
దేవుని ప్రతిరూపాలు
స్వచ్ఛ బచ్ పన్
కైలాస్ సత్యార్థి గత నలభై ఏళ్లుగా ఏ దేవాలయానికీ వెళ్లకుండానే దైవ సన్నిధిలో గడుపుతున్నారు! ఆయన వయసిప్పుడు అరవై ఏళ్లు. ఇటీవలే నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన సత్యార్థి... బాలల హక్కుల పరిరక్షణ కోసం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఇంచుమించు తన ఇరవయ్యవయేట నుంచే పాటు పడుతున్నారు. 1980లో ఆయన స్థాపించిన ‘బచ్‌పన్ బచావో ఆందోళన్’ ఉద్యమం ఇప్పటి వరకు 144 దేశాలలోని ఎనభైమూడు వేల మందికి పైగా బాలల్ని దుర్భర పరిస్థితుల నుంచి బయటికి తెచ్చింది.
దైవం, ఆథ్యాత్మికత అన్నవి సత్యార్థి దృష్టిలో సాధారణ అర్థాలకు పూర్తి భిన్నమైనవి. స్వేచ్ఛ ఆయన నమ్మిన దైవం. దేవుడే మనిషికి స్వేచ్ఛను ప్రసాదించాడు కాబట్టి స్వేచ్ఛకూడా దైవసమానమేనని ఆయన అంటారు. దేవుడిచ్చిన ఆ స్వేచ్ఛను కాపాడుకోడానికి పోరాడడం కూడా ఆయన ఉద్దేశంలో ఒక దైవకార్యమే. బాలల స్వేచ్ఛను కాపాడే ఉద్యమం చేపట్టిన నాటి నుంచీ బాలలే దైవంగా ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు సత్యార్థి.
మత భావనలున్న మనిషిని కాదు నేను. గత నాలుగు దశాబ్దాల కాలంలో ఒక్కనాడైనా గుడిని గానీ, మసీదును గానీ, చర్చిని గానీ నేను సందర్శించలేదు. భక్తి ఉంటుంది. కానీ ఆలయాలకు వెళ్లి ఆరాధించను. బాలలే నా దేవుళ్లు. వారికి తమ స్వేచ్ఛను, బాల్యాన్ని తెచ్చివ్వడమే దైవానికి నేను చేసే ప్రార్థన. దేవుడికి నిజమైన ప్రతిరూపాలు బాలలే. వారికోసం పనిచేయడం నాకు దైవ సన్నిధిలో గడపడంలా ఉంటుంది అంటారు సత్యార్థి.