Smile Foundation
-
అటు అందం..ఇటు యవ్వనం: ఇంకెందుకు ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ చిరునవ్వు దినోత్సవం ప్రతి సంవత్సరం, అక్టోబర్ మొదటి శుక్రవారం జరుపుకుంటాం. ఈ స్మైల్ డేను తొలిసారిగా 1999లో అమెరికన్ ఆర్టిస్ట్ హార్వే బాల్ ప్రారంభించారు. నవ్వుతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియజేయడంమే దీని ఉద్దేశం. పని ఒత్తిడినుంచి మన బాడీ రిలాక్స్ అయ్యేందుకు ఓ చక్కటి చిరునవ్వు చాలు. శరీరంలో అనేక చక్కటి మార్పులకు శ్రీకారం చుడుతుంది చిరునవ్వు. ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా గుండె కదలికలు, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మనతోపాటు, మనచుట్టూ ఉన్నవారిని కూడా సంతోషకరంగా ఉండేలా చేస్తుంది. నగుమోముతో ఉంటే మీరే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. ఎందుకంటే ఎప్పటికీ యవ్వనంగా ఉంటారు కాబట్టి. నవ్వు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సాధారణ జలుబు, ఫ్లూనుంచి సులువుగా బయటపడవచ్చు, అంతేనా సహజమైన పెయిన్ కిల్లర్‌గా కూడా పనిచేస్తుంది. నవ్వినప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్లు సహజమైన పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తాయి. సెరోటోనిన్ సహజమైన యాంటీడిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. తద్వారా మన మానసిక స్థితిని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచేలా దోహదపడుతుంది. నవ్వడం వలన సగటున కనీసం 3 సంవత్సరాల వయసు తగ్గి, మరింత యవ్వనంగా కనిపించేలా చేస్తాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. చిరునవ్వులు చిందిస్తూ.. హాయిగా జీవిద్దాం! -
అమ్మానాన్నలే అడుక్కోమన్నారు
సాక్షి, సిటీబ్యూరో: ‘బాలానగర్ నర్సాపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద 11 మంది పిల్లలు భిక్షాటన చేస్తుండటాన్ని గుర్తించిన ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్ కెమెరాతో ఫొటో తీశాడు. ఎందుకు అడుక్కుంటున్నారు..మంచిగా చదువుకోవచ్చు కదా అని అడిగితే వారి నుంచి సమాధానం కరువైంది. దీంతో అతను ఫొటోలను ట్విట్టర్ ద్వారా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు పంపాడు. దీంతో రంగంలోకి దిగిన బాలానగర్ ఆపరేషన్ స్మైల్ బృందం సహకారంతో అక్కడ పిల్లలు, పాపలను ఎత్తుకుని భిక్షాటన చేస్తున్న బాలికలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వివరాలు రాబట్టగా గుల్బార్గాకు చెందిన ఎనిమిది మందితో కన్న తల్లిదండ్రులే భిక్షాటన చేస్తున్నట్లు తెలుసుకొని అవాక్కయ్యారు. వీరిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచి శిశువిహార్ హోమ్‌కు తరలించారు. సెప్టెంబర్ నెలలో బాలకార్మికులతో పాటు రోడ్ల వెంట చెత్త ఏరుకుంటున్న పిల్లలు...ఇలా 58 మందిని సంరక్షించారు. బాలకార్మికులతో పని చేయించుకుంటున్న 19 మందిపై కేసులు నమోదుచేశారు. 39 మంది చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచగా పునరావాస కేంద్రాలకు తరలిం చారు. వీరందరినీ పాఠశాలకు పంపిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
మొక్కుబడిగా ‘స్మైల్’
కొత్తగూడెం: బాలలకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించి, పాఠశాలల్లో చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు జిల్లాలో మొక్కుబడిగా సాగుతున్నాయి. అన్ని శాఖల అధికారులు కలిసి ప్రతి ఏటా జనవరిలో ‘ఆపరేషన్ స్మైల్’, జూలైలో ‘ఆపరేషన్ ముస్కాన్’ పేర రెండు విడతలుగా స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నారు. బడి బయట బాలలను గుర్తించి పాఠశాలల్లో చేరుస్తున్నారు. ఆ తర్వాత పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో తిరిగి బాలలు బలవంతంగా పనుల్లో కూరుకుపోతున్నారు. దీంతో ప్రభుత్వాల లక్ష్యం నెరవేరడంలేదు. పట్టింపు అంతంత మాత్రమే..! జనవరి నెలమొత్తం జరగాల్సిన ఆపరేషన్ స్మైల్ జిల్లాలో జనవరి 12వ తేదీ వరకు పట్టాలు ఎక్కడంలేదు. జనవరి 31కే ముగిస్తున్నారు. ఈ యేడాది మేడారం ప్రత్యేక విధుల పేరుతో ముగించేశారు. జిల్లా ఉన్నతాధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో డ్రైవ్‌లు ఫలితాలినివ్వడంలేదు. ప్రధానంగా బాల కార్మికులను గుర్తించి వారికి శాశ్వత ప్రాతిపదికన విద్యను అందించాల్సి ఉండగా, బృందాలు కేవలం డ్రాపవుట్స్పైనే దృష్టి సారించి కేసులను నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డివిజన్ల వారీగా విద్యాశాఖ అధికారులతో చైల్డ్‌లైన్ అధికారులు నిరంతరం హాజరును సమీక్షించాల్సి ఉండగా, ఆ ఊసే లేకపోవడం శోచనీయం. దీంతో బాలకార్మికులు, డ్రాపవుట్స్ యథాస్థితికి చేరుకుంటున్నారు. స్మైల్, ముస్కాన్ అమలు ఇలా.. జిల్లాను ఐదు డివిజన్లుగా విభజించి ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ చేపడుతున్నారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం డివిజన్లుకాగా, ఒక్కో డివిజన్లో ఒక ఎస్సై, మహిళా కానిస్టేబుల్, సీడబ్ల్యూసీ సభ్యులు, ఇద్దరు పురుష కానిస్టేబుల్‌తో పాటు కార్మిక శాఖ అధికారి కలిసి స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తారు. బడిబయట పిల్లలను గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలల్లో చేర్పిస్తారు. బాల కార్మికులతో పనులు చేయిస్తున్న వారిపై కేసులను నమోదు చేస్తారు. 14 సంవత్సరాల లోపు వెట్టి చాకిరీ చేయిస్తున్న వారిపై కార్మిక శాఖ అధికారులు ఐఆర్ చట్టం కింద, 18 సంవత్సరాల లోపు చాకిరీ చేయించే వారిపై జేజే యాక్ట్, 2015 ప్రకారం కేసులను నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తారు. ఈ ఏడాది 167 కేసులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2015లో 578, 2016లో 385 కేసులు నమోదు చేశారు. జిల్లా విభజన తరువాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో 2017 జనవరిలో 152 కేసులు, జూలైలో 138 కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది 2018 జనవరి 12న చేపట్టిన ఆపరేషన్ స్మైల్‌లో 167 కేసులను నమోదు చేశారు. భద్రాచలం డివిజన్లో 23, పాల్వంచలో 64, కొత్తగూడెం 18, మణుగూరు 13, ఇల్లందు డివిజన్లో 49 కేసులను నమోదు చేశారు. వీరు గుర్తించిన కేసులలో ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు 20, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 147 మంది ఉన్నారు. వీటిలో అత్యధికంగా డ్రాపవుట్స్, పిల్లలతో భిక్షాటన చేసే కేసులే ఉండటం గమనార్హం. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి తప్పిపోయి, పారిపోయి వచ్చిన పిల్లలు వెట్టి చాకిరీకి గురవుతున్నారు. భాష రాకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, హోటల్స్, వ్యాపార దుకాణాల్లో మగ్గిపోతున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి భారత రాజ్యాంగం కల్పించిన 21(ఏ) ఆర్టికల్ ప్రకారం, 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం... ప్రతీ విద్యార్థికి విద్య అందేలా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరిగేలా ప్రక్షాళన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ స్పెషల్ డ్రైవ్‌లలో గుర్తించిన బాల కార్మికులను, డ్రాపవుట్స్‌ను పాఠశాలల్లో చేరుస్తున్నాం. అంతేకాకుండా ఆ విద్యార్థులపై తగిన శ్రద్ధ వహిస్తున్నాం. విద్యార్థులకు న్యాయం జరిగేలా సిబ్బందితో పర్యవేక్షిస్తున్నాం. –ఝాన్సీ లక్ష్మీబాయి, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి -
స్టెప్పులతో అదరగొట్టిన టీమిండియా ఆటగాళ్లు
ముంబయి: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫౌండేషన్, మరో ఛారిటీ సంస్థ స్మైల్ ఫౌండేషన్ తో చేతులు కలిపింది. ముంబయి నగరంలో శుక్రవారం రాత్రి క్రికెటర్ విరాట్ కోహ్లీ టీమిండియా ఆటగాళ్లతో పాటు మరికొందరు సెలబ్రిటీలు ఛారిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాషింగ్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీలు స్టెప్పులతో అదరగొట్టారు. వీరికి తోడు యువ ఆటగాడు హార్దిక్ పాండ్యా జత కలిసి తన డ్యాన్స్ తో ఆకట్టుకున్నాడు. నిరుపేద చిన్నారులు, యువతలో స్పూర్తి పొంపేందించేందుకు ఈ ఈవెంట్ నిర్వహించారు. దాదాపు 4 లక్షల మంది చిన్నారులకు విద్య, నిరుద్యోగులకు శిక్షణ లాంటి కార్యక్రమాల కోసం శ్రీకారం చుట్టారు. భారతదేశంలోని నిరుపేద చిన్నారులకు విద్యను అందించడం, నిరుద్యోగ యువతకు మార్గదర్శనం చేయడం ఈవెంట్ ముఖ్య లక్ష్యమని కోహ్లీ పేర్కొన్నాడు. చాలా మంది ప్రముఖులు చేయూత అందించేందుకు, తమతో భాగస్వామ్యం అందుకోవడానికి ఇక్కడికి విచ్చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఈ సందర్బంగా కోహ్లీ, ఎం.ఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, ఉమేశ్ యాదవ్ చిన్నారులతో కలిసి ఫొటోలు దిగి వారికి సంతోషాన్ని పంచారు. టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, కె.ఎల్ రాహుల్, అజింక్యా రహానే ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. వీరితో పాటు ఆకాశ్ అంబానీ, గౌతమ్ సింఘానియా, నికిల్ చతుర్వేది, దిగ్విజయ్ సిన్హ్ కతివాడా, ఇతర ప్రముఖులు విరాట్ ఫౌండేషన్ ఈవెంట్ కు హాజరై తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)