సర్కారీ బడుల తీరు మారింది  | Manabadi Nadu Nedu Implementing Is A Good Fortune For Students | Sakshi
Sakshi News home page

సర్కారీ బడుల తీరు మారింది 

Published Mon, Aug 24 2020 8:35 AM | Last Updated on Mon, Aug 24 2020 8:44 AM

Manabadi Nadu Nedu Implementing Is A Good Fortune For Students - Sakshi

కాశీబుగ్గ: రాష్ట్రంలో విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమ బోధన ప్రవేశపెట్టడం.. పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా మన రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకు రావడం ఆహ్వానించదగిన పరిణామమని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన కాశీబుగ్గ ప్రభుత్వ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు ఆసపాన మధుబాబు అన్నారు. అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆదివారం ఆయన విద్యా రంగంలోని పరిస్థితులపై ‘సాక్షి’తో మాట్లాడారు.

కాశీబుగ్గ ప్రభుత్వ పాఠశాలలో ఐదేళ్లుగా ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. ఆంగ్లమంటే భయపడే విద్యార్థులను 10/10 సాధించే విధంగా తీర్చిదిద్దాను. విద్యార్థుల కోసం సొంతల్యాబ్, సొంత ప్రణాళికతో ముందుకెళ్లాను. సండే క్లాసెస్, నైట్‌ విజిట్, అదనపు తరగతుల నిర్వహణ, క్లాస్‌ థియేటర్, స్నేహపూర్వక వాతావరణంలో సరదాగా ఆంగ్లం నేర్పించడం, డిజిటల్‌ బోధన, లాంగ్వేజ్‌ గేమ్స్‌ వంటి వాటితో జిల్లా ఉత్తమ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నాను. ఇప్పుడు జాతీయ కమిటీ గుర్తించడంతో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వరించింది. 

ఆంగ్ల మాధ్యమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తే విద్యార్థితో పాటు, జిల్లా, రాష్ట్రం బాగుపడతాయి. ఆంగ్లాన్ని ఆపితే మన అభివృద్ధిని ఆపినట్టే. ఆంగ్లంపై భయం పోగొట్టి పునాది స్థాయి నుంచి బోధిస్తే అనర్గళంగా చదవడం, రాయడం వస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం అంగన్‌వాడీ స్థాయి నుంచి ప్రీ ప్రైమరీ పేరుతో శిక్షణ ఇచ్చి అమలు చేయనుంది. ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల పుస్తకాలలో పక్కనే తెలుగులో వివరణ ఉంటుంది. అందుచేత ఆంగ్ల మాధ్యమంతో తెలుగు పిల్లలు ఇబ్బందులు పడరు.

నాడు–నేడు కార్యక్రమం అమలు చేయడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాఠశాలలపై ప్రత్యేకమైన శ్రద్ధతో దీనిని తలపెట్టారు. కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితుల నుంచి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావడం సంతోషకరం. పాఠశాల తరగతి, పుస్తకాలు, యూనిఫాం, బెంచ్‌లు, డిజిటల్‌ తరగతులు, విద్యార్థులకు మారిన భోజన మెనూ, కానుకగా పాఠశాల కిట్, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన ఇవన్నీ విద్యావిధానాన్ని మార్చనున్నాయి. 

కేంద్ర విధానాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను కలుపుకుని కొత్త విధానాలు ప్రవేశపెట్టారు. వీటి అమలుతో విద్యార్థులకు ఒత్తిడి లేకుండా చక్కగా చదువుకునే అవకాశం కలుగుతుంది.

మా స్వగ్రామం కాపుతెంబూరు. నా చదువు మొత్తం ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. మా నాన్న టీచర్‌. ఆయనే నా గురువు. ఆంగ్లంలో రెండు పీజీలు చేశాను. నా భార్య తేజేశ్వరి. ఇద్దరు కుమారులు జ్ఞానసాయి, శ్రీహర్ష. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement