వంగూరు, న్యూస్‌లైన్: ‘మాచెల్లెల్ని గుర్తు తెలియని వారికి అమ్మేశారు.. నన్ను, మా అక్కను జీతం ఉంచారు మా అమ్మానాన్న.. చదువుకోవాలని ఉన్నా చదివించే వారు లేక గొర్రెలను కాస్తున్నా..’ అని ఓ బాలకార్మికురాలు అన్న మాటలు శనివారం అధికారులను ఆవేదనకు గురిచేశాయి.
అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన బాలయ్య, ఎల్లమ్మ దంపతులకు అంజమ్మ, దివ్య, రాణి అనే ముగ్గురు కూతుళ్లు. వీరి తల్లిదండ్రులు కనీస బాధ్యత మరిచి కన్నప్రేమను దూరం చేసుకునే క్రమంలో చిన్నకూతురు రాణిని అమ్మేశారు. రెండోకూతురు దివ్యను వంగూరు మండలం సర్వారెడ్డిపల్లిలో గుండెమోని జంగయ్య అనే రైతు వద్ద ఏడాదికి రెండువేల జీతం చొప్పున కుదిర్చారు. మరో కూతురును ఇదే మండలంలో తిప్పారెడ్డిపల్లిలో ఒక రైతు వద్ద జీతం పెట్టారు. ఏడాదికి వీరిద్దరినుంచి వచ్చే జీతం తీసుకుంటూ నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలో కూలీపనలు చేసుకుంటూ తల్లిదండ్రులు జీవనం గడుపుతున్నారు.
ఇదిలాఉండగా వంగూరు మండలం సర్వారెడ్డిపల్లిలో గొర్రెలకాపరిగా పనిచేస్తున్న దివ్యను శనివారం గ్రామస్తుల సమాచారం మేరకు అధికారులు కలిశారు. తహశీల్దార్ శ్రీనివాసులు సర్వారెడ్డిపల్లి గ్రామానికి వెళ్లి రైతు వద్ద ఉన్న దివ్య(12)ను పిలిపించుకుని ఆమెతో మాట్లాడారు. చదువుకోవాలని ఉందని దివ్య చెప్పడంతో తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ శంకర్‌నాయక్‌లు దివ్యను వంగూరు మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా అమ్మాయిని కదిలిస్తే గుక్క తిప్పుకోకుండా అన్ని విషయాలు చెప్పేసింది. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి కన్నీటిగాధలు ఉండనేఉన్నాయి.
చదువుకోవాలని ఉంది
Published Sun, Sep 22 2013 4:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
Advertisement