ఆలంపల్లి, న్యూస్‌లైన్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఎంవీఎఫ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. వికారాబాద్ డైట్‌లో గురువారం సర్పంచులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. గ్రామంలో ఉన్న బడీడు పిల్లలను బడికి పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో విద్యాహక్కు చట్టం పకడ్బంధీగా అమలయ్యేలా చూడాలన్నారు. గ్రామాలు పూర్తి స్థాయిలో అక్షరాస్యత సాధించిన నాడే అన్ని విధాలా అభివృద్ధికి నోచుకుంటాయని పేర్కొన్నారు. బాలకార్మికులను పనుల్లో పెట్టుకుంటే వచ్చే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో ఎంవీఎఫ్ జిల్లా సమన్వయకర్త అమరేశ్వర్, వెంకటయ్య, మండల పరిధిలోని సర్పంచులు పాల్గొన్నారు.