ఉపాధ్యాయుడు ప్రభాకర్‌కు సన్మానం
- ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభాకర్
కౌడిపల్లి : వినూత్న పద్ధతిలో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయునికి రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట పురస్కారం దక్కింది. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పడు నివృత్తి చేస్తూ కొత్త పద్ధతిలో విద్యార్థులకు సులభంగా స్పష్టంగా అర్థమయ్యేలా విద్యాబోధన చేస్తున్నందకుగా మండలంలోని తునికి వద్దగల ఎంజేపీటీబీసీ డబ్ల్యూ ఆర్ఎస్ (మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ మత్స్యకారుల గురుకుల పాఠశాల)లో విధులు నిర్వహిస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ప్రభాకర్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేసింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైదరాబాద్‌లో ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించనుంది. మండలంలోని తునికి గురుకుల పాఠశాలకు గతేడాది బదిలీపై వచ్చిన ప్రభాకర్ జీవశాస్త్రంలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించేవారు. పాఠాలతోపాటు స్కూల్ దశలోనే ప్రాక్టికల్స్ చేసి చూపుతున్నారు. దీంతో విద్యార్థులకు పాఠాలు విన్నదానికి కన్నా ప్రయోగాత్మకంగా చేసి చూపించడంతో విషయం సులభంగా అర్థమవుతోంది.
గురుకులంలో ప్రాక్టికల్స్ మెటీరియల్ లేకపోవడంతో ప్రిన్సిపాల్ తిరుపతి, గురుకుల పాఠశాల కార్యదర్శి మల్లయభట్టుతో చర్చించి సుమారు రూ. 4లక్షలతో సైన్స్ పరికరాలను తెప్పించి విద్యార్థులకు బోధిస్తున్నారు. విద్యాబోధనలో లోకాస్ట్ మెటీరియల్ వాడుతూ బోధనోపకరణలతో బోధించడం వల్ల విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకుంటున్నారు.
విద్యాబోధన ఇలా..
విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో ఉపాధ్యాయుడు ప్రభాకర్ తరగతి గదిలో ఎన్నో వినూత్న ప్రక్రియలతో బోధిస్తాడు. ఉదాహరణకు శ్వాసక్రియ పాఠ్యాంశం బోధించేందుకు ఏకంగా మేకకు చెందిన శ్యాస వ్యవస్థను తీసుకువచ్చి అందులో స్వయంగా గాలి ఊది విద్యార్థులతో చేయించడంతో పాటు శ్యాస వ్యవస్థలోని భాగాలు, ప్రక్రియ అందులోని అవయవాలను వివరించి వినూత్నంగా బోధిస్తాడు. దీంతో విద్యార్థులకు సులభంగా అర్ధమవుతుంది.
ఇలాంటి ప్రయోగాలు ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో మాత్రమే చేయిస్తారు. దీంతో ప్రభుత్వం ప్రభాకర్ ప్రతిభను గుర్తించింది. గతంలో ఆయన ఖమ్మం జిల్లాతోపాటు మెదక్ జిల్లాలో బొమ్మల రామారం, తూప్రాన్, మెదక్ బాలికల గురుకుల పాఠశాలలో సైతం విధులు నిర్వహించారు. రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌లో సైతం విద్యార్థులు పాల్గొనేలా చేసి బహుమతులు అందుకున్నారు. జిల్లాస్థాయితోపాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు.
అవార్డు రావడం సంతోషంగా ఉంది
రాష్ట్ర ప్రభుత్వ తనను ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తించడం సంతోషంగా ఉంది. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా తనకు తోచిన ఆలోచన ప్రకారం బోధనోపకరణలతో విద్యాబోధన చేస్తా. విద్యార్థులతోపాటు తోటి సిబ్బందితో స్నేహభావంతో మెలగడంవల్ల విద్యార్థుల సమస్యలను తెలియ చేస్తారు. దీంతో సులభంగా వారి సందేహాలను నివృత్తి చేస్తా. - ప్రభాకర్, గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు