కొత్తగూడెం: బాలలకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించి, పాఠశాలల్లో చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు జిల్లాలో మొక్కుబడిగా సాగుతున్నాయి. అన్ని శాఖల అధికారులు కలిసి ప్రతి ఏటా జనవరిలో ‘ఆపరేషన్ స్మైల్’, జూలైలో ‘ఆపరేషన్ ముస్కాన్’ పేర రెండు విడతలుగా స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నారు. బడి బయట బాలలను గుర్తించి పాఠశాలల్లో చేరుస్తున్నారు. ఆ తర్వాత పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో తిరిగి బాలలు బలవంతంగా పనుల్లో కూరుకుపోతున్నారు. దీంతో ప్రభుత్వాల లక్ష్యం నెరవేరడంలేదు.
పట్టింపు అంతంత మాత్రమే..!
జనవరి నెలమొత్తం జరగాల్సిన ఆపరేషన్ స్మైల్ జిల్లాలో జనవరి 12వ తేదీ వరకు పట్టాలు ఎక్కడంలేదు. జనవరి 31కే ముగిస్తున్నారు. ఈ యేడాది మేడారం ప్రత్యేక విధుల పేరుతో ముగించేశారు. జిల్లా ఉన్నతాధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో డ్రైవ్‌లు ఫలితాలినివ్వడంలేదు. ప్రధానంగా బాల కార్మికులను గుర్తించి వారికి శాశ్వత ప్రాతిపదికన విద్యను అందించాల్సి ఉండగా, బృందాలు కేవలం డ్రాపవుట్స్‌పైనే దృష్టి సారించి కేసులను నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డివిజన్‌ల వారీగా విద్యాశాఖ అధికారులతో చైల్డ్‌లైన్ అధికారులు నిరంతరం హాజరును సమీక్షించాల్సి ఉండగా, ఆ ఊసే లేకపోవడం శోచనీయం. దీంతో బాలకార్మికులు, డ్రాపవుట్స్ యథాస్థితికి చేరుకుంటున్నారు.
స్మైల్, ముస్కాన్ అమలు ఇలా..
జిల్లాను ఐదు డివిజన్లుగా విభజించి ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ చేపడుతున్నారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం డివిజన్లుకాగా, ఒక్కో డివిజన్‌లో ఒక ఎస్సై, మహిళా కానిస్టేబుల్, సీడబ్ల్యూసీ సభ్యులు, ఇద్దరు పురుష కానిస్టేబుల్‌తో పాటు కార్మిక శాఖ అధికారి కలిసి స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తారు. బడిబయట పిల్లలను గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలల్లో చేర్పిస్తారు. బాల కార్మికులతో పనులు చేయిస్తున్న వారిపై కేసులను నమోదు చేస్తారు. 14 సంవత్సరాల లోపు వెట్టి చాకిరీ చేయిస్తున్న వారిపై కార్మిక శాఖ అధికారులు ఐఆర్ చట్టం కింద, 18 సంవత్సరాల లోపు చాకిరీ చేయించే వారిపై జేజే యాక్ట్, 2015 ప్రకారం కేసులను నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తారు.
ఈ ఏడాది 167 కేసులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2015లో 578, 2016లో 385 కేసులు నమోదు చేశారు. జిల్లా విభజన తరువాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో 2017 జనవరిలో 152 కేసులు, జూలైలో 138 కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది 2018 జనవరి 12న చేపట్టిన ఆపరేషన్ స్మైల్‌లో 167 కేసులను నమోదు చేశారు. భద్రాచలం డివిజన్‌లో 23, పాల్వంచలో 64, కొత్తగూడెం 18, మణుగూరు 13, ఇల్లందు డివిజన్‌లో 49 కేసులను నమోదు చేశారు. వీరు గుర్తించిన కేసులలో ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు 20, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 147 మంది ఉన్నారు. వీటిలో అత్యధికంగా డ్రాపవుట్స్, పిల్లలతో భిక్షాటన చేసే కేసులే ఉండటం గమనార్హం. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి తప్పిపోయి, పారిపోయి వచ్చిన పిల్లలు వెట్టి చాకిరీకి గురవుతున్నారు. భాష రాకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, హోటల్స్, వ్యాపార దుకాణాల్లో మగ్గిపోతున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి భారత రాజ్యాంగం కల్పించిన 21(ఏ) ఆర్టికల్ ప్రకారం, 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం... ప్రతీ విద్యార్థికి విద్య అందేలా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరిగేలా ప్రక్షాళన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
జాగ్రత్తలు తీసుకుంటున్నాం
ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ స్పెషల్ డ్రైవ్‌లలో గుర్తించిన బాల కార్మికులను, డ్రాపవుట్స్‌ను పాఠశాలల్లో చేరుస్తున్నాం. అంతేకాకుండా ఆ విద్యార్థులపై తగిన శ్రద్ధ వహిస్తున్నాం. విద్యార్థులకు న్యాయం జరిగేలా సిబ్బందితో పర్యవేక్షిస్తున్నాం. –ఝాన్సీ లక్ష్మీబాయి, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి
Comments
Please login to add a commentAdd a comment