ఘనంగా గురుపూజోత్సవం | grand teacher's day celebrations at Korukonda | Sakshi
Sakshi News home page

ఘనంగా గురుపూజోత్సవం

Published Fri, Sep 6 2013 4:05 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM

grand teacher's day celebrations at Korukonda

కోరుకొండ (విజయనగరం రూరల్), న్యూస్‌లైన్ : కోరుకొండ సైనిక పాఠశాలలో గురుపూజోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సర్వేపల్లి రాధకృష్ణన్ విగ్రహానికి పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, లెఫ్ట్‌నెంట్ కల్నల్ ఎం.అశోక్‌బాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందన్నారు. దేశానికి ఎంతో మంది శాస్త్రవేత్తలను, మేధావులను అందించడంలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేని చెప్పారు. బావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తారని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి వ్యాపారమయంగా మారడం బాధకరమని తెలిపారు. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేసినపుడే దేశానికి ఉత్తమ పౌరులు అందుతారన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం పదవీకాలం అనంతరం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో 11 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రసంగాలు పలువురిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లెఫ్ట్‌నెంట్ కల్నల్ ప్రవీణ్‌కుమార్, సీనియర్ ఉపాధ్యాయులు సర్వారాయుడు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
 
 నవోదయలో...
 కిల్తంపాలెం (శృంగవరపుకోట రూరల్)  : కిల్తంపాలెం జవహార్ నవోదయ విద్యాలయంలో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ ఎం.వి.సుబ్బారావు పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఉపాధ్యాయులందరూ గర్వించదగ్గ విషయమన్నారు. విద్యార్థి సంఘ నాయకుడు అరుణసాయి నేతృత్వంలో విద్యార్థులు ఉపాధ్యాయులందరినీ ఘనంగా సన్మానించి జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా విద్యాలయ సిబ్బందికి, ఉపాధ్యాయులకు వాలీబాల్, క్రికెట్, షాట్‌పుట్, బ్యాడ్మింటన్ తదితర పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. 12వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల అవతారమెత్తి పలు తరగతుల విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించి పలువుర్ని ఆకట్టుకున్నారు.
 
 ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి
 విజయనగరం ఆరోగ్యం  : ప్రతి ఒక్కరూ రక్తం దానం చేయాలని ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు బి.రామకృష్ణారావు అన్నారు. గురువారం  కేంద్రాస్పత్రిలో గురుపూజోత్సవం సందర్భంగా  గాంధీ బ్లడ్ డోనర్స్‌క్లబ్ , ఆశ్రయ బ్లడ్ డోనర్స్‌క్లబ్, జరజాపుపేటకు చెందిన యూత్‌క్లబ్ వారు సంయుక్తంగానిర్వహించిన  రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తం దానం  చేయడమంటే ఆపదలో ఉన్న సాటి మనిషికి రక్తం ఇచ్చి పునర్జన్మ ప్రసాదించగలడన్నారు. ఇప్పటికీ రక్తం సకాలంలో అందక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అదే విధంగా చదువు, విద్య నేర్పిన గురువులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రాస్పత్రి రక్తనిధి కేంద్రం వైద్యులు సత్యశ్రీనివాస్, గాంధీ బ్లడ్ డోనర్స్‌క్లబ్ అధ్యక్షుడు అబ్ధుల్వ్రూప్ పాల్గొన్నారు. 
 
 హైదరాబాద్‌లో గురువులకు అవార్డు ప్రదానం
 విజయనగరం కల్చరల్, న్యూస్‌లైన్ : గురుపూజోత్సవం సందర్భంగా జిల్లాకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు హైదరాబాద్ రవీంద్రభారతీలో అవార్డులు ప్రదానం చేశారు.  విద్యాశాఖ మంత్రి పి.పార్థసారథి విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో మృదంగ అధ్యాపకురాలు మండపాక నాగలక్ష్మికి అవార్డు ప్రదానం చేశారు.  అలాగే ఎ.విక్టర్‌బాబు, ఎస్‌జీటీ, పి.ఎస్.ఆర్.పురం, గంట్యాడ మండలం,  బొంతలకోటి శంకరరావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గంగచోళ్లపెంట, గజపతినగరం మండలం, రిటైర్డు టీచర్ బి.అప్పలస్వామి, ఎంపీపీఈ స్కూల్, పెద్దబంటుపల్లి, గుర్ల మండలం ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement