బువ్వ పెట్టి... భవిత మారుస్తున్నారు!
బతుకు భారం.. భవిత ప్రశ్నార్థకం. చేతులకు మసి, బతుకుల్లో మురికి...
ఇదీ స్ట్రీట్ చిల్డ్రన్స్ జీవితం. ఆ జీవితాలను పట్టించుకుని దగ్గరగా చూస్తే
చలించని మనసుండదు. అయితే అలాంటి చాలా మనసులకు వారిని
సంస్కరించే మార్గం గురించి తెలియదు. తెలిసినా తీరికలేదు.
ఇలా నడుస్తున్న ప్రపంచంలో ‘వాళ్లు’ బుడతలను బుజ్జగించారు.
వారి భవితను తీర్చిదిద్దే బాధ్యతను తీసుకొన్నారు. తర్వాత ఏమైందంటే...
భారతదేశంలో బడిలేని వీధి ఉంటుందేమో కానీ, బాలకార్మికుడు లేని వీధి బహుశా ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో తమకు చేతనైనంత మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సంస్థ అనన్య ట్రస్ట్. 16 సంవత్సరాలుగా ఈ సంస్థ అనేక మంది పేదపిల్లలను, బాలకార్మికులుగా మారిన వారిని చేరదీస్తోంది. డాక్టర్ శశిరావు ఆధ్వర్యంలో బెంగళూరు పరిసరాల్లో ఈ స్వచ్ఛంద సంస్థ తన సేవలను కొనసాగిస్తోంది.
ఉత్తమ పౌరులను అందిస్తోంది.
వీధిబాలల్లో చదువుకోవాలనే తపన ఉంటుందని చెప్పలేం. బడి ప్రస్తావన లేనందుకు తామెంతో ఆనందంగా గడుపుతున్నామనే ఆలోచన ఉన్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. వారు పుట్టి పెరిగిన పరిస్థితులు అలాంటి మానసిక స్థితికి కారణమయ్యిండొచ్చు. మరి అలాంటి వారిని పిలవగానే బడికొస్తారా? అందుకే... అనన్య సంస్థ సభ్యులు స్ట్రీట్ చిల్డ్రన్ మానసిక స్థితి గురించి మొదట అధ్యయనం చేశారు. కొంతమంది వీధి బాలల్తో మాట్లాడారు. వారిని తీసుకొచ్చి.. చదువులు, పాఠశాల అనకుండా వారంటూ ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నించారు. వారిని విజ్ఞానవంతులుగా కాకుండా.. బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్ది