జిల్లాల వారీగా సర్వే చేపట్టాలని కార్మిక శాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: బాలల్ని పనిలో పెట్టుకోవడాన్ని నిషేధిస్తూ ప్రత్యేకంగా చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పటికీ ప్రభావం పెద్దగా కనిపించడంలేదు. చాలాచోట్ల 14 ఏళ్ల లోపు పిల్లలతో పనిచేయిస్తున్న సందర్భాలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో బాల కార్మికుల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా సర్వే చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో తొలుత ఇక్కడి నుంచే సర్వే ప్రారంభించాలని యోచిస్తోంది.
ఈ క్రమంలో జిల్లాల వారీగా సర్వే చేపట్టేం దుకు కార్మికశాఖకు ఆదేశాలు జారీ చేసింది. బాలకార్మిక సర్వే నిమిత్తం జిల్లాల వారీగా సర్వే నిర్వహిస్తుండగా.. ఇందుకు ఒక్కో జిల్లాకు రూ.4లక్షలు కేటాయించింది. సర్వే వివరాల ఆధారంగా కొత్తగా జాతీయ బాలకార్మిక నిర్మూలన ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇటీవల ప్రకటించారు.
సరిగా పనిచేయని ప్రస్తుత ప్రాజెక్టులు..
పూర్వ జిల్లాల ప్రకారం రాష్ట్రంలో పదింటా 8 జిల్లాల్లో జాతీయ బాల కార్మిక నిర్మూలన ప్రాజెక్టులున్నాయి. వీటిలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ప్రాజెక్టులు ఐదేళ్లుగా కార్యక్రమాలు నిర్వహించడం లేదు. మిగతా ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టుల్లో అరకొరగా కార్యక్రమాలు సాగుతున్నాయి. నిర్మాణ రంగంతో పాటు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, కర్మాగారాల్లో పనిచేస్తున్నవారిలో ఎక్కువగా బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన వారున్నారు. ఈ క్రమంలో వారి పిల్లల్ని సైతం పనుల్లో పెడుతున్నట్లు అధికారుల ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి.
బాలకార్మికుల లెక్క తేల్చేద్దాం
Published Mon, Feb 6 2017 2:50 AM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM
Advertisement
Advertisement