‘కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్’ తో కలిసి దేశవ్యాప్తంగా పని చేస్తున్న పిల్లల హక్కుల కార్యకర్తలలో హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చందన మర్రిపల్లి ఒకరు. సత్యార్థి ఫౌండేషన్ ‘బచ్‌పన్ బచావో ఆందోళన్’ చేపట్టి దాదాపుగా భారత్ దేశమంతటా పర్యటించింది.
బాల కార్మికులను, అపహరణకు గురయిన పిల్లలను గుర్తించి వారిని పనుల్లో నుంచి తప్పించి బడుల్లోకి పంపిస్తోంది. లైంగిక దోపిడీకి బలవుతున్న బాల్యానికి సంరక్షించడానికి తాపత్రయ పడుతోంది. ఈ పర్యటనల క్రమంలో ప్రత్యక్షానుభంతో తాను తెలుసుకున్న అనేక సంగతులను చందన ‘సాక్షి’ ఫ్యామిలీతో పంచుకున్నారు.
‘‘బచ్‌పన్ బచావో ఆందోళన్ (బిబిఎ)లో భాగంగా 2017లో భారత్ యాత్ర నిర్వహించాం. ఆ యాత్ర కన్యాకుమారి నుంచి తెలంగాణ మీదుగా కాశ్మీర్ వరకు ఆగింది. ఏడు మార్గాలుగా సాగిన మా భారత్ యాత్ర 22 రాష్ట్రాలు, యూటీలను సందర్శించింది. ఆ పర్యటనలో సమాజానికి ‘పిల్లల మీద దాడి జరగకూడదు, పిల్లలు అపహరణకు గురి కాకూడదు’ అని పిలుపునిచ్చాం. ‘చైల్డ్ రేప్‌కి శిక్ష కఠినంగా ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. భారత్ యాత్ర తర్వాత ఇచ్చిన నివేదిక కారణంగానే 16వ లోక్‌సభ యాంటీ ట్రాఫికింగ్ బిల్‌కు చట్టం రూపం వచ్చింది.
బిబిఎ కి 14 రాష్ట్రాల్లో పటిష్టమైన నెట్‌వర్క్ ఉంది. మా కార్యకర్తలు చురుగ్గా పని చేస్తూ తమ దృష్టికి వచ్చిన విషయాలను పోర్టల్‌లో పోస్ట్ చేస్తారు. అలా మాకు ఒడిషా నుంచి పెద్దసంఖ్యలో బాలకార్మికులు తెలంగాణకు తరలి వచ్చినట్లు తెలిసింది. ఒడిషా వాళ్లు ఎక్కడెక్కడ పనులు చేస్తున్నారనే కోణంలో స్థానికంగా విచారించినప్పుడు.. వాళ్లంతా ఇటుకలు తయారు చేసే బట్టీల్లో పనిచేయడానికి వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత ఇటుక బట్టీల మీద నిఘా పెట్టాం. ఆ నిఘాలో మేము ఊహించిన వాటితోపాటు ఊహించని నిజాలూ బయటపడ్డాయి.
పేదరికం చేసే ఒప్పందం
ఇటుక బట్టీలు జనావాసాలకు దూరంగా ఉంటాయి. ఆ బట్టీల్లో పని చేయడానికి శ్రామికులను బయటి నుంచి తీసుకువస్తుంటారు బట్టీల యజమానులు. ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన ఇటుకలు చేసే శ్రామికులు ఇటుక బట్టీల పక్కనే ఇటుకల్లేని గుడారాల్లో తలదాచుకుంటారు. పాములు, తేళ్లు ఆ గుడారాల చుట్టూ సంచరిస్తూనే ఉంటాయి. వాటి బారి నుంచి తమను తాము కాచుకుంటూ బతుకీడుస్తుంటారు. ఇదంతా ఒక ఎత్తయితే శ్రామికుల కుటుంబాల్లోని పిల్లలతో కూడా పని చేయించుకునేటట్లు ఒప్పందం చేసుకుంటున్నారు! ఇది ఇటుక బట్టీల యజమానులకు– శ్రామికుల కుటుంబాలకు మధ్య జరిగే ఒడంబడిక.
