పిల్లలను పనిలో పెట్టుకుంటే శిక్షార్హులు
సీనియర్ సివిల్ జడ్జి సీతారామకృష్ణారావు
మార్కాపురం టౌన్ : వ్యాపార సంస్థలు, గృహాల్లో పద్నాలుగేళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా శిక్షార్హులవుతారని సీనియర్ సివిల్ జడ్జి కె.సీతారామకృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం ఐసీడీఎస్ అర్బన్ కార్యాలయంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా అంగన్‌వాడీ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పదేళ్ల క్రితం బాల కార్మికులు ఎక్కువగా ఉండేవారని, ప్రస్తుతం కొంతమేర బాల కార్మికుల సంఖ్య తగ్గిందని చెప్పారు. పిల్లలను తప్పక బడికి పంపించేలా తల్లిదండ్రుల్లో చైతన్యం తేవాలని సూచించారు.
చైల్డ్‌లై న్ జిల్లా కో-ఆర్డినేటర్ ఎం.కిశోర్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని 250 పట్టణాల్లో చైల్డ్‌లైన్ కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో 13 మిలియన్ల మంది బాల కార్మికులు ఉన్నట్లు గుర్తించగా, అనధికారికంగా ఈ సంఖ్యకు ఎన్నోరెట్లు ఎక్కువగా బాల కార్మికులు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. బాలకార్మికులను అరికట్టడంలో అంగన్‌వాడీ సిబ్బంది పనితీరు బాగుందని ప్రశంసించారు. తప్పిపోయిన, వీధి బాలలు, ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలలు, బాల్యవివాహాలకు బలవుతున్న బాలలు, అంగవైకల్యం, భిక్షాటన చేస్తున్న బాలలు, అనాథ బాలలను గుర్తించి 1098 నంబర్‌కు ఫోన్ చేసినట్లయితే చైల్డ్‌లైన్ ద్వారా వారికి రక్షణ కల్పించి ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అర్బన్ సీడీపీఓ వై.ధనలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు, న్యాయవాది ఝాన్సీ, చైల్డ్ లైన్ బృంద సభ్యుడు సీతారామమూర్తి, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.