ఇది అమానవీయమైన బిల్లు
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన బిల్లుపై ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బాల కార్మిక వ్యవస్థ (నిషేధం, నియంత్రణ) సవరణ బిల్లు అమానవీయమైందని, దీనిని ముందు సెలెక్ట్ కమిటీకి పంపాలని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. మంగళవారం ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ‘2012లో చేసిన సవరణ చాలా బలహీనంగా ఉంది. దాన్ని బలోపేతం చేసి ఈ సవరణ తెస్తున్నారనుకుంటే... ఇది మరింత బలహీనంగా ఉంది. విద్యాహక్కు చట్టాన్ని ఈ సవరణ బిల్లు పరిగణనలోకి తీసుకోలేదు. కుటుంబ వ్యాపార సంస్థలో పనిచేసుకోవచ్చనే నిబంధన కూడా ఈ చట్టాన్ని బలహీన పరుస్తోంది. అలాగే 14 నుంచి 18 ఏళ్ల మధ్య కౌమార దశలో ఉన్న వారు పనిచేసుకోవచ్చని, కానీ ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేయరాదని పేర్కొన్నారు.
ఇంతకుముందు ప్రమాదకర పరిశ్రమలను 83 రకాలుగా వర్గీకరించారు. కానీ వీటిని ఇప్పుడు కేవలం మూడింటికి కుదించారు. అందువల్ల ఈ బిల్లును వెంటనే పార్లమెంటు సెలెక్ట్ కమిటీకి పంపాలి. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉంది. పెద్దవాళ్లు పనిచేసే చోట వాతావరణం కూడా బాగుండడం లేదు. భద్రత, శుభ్రత కలిగి ఉండాలి. ఈ బిల్లు బాలికలను బాలకార్మికులుగా మార్చేదిగా ఉంది. ఒకవైపు బేటీ బచావో.. బేటీ పడావో అంటూ నినాదాలు ఇస్తారు. మరోవైపు ఇలా బాలకార్మికులుగా మారేం దుకు చట్టాల్లో అవకాశం కల్పిస్తారు. మీరు నినాదాన్నైనా పక్కనపెట్టండి... లేదంటే చట్టాన్నైనా పకడ్బందీగా మార్చండి. అన్నిరకాల మినహాయింపులు తొలగించాలి. 14ఏళ్ల లోపు పిల్లలను ఎక్కడా పనికి అనుమతించరాదు. రాజ్యసభలో కాంగ్రెస్ ఈ బిల్లును అడ్డుకుంటుందని అనుకున్నా. కానీ వారు అడ్డుకోలేదు. ఇది చాలా అమానవీయమైన బిల్లు. వాళ్లు అన్నిరకాల బిల్లులను అడ్డుకుంటారు. కానీ పిల్లల విషయానికి సంబంధించిన ఈ బిల్లును మాత్రం అడ్డుకోలేదు’ అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.