చిన్నారులను పనిలో పెట్టుకుంటే జైలే
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి
ఏఎస్పీ చందనదీప్తి తాండూరులో చైల్డ్‌లైన్
ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
తాండూరు: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని తాండూరు ఏఎస్పీ చందనదీప్తి పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూరు చైల్డ్‌లైన్, ఎంవీఎఫ్ సంయుక్తంగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని భద్రేశ్వర్ చౌక్‌లో ఏఎస్పీ చందనదీప్తి, మున్సిపల్ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మి ర్యాలీని ప్రారంభించారు.
పలు దుకాణాలకు వెళ్లి ఏఎస్పీ, మున్సిపల్ చైర్‌పర్సన్, చైల్డ్‌లైన్ ప్రతినిధులు యజమానులకు అవగాహన కల్పించారు. చిన్నారులను పనిలో పెట్టుకోబోమని వారినుంచి హామీ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ చందనదీప్తి మాట్లాడుతూ బాలల రక్షణ, సంరక్షణ చట్టం 2015, సెక్షన్ 79 ప్రకారం 18 ఏళ్లలోపు చిన్నారులను పనిలో పెట్టుకోవడం నేరమని, ఐదేళ్ల జైలుశిక్ష పడుతుందని వివరించారు. బడీడు పిల్లలందరినీ పాఠశాలలకు పంపేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు,వ్యాపారులు, విద్యావేత్తలు అందరూ కలిసి సమష్టికృషితో బాలకార్మిక వ్యవస్థ అంతానికి నడుం బిగించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
బాలకార్మిక రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. తాండూరు మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. 18ఏళ్లలోపు బాలబాలికలను పనిలో పెట్టుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చైల్డ్‌లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటేశ్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న బాలలను రక్షించేందుకు తక్షణమే 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు. బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య, కార్మిక శాఖ అధికారి శశివర్మ, చైల్డ్‌లైన్,ఎంవీఎఫ్, బాలల హక్కుల పరిరక్షణ సమితి, షేర్ సంస్థ, ప్రతినిధులు వెంకట్‌రెడ్డి, వెంకట్, నర్సింహులు, రాములు, జనార్దన్, సుదర్శన్, వెంకట్‌రావు, శ్రీనివాస్,రామేశ్వర్, ఆశీర్వాదం, నాగమణి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.