మార్కులు కాదు.. మేధస్సు ముఖ్యం | intelligence is important rather than marks | Sakshi

మార్కులు కాదు.. మేధస్సు ముఖ్యం

Published Sat, Sep 6 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM

మార్కులు కాదు.. మేధస్సు ముఖ్యం

మార్కులు కాదు.. మేధస్సు ముఖ్యం

ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే మేధస్సు పెరుగుతుందని, అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.

షాద్‌నగర్ రూరల్:  ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే మేధస్సు పెరుగుతుందని, అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభకు మార్కులు కొలమానం కాదని, మేధస్సు ముఖ్యమని చెప్పారు. శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్ద జూనియర్ కళాశాల ఆవరణలో ఆవోపా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాంకు కళాశాల విద్యార్థులు బోనాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు చెప్పాలనే ఆలోచన, విద్యార్థులకు నేర్చుకోవాలనే తపన ఉన్నప్పుడే అత్యుత్తమ ఫలితాలు వస్తాయన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాదని, నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. భూమిపై ఉన్న జీవరాశులకు స్పందించే తత్వం మాత్రమే ఉందని, ఆలోచించే శక్తి ఒక్క మానవుడికే ఉంద న్నారు. పూర్వకాలంలో విద్యను ఆభ్యసించాలంటే ఎన్నో ఇబ్బందులు ఉండేవని, ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా నేడు అందరికీ విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. నైజాం కాలంలో ప్రజలను చైతన్యం చేయడానికి సావిత్రిభాయి రహస్యంగా చదువు నేర్పించారని, అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయాలన్నారు.

సమాజం అభివృద్ధి చెందాలంటే చదువు ఎంతో ముఖ్యమన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని, ప్రతి గ్రామంలోని నాయకులు, యువజన సంఘాలు పూర్తిస్థాయిలో సహకరించినపుడే అది సాధ్యమవుతుందన్నారు. మొగిలిగిద్ద ప్రభుత్వ కళాశాలకు దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని, దీన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం కోదండరాం తన జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రుమంలో కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మన్న, బండారి రమేష్, పాతూరి వెంకట్రావు, బెజుగం రమేష్, మలిపెద్ది శంకర్, నందకిశోర్, దొంతుపాండు రంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement