World Day Against Child Labour
-
బాల్యానికి భరోసా ఏదీ?
‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా, పాలు మరచి ఎన్నాళ్ళయ్యిందో, ఓ పాల బుగ్గల జీతగాడా, కొలువుదీరి ఎన్నాళ్ళయ్యిందో’ అంటూ... ప్రజాకవి సుద్దాల హనుమంతు రాసిన ఈ పాట భారతదేశంలో శతాబ్దాల తరబడి బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతున్న బాలల జీవన చిత్రాన్ని ప్రతిబింబిస్తుంది. బడిలో ఉండాల్సిన పిల్లలను, ఆట పాటలతో గడపాల్సిన బాల్యాన్ని బందీ చేయడం ఒక అనాగరిక చర్య. ఇది మన భారతదేశ సమస్య మాత్రమే కాదు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న చాలా దేశాల సమస్య కూడా.ప్రపంచవ్యాప్తంగా 28.7 కోట్ల మంది పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది ‘వరల్డ్ డే అగెనెస్ట్ చైల్డ్ లేబర్’ ఉద్యోగుల భద్రత, ఆరోగ్యాలను మెరుగుపరచవలసిన అవసరాన్నీ, చిన్నారి బాల కార్మికుల పరిస్థితులను మెరుగుపరచవలసిన అవసరాన్నీ నొక్కి చెబుతోంది. పిల్లలందరికీ విద్య, ఆరోగ్యాలను పొందడానికి హక్కు ఉంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది బాలలు వీటికి దూరమవుతున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలు అనాథలు కావడం, కుటుంబ పేదరికం, నిరక్షరాస్యత, తదితర కారణాల వల్ల బాలలు కార్మికులుగా మారుతున్నారు.కర్మాగారాలలో, హోటళ్లలో, రైల్వే – బస్ స్టేషన్లలో, వీధుల్లో బాలకార్మికులు కనిపిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో పనులు చేస్తూ బతుకు బండిని లాగుతున్నారు. పట్టణాలు, నగరాలలో బాలకార్మికులు భిక్షాటన చేస్తున్నారు. కొంతమంది చెడువ్యసనాలకు బానిసలై దొంగతనాలూ, హత్యలకూ పాల్పడుతున్నారు. బాల కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితాలు శూన్యం అని చెప్పవచ్చు.బడికి వెళ్లాల్సిన బాల్యం బందీగా మారుతోంది. దీనికి కారణం ఎవరు? రోడ్డుపై విసిరేసిన ఎంగిలి విస్తరాకులూ, చిత్తుకాగితాలు ఏరుకుంటూ... చితికిపోయిన బతుకులు ఈడ్చుకుంటూ మెతుకు కోసం జీవిత పోరాటం చేస్తున్నారు వీరు. ఇటుకలు మోస్తూ, ఇనుమును కరిగిస్తూ, బిక్షమెత్తుకొంటూ, పంక్చర్ లేస్తూ, పేపర్ వేస్తూ, పాలు, పల్లీలమ్ముతూ, కంపెనీల్లో పనిచేస్తూ, పశువులు కాస్తూ, కలుపులు తీస్తూ, పాలిష్ చేస్తూ, పెయింట్లు వేస్తూ బతుకును వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితులను కళ్లారా చూస్తున్న ఐక్యరాజ్యసమితి 2002లో బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది.అయినా ప్రపంచంలోని వివిధ దేశాలలో బాలకార్మికుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప, తగ్గడం లేదు. సమాజంలో భాగమైన మనమందరం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు నడుం బిగిద్దాం. – ముద్దం నరసింహ స్వామి; జర్నలిస్టు, హైదరాబాద్ (రేపు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా) -
World Day Against Child Labour 2022: పని నేర్పించడం వేరు.. పని చేయించడం వేరు
తల్లిదండ్రులు యజమానులు కాదు. పిల్లలు కార్మికులు కాదు. ‘అది ఎత్తు’ ‘ఇది సర్దు’ ‘నీళ్లు తీసుకురా’ ‘ఇల్లు చిమ్ము’ ‘స్కూటర్ తుడువు’ పిల్లలకు పని నేర్పాల్సిందే. కాని వారు మన కడుపున పుట్టినందున మనం చెప్పే పనులన్నీ చేస్తే బాలకార్మికులే అవుతారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల మీద చేసే అజమాయిషీ అన్యాయంగా ఉంటుంది. వారిది ఆడే పాడే చదువుకునే వయసు. ఇంట్లో అయినా బయట అయినా కూలి బతుకు కాదు. ‘అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా గ్రహించాల్సింది ఇదే. ఒక సందర్భం: తొమ్మిదో క్లాసు చదువుతున్న వర్థన్ టీవీ చూస్తున్నాడు. అమ్మ బజారుకు వెళ్లి నూనె పేకట్ తెమ్మంది. ఆ షాప్ ఇంటికి కొంచెం దూరం. అమ్మ వెళ్లొచ్చు. నాన్న ఇంట్లోనే ఉన్నాడు. నాన్న కూడా వెళ్లొచ్చు. వర్థన్ చాలాసార్లు వెళ్లి తెస్తాడు. కాని ఆ టైమ్‌లో వాడికి వెళ్లడం ఇష్టం లేదు. అమ్మ పదేపదే చెప్తోంది. వాడు కదలట్లేదు. లాగి ఒక్కటిచ్చింది. ఎదుగుతున్న పిల్లాడు. చాలా హర్ట్ అయ్యాడు. ఇంట్లో నుంచి గంట మాయం అయిపోయాడు. ఆ అమ్మా నాన్నలు పడ్డ కంగారు అంతా ఇంతా కాదు. పని చేసి తీరాల్సిందే అనేది వాడికి రూలు కాదు. వాడు ఆ నియమానికి బద్ధుడు కాదు. వాడు చిన్నపిల్లాడు కనుక పెద్దలు భయపడి చచ్చినట్టు చేయాల్సిందే అనే భావనా సరిౖయెనది కాదు. మరో సందర్భం: పదో క్లాసు చదువుతున్న మాలిక రెండు రోజులకు ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్లి రెండు బిందెలు నీళ్లు తేవాలి. వాళ్లు ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉంటారు. వాడుకునే నీళ్లు ట్యాంకు నుంచి వస్తాయి. తాగే నీళ్లే కింద పట్టుకుని తెచ్చుకోవాలి. పనిమనిషి తేదు. తల్లి రెండేళ్ల క్రితం వరకూ తెచ్చేది. ఇప్పుడు పూర్తి బాధ్యత మాలికకు అప్పజెప్పింది. తండ్రి, అన్నయ్యకు ఈ బాధ్యత లేదు. నీళ్ల బరువు మాలిక నెత్తి మీదే. మాలికకు ఒక్కోసారి చేయబుద్ధి కాదు. ఆ రోజు ఇంట్లో పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. మూడో సందర్భం: ప్రతి ఇంటి హాలులో సోఫా ఉంటుంది. సోఫాలో తల్లి, తండ్రి కూచుని ఉంటారు. కాని వారికి దూరంగా ఉన్న ఫోన్ పిల్లలు తెచ్చివ్వాలి. ఫ్రిజ్‌లో నుంచి నీళ్లు పిల్లలు తెచ్చివ్వాలి. ఎవరో డోర్ కొడతారు. మరో రూమ్‌లో చదువుకుంటున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లలు తలుపు తెరవాలి. చెత్తవాడు బయట రిక్షా ఆపుతాడు. పిల్లలు వెళ్లి పోసి రావాలి. అమేజాన్ పార్శిల్ వస్తుంది. పిల్లలే అందుకోవాలి. స్విగ్గి ఆర్డర్ పెట్టాలి. పిల్లలకే ఆ పని చెప్పాలి. ఇవన్నీ పిల్లలు చేయదగ్గ అతి తేలికైన పనులే. కాని పిల్లల స్థానంలో నౌకర్ని ఊహించుకుంటే ఇన్ని పనులు చెప్పగలమో లేదో తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. పదిహేను పదహారేళ్లు వచ్చే వరకూ పిల్లలకు పని ప్రత్యేకంగా ఇష్టం ఉండదు. వారు సంతోషంగా ఉండటానికి చూస్తారు. ఆడుకోవాలనుకుంటారు. చదువుకుంటారు. టీవీలు, వీడియోలు చూస్తారు. సైకిల్ తొక్కుతారు. ఊరికూరికే నవ్వుకుంటూ ఉంటారు. వారికి పని నేర్పించడం పెద్దల బాధ్యత. ఇంటి పనుల్లో కూడా పిల్లలకు భాగం ఉంటుంది. బాత్రూమ్లో వస్తువులు నీట్‌గా పెట్టడం, స్నానం చేశాక వారి బట్టలు తీసుకెళ్లి వాష్ ఏరియాలో పడేయడం, చెప్పుల స్టాండ్‌లో చెప్పులు నీట్‌గా సర్దుకోవడం, నిద్ర లేచాక దుప్పట్లు మడత వేయడం, అవసరం అయితే టీ పెట్టడం నేర్చుకోవడం... ఇవి కూడా పనులే. ఈ మాత్రం పనులు వారు తెలుసుకుని ఉండాలి. అంతమాత్రం చేత వారికి పనులు రావాల్సిందే అని పంతం పెట్టి ఇల్లు చిమ్మించడం, బట్టలు ఉతికించడం, అంట్లు తోమించడం, నీళ్లు మోయించడం, దూరాలకు పంపి పదే పదే వస్తువులను తెప్పించడం... వారిని బాల కార్మికుల కింద మార్చడమే అవుతుంది. పిల్లలు కొంత ఎదిగిన వెంటనే ఇక పనులు వారి నెత్తిన వేసే ధోరణి తల్లిదండ్రుల్లో ఉంటుంది. అది చాలా తక్కువ స్థాయిలో మాత్రమే అనుమతించదగింది. వారు ఏ మాత్రం ఇంటి నౌకర్లు కారు. ఇంటి సభ్యులు. మరో విషయం. కొందరికి చదువు బాగా వంటబట్టినట్టు కొందరు పిల్లలకు పనులు బాగా వంటబడతాయి. కొందరు పిల్లలకు ఎంతమాత్రం పనులు రావు. దానికి ఏం చేయలేము. ఉదాహరణకు కొందరు పిల్లలు టక్కున వస్తువు పట్టుకురాలేరు. ‘షెల్ఫ్‌లో జండూబామ్ ఉంటుంది తీసుకురా’ అని తల్లి ఆర్డర్ వేస్తే కొందరు పిల్లలకు భూతద్దం ఇచ్చినా ఆ జండూబామ్ కనపడదు. వారికి కనపడదు అని తల్లికి కూడా తెలుసు. ‘కనపడిందా.. కనపడిందా’ అని తల్లి అరుస్తూ ఉంటుంది. పిల్లాడికి అది చాలా యాంగ్జయిటీని ఇస్తుంది. తల్లో, తండ్రో ‘నా బిపి టాబ్లెట్ స్ట్రిప్ తీసుకురా’ అనంటే అది టక్కున వెతికి తెచ్చే వరకు, అలా వెతకడం రాకపోతే ఆ పిల్లాడి నెత్తి మీద పిడుగు పడుతుందంటే అది వింతగా ఉండొచ్చు. కాని అది నిజం. కొందరు పిల్లల దుర్బలంగా ఉంటారు. కొన్ని పనులు చేయలేరు. కొందరు పిల్లలు బద్దకంగా ఉంటారు. వేగంగా కదల్లేరు. కొందరు పిల్లలు అసలు పని అంటేనే లోలోపల కుమిలిపోతారు. వారిని చాలా మెల్లగా అవసరం మేరకు దారిలో పెట్టుకోవాలి తప్ప కొరడా పట్టుకుని అదిలించే పద్ధతిలో కాదు. బయట షాపుల్లో వీధుల్లో కనిపించే బాల కార్మికులను చూసి జాలి పడటం కాదు. మన ఇళ్లల్లో మన పిల్లలు ‘కార్మికులు’గా ఎన్ని పని గంటలు ఇంటి పని చేస్తున్నారు, ఆ శ్రమ వల్ల వారి మానసిక, భౌతిక స్థితిలో ఏం తేడా కనిపిస్తోంది అనేది తల్లిదండ్రులు గమనించుకోవాలి. పిల్లలు పుట్టడమే సున్నితంగా పుడతారు. వారితో సున్నితంగా వ్యవహరించాల్సింది పెద్దలే. -
ఇంకానా బాల కార్మిక వ్యవస్థ?
బాలలు భగవంతుడి స్వరూపాలంటారు. ఏ దేశానికైనా మూల స్తంభాలూ, భవిష్యత్తూ వాళ్లే. అమ్మ ఒడిలో, నాన్న లాలనలో, స్వేచ్ఛగా ప్రేమాభిమానాల మధ్య ఎదగడం బాలల హక్కు కావాలి. అమాయ కత్వంతో తొణికిసలాడే ఆ పసి మనసుల గురించి పట్టించుకోక పోవడం, అనాదరించడం సాంఘిక దురాచారమే అవుతుంది. ఈ 21వ శతాబ్దంలోనూ బాల కార్మిక వ్యవస్థ అతిపెద్ద ప్రపంచ సమస్యల్లో ఒకటి కావడం దురదృష్టకరం. ప్రపంచవ్యాప్తంగా కూడా బాలకార్మిక వ్యవస్థ కొన సాగేందుకు బోలెడన్ని కారణాలు ఉన్నాయి. పేదరికం, నిరక్ష రాస్యత, పెద్ద పెద్ద కుటుంబాలు, బాలలకు సులువుగా ఉపాధి దొరికే అవకాశం లేకపోవడం, ఉన్న చట్టాల అమల్లో నిర్లక్ష్యంతో పాటు అనేక ఇతర అంశాలు కూడా చేరడం వల్ల ఈ సాంఘిక ఆర్థిక, రాజకీయాలు కలిసి ఈ దురాగతం ఇంకా కొనసాగేలా చేస్తున్నాయి. అయితే బాల కార్మిక వ్యవస్థను ఒక ఆర్థిక సమస్యగా పరిగణిస్తే మాత్రం ఏ దేశమూ దీన్ని పరిష్కరింప జాలదు. సామాజిక దృక్పథంలో మార్పు రావాలి. రాజకీయం గానూ కొంత సున్నితంగా వ్యవహరించాలి. గత ఎనిమిదేళ్లలో బాల కార్మిక వ్యవస్థను నియంత్రిం చడంలో దేశం చెప్పుకోదగ్గ స్థాయిలో విజయవంతమైంది. నేను కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి)గా వ్యవహరిస్తున్న సమయంలో అమల్లోకి వచ్చిన ‘ద చైల్డ్ లేబర్ (ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్) అమెండ్మెంట్ యాక్ట్ 2016’ పాత్ర కూడా ఇందులో ఉండటం ముదావహం. పద్నాలుగేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలను ఏ రకంగానూ పనిలో పెట్టుకోకూడదని ఈ చట్టం చెబుతుంది. అలాగే 14–18 మధ్య వయస్కులను ప్రమాదకరమైన వృత్తుల్లో నియమించ రాదు. అయితే కుటుంబ సభ్యుల లేదా కుటుంబ వ్యాపారంలో బాలలు సాయం అందించేందుకు ఈ చట్టం అవకాశం కల్పి స్తోంది. అలాగని ప్రమాదకరమైన వృత్తులో పని చేసే అవకాశం లేదు. మా అమ్మ ఈశ్వరమ్మ ఉల్లిపాయలు అమ్మేది. స్కూల్ అయిపోయిన తరువాత నేనూ దుకాణంలో అమ్మకు సాయపడే వాడిని. అయితే 2016 నాటి చట్టం కంటే ముందు ఇలా చేయడం శిక్షార్హమైన నేరం. నా చిన్నతనపు కథనం ఎందుకు ప్రస్తావిస్తున్నానని అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రమాద కరం కాని చాలా వాణిజ్య కార్యకలాపాల్లో ఇప్పటికీ తల్లిదండ్రు లకు పిల్లల సాయం అవసరమవుతూంటుంది. అటువంటి సందర్భాల్లో పిల్లలు వారికి సాయపడటంలో తప్పులేదు. ఇంకో విషయం: మా అమ్మ ఎప్పుడూ స్కూల్ ఎగ్గొట్టి తనకు సాయపడాలని కోరలేదు. ఆ విషయం నేనెప్పుడూ గుర్తుంచు కుంటాను. కష్టాలెన్ని ఉన్నా నాకు మంచి విద్యను అందించా లన్న ఆమె దృఢ నిర్ణయానికి నమస్సులు అర్పిస్తాను. బాలాకార్మికులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కేంద్రీ కృతమై ఉన్న నేపథ్యంలో వారందరిలోనూ వీలైనంత తొందరగా చైతన్యం కల్పించాల్సిన అవసరముంది. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు కింద ఇప్పటివరకూ దాదాపు 14 లక్షల మంది బాలకార్మికులకు విముక్తి లభించింది. అంతేకాకుండా ప్రత్యేక శిక్షణా కేంద్రాల ద్వారా వారికి బ్రిడ్జ్ కోర్సులు అందించి సాధారణ పాఠశాలల్లో విద్యనభ్యసించే అవకాశం కల్పించారు. వృత్తి నైపుణ్యాలు అందించడంతోపాటు మధ్యాహ్న భోజన పథకం, ఆరోగ్య సేవలు, ఉపకార వేతనం కూడా అందించారు. బాలకార్మిక వ్యవస్థ నుంచి బయటపడ్డ వారు సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు వీలుగా సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2021 మార్చి 31 నాటికి దేశంలోని 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 1,225 ప్రత్యేక శిక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. తల్లిదండ్రుల వృత్తుల్లో బాలలు కార్మికులుగా చేరడం మనం చాలాకాలంగా చూస్తున్నాం. ఇటుక బట్టీలు, గార్మెంట్స్, వ్యవసాయం, టపాసుల తయారీల్లో బాలకార్మికుల భాగ స్వామ్యం ఉంది. ధాబాలు, చిన్న చిన్న హోటళ్లు, టీస్టాల్స్, తివాచీ, చేతిగాజుల పరిశ్రమల్లో పిల్లలు రకరకాల పనులు చేస్తున్నారు. ఇలా అసంఘటిత రంగాల్లో బాలకార్మికులు పనిచేసే అవకాశాలు ఎక్కువ. అయినప్పటికీ పాఠశాలలకు పంపకుండా పనిలో పెట్టుకుంటున్న కుటుంబ సభ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇది మరింత సమర్థంగా, వేగంగా జరగాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్‌ను సక్రమంగా అమలు చేయడం కూడా బాలకార్మిక వ్యవస్థ పీడ వదిలించుకోవడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. సమగ్ర శిక్ష అభియాన్ సమన్వయంతో ఐదు నుంచి ఎనిమిదేళ్ల మధ్య వయస్కులు విద్యా వ్యవస్థలో భాగమయ్యేలా చూడాలి. అలాగే ‘పెన్సిల్’ (ప్లాట్ఫార్మ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్)పై సమర్థమైన నిఘా ఉంచాలి. కుటుంబాల వృత్తుల్లో పాల్గొన్న వారిని కూడా బాలకార్మికులుగా గుర్తించడం ద్వారా ప్రస్తుత పరిస్థితి మార్చలేము. అందుకే భిన్నమైన ఆలోచనతో ఈ చిక్కుముడిని విప్పాల్సి ఉంటుంది. పైగా ఈ పని కేవలం ప్రభుత్వానిది మాత్రమే అనుకుంటే తప్పు. ఎన్జీవోలు, స్వచ్ఛంద కార్యకర్తలు, సీనియర్ సిటిజెన్లు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. 2022 సంవత్సరపు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాలను ‘సార్వత్రిక సామాజిక పరిరక్షణ ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన’ అన్న అంశం ప్రధాన ఇతివృత్తంగా నిర్వహిస్తూండటం ఎంతైనా సంతోషకరం. బాల కార్మికుల్లేని ప్రపంచం ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటన్న సంగతి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను తుదముట్టించాలన్న లక్ష్యం ప్రపంచం ముందున్న విషయం తెలిసిందే. ఈ దిశగా భారత్ గత ఎనిమిదేళ్లల్లో ఎంతో ప్రగతి సాధించింది. కోవిడ్–19 కారణంగా ఇబ్బందులు ఎదురైనా బాలకార్మిక వ్యవస్థ మళ్లీ వేళ్లూనుకోకుండా దృఢ సంకల్పం, నిశ్చయంతో పని చేయా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలిసికట్టుగా కృషి చేస్తే దేశం త్వరలోనే బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి పొందగలదు! - బండారు దత్తాత్రేయ, హరియాణా రాష్ట్ర గవర్నర్ (జూన్ 12న ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం) -
చిన్నారులను పనిలో పెట్టుకుంటే జైలే
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి ఏఎస్పీ చందనదీప్తి తాండూరులో చైల్డ్‌లైన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ తాండూరు: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని తాండూరు ఏఎస్పీ చందనదీప్తి పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూరు చైల్డ్‌లైన్, ఎంవీఎఫ్ సంయుక్తంగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని భద్రేశ్వర్ చౌక్‌లో ఏఎస్పీ చందనదీప్తి, మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి ర్యాలీని ప్రారంభించారు. పలు దుకాణాలకు వెళ్లి ఏఎస్పీ, మున్సిపల్ చైర్పర్సన్, చైల్డ్‌లైన్ ప్రతినిధులు యజమానులకు అవగాహన కల్పించారు. చిన్నారులను పనిలో పెట్టుకోబోమని వారినుంచి హామీ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ చందనదీప్తి మాట్లాడుతూ బాలల రక్షణ, సంరక్షణ చట్టం 2015, సెక్షన్ 79 ప్రకారం 18 ఏళ్లలోపు చిన్నారులను పనిలో పెట్టుకోవడం నేరమని, ఐదేళ్ల జైలుశిక్ష పడుతుందని వివరించారు. బడీడు పిల్లలందరినీ పాఠశాలలకు పంపేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు,వ్యాపారులు, విద్యావేత్తలు అందరూ కలిసి సమష్టికృషితో బాలకార్మిక వ్యవస్థ అంతానికి నడుం బిగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బాలకార్మిక రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. తాండూరు మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. 18ఏళ్లలోపు బాలబాలికలను పనిలో పెట్టుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చైల్డ్‌లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటేశ్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న బాలలను రక్షించేందుకు తక్షణమే 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు. బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య, కార్మిక శాఖ అధికారి శశివర్మ, చైల్డ్‌లైన్,ఎంవీఎఫ్, బాలల హక్కుల పరిరక్షణ సమితి, షేర్ సంస్థ, ప్రతినిధులు వెంకట్‌రెడ్డి, వెంకట్, నర్సింహులు, రాములు, జనార్దన్, సుదర్శన్, వెంకట్రావు, శ్రీనివాస్,రామేశ్వర్, ఆశీర్వాదం, నాగమణి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
బలవుతున్న బాల్యం..
ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ ఒకటి. 21వ శతాబ్దంలోనూ ఈ సమస్య ఇంకా అంతం కావడం లేదు. ఎందరో బాలల భవిష్యత్‌ను చిదిమేస్తున్న కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అంతర్జాతీయ సమాజం కృషి చేస్తూనే ఉంది. అయినప్పటికీ పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించడం లేదు. నేడు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భంగా నేటి తరంలో బాలకార్మిక వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం.. 21 కోట్ల మంది.. కార్మికులుగా పనిచేసే 5 నుంచి 14 ఏళ్లలోపు పిల్లల్ని బాలకార్మికులుగా పరిగణిస్తారు. కొన్నిదేశాల్లో 17 ఏళ్లలోపు బాలల్ని కూడా కార్మికులుగానే భావిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21 కోట్ల మంది బాల కార్మికులుగా కొనసాగుతున్నారని ఐక్యరాజ్య సమితి అంచనా. పిల్లలు ఎవరైనా బాలకార్మికులుగా ఉన్నారంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లే. పరిశ్రమలు, వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగం, సేవలు సహా అనేక రంగాల్లో బాలలు కార్మికులుగా పనిచేస్తున్నారు. కారణాలు.. పిల్లల తల్లిదండ్రుల పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యతల కారణంగానే బాలకార్మికులు పెరిగిపోతున్నారు. కనీస అవసరాలకు సరిపడా ఆదాయం దొరకని అనేక కుటుంబాలు తమ పిల్లల్ని పనుల్లో చేర్పిస్తున్నాయి. ప్రపంచంలో పావుశాతం జనాభా కఠిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ఆఫ్రికా, అసియా, లాటిన్ అమెరికాల్లో పేదరికం కారణంగా పిల్లలు కార్మికులుగా మారాల్సి వస్తోంది. కొన్ని దేశాల్లో పిల్లలు విద్యనభ్యసించేందుకు అనువైన వసతులు లేకపోవడం కూడా ఒక కారణం. ప్రభుత్వాలు ఉచిత విద్య అందించకపోవడం, ప్రైవేటు విద్య ఖరీదు కావడంతో బాలలు చదువుకు దూరమై కార్మికులుగా పని చేస్తున్నారు. వెట్టిచాకిరి, సామాజిక అంశాలు సైతం ఇందుకు కారణమవుతున్నాయి. ఇక కొందరు పిల్లలు వంశపారంపర్యంగా వస్తున్న పనుల్లోనే కొనసాగుతున్నారు. బాల్యం ఛిద్రం.. బాల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కనీసం ప్రాథమిక విద్య కూడా పొందకుండానే కార్మికులుగా మారుతున్నారు. వీరిలో పోషకార లోపం కారణంగా శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండడం లేదు. అనేక మానసిక, శారీరక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. యాజమాన్యాలు బాల కార్మికులతో ఎక్కువ పనిచేయిస్తూ, తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. కొంతమంది బాలలు వారి సామర్ధా్యనికి మించిన పనుల్ని చేయాల్సి వస్తోంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రమాదకర పరిస్థితుల్లో సైతం బాలలు పనిచేస్తున్నారు. బాలకార్మికులు భౌతిక, లైంగిక దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని అనేక నివేదికలు వివరిస్తున్నాయి. భవిష్యత్ అంధకారం.. బాల కార్మికులుగా కొనసాగిన వారు భవిష్యత్‌లో ఉన్నతమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. వీరికి సరైన విద్య లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. పోటీతత్వం నిండిన సమాజంలో అన్నిరకాలుగా వెనుకబడిపోతున్నారు. పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారు. ఉపాధి మార్గాలు వెతుక్కునేందుకు సరైన మార్గదర్శనం, ఆర్థిక తోడ్పాటు లేకపోవడం, నైపుణ్యలేమి వంటి కారణాల వల్లే ఇలా మారుతున్నారు. ఇందుకు వ్యవస్థనే తప్పుబట్టాల్సి ఉంటుంది. నిర్మూలనకు మార్గం.. బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలంటే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలి. దీనికి అనుగుణమైన చట్టాలు రూపొందించాలి. బాలలతో పని చేయించుకునే యజమానులకు కఠిన శిక్షలు విధించాలి. బాలలందరికీ విద్య, పోషకాహారం అందేందుకు కృషి చేయాలి. ఈ పరిస్థితికి కారణమైన వ్యవస్థల్లో మార్పు తీసుకురావడం ద్వారానే ఇది సాధ్యం. పిల్లల్ని పనులు మాన్పించి, బడులలో చేర్పించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. వారి తల్లిదండ్రులు ఆర్థికంగా ఎదిగేందుకు సరైన అవకాశాల్ని కల్పించడం ద్వారా బాల కార్మికులు లేకుండా చూడొచ్చు. ఇలాంటి పిల్లలు చదువుకునేందుకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి, ఉచిత విద్య, భోజనం అందిచాలి. తల్లిదండ్రుల సంరక్షణ లేని వారికి ప్రత్యేక రక్షణ, వసతులు కల్పించాలి. మన దేశంలో.. ప్రపంచంలో ఎక్కువ మంది బాలకార్మికులు ఉన్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. మన దేశంలో దాదాపు కోటి వరకు బాల కార్మికులు ఉన్నట్లు అంచనా. ఈ వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం కఠినమైన చట్టాల్ని అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించలేకపోతున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు అమలవుతోంది. దీనిలో భాగంగా పనుల్లో మగ్గుతున్న బాలల్ని గుర్తించి, వారికి సరైన ఆవాసం కల్పించి, విద్య అందిస్తారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విద్యాహక్కు చట్టం సత్ఫలితాల్నిస్తోంది. ఏ కారణం చేతనైనా బాలలు బడి బయట ఉండరాదని, ప్రతి ఒక్కరికి నిర్బంధ ప్రాథమిక విద్య అందాలని ఈ చట్టం చెబుతోంది. బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లల్ని పనుల్లో పెట్టుకోకూడదు. దీన్ని అతిక్రమించిన వారికి జైలు శిక్షలతోపాటు జరిమానాలు విధిస్తారు. యునిసెఫ్ కృషి.. అంతర్జాతీయంగా బాలల హక్కుల కోసం కృషి చేస్తున్న యునిసెఫ్ సంస్థ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు యత్నిస్తోంది. వివిధ దేశాలతో కలిసి ఈ సమస్య నివారణ కోసం చట్టాలు రూపొందించింది. 15 ఏళ్లలోపు పిల్లల్ని ఎక్కడా పనుల్లో చేర్చుకోకూడదని, 18 ఏళ్లలోపు వారిని కఠినమైన పనులకు వినియోగించకూడదని యునిసెఫ్ నిబంధనలు చెబుతున్నాయి. పిల్లలందరికీ కచ్చితంగా విద్య అందేలా చూస్తోంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అవసరమైన చట్టాలను రూపొందించడంలో, ప్రాథమిక విద్య అందించడంలో యునిసెఫ్ కీలకపాత్ర పోషిస్తోంది. -
బాల్యం... భారం
కఠిన చట్టాలున్నా అమలు కాని బాలకార్మిక నిర్మూలన సామాజిక చైతన్యంతోనే బాలల హక్కుల పరిరక్షణ నేడు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం పలకా, బలపం పట్టాల్సిన చేతులు.. ఇటుక బట్టీల్లో వెట్టిచాకిరీ చేస్తున్నాయి. భావి భారత పౌరులు.. హోటళ్లలో అంట్లు తోముతూ.. మెకానిక్ షాపుల్లో పనిచేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికీ అనేక గ్రామాల్లో పశువుల కాపరులుగా చిన్నారులను ఉపయోగించుకుంటున్నారంటే బాలకార్మిక వ్యవస్థ ఎంతగా వేళ్లూనుకుందే అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రుల నిరక్షరాస్యత, అవగాహన రాహిత్యంతో పాటు పేదరికం వల్ల పిల్లలు బడికి దూరమై.. వెట్టికి దగ్గరవుతున్నారు. నేడు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... సిద్దిపేట రూరల్: జిల్లాలో బాలకార్మికుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆపరేషన్ స్మైల్ ప్రోగ్రాం ద్వారా 2015లో 242 మంది చిన్నారులను గుర్తించారు. వీరిని పాఠశాలల్లో చేర్పించడంతో పాటు, కొందరిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అదేవిధంగా ఈ ఏడాది జనవరిలో స్మైల్-2 కార్యక్రమంలో భాగంగా 183 మంది బాలకార్మికులను గుర్తించారు. ఇందులో 120 మందిని వివిధ పాఠశాలల్లో చేర్పించారు. మరో 63 మందిని వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. మరోవైపు చైల్డ్‌లేబర్ అధికారులు బాలకార్మికులను గుర్తిస్తూ, వారి తల్లిదండ్రుల్లో అవగాహన కలిగిస్తున్నారు. కొన్నిచోట్ల కేసులు నమోదు చేసి, విధించిన జరిమానా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. చట్టాల అమలుతోనే... బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం కఠినమైన చట్టాలు రూపొందించింది. 1986 జువనైల్ జస్టిస్ చట్టం (జేజే యాక్ట్) ప్రకారం బాలకార్మికులతో పనిచేయించే వారిని తక్షణం అరెస్ట్ చేయవచ్చు. నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. అన్ని పోలీస్స్టేషన్ల్లో ఫిర్యాదు చేసేందుకు బాలల హక్కుల పరిరక్షణ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఎవరైనా పిల్లలతో పనిచేయిస్తున్నట్టు కనిపిస్తే నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కర్మాగారాల్లో ఎక్కువగా... బాలకార్మికులు ఎక్కువగా వ్యవసాయ కూలీలు, ఇటుకబట్టీలు, పారిశ్రామికవాడలు, హోటళ్లు, మోటారు వాహనాల గ్యారేజీల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. మెదక్, పటాన్చెరు, హత్నూర, నర్సాపూర్, సంగారెడ్డి, నారాయణఖేడ్, సిద్దిపేట ప్రాంతాల్లోని ఇటుక బట్టీల్లో ఎక్కువగా ఒరిస్సా, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన చిన్నారులు పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల సమ్మతంతో పనిచేస్తున్నా బాలకార్మిక వ్యవస్థ కిందకే వస్తుంది. కార్మిక విభాగం అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది, రెవెన్యూ, పోలీసు సిబ్బంది తరచూ తనిఖీలు నిర్విహ ంచి వెట్టి నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో కొన్ని సంస్థలు పనిచేయలేకపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.