పేదరికం శాసిస్తున్న జీవితాల్లో ఆ పేదరికమే దగ్గరుండి మరీ చేయించే కట్టుబానిసత్వాలు ఇవన్నీ. అలా కుటుంబం మొత్తం పని చేస్తుంటారు. పదేళ్ల పిల్లలను కూడా ఒక తలకాయగా లెక్కించేసి ముందుగానే కొంత డబ్బు అడ్వాన్స్‌గా ఇచ్చేస్తారు. అలా బడిలో బలపంతో అక్షరాలు దిద్దాల్సిన బాల్యం తన ప్రమేయం లేకుండానే ఇటుక రాళ్లను పేర్చడానికి అలవాటు పడిపోతుంది. పద్నాలుగేళ్ల వయసు వచ్చే వరకు పిల్లలను బడికి పంపించాలని, పనులకు పంపించకూడదని మన దగ్గర చట్టాలన్నాయి. అయినా పనుల్లో చేర్చేది తల్లిదండ్రులే అయినప్పుడు ఆపగలిగింది ఎవరనేదే ప్రశ్న. ఒకవేళ తల్లిదండ్రులు సెలవుల్లో పిల్లలకు ఏదో పని నేర్పించాలనుకుంటే దానికీ నిబంధనలున్నాయి.
రాత్రి ఏడుగంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు పిల్లల చేత ఎట్టి పరిస్థితుల్లోనూ పని చేయించరాదు. కానీ ఇటుకబట్టీల్లో పనులు పగటి పూటకంటే రాత్రిళ్లే ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే ప్రమాదకరమైన పని ప్రదేశాల్లో పిల్లల చేత పని చేయించరాదనే నిబంధన చాలా స్పష్టంగా ఉంది. బట్టీల మధ్య ఇరుగ్గా ఉండే సందుల్లో సులువుగా నడుస్తూ ఇటుకలను తిరగేయడం వంటి పనులు పెద్దవాళ్ల కంటే పిల్లలే బాగా చేస్తారని ఆ పనులు పిల్లల చేతనే చేయించడం చూశాం. ఇంతకంటే అసలైన ఘోరం, అమానవీయం మరొకటుంది ఇక్కడ!
చీకటే నాలుగ్గోడలు!
ఇటుక బట్టీల దగ్గర నివాసం ఉండే శ్రామికుల కోసం టాయిలెట్‌లు ఉండవు. రాత్రి కావడమే వాళ్లకు నాలుగ్గోడలు. స్నానం చేయాలన్నా, ఇతర కాలకృత్యాలైనా తెల్లవారకముందే పూర్తవ్వాలి. లేకుంటే మళ్లీ రాత్రి జనం నిద్రకు ఉపక్రమించిన తర్వాతే. అప్పుడు కూడా ఏజెంట్‌ల నిఘా కళ్ల నీడల్లో సంచరించాల్సిందే. టీనేజ్‌లో ఉన్న ఆడపిల్లలు దూరంగా వెళ్తుంటే... వాళ్ల కదలికలను గమనిస్తూ టార్చ్ లైట్ వేస్తుంటాడు ఏజెంట్. ఇదేం పని అని అడిగితే ఆ అమ్మాయిలు ఎటూ పారిపోకుండా చూస్తున్నామంటారు. పిల్లల బాల్యాన్ని పనిగంటలుగా మార్చి కొనుగోలు చేసిన వ్యాపారి కబంధ హస్తాల్లో నుంచి బయటపడడం అంత సులభం కూడా కాదు. అయినా వాళ్ల ప్రతి కదలిక మీదా ఓ కన్ను ఉంటుంది.
ఇంతే కచ్చితంగా శ్రామికుల సదుపాయాలు కల్పిస్తున్నారా అంటే ఒక్కటీ కనిపించవు. శ్రామికులను కుటుంబాలతోపాటు పనిలో పెట్టుకున్నప్పుడు పాటించాల్సిన లేబర్ ‘లా’ను పట్టించుకోవడం ఎక్కడా కనిపించలేదు మాకు. శ్రామికులు సౌకర్యంగా నివసించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ యజమానులే చేయాలి. పిల్లల కోసం స్పెషల్ స్కూల్ కూడా నిర్వహించాలి. అది కూడా ఏ ప్రాంతం నుంచి శ్రామికులను తీసుకువచ్చారో ఆ భాషలోనే చదువు చెప్పించాల్సి ఉంటుంది. రెండు నెలల కిందట కూడా ఇలాంటి దయనీయ స్థితిలో దాదాపుగా వెట్టిచాకిరి చేస్తున్న పిల్లలను సంరక్షించాం. బాండెడ్ లేబర్ యాక్ట్‌ని ఉల్లంఘిస్తే పని చేయించుకున్న యజమానులతోపాటు తల్లిదండ్రులకూ శిక్ష ఉంటుందని చెప్పిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది.
అసలైన దయనీయం
పిల్లల బాల్యాన్ని తుంచేయడంలో సమాజం బాధ్యత కూడా ఎక్కువే. ఒక కాలనీలో పిల్లలు స్కూలు ఎగ్గొట్టి అల్లరిచిల్లరగా తిరుగుతుంటే ఆ కాలనీ వాళ్లు చూసి కూడా వాళ్ల అమ్మానాన్నలకు చెప్పరు. హైదరాబాద్ సిటీలో ఓ బస్తీలో పిల్లలు మద్యం తాగుతున్నట్లు కాలనీలో అందరికీ తెలుసు. కానీ ఒక్కరు కూడా వాళ్ల అమ్మానాన్నలకు చెప్పలేదు, అధికారులకూ చెప్పలేదు. పిల్లల సంరక్షణ కోసం మన దగ్గర చట్టాలున్నాయి. కానీ సంబంధిత డిపార్ట్‌మెంట్‌లకు సమాచారం చేరడం లేదు. ఆ గ్యాప్‌ని భర్తీ చేయడానికి సత్యార్థి ఫౌండేషన్ పని చేస్తోంది. మాకు సమాచారం వచ్చిన వెంటనే ముందుగా వెళ్లి పరిస్థితిని గమనిస్తాం. ఆ తర్వాత ప్రభుత్వ శాఖలకు తెలియచేసి వారి సమన్వయంతో ఆ పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, పిల్లల్ని బడికి పంపేలా చూడడం వంటివి మా వంతు బాధ్యతగా చేస్తున్నాం.
లీగల్ అవేర్‌నెస్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాం. మా విజ్ఞప్తి ఒక్కటే... ‘పిల్లలు అపహరణకు గురయినట్లు తెలిసినా, పిల్లల చేత పని చేయించడాన్ని చూసినా, పిల్లలు ఇతర వేధింపులకు బలవుతున్నట్లు తెలిసినా, వ్యసనాల బారిన పడుతున్నట్లు గమనించినా వెంటనే మాకు తెలియచేయండి’ అని అర్థిస్తుంటాం.ఈ ఏడాది ఫిబ్రవరిలో కరీంనగర్‌లో సమావేశంలో కైలాష్ సత్యార్థి గారు పాల్గొన్నారు. మేము చేసుకున్న తీర్మానాల్లో ముఖ్యమైనవి.. బడికి పోవాల్సిన వయసులో ఉన్న పిల్లలు పనికి పోతున్నట్లు ఒక్క కేసు కూడా లేని రోజు కోసమే మా పోరాటం. పిల్లలందరూ బడిలో ఉండాలనేది మా ఫౌండేషన్ ఆశయం’’ అని ముగించారు చందన.
– వాకామంజులారెడ్డి ఫొటోలు : నాగరాజు
బాల్యం విలువైనది
మాది రాజన్న సిరిసిల్ల జిల్లా (ఒకప్పటి కరీంనగర్ జిల్లా)లోని రుద్రంగి గ్రామం. మా ఊర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి మహిళను నేను. ఆడపిల్లలను చదివించడంలో అంతటి వెనుకబాటుకు గురయి ఉంది మా గ్రామం. నాన్న టీచర్, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి కావడం, అమ్మకు చదువుకోవాలనే కోరిక ఉండి కూడా చదువుకోలేకపోవడంతో నన్ను చదివించి తాను సంతోషపడడం... నన్ను పీజీ వరకు తీసుకెళ్లింది. పిల్లల్ని పనికి పంపించకుండా బడికి పంపించడం అంటే ఇటు సూర్యుడు అటు ఉదయించినంత గందరగోళమన్నమాట. మా నాన్న మా ఊరి ఉద్యమకారుడనే చెప్పాలి.
టీచర్‌గా ఆయన బడికి వచ్చిన పిల్లలకు పాఠాలు చెప్పి ఊరుకోలేదు. ప్రతి ఇంటికీ తిరిగి పిల్లల్ని బడికి పంపించమని పెద్దవాళ్లను బతిమిలాడి మరీ తీసుకెళ్లేవారు. నా చిన్నప్పుడు నాన్నను అలా చూశాను. పీజీలో సోషల్ వర్క్ చేశాను. దాంతో నా కెరీర్‌ని కూడా సామాజిక కార్యకర్తగానే మలుచుకున్నాను. మొదట ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్, హెచ్‌ఐవి ప్రాజెక్ట్‌లతో పని చేశాను. ప్రస్తుతం సత్యార్థి ఫౌండేషన్‌తో కలిసి పని చేస్తున్నాను. బాల్యం విలువైనది. పిల్లల కోసం పనిచేయడం సంతోషంగా నాకు ఉంది.
చందన మర్రిపల్లి, పిల్లల హక్కుల కార్యకర్త,
చీఫ్ కో ఆర్డినేటర్(తెలంగాణ), సత్యార్థి ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment