ఆచార్య దేవో భవ..! | Funday Cover Story About Teachers Day Special | Sakshi
Sakshi News home page

Teachers Day: ఆచార్య దేవో భవ..!

Published Sun, Sep 4 2022 10:13 AM | Last Updated on Sun, Sep 4 2022 10:18 AM

Funday Cover Story About Teachers Day Special - Sakshi

ఒక వ్యక్తి జీవితం మీద ఉపాధ్యాయుని ప్రభావం ఈ బిందువు దగ్గర అంతమైందని ప్రకటించడం దాదాపు అసాధ్యం. మనిషి జీవితాన్ని శాసించేవి, మార్చేవి, ఉత్థానపతనాలకు దోహదపడేవి విద్య, విజ్ఞానం. నేటితరం బాలలకి విద్యలోని శక్తిని పరిచయం చేసేవారే ఉపాధ్యాయులు. అలా వ్యక్తుల జీవితాలనీ, తద్వారా రేపటి సమాజాన్నీ తేజోమయం చేస్తారు గురువులు.

లేలేత మనసుల పాలిట నైరూప్యచిత్రాల్లా ఉండే పాఠ్యాంశాలను క్రమంగా సుందరచిత్రాల్లా దర్శించే విధంగా వారిని తీర్చిదిద్దుతారు. నేర్చుకోవడం, అభ్యసించడం అనేవి జీవితంలో ప్రధానంగా గురుముఖంగానే జరుగుతాయి. నాగరికత ఆరంభం నుంచి ఉన్న గురువుల వ్యవస్థ ఎప్పటికీ ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయం లేదు. అందుకే నాగరికత అనే జ్యోతి ఆరిపోకుండా తన చేతులొడ్డి రక్షించేవారే గురువులు అంటారు ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ.
- డా. గోపరాజు నారాయణరావు

మారుతున్న కాలాన్ని బట్టి, అవసరాల మేరకు విద్య కొత్త పుంతలు పడుతూనే ఉంటుంది. ఉపాధ్యాయులు కూడా కాలంతో పరుగులు పెట్టాలి. ఇప్పుడు ఉపాధ్యాయుడు అంటే తరగతిలో పాఠం చెప్పి, హోవ్‌వర్క్‌ ఇచ్చి ఇంటికి పంపేవారే కాదు, ఇంటి దగ్గర కూడా విద్యార్థి మెదడు పనిచేసే విధంగా చేయగలిగినవారే.

ఇప్పుడు డిజిటల్‌ టీచర్‌  
ఇవాళ్టి తరగతి గది అంటే రేపటి భారతదేశం. ఆ తరగతి గదికి నాయకుడు ఉపాధ్యాయుడు. విద్యార్థి స్వశక్తి ఏమిటో, అతడిలోని తృష్ణ ఎంతటిదో గుర్తించడం దగ్గర ఉపాధ్యాయుడు విఫలమైతే విద్యార్థి అతడి జీవితంలోనే విఫలమైపోతాడు. ఇలా ఎన్నయినా సంప్రదాయ చింతనతో చెప్పుకోవచ్చు. అలా అని అవి భ్రమలు కూడా కాదు. కానీ ఉపాధ్యాయుడి స్థానంలో వచ్చిన అతి పెద్ద మార్పు 21వ శతాబ్దంలో ఆయన డిజిటల్‌ టీచర్‌గా మారడమే. ఈ నేపథ్యంతో డిజిటల్‌ యుగంలో మారిన ఉపాధ్యాయుని బాధ్యతను ఒక్కసారి పరిశీలించాలి.

21వ శతాబ్దం పెనుమార్పుల వేదిక. నిన్నటి విద్యార్థికీ నేటి విద్యార్థికీ ఎంతో వైరుధ్యం ఉంది. ఇవాళ్టి విద్యార్థి నిన్నటి విద్యార్థి కంటే చాలా పరిణతిని ప్రదర్శిస్తున్నాడు. ప్రపంచ పరిస్థితులు, శాస్త్రసాంకేతిక రంగాలలో సంభవించిన విస్ఫోటం వీళ్లకి ఆ అవకాశాలని దోసిళ్ల నిండుగా అందించాయి. ఈ కాలాన్ని శాసిస్తున్నదే సాంకేతిక పరిజ్ఞానం. ఆ క్రమంలోనే ఉపాధ్యాయుడు అన్న వ్యవస్థ కొత్త అర్థాలను సంతరించుకునే పనిలో నిమగ్నమయింది.

కేవలం రెండు దశాబ్దాల క్రితం ఉపాధ్యాయుని స్థానం నేటి ఉపాధ్యాయుని స్థానం ఒక్కటి కానే కావు. ఆ ఉద్యోగం పరిధి, దానికి ఉండవలసిన దృష్టి అంచనాకు అందనంత మార్పుకు లోనయ్యాయి. ఆలోచించే నైపుణ్యం, జీవించే నైపుణ్యాల మీద ఆధారపడి 21వ శతాబ్దంలో విద్య నిర్మితమవుతున్నది. తరగతి గది నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన విద్యార్థి, బయటి వ్యవస్థల అవసరాలకు ఆసరా కాగల తీరులోనే ఇవాళ్టి చదువు ఉండాలని చెబుతున్నారు. తరగతిలో నేర్చుకున్నది బయటి ప్రపంచంలో విద్యార్థి బతకడానికి ఉపయోగపడినప్పుడే దానికి సార్థకత అన్న దృష్టి ఈ పరిణామం నిండా కనిపిస్తుంది.

కేవలం బోధకుడు కాదు
ఇవాళ్టి ఉపాధ్యాయుడు కేవలం బోధకుడు కాదు. ఉద్యోగితా నైపుణ్యాలను పెంచే బాధ్యతతో పాటు విద్యార్థుల మేధావికాసం, విశ్లేషణాత్మకంగా ఆలోచించేటట్టు చేయడం, సృజనాత్మక దృష్టిని పెంపొందించడం, జీవితాంతం గుర్తుండే విద్యను అందించడం కూడా వారు నిర్వర్తించవలసిన గురుతర బాధ్యతలుగానే మారాయి. గ్లోబల్‌ యుగంలో డిజిటల్‌ ఆధారిత ఉద్యోగితా నైపుణ్యాల సాధనలో విద్యార్థికి నిర్దేశకులుగా ఉండవలసింది ఉపాధ్యాయులే. విద్యార్థుల నైపుణ్యాలు పెంచడానికి తమ నైపుణ్యాలను అవిశ్రాంతంగా పెంపొందించుకోవలసిన యుగంలో ఉపాధ్యాయులు ఉన్నారు. లేకపోతే ఎదురయ్యే ప్రమాదం తక్కువేమీ కాదు. ఇప్పుడు ఉపాధ్యాయునితో సమంగా విద్యార్థి కూడా పరిజ్ఞానం సంతరించుకో గలుగుతున్నాడు. కారణం ఇంటర్నెట్‌తో సాహచర్యం. తన నైపుణ్యానికి సృజనను కలిపి ఉపాధ్యాయుడు విద్యార్థికి జ్ఞానాన్ని అందించాలి. లేకపోతే డిజిటల్‌ యుగంలోను విద్యాధికులైన నిరుద్యోగులు పెరిగిపోతారు. ఇదే అసలు ప్రమాదం.

కోటి మంది ఉపాధ్యాయులు
ఎన్‌సీఈఆర్‌టీ ఏడో సర్వే, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం (2011–12) దేశంలో 10,31,000 పాఠశాలలు (గుర్తింపు కలిగినవి) ఉన్నాయి. 2019లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం 900 విశ్వవిద్యాలయాలు, 40,000 కళాశాలలు ఉన్నాయి. ‘నో టీచర్‌ నో క్లాస్‌ భారత్‌లో విద్య పరిస్థితిపై నివేదిక 2021’ ప్రకారం ప్రస్తుతం దేశంలో 97 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు (ఈ నివేదిక  ప్రకారం మరొక పది లక్షల మంది ఉపాధ్యాయులు అవసరం). టాటా ట్రస్ట్‌లలోని ది టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ ఇనీషియేటివ్‌ (టీఈఐ) ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలను నిలబెడుతూ, ఆధునీకరించడానికి ప్రయత్నిస్తున్న సంస్థ. వీటి ఆధ్వర్యంలో 2018లో స్థాపించిన సంస్థ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌.

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌  కేంద్రంగా ఇది పనిచేస్తున్నది. చిరకాలంగా నిర్లక్ష్యానికి గురైన ఉపాధ్యాయ ప్రతిభను మెరుగుపరచే పనిని ఈ సంస్థ యునెస్కో సహకారంతో చేపట్టింది. ‘నో టీచర్‌ నో క్లాస్‌ భారత్‌లో విద్య పరిస్థితిపై నివేదిక 2021’ ఇది ఇచ్చినదే. మంచి చెడు రెండింటి గురించి బేరీజు వేసుకుని ఈ సంస్థ తన పని సాగిస్తున్నది. 50 శాతం మహిళలతో ఉపాధ్యాయ వృత్తి స్త్రీపురుష నిష్పత్తిని సమంగా నిలబెట్టుకుంటున్నది. గ్రామీణ ప్రాంతం నుంచి యువత, స్త్రీలు ప్రధానంగా ఈ వృత్తిని ఇష్టపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో సామాజిక గౌరవం సాధారణంగానే ఉంది.

దేశంలో ఎక్కువ పాఠశాలలు ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలు ఉపాధ్యాయుడే కేంద్రకంగా పనిచేస్తున్నాయి. వారి నమ్మకాలే బోధనను నిర్దేశిస్తున్నాయని ఆ నివేదిక తేల్చింది. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశం పట్ల ఎక్కువ మంది ఉపాధ్యాయులు సానుకూలంగానే ఉన్నారని ఆ నివేదిక చెప్పడం శుభవార్తే! వీరిలో 25 శాతం విధుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారనీ, 30 శాతం ఈ వృత్తి నుంచి తప్పించదగినవారే ఉన్నారనీ వెల్లడించడం ఆందోళన కలిగిస్తుంది. ఇందుకు కారణం ఇప్పటి వరకు ఉపాధ్యాయుల ప్రతిభకు పదును పెట్టే ప్రత్యేక ప్రయత్నమేదీ జరగలేదు. ప్రపంచ శక్తిగా ఎదగాలని ఆశిస్తున్న భారత్‌ ఈ అంశం మీద ఇక దృష్టి పెట్టక తప్పదు.

ప్రోత్సాహమే సగం విద్య
విద్యార్థి మరొక యుగానికి చెంది ఉంటాడు. కాబట్టి అతడి మీద మీ యుగపు పరిజ్ఞానం మేరకు పరిధులు విధించవద్దు అంటారు రవీంద్రనాథ్‌ టాగోర్‌. నిజమే, విద్యార్థులను ప్రభావితం చేసే శక్తి ఉన్న ఉపాధ్యాయులు నైపుణ్యాన్ని ఇచ్చే వనరుల మీద పరిమితులు విధించరు. ఆ దిశగా ప్రోత్సహిస్తారు కూడా. విద్యార్థిని ప్రభావితం చేయడానికి జ్ఞానాన్ని, కొత్త పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా అభ్యసించే అవకాశం కల్పిస్తారు. అందుకే ఈ తరం ఉపాధ్యాయుని డిజిటల్‌ లీడర్‌గా కూడా చూస్తున్నారు. చేస్తున్న పనిని ఆస్వాదించడం, ఆస్వాదించే తీరులో పనిని తీర్చిదిద్దడం కూడా ఆయనకు తెలుసు. జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది. దీనితో విద్యార్థులు అలాంటి ఉపాధ్యాయులను మరింత గౌరవిస్తారు. నిజంగా విద్య అంటే పదింట తొమ్మిది వంతులు ప్రోత్సాహమే.  

నాలుగు ‘సి’లు 
ఇప్పుడు పోటీతత్వం మరింత పెరిగింది. అదే సమయంలో ఉద్యోగ జీవితానికి సంబంధించి ఎంపికలకు కూడా విద్యార్థులకు ఎన్నో కొత్తదారులు ఏర్పడ్డాయి. విద్యార్థి మనస్తత్వాన్ని బట్టి ఆ దారులకు మళ్లించే బాధ్యత ఉపాధ్యాయునిదే.  భవిష్యత్తులో నాలుగు ‘సి’ల మీద విద్యార్థి భవితవ్యం ఆధారపడి ఉందని నిపుణులు చెబుతున్నారు.. క్రిటికల్‌ థింకింగ్, కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్రియేటివిటీ. ఈ పదాలు, వాటి భావనలతో విద్యార్థిని మమేకం చేయవలసిన బాధ్యత కూడా ఉపాధ్యాయునిదే.

వాటి గురించి నిజమైన అవగాహన ఏర్పడితే కాలానికి తగినట్టు పోటీ ప్రపంచంలో నెగ్గడానికి విద్యార్థిలో సంసిద్ధత వస్తుంది. డిజిటల్‌ యుగంలో అందుబాటులో ఉన్న పెద్ద జ్ఞానసాగరం ఇంటర్నెట్‌. యూట్యూబ్, ట్యుటోరియల్, ఈబుక్‌ , ముద్రిత పత్రాలు ఇప్పుడు అందుబాటు ఉన్నాయి. నేటి ఉపాధ్యాయుని కర్తవ్యం విద్యార్థి అభిరుచిని బట్టి ఆ నైపుణ్యాలకు వారిని చేరువ చేయాలి. ఉపాధ్యాయుల సామర్థ్యానికి కూడా పరిధులు ఉన్నా, ఆ నైపుణ్యాల దిశగా విద్యార్థిని మళ్లించే వెసులుబాటూ ఉంది.

నేర్చుకోవడానికి తగిన వాతావరణంలోకి వారిని తీసుకువెళ్లే నైపుణ్యం ఈ తరం ఉపాధ్యాయులలో ఉండాలి. భావి భారతాన్ని నిర్మించే బాధ్యత ఉన్నవారు మొదట తమను తాము నిర్మించుకోవాలి. ప్రాథమిక పాఠశాల కావచ్చు, ప్రాథమికోన్నత పాఠశాల కావచ్చు, కళాశాల లేదా విశ్వవిద్యాలయం కావచ్చు. ఉపాధ్యాయుడు ఎక్కడ బోధిస్తున్నా ఆయన ఒక విద్యార్థిని తయారు చేసే బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టే. 

నూతన విద్యావిధానం 2020: ఉపాధ్యాయుడు
మారుతున్న విద్య, ఉపాధ్యాయ వ్యవస్థలు సమాజంలో పాక్షికంగానే అమలు కావడం సరికాదనే ‘నూతన విద్యావిధానం 2020’ భావిస్తున్నట్టు కనిపిస్తుంది. అంగన్‌వాడీలలో చదువుకునే బాలలు సహా మన దేశ విద్యార్థి జనాభా 40 కోట్లనీ, వీరందరికీ బోధిస్తున్న 1.5 కోట్ల మంది ఉపాధ్యాయులనీ దృష్టిలో ఉంచుకుని ‘నూతన విద్యావిధానం 2020’ ఆవిర్భవించిందని నివేదిక రూపకల్పనలో భాగస్వామి, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ విద్యాభారతి జాతీయ అధ్యక్షుడు దూసి రామకృష్ణ చెప్పారు. రెండు కోట్లు డ్రాపౌట్స్‌ ఉన్నా, 38 కోట్లు ఎప్పుడూ తరగతులలో ఉంటారు. ప్రభుత్వం ఎంత ఆధునిక, విస్తృత విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టినా దానిని అమలు చేయవలసింది ఉపాధ్యాయుడే.

వచ్చే దశాబ్దం ఉపాధ్యాయ దశాబ్దం కావాలని ఈ నివేదిక లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రపంచంలో బహుశా ఏ దేశంలోను కనిపించనంత భారతీయ అధ్యాపకశక్తిని సశాస్త్రీయంగా ఉపయోగించుకుంటే ఎంతో మార్పు తేవచ్చునన్న ఆలోచనతో విద్యా విధానం సూచనలు చేసింది. సమగ్ర బోధకుడు అనే భావనను ముందుకు తెచ్చిన ఆ నివేదిక ఉపాధ్యాయులకు నాలుగేళ్ల శిక్షణను సూచించింది. అంతేకాదు, వృత్తి నైపుణ్యం వృద్ధి చేసే ఒక నిరంతర శిక్షణను కూడా కొత్త విద్యా విధానం ముందుకు తెచ్చింది. ఉపాధ్యాయుడిగా జీవించాలి అన్న కోరిక ఉన్నవారే ఆ వృత్తిలోకి రావడం గురించి విద్యా విధానం చర్యలు తీసుకుంది.    

నేర్చుకుంటూనే నేర్పించాలి.
ఇవాళ్టి మరొక పరిణామం కూడా ఉపాధ్యాయుల దృష్టిలో ఉంది. సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రస్తావన, వినియోగం లేకుండా ఇవాళ విద్యార్థి నేర్చుకోవడానికి సిద్ధం కాలేడు. మొదట ఉపాధ్యాయునికి ఈ పరిజ్ఞానం ఉండాలి. ఇంటర్నెట్‌ మీద, దానిని అన్వేషించడం మీద ఉపాధ్యాయుని పరిచయం లేకుంటే ఆయన విద్యార్థులకు చెప్పలేరు. విద్యార్థులను సదా ప్రభావితం చేయగలిన ఉపాధ్యాయుడంటే జీవిత కాలం నేర్చుకునే లక్షణం కలిగి ఉంటారు. తాము బోధించే పాఠ్యాంశంలో వచ్చిన మార్పులు, చేర్పుల పట్ల స్పృహ కలిగి ఉంటారు. అంటే వచ్చే దశాబ్దంలో ఎలాంటి ఉద్యోగాలు రాబోతున్నాయో వారు చెప్పగలిగి ఉంటారు.

విషయ సేకరణ ఆధారంగా చేసే విద్యార్జన ప్రాధాన్యం తెలిసి ఉండడం 21వ శతాబ్దం ఉపాధ్యాయుడి ముఖ్య లక్షణాలలో ఒకటి. ఇప్పుడు నిపుణులు చెబుతున్న అద్భుతమైన ఒక సూత్రం గురించి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. 21వ శతాబ్దంలో నిరక్షరాస్యుడని ఎవరిని చెప్పవచ్చునంటే చదవడం రాయడం చేతకాని వారిని కాదు. నేర్చుకోలేనివారిని, నేర్చుకొనే సంసిద్ధత లేనివారిని, మళ్లీ మళ్లీ నేర్చుకుంటూనే ఉండాలన్న స్పృహ లేనివారినే.  

నేర్పించడం అనే కళ, శాస్త్రీయతలను మిళితం చేసే బోధనా పద్ధతులను ఇవాళ ఎక్కువ మంది ఉపాధ్యాయులు అలవరచుకుంటున్నారు. ఉపాధ్యాయుడు నేర్పించడాన్ని ప్రేమించాలి. నేర్చుకునేవాళ్లను ప్రేమించాలి. ఈ రెండింటినీ సమన్వయం చేయడానికి ఇంకా ఇష్టపడాలి. వివిధ సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులతో నిండి ఉండే తరగతిలో బోధించే విధానానికి వారు అలవాటు పడాలి. ప్రతి విద్యార్థికి సంబంధించి విద్యావసరాలు, సామర్థ్యాలు, అభిరుచులపైన ఉపాధ్యాయులు దృష్టి పెడుతున్నారు.

విద్యార్థుల ఐచ్ఛిక విద్యాభిరుచిని గమనించి సమాజంలో ఉత్పాదకతకు ఉపయోగపడే భాగస్వామిగా మలచడం ఇవాళ ఉపాధ్యాయుల ముందు ఉన్న ప్రథమ కర్తవ్యంగా అవతరించింది. స్మార్ట్‌ బోర్డ్‌ టెక్నాలజీతో తరగతిలో మరింత చురుకుగా ఉండేటట్టు చేయడం, విద్యా సంబంధ కార్యకలాపాలలో చేయూత నివ్వడం ఉపాధ్యాయులు ఇవాళ ఒక సవాలుగా తీసుకుంటున్నారు. ఎలా నేర్చుకోవాలో చెప్పగలిగితే పిల్లలు మరింత కష్టపడతారు. ఎడ్యుకేటర్‌ లేదా ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత ఏదీ అంటే సమాజం ఎదుర్కొంటున్న వాస్తవిక సమస్యలు పరిష్కరించడానికి ఉపకరించే విద్యా విధాన పద్ధతులను అన్వేషించాలి. 

మోతాదు మించుతున్నదా? 
ఇంతకీ విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం మోతాదుకు మించుతున్నదా? ఈ ప్రశ్న వేసుకోక తప్పదు. భారత సామాజిక నేపథ్యంలో ఈ ప్రశ్న మరింత అవసరం.అందుకు సంబంధించిన భయాలు ఇప్పుడు మొదలయినాయి కూడా. 2030 సంవత్సరానికి, అంటే కేవలం ఎనిమిదేళ్లలోనే గురువు అనే స్థానానికి సాంకేతిక పరిజ్ఞానం పంగనామం పెట్టబోతున్నదన్న భయాలు అవి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, బ్లాక్‌చైన్‌ తరగతి గదిని శాసిస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ భయాల వెనుక విపరీతంగా ప్రవేశిస్తున్న శాస్త్రసాంకేతిక రంగాలు ఒక్కటే కారణం కాదు. సాంకేతికతకు మోకరిల్లుతున్న నేటి తరాలు కూడా కారణమే.

పాలకులు, నేతలు, రాజకీయ సంస్థలు దేశం పురోగమించడం గురించి, ప్రపంచపటంలో దివ్యమైన స్థానం గురించి తమకున్న కల్పనలో విద్య స్థానం ఎక్కడో ఇప్పటికీ చెప్పడం లేదు. దేశాభివృద్ధికి పునాదులు తరగతి గదులలో పడతాయన్న వాస్తవం గుర్తించడానికి వారికి ఇంకెంత కాలం పడుతుందో తెలియడం లేదు. ఇవన్నీ ఉన్నా కొన్ని వాస్తవాలను అంగీకరించాలి. ఉపాధ్యాయుడికి పరిమితులు ఉన్న మాట నిజం. కానీ ఆయన తరగతిలో బోధించినట్టు, ఆయన కంటే ఎంతో ఎక్కువ ‘డేటా’ కలిగి ఉండే రోబో ఆయనకు ఏనాటికీ ప్రత్యామ్నాయం కాదు, కాలేదు. కాబట్టి 22వ శతాబ్దంలోకి ప్రవేశించినా పాఠ్యాంశాలు మారవచ్చు. పాఠశాలలు, అందులోని తరగతుల రూపురేఖలు అసాధారణంగా ఉండవచ్చు. బోధనా పద్ధతులు మారిపోవచ్చు. బాలలు మరింత చురుకుగా ఉండవచ్చు. కానీ అక్కడ ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అప్పుడే విద్యార్థికి మార్గదర్శనం లభిస్తుంది. గురుస్థానం శాశ్వతం కావాలి. 

విద్య, విలువలు, ఉపాధ్యాయుడు
పిల్లల మేధను విద్యతో ప్రకాశింపచేసే క్రమంలో వాళ్ల హృదయాలను కూడా విద్యతో గుబాళింపచేయడం మరవరాదని దలైలామా అంటారు. ఈ పని కుటుంబంలో జరగాలి. ఆపై ఆ బాధ్యత ఉపాధ్యాయులు స్వీకరించాలి. పురోగమిస్తున్న సమాజంలో విలువలకు స్థానం లేకుంటే విపరీతాలకు దారి తీస్తుంది. ఒక భావిపౌరుడి ప్రవర్తన అతడికి ఉన్న విలువలను బట్టే నిర్మితమవుతుంది. నీతి నిజాయతీలు, విచక్షణ, సామాజిక సేవ పట్ల అనురక్తి, జాతీయ సమైక్యత పట్ల గౌరవం, సామాజిక న్యాయం పట్ల అవగాహన ఇవన్నీ కూడా విలువల నుంచి సంక్రమించేవే. యువత కౌమారమంతా తరగతి గదిలోనే గడుస్తుంది కాబట్టి ఉపాధ్యాయులు ఈ విషయంలో ఎక్కువ బాధ్యత స్వీకరించాలి. విలువలంటే మానసిక ఆరోగ్యాన్ని కాపాడేవే. వీటన్నిటికీ మించినది క్రమశిక్షణ. అది విద్యార్థి జీవితం నుంచి మొదలు కావాలి. అదొక విలువ. 

గురుశిష్య బంధానికి అడ్డుకట్ట?
గురుశిష్య బంధం అనివార్యం. కానీ ఈ బంధం తెగిపోతున్నదా అని ప్రశ్నించుకునే వాతావరణం ప్రస్తుతం కనిపించడం విషాదమే. చాలా కళాశాలలు, కొన్నిచోట్ల పాఠశాలలు కూడా మత్తు మందులకు చేరువ కావడం గురుశిష్య సంబంధం బలహీన పడుతున్నదని చెప్పడానికి ఉపకరించేదే! విద్యార్థులు వ్యసనాలకు బానిసలు కావడం సామాజిక ఉల్లంఘన. శిష్యులను అలాంటి వాటి జోలికి వెళ్లకుండా నిరోధించలేకపోవడం గురువుల సామాజిక ఉల్లంఘన. ఎన్ని చట్టాలు వచ్చినా ర్యాగింగ్‌ భూతం లొంగకపోవడం విద్యార్థి, ఉపాధ్యాయుడు ఇద్దరూ కూడా సామాజిక బాధ్యతను మరచిపోయిన ఫలితమే. అదుపు చేయాలని ఉపాధ్యాయులకు, ఒదిగి ఉండాలని విద్యార్థులకు లేకపోతే విపరీత పరిణామాలు తప్పవు.   

సాంకేతికత ప్రత్యామ్నాయం కాలేదు
వెనువెంటనే కాకున్నా, సమీప భవిష్యత్తులో భారత్‌లో కూడా తరగతి గదిని సాంకేతికత శాసిస్తుంది. కరోనా ఈ అవసరాన్ని కాస్త ముందుకు తెచ్చింది కూడా. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సాంకేతికతను ప్రవేశ పెట్టడం గురించి వస్తున్న ఒత్తిడి కూడా తక్కువగా లేదు. ఎల్‌కేజీ దగ్గర నుంచి పలకా బలపాలు మాయమవుతున్నాయి. అయితే ఒక ప్రశ్న. సాంకేతికత ఉపాధ్యాయునికి నిజంగానే ప్రత్యామ్నాయం కాగలదా? డిజిటల్‌ వ్యవస్థ ఎంత విస్తరించినా, బలపడినా అది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కాలేదు. నేపథ్యాన్ని బట్టి భారతీయ సమాజంలో విద్యార్థులంతా ఒకే విద్యా ప్రమాణాలు ప్రదర్శించే పరిస్థితిలో లేరు. విద్యార్థులందరి అభిరుచిని ఉపాధ్యాయుడు మాత్రమే గమనించగలడు.

గురుశిష్య సంబంధం పాతబడేది కాదు. జీవితానుభవాన్ని, సృజనాత్మక శక్తిని మేళవించి పాఠ్యాంశాలను చెప్పగలిగేది గురువు మాత్రమే. ఉపాధ్యాయుడు తేగలిన మార్పు సాంకేతికతతో సాధ్యంకాదని ఇప్పటికే కొన్ని పరిశోధనలు తేల్చాయి. ఎందుకంటే విద్య అంటే కేవలం కొన్ని వాస్తవాలు, ఇంకొన్ని సమీకరణల సమ్మేళనం కాదు.  అభ్యాసానికి అనుగుణమైన వాతావరణం గురుశిష్య సంబంధం నుంచి జనిస్తుంది. అది యంత్రం ద్వారానో, కంప్యూటర్‌ తెరతోనో సాధ్యం కాదు. విద్యార్థిని స్వతంత్రంగా ఆలోచింప చేసేదే విద్య. ఆ పని ఉపాధ్యాయుని ద్వారా జరుగుతుంది.   

భావి తరాలను విశ్వమానవులుగా తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయులు తయారు కావడం అవసరమే. ఆ క్రమంలో కొన్ని భ్రమలలో ఎవరూ కొట్టుకుపోరాదు. డిజిటల్‌ యుగంలో మనదైన చరిత్ర, మనదైన సాహిత్యం, కళ, సాంస్కృతిక వారసత్వం చిన్నబోయే పరిస్థితి ఏర్పడడం సరికాదు. మన ప్రాంతీయ భాషలకు గ్రహణం పట్టకూడదు. ఆధునిక విద్య, ఆధునిక విద్యారీతులు మత్తులో మళ్లీ వేరొక వ్యవస్థకు మన యుతరం బోయీలు కారాదు. విద్యావిధానం ఆధునికం కావాలి. అదే సమయంలో అందులో మట్టివాసన ఉండాలి. కంప్యూటర్‌కే, ప్రయోగశాలకే విద్యార్థిని పరిమితం చేయడమూ సరికాదు. విద్యావిధానంలో ఆధునికత సృజనాత్మకతకు, క్రీడాప్రతిభకు ఆస్కారం కల్పించాలి.

డిజిటల్‌ విద్యావిధానానికి ఉపాధి కల్పన పునాదిగా ఉన్నప్పటికి, సామాజిక బాధ్యత పట్ల యువతకు నిరంతర స్పృహ అవసరమన్న విషయమూ గుర్తించాలి. కొత్త విద్యావిధానం విద్యార్థికీ, సమాజానికీ మధ్య అడ్డుగోడ కట్టేది కారాదు. ఎందుకంటే పాఠశాల అనేది సమాజానికి సుదూరంగా ఉండే వ్యవస్థ కాదు. కొత్తయుగంలో కొత్త తప్పిదాలకు చోటు లేకుండా చూడవలసిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోగలరు. ఎందుకంటే పాఠ్యప్రణాళిక రూపకల్పనలో వారి పాత్ర వాస్తవం. 

డిజిటల్‌ యుగం పాత సమస్యలను గమనించకుండా సాగితే అది వైఫల్యానికే దారి తీస్తుంది. భారతదేశానికి సంబంధించినంత వరకు అంతరాలు ఒక వాస్తవం.  డిజిటల్, శాస్త్రసాంకేతిక వినియోగం అందరికీ సమంగా అందాలంటే ప్రభుత్వ పాఠశాలలను అందుకు తగినట్టు రూపొందించాలి. డిజిటల్‌ లీడర్లు ఇటు వైపు చూడకపోతే సమాజంలో పెద్ద అగాధం ఏర్పడుతుంది. విద్యారంగంలో అంతరాలు నిరోధించడానికి కొన్ని దశాబ్దాల పాటు జరిగిన ప్రయత్నాలు నీరుకారాయన్న విమర్శ ఇప్పటికే ఉంది.

ఒకప్పుడు అన్ని వర్గాల వారు ప్రభుత్వ పాఠశాలలకే వెళ్లి చదువుకునేవారు. సమాన అవకాశాలు అన్న సూత్రాన్ని వమ్ము చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు చతికిలపడ్డాయి. చదువు ‘కొనడం’ అన్న మాట కూడా ఇప్పుడు వినవలసి వస్తున్నది. చదువు ప్రాథమిక హక్కుగా అవతరించిన తరువాత కూడా అక్షరం గగన కుసుమం కావడం పురోగతికి దోహదం చేసే పరిణామం కాదు. 

ఉపాధ్యాయులు తాము నేర్చుకుంటూనే విద్యార్థులకు నేర్పుతారు. ఆ క్రమంలో సరైన నడత నేర్చుకోమని ఉపాధ్యాయునికి ఎవరో చెప్పే పరిస్థితి రావడం విషాదమే. ఇటీవల వస్తున్న వార్తలు కొందరు ఉపాధ్యాయుల పట్ల అసహనాన్ని పెంచేవిగా ఉన్నాయి. మద్యం సేవించి పర్యవేక్షకునిగా పరీక్ష హాలుకు వచ్చిన వారు, చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి అరెస్టయినవారు ఇంకా తీవ్రమైన అసాంఘిక చర్యలకు ఉపాధ్యాయులు పాల్పడుతున్న సంగతులు బయటపడుతున్నాయి.

ఇక విద్యార్థులను తీవ్రంగా దండిస్తున్న సంఘటనలకు అంతేలేదు. బయటి సమాజంలోని బలహీనతలు, ప్రలోభాలకు ఉపాధ్యాయులు లోను కాకుండా చేయడానికి నూతన విద్యా విధానం 2020లో ప్రతిపాదించిన నాలుగేళ్ల ఉపాధ్యాయ శిక్షణతో సాధ్యం కాగలదని విశ్వసిద్దాం. మారుతున్న కాలంలో ఉపాధ్యాయ వృత్తి మీద పెరుగుతున్న ఒత్తిడికి విరుగుడుగా ఈ విధానం సాధికారత కల్పించడం ఒక వెసులుబాటు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement