సాక్షి, అమరావతి: యువతులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టడం, బాలలను అక్రమంగా తరలించడం, బాల కార్మికులుగా మార్చడం వంటి దురాగతాలపై కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాస్త్రం సంధించింది. ఈ మేరకు మానవ అక్రమ రవాణా నిరోధక బిల్లు–2018ను తీసుకొస్తోంది. దేశవ్యాప్తంగా మానవ అక్రమ ఆందోళనకర రీతిలో పెరిగిపోతోంది. అక్రమ రవాణాలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నాయి. బాలకార్మికుల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
మానవ అక్రమ రవాణా నిరోధక బిల్లు–2018ను జూలై 26న లోక్‌సభలో ప్రవేశపెట్టడంతో ఆమోదం లభించింది. మంగళవారం రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉండగా సభ వాయిదా పడిన నేపథ్యంలో బుధవారం ప్రవేశపెట్టనున్నారు. మానవ అక్రమ రవాణా కేసుల్లో బాధితులకు న్యాయం జరగకపోవడం, పునరావాసంలో జాప్యం వంటి సమస్యలపై సుప్రీంకోర్టుకు పలు ఫిర్యాదులు అందాయి.
ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు 2015లో కేంద్ర ప్రభుత్వానికి పలు మార్గదర్శకాలు జారీ చేస్తూ తీర్పు వెలువరించింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో బాధితులకు పరిహారం, పునరావాసంలో తీవ్ర జాప్యం జరుగుతోందని సుప్రీంకోర్టు గుర్తించింది. అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి చట్ట సవరణ చేయడం ద్వారా బాధితులకు సత్వరం న్యాయం చేకూర్చాలని సూచించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ గత మూడేళ్లలో దాదాపు 32 పర్యాయాలుముసాయిదా బిల్లులు తయారు చేసి ప్రజాభిప్రాయాన్ని కోరింది. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన తుదిబిల్లు ఎట్టకేలకు అవాంతరాలను అధిగమించి ఆమోదం పొందింది. ఇక రాజ్యసభలో ఆమోదించడమే తరువాయి.
కేటుగాళ్లకు కఠిన శిక్షలు
మానవ అక్రమ రవాణా నిరోధక బిల్లు చట్టరూపం దాల్చి, అమల్లోకి వస్తే మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పునరావాస మూలనిధి(రిహాబిలిటేషన్ ఫండ్) ఏర్పాటు చేస్తుంది. అక్రమ రవాణాకు పాల్పడిన దుండగుల(ట్రాఫికర్ల) నుంచి తక్షణం అపరాధ రుసుం వసూలు చేసి బాధితులకు అందజేస్తారు.
18 ఏళ్ల లోపు బాలలను కార్మికులుగా మారిస్తే, అక్రమంగా తరలిస్తే కఠిన శిక్షలు తప్పవు. ఇలాంటి కేసుల్లో నాలుగు నెలల్లోనే విచారణ పూర్తి చేసి దోషులను శిక్షలు విధించడంతోపాటు బాధితులకు తక్షణ న్యాయం చేయాల్సి ఉంటుంది. ఈ కేసుల పురోగతిని పర్యవేక్షించడానికి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. బాధితులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావడం శుభపరిణామమని ‘హెల్ప్’ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌వీఎస్ రామ్మోహన్ చెప్పారు.
ఇది గొప్ప విజయం
‘‘దేశంలోని వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న బాలలు, మహిళలతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 8 లక్షల మంది బాధితులు సాధించుకున్న గొప్ప విజయం ఇది. కొత్త చట్టంతో ట్రాఫికర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుంది. బాధితులకు న్యాయం, పునరావాసం లభిస్తాయి. 18 ఏళ్లలోపు వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తే కఠిన శిక్షలుంటాయి’’ – వి.విజయనిర్మల, విముక్తి సంస్థ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment