిగా దీనిని అభివర్ణిస్తారు. ఆయనకు 77 ఏళ్లు వచ్చినప్పటి నుంచి అంటే 1962 సెప్టెంబరు 5 నుంచి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. . ► సెప్టెంబరు 5న 1888లో జన్మించిన సర్వేపల్లి ... దేశం గర్వించదగ్గ మేధావిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన సర్వేపల్లికి విద్యార్థులంటే పంచప్రాణాలు. విద్యార్థులకు కూడా ఆ మాస్టరుగారంటే చెప్పలేంత గౌరవం. అలా విద్యార్థుల ఆదరాభిమానాలు పొందిన ఉత్తమ ఉపాధ్యాయుడు సర్వేపల్లి. ► విలువైన విద్యకు సర్వేపల్లి ప్రతిరూపం. విలువలున్న విద్యను ప్రోత్సహించాలన్నది ఆయన జీవితాశయం. అక్షరాశ్యతలో దేశం దూసుకుపోవాలన్నది ఆయన ఆకాంక్ష. యువతకు విద్యాబుద్ధులు నేర్పించడంలో... వారిని సరైన దిశలో పయనించేలా చేయడంలో పాటించిన నిబద్ధతకు గౌరవసూచికంగా ఆయనను గౌరవించుకుంటున్నాం. అందుకే ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ► మైసూరు, కలకత్తా యూనివర్శిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా పనిచేసిన సర్వేపల్లి...ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలోనూ తత్వశాస్త్రాన్ని బోధించారు. బెనారస్, ఆంధ్రా యూనివర్శిటీలకు వైస్ చాన్సలర్‌గా పనిచేశారు. తత్వశాస్త్రంపై ఎన్నో పుస్తకాలు రాశారు. సాహిత్యంలో 16 సార్లు, శాంతి కేటగిరీలో 11 సార్లు... ఇలా 27 సార్లు ప్రతిష్ఠాత్మక నోబెల్ ప్రైజ్ కోసం సర్వేపల్లి పేరు నామినేట్ కావడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవం. ► సోవియట్ యూనియన్‌కు రాయబారిగా కూడా ఆయన పనిచేశారు. అన్నింటికన్నా మిన్నగా దేశానికి తొలి ఉపరాష్ట్రపతిగా ...రెండో రాష్ట్రపతిగా పదవీబాధ్యతలు చేపట్టి ఆ పదవులకే వన్నెతెచ్చారు సర్వేపల్లి. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు అందుకున్న భారత రత్నం ఆయన. -బొబ్బిలి శ్రీధరరావు -
రఘురాం అంకితభావం.. ఆదర్శం
సాక్షి, జడ్చర్ల: విధి నిర్వహణలో అంకితభావం.. దానికి తోడు సేవాదృక్పథం కలిగి ఉండటంతో రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యాడు జడ్చర్ల ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ కళాశాల అధ్యాపకుడు రఘురాం. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరి చిత్రా రామచంద్రన్ ప్రకటించిన ఉత్తమ అధ్యాపకుల జాబితాలో ఆయనకు చోటు దక్కింది. కరోనా పరిస్థితులతో అవార్డును డీఐఓ ద్వారా నేరుగా కళాశాలకు పంపించి అందజేయనున్నారు. ఉమ్మడి జిల్లాల ఒక్కరికే అవకాశం.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్కరికే వచ్చిన ఈ అవార్డు త్వరలోనే రఘురాం అందుకోనున్నారు. మహబూబ్‌నగర్ ఎన్టీఆర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న జడ్చర్ల అనంతరామయ్య 2005లో అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతితో కారుణ్య నియామకం ద్వారా ఆయన కుమారుడు రఘురాం ఎల్డీసీగా వంగూరులో ఉద్యోగంలో చేరారు. తిమ్మాజిపేటలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి 2014లో ఖిల్లాఘనపూర్ కళాశాలకు పదోన్నతిలో లెక్చరర్‌గా బదిలీపై వెళ్లారు. 2018 జూన్‌లో జడ్చర్ల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు బదిలీపై వచ్చారు. బదిలీపై వచ్చిన సమయంలో కళాశాలలో కేవలం 75మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 375కు చేరింది. స్పందించిన ఎమ్మెల్యే.. కో ఎడ్యుకేషన్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన అధ్యాపకుడు రఘురాం సేవలతో స్పందించిన జడ్చర్ల ఎమ్మెల్యే డా. లక్ష్మారెడ్డి ప్రభుత్వ బాలికల కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. ఆయన సొంత ఖర్చులతో భోజన వసతి కల్పించారు. మధ్యాహ్న భోజనానికి రాష్ట్రవ్యాప్త అమలుకు శ్రీకారం.. జూలై 17వ తేదిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జడ్చర్ల బొటానికల్ గార్డెన్ నిర్వాహకుడు వృక్షశాస్త్ర అధ్యాపకుడు డా.సదాశివయ్యతో కలసి సీఎం కేసీఆర్‌ను రఘురాం కలిశారు. దీంతో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు బాగున్నాయని సీఎం కేసీఆర్ అభినందించారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న బోజనం ఆవశ్యకత ఉందని గ్రహించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయిస్తానని ప్రకటించారు. నాన్న స్ఫూర్తితోనే.. నాన్న ఆశయాల సాధనకోసమే సేవ చేయాలని తలంచాను. జడ్చర్ల కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సంకల్పించి మధ్యాహ్న భోజనం, యూనిఫాంలను ఉచితంగా అందించాను. తోటి అధ్యాపకులు, ప్రిన్సిపాల్ సహకారంతో ముందుకెళ్తున్నాం. నా సేవలకు గుర్తింపుగా వచ్చిన ఈ అవార్డు మా నాన్నకే అంకితం. – రఘురాం, గణిత అధ్యాపకుడు, జడ్చర్ల కో ఎడ్యుకేషన్ కళాశాల -
సర్కారీ బడుల తీరు మారింది
కాశీబుగ్గ: రాష్ట్రంలో విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమ బోధన ప్రవేశపెట్టడం.. పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా మన రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకు రావడం ఆహ్వానించదగిన పరిణామమని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన కాశీబుగ్గ ప్రభుత్వ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు ఆసపాన మధుబాబు అన్నారు. అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆదివారం ఆయన విద్యా రంగంలోని పరిస్థితులపై ‘సాక్షి’తో మాట్లాడారు. ► కాశీబుగ్గ ప్రభుత్వ పాఠశాలలో ఐదేళ్లుగా ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. ఆంగ్లమంటే భయపడే విద్యార్థులను 10/10 సాధించే విధంగా తీర్చిదిద్దాను. విద్యార్థుల కోసం సొంతల్యాబ్, సొంత ప్రణాళికతో ముందుకెళ్లాను. సండే క్లాసెస్, నైట్ విజిట్, అదనపు తరగతుల నిర్వహణ, క్లాస్ థియేటర్, స్నేహపూర్వక వాతావరణంలో సరదాగా ఆంగ్లం నేర్పించడం, డిజిటల్ బోధన, లాంగ్వేజ్ గేమ్స్ వంటి వాటితో జిల్లా ఉత్తమ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నాను. ఇప్పుడు జాతీయ కమిటీ గుర్తించడంతో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వరించింది. ► ఆంగ్ల మాధ్యమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తే విద్యార్థితో పాటు, జిల్లా, రాష్ట్రం బాగుపడతాయి. ఆంగ్లాన్ని ఆపితే మన అభివృద్ధిని ఆపినట్టే. ఆంగ్లంపై భయం పోగొట్టి పునాది స్థాయి నుంచి బోధిస్తే అనర్గళంగా చదవడం, రాయడం వస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం అంగన్వాడీ స్థాయి నుంచి ప్రీ ప్రైమరీ పేరుతో శిక్షణ ఇచ్చి అమలు చేయనుంది. ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల పుస్తకాలలో పక్కనే తెలుగులో వివరణ ఉంటుంది. అందుచేత ఆంగ్ల మాధ్యమంతో తెలుగు పిల్లలు ఇబ్బందులు పడరు. ► నాడు–నేడు కార్యక్రమం అమలు చేయడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాఠశాలలపై ప్రత్యేకమైన శ్రద్ధతో దీనిని తలపెట్టారు. కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితుల నుంచి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావడం సంతోషకరం. పాఠశాల తరగతి, పుస్తకాలు, యూనిఫాం, బెంచ్‌లు, డిజిటల్ తరగతులు, విద్యార్థులకు మారిన భోజన మెనూ, కానుకగా పాఠశాల కిట్, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన ఇవన్నీ విద్యావిధానాన్ని మార్చనున్నాయి. ► కేంద్ర విధానాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను కలుపుకుని కొత్త విధానాలు ప్రవేశపెట్టారు. వీటి అమలుతో విద్యార్థులకు ఒత్తిడి లేకుండా చక్కగా చదువుకునే అవకాశం కలుగుతుంది. ► మా స్వగ్రామం కాపుతెంబూరు. నా చదువు మొత్తం ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. మా నాన్న టీచర్. ఆయనే నా గురువు. ఆంగ్లంలో రెండు పీజీలు చేశాను. నా భార్య తేజేశ్వరి. ఇద్దరు కుమారులు జ్ఞానసాయి, శ్రీహర్ష. -
ఆ హెచ్ఎం తీరు.. ప్రత్యేకం
పాల్వంచరూరల్: ఆ హెడ్మాస్టర్ స్టైలే వేరు. అందరి ఉపాధ్యాయుల మాదిరిగా కూర్చీలో కూర్చో కుండా.. నేలపైనే కూర్చొని విద్యాబోధన చేస్తారు. పాల్వంచ మండలం సంగం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిలో హెచ్ఎం లాల్‌సయ్యద్ అనేక సంవత్సరాలుగా నేలపైనే కూర్చొని పాఠాలు బోధిస్తున్నారు. ఈయన గతంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా అందుకున్నారు. పాఠాలు బోధించేటప్పుడు నేలపైనే కూర్చొంటే విద్యార్థులు తనతో కలిసిపోతారని, మరింత శ్రద్ధతో వింటారని హెచ్ఎం తెలిపారు. ఏళ్ల నుంచి తాను అలాగే పాఠాలు బోధిస్తున్నట్లు వివరించారు. -
ఈ బంధం.. ఎందరికో ఆదర్శం
పేదరికంతో తాను చదువుకోలేక పోయాననే బాధను దిగమింగుకుని.. ఓ శిష్యున్ని తన కష్టార్జితంతో ఉన్నత శిఖరాలకు చేర్చిన ఓ గురువు జీవత గాథ ఇది. నా శిష్యుడిని గొప్ప శాస్త్రవేత్తను చేయాలనే ఆ గురువు తపన.. గురువు లక్ష్యానికి అనుగుణంగా శిష్యుడి కష్టం.. వెరసి ఈ అనుబంధం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ గురు శిష్యుల బంధంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.... కష్టాల కడలిని జయించి.. జనగామ : వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి చెందిన నాసం రాజయ్య, సరోజని దంపతుల కుమారుడు నాసం రమేష్ 7వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు. పేదరికంలో పుట్టిన ఆ బిడ్డకు మంచి విద్యను అందించాలనే తపనతో తల్లిదండ్రులు గీతాంజలి ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతిలో చేర్పించారు. కూలీ పని చేస్తూ కొడుకును చదివించుకున్నారు. చదువుకోవాలనే తపన ఉన్నా... ఆర్థికంగా వెనకబడి.. తల్లిదండ్రులతో కలిసి పనికి వెళ్లేవాడు. పని చేస్తూనే పదో తరగతి పూర్తి చేశాడు. ఈ సమయంలోనే కొంతమంది స్నేహితులు, గురువులు కొంతం రవీందర్, బొల్లెబోయిన. కిషోర్, బండి. శ్రీనివాస్, వంగ రవీందర్.. రమేష్‌ను వెన్నుతట్టి ముందుకు నడిపించారు. గీతాంజలి స్కూల్లోనే పీఈటీగా(ప్రైవేటు) పోస్టింగ్ ఇప్పించారు. విద్యార్థులకు శిక్షణ ఇస్తూనే... రమేష్ పోలీసు జాబ్ కోసం అహోరాత్రులు కష్టపడి చదివాడు. రెండున్నరేళ్ల పాటు స్కూల్లోనే పని చేస్తూ... 2004లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా ఎంపికయ్యాడు. శిష్యుడికి చేయూత.. గీతాంజలి స్కూల్లో నాసం రమేష్ పని చేస్తున్న సమయంలో సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన బుట్టి రమేష్ చదువుకునే వాడు. బుట్టి రమేష్‌కు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడే తన తండ్రి గుండె పోటుతో చనిపోయాడు. అప్పటి నుంచి తల్లి మల్లికాంబ కూలీ పని చేస్తూ.. కొడుకును చదివించింది. కుటుంబ పోషణ భారమవడంతో.. కుమారుడిని ఏడో తరగతిలోనే చదువు మాన్పించే ప్రయత్నం చేసింది. దీంతో అదే పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్న గురువు నాసం రమేష్‌ను శిష్యుడు బి.రమేష్ (విద్యార్థి) కలిసి.. తన బాధను చెప్పకున్నాడు. అప్పటి నుంచి ఆ విద్యార్థిని నాసం రమేష్ తన సొంతఖర్చులతో బాగా చదివించాడు. తాను చేరలేని లక్ష్యాన్ని శిష్యుడైనా చేరుకోవాలనే లక్ష్యంతో ప్రోత్సహించాడు. బుట్టి రమేష్ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఏపీలోని కర్నూల్ ఏపీఆర్జేసీ ఎంట్రన్స్‌లో జీవరసాయన శాస్త్రంలో ఉస్మానియా రీజియన్‌లోనే మొదటి ర్యాంకు సాధించాడు. ఆ తర్వాత హైదరాబాద్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో అడ్మిషన్ లభించింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. శిష్యుడు రమేష్ పూణేలోని ‘నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్’ గేట్లో 129 ఆల్ ఇండియా ర్యాంక్‌తో పాటు ఐసీఎంఆర్, జేఆర్ఎఫ్ సాధించి.. తనపై గురువు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇందులోనే రమేష్‌కు క్యాన్సర్‌పై రీసెర్చ్ చేయడానికి అవకాశం రావడంతో.. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సైనికుడిగా నేను, శాస్త్ర వేత్తగా నా శిష్యుడు.. భారతమాత రుణం తీర్చుకోవాలి. మా మనసులు వేరైనా.. ఆలోచన, లక్ష్యం, కష్టం, బాధ్యత మాత్రం ఒక్కటిగా పంచుకున్నాం. నేను నెరవేర్చలేకపోయిన ఆశయాన్ని మా శిష్యుడు సాధిస్తున్నాడు. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాత.. శిష్యుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. మా పదహారేళ్ల ప్రయాణంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. వాటిని ఇష్టంగా స్వీకరిస్తూ.. ముందుకు వెళ్లాం. నా శిష్యుడిని గొప్ప శాస్త్ర వేత్తగా తయారుచేసి, జీవశాస్త్రంలో నోబెట్ బహుమతి సాధించేలా చేయాలన్నదే నా లక్ష్యం. – నాసం రమేష్, గురువు, సీఆర్పీఎఫ్ జవాన్ రమేష్సార్ మార్గదర్శకత్వమే నాకు బలంతల్లి బడికి వద్దురా బిడ్డా అన్న సమయంలో రమేష్ సార్ కనిపించి వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఆ రోజును నేను మరచిపోలేను. రమేష్ సర్ క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవారు. ఒక వ్యక్తి జీవితంలో పైకి రావడానికి కావాల్సినవి పట్టుదల, మార్గదర్శకత్వం. నాకు పట్టుదల ఉంది, రమేష్ సార్ నాకు మార్గదర్శనం చేశారు. అదే నా బలమైంది. సాధారణ విద్యార్థిని అయినా.. నా గురువు గొప్పమనిషిగా నన్ను తీర్చి దిద్దడానికి ప్రయత్నాలు కొనసాగించారు. జీవితంలో వైఫలాలు ఉన్నా.. తనకు మాత్రం ఏ లోటు చేయలేదు. కుటంబ సభ్యుడిగా ఆరాధించారు. నా బంధువులు సహాయం చేసే స్థితిలో ఉన్నప్పటికీ ఎవరూ కూడా అండగా నిలబడలేదు. తన ప్రతి విజయం వెనక సార్ ప్రోత్సాహం కనిపిస్తుంది. గురువు అనే వ్యక్తి తనకు ఉన్న లక్ష్యాలను నెరవేర్చుకోలేకపోయినా.. ఆ లక్ష్యాలను చేరుకునేలా గొప్ప విద్యార్థులను తయారు చేయగలరని నిరూపించాడు మా రమేష్ సార్. – బుట్టి రమేష్, శిష్యుడు -
వినూత్న బోధనకు విశిష్ట పురస్కారం
ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభాకర్ కౌడిపల్లి : వినూత్న పద్ధతిలో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయునికి రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట పురస్కారం దక్కింది. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పడు నివృత్తి చేస్తూ కొత్త పద్ధతిలో విద్యార్థులకు సులభంగా స్పష్టంగా అర్థమయ్యేలా విద్యాబోధన చేస్తున్నందకుగా మండలంలోని తునికి వద్దగల ఎంజేపీటీబీసీ డబ్ల్యూ ఆర్ఎస్ (మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ మత్స్యకారుల గురుకుల పాఠశాల)లో విధులు నిర్వహిస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ప్రభాకర్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైదరాబాద్‌లో ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించనుంది. మండలంలోని తునికి గురుకుల పాఠశాలకు గతేడాది బదిలీపై వచ్చిన ప్రభాకర్ జీవశాస్త్రంలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించేవారు. పాఠాలతోపాటు స్కూల్ దశలోనే ప్రాక్టికల్స్ చేసి చూపుతున్నారు. దీంతో విద్యార్థులకు పాఠాలు విన్నదానికి కన్నా ప్రయోగాత్మకంగా చేసి చూపించడంతో విషయం సులభంగా అర్థమవుతోంది. గురుకులంలో ప్రాక్టికల్స్ మెటీరియల్ లేకపోవడంతో ప్రిన్సిపాల్ తిరుపతి, గురుకుల పాఠశాల కార్యదర్శి మల్లయభట్టుతో చర్చించి సుమారు రూ. 4లక్షలతో సైన్స్ పరికరాలను తెప్పించి విద్యార్థులకు బోధిస్తున్నారు. విద్యాబోధనలో లోకాస్ట్ మెటీరియల్ వాడుతూ బోధనోపకరణలతో బోధించడం వల్ల విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకుంటున్నారు. విద్యాబోధన ఇలా.. విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో ఉపాధ్యాయుడు ప్రభాకర్ తరగతి గదిలో ఎన్నో వినూత్న ప్రక్రియలతో బోధిస్తాడు. ఉదాహరణకు శ్వాసక్రియ పాఠ్యాంశం బోధించేందుకు ఏకంగా మేకకు చెందిన శ్యాస వ్యవస్థను తీసుకువచ్చి అందులో స్వయంగా గాలి ఊది విద్యార్థులతో చేయించడంతో పాటు శ్యాస వ్యవస్థలోని భాగాలు, ప్రక్రియ అందులోని అవయవాలను వివరించి వినూత్నంగా బోధిస్తాడు. దీంతో విద్యార్థులకు సులభంగా అర్ధమవుతుంది. ఇలాంటి ప్రయోగాలు ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో మాత్రమే చేయిస్తారు. దీంతో ప్రభుత్వం ప్రభాకర్ ప్రతిభను గుర్తించింది. గతంలో ఆయన ఖమ్మం జిల్లాతోపాటు మెదక్ జిల్లాలో బొమ్మల రామారం, తూప్రాన్, మెదక్ బాలికల గురుకుల పాఠశాలలో సైతం విధులు నిర్వహించారు. రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌లో సైతం విద్యార్థులు పాల్గొనేలా చేసి బహుమతులు అందుకున్నారు. జిల్లాస్థాయితోపాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. అవార్డు రావడం సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ తనను ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తించడం సంతోషంగా ఉంది. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా తనకు తోచిన ఆలోచన ప్రకారం బోధనోపకరణలతో విద్యాబోధన చేస్తా. విద్యార్థులతోపాటు తోటి సిబ్బందితో స్నేహభావంతో మెలగడంవల్ల విద్యార్థుల సమస్యలను తెలియ చేస్తారు. దీంతో సులభంగా వారి సందేహాలను నివృత్తి చేస్తా. - ప్రభాకర్, గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు -
‘ఉప్పాల’కు ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు
గుంటూరు ఎడ్యుకేషన్ : గుంటూరు జిల్లా నుంచి జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఉప్పాల రామమోహనరావు సోమవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఉప్పాల యడ్లపాడు మండలం జగ్గాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. -
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా వేణు
నయీంనగర్/ఆత్మకూరు : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆత్మకూరు మండలం పులుకుర్తి జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన జీవశాస్త్రం స్కూల్ అసిస్టెంట్ పరికిపండ్ల వేణు ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా నుంచి వేణు జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైనట్లు కేంద్ర మానవవనరుల శాఖ వెబ్సైట్లో పేర్కొంది. సెప్టెంబర్ 5వ తేదీన జరిగే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ఢిల్లీలో ఆయన అవార్డు స్వీకరించనున్నారు. తెలంగాణలో మొత్తం ఏడుగురు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాగా.. మన జిల్లా నుంచి వేణు ఎంపికయ్యారు. ఇదిలా ఉండగా, వేణు 2003లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2008లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా, ఇదే ఏడాది ఇందిరా ప్రియదర్శిని అవార్డులను అందుకున్నారు. కాగా, 2001 జనాభా గణనలో ఉత్తమ సేవలు అందించినందుకు కేంద్ర ప్రభుత్వ ఉత్తమ ఎన్యూమరేటర్‌గా వెండి పతకం, ప్రశంసపత్రంతో సత్కరించింది. వీటితోపాటు ఆయన మరెన్నో అవార్డులు, ప్రశంసాపత్రాలు స్వీకరించారు. ప్రధానంగా 2014లో ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పాఠశాలకు నిర్విరామంగా హాజరై జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొం దారు. జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా వేణు ఎంపిక కావడంపై అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. -
జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా బుచ్చిరెడ్డి ఎంపిక
మిడ్జిల్: జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు మండలంలోని దోనూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బుచ్చిరెడ్డి ఎంపికైనట్లు పీఆర్టీయూ మండల అధ్యక్షుడు ఎల్లయ్య తెలిపారు. మండలలోని గుడిగాన్‌పల్లి గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి గతేడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడంపై మండల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తంచేశారు. అవార్డును సెప్టెంబర్ 5వ తేదీన డిల్లీలో రాష్ట్రపతి చేతులమీదుగా అందుకోనున్నారని ఆయన తెలిపారు. -
అమ్మనే ఉత్తమ గురువు
నేను ఈ స్థాయికి చేరడానికి కారణం అమ్మే: ప్రణబ్ పిల్లలకు పాఠాలు చెప్పిన ప్రథమ పౌరుడు న్యూఢిల్లీ: తాను ఈ స్థాయికి చేరుకున్నాననంటే అదంతా తమ అమ్మ చలవేనని, తనకు అమ్మే ఉత్తమ గురువు అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. ప్రపంచంలో అందరికీ తల్లే ఉత్తమ టీచర్ అని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన ‘బి ఎ టీచర్’ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఎస్టేట్‌లో ఉన్న 'డా.రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయ' పాఠశాలలో ప్రణబ్ టీచర్ అవతారం ఎత్తారు. అక్కడి విద్యార్థులకు చరిత్ర పాఠాలు చెప్పారు. తన చిన్ననాటి అనుభూతులను పంచుకున్నారు. 'చిన్నప్పుడు తుంటరి పనులు చేస్తూ మా అమ్మ చేతిలో దెబ్బలు తిన్నాను. కానీ కొద్దిసేపటికే అమ్మ నన్ను దగ్గరకు తీసుకుని లాలించేది. ప్రతిఒక్కరికీ అమ్మే ఉత్తమ గురువు. మీకు కూడా మీ అమ్మే ఉత్తమ గురువు..' అని చెప్పారు. తన చిన్నతనంలో తండ్రి కమదా కింకార్ జీవితం ఎప్పుడూ పార్టీ కార్యాలయం, జైలు మధ్యే గడిచేదని.. తన తల్లే తనను పెంచిందని చెప్పారు. 'మా ఊళ్లోని తోటి పిల్లలతో కలసి ఆవుల మందల వెంట వెళ్లేవాడిని. ఆడుకునేవాడిని. కానీ నాకు చీకటి అంటే భయం. అందుకే సూర్యాస్తమయం అవుతోందనగానే ఇంటికి తిరిగి వెళ్లేవాడిని. రోజూ ఐదు కిలోమీటర్లు నడిచి బడికి వెళ్లేవాడిని. అంత దూరం ఎందుకు వెళ్లాలంటూ అమ్మను అడిగితే.. తనకు మరో మార్గం లేదని చెప్పేది. ఏదైనా కష్టించి పనిచేయాలని చెబుతూ ఉండేది' అని తెలిపారు. కార్యక్రమంలో ప్రణబ్ 11వ, 12వ తరగతి పిల్లలకు 'భారతదేశ రాజకీయ చరిత్ర' పై గంటపాటు పాఠాలు చెప్పారు. దేశ చరిత్రలో రాష్ట్రపతి పదవిలో ఉండగా విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఇదే తొలిసారి. తాను ఇప్పుడు రాష్ట్రపతిని కాదని, మీకు టీచర్‌నని చెబుతూ.. తనను 'ముఖర్జీ సార్' గా పిలవాలని కోరారు. దేశంలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మీడియా, ఎన్జీవోలు తోడ్పడుతున్నాయని ప్రశంసించారు. మాజీ ప్రధానులు నరసింహారావు, మన్మోహన్సింగ్ల హయాంలో దేశ ఆర్థిక అభివృద్ధికి చేసిన కృషిని కూడా ఆయన పాఠంలో ప్రస్తావించారు. -
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు పేర్లు ఖరారు
హైదరాబాద్: తెలంగాణలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 19 మంది పేర్లను ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 5న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో టీ సర్కారు రూ.10 వేల పురస్కారాన్ని ఎంపికైన వారికి ఇవ్వనుంది. బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో చేసిన సేవలకు ఈ అవార్డులను అందజేస్తోంది.