బాల్యం... భారం
కఠిన చట్టాలున్నా అమలు కాని బాలకార్మిక నిర్మూలన
సామాజిక చైతన్యంతోనే బాలల హక్కుల పరిరక్షణ
నేడు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం
పలకా, బలపం పట్టాల్సిన చేతులు.. ఇటుక బట్టీల్లో వెట్టిచాకిరీ చేస్తున్నాయి. భావి భారత పౌరులు.. హోటళ్లలో అంట్లు తోముతూ.. మెకానిక్ షాపుల్లో పనిచేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికీ అనేక గ్రామాల్లో పశువుల కాపరులుగా చిన్నారులను ఉపయోగించుకుంటున్నారంటే బాలకార్మిక వ్యవస్థ ఎంతగా వేళ్లూనుకుందే అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రుల నిరక్షరాస్యత, అవగాహన రాహిత్యంతో పాటు పేదరికం వల్ల పిల్లలు బడికి దూరమై.. వెట్టికి దగ్గరవుతున్నారు. నేడు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం...
సిద్దిపేట రూరల్: జిల్లాలో బాలకార్మికుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆపరేషన్ స్మైల్ ప్రోగ్రాం ద్వారా 2015లో 242 మంది చిన్నారులను గుర్తించారు. వీరిని పాఠశాలల్లో చేర్పించడంతో పాటు, కొందరిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అదేవిధంగా ఈ ఏడాది జనవరిలో స్మైల్-2 కార్యక్రమంలో భాగంగా 183 మంది బాలకార్మికులను గుర్తించారు. ఇందులో 120 మందిని వివిధ పాఠశాలల్లో చేర్పించారు. మరో 63 మందిని వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. మరోవైపు చైల్డ్‌లేబర్ అధికారులు బాలకార్మికులను గుర్తిస్తూ, వారి తల్లిదండ్రుల్లో అవగాహన కలిగిస్తున్నారు. కొన్నిచోట్ల కేసులు నమోదు చేసి, విధించిన జరిమానా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు.
చట్టాల అమలుతోనే...
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం కఠినమైన చట్టాలు రూపొందించింది. 1986 జువనైల్ జస్టిస్ చట్టం (జేజే యాక్ట్) ప్రకారం బాలకార్మికులతో పనిచేయించే వారిని తక్షణం అరెస్ట్ చేయవచ్చు. నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. అన్ని పోలీస్‌స్టేషన్‌ల్లో ఫిర్యాదు చేసేందుకు బాలల హక్కుల పరిరక్షణ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఎవరైనా పిల్లలతో పనిచేయిస్తున్నట్టు కనిపిస్తే నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
కర్మాగారాల్లో ఎక్కువగా...
బాలకార్మికులు ఎక్కువగా వ్యవసాయ కూలీలు, ఇటుకబట్టీలు, పారిశ్రామికవాడలు, హోటళ్లు, మోటారు వాహనాల గ్యారేజీల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. మెదక్, పటాన్‌చెరు, హత్నూర, నర్సాపూర్, సంగారెడ్డి, నారాయణఖేడ్, సిద్దిపేట ప్రాంతాల్లోని ఇటుక బట్టీల్లో ఎక్కువగా ఒరిస్సా, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన చిన్నారులు పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల సమ్మతంతో పనిచేస్తున్నా బాలకార్మిక వ్యవస్థ కిందకే వస్తుంది. కార్మిక విభాగం అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది, రెవెన్యూ, పోలీసు సిబ్బంది తరచూ తనిఖీలు నిర్విహ ంచి వెట్టి నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో కొన్ని సంస్థలు పనిచేయలేకపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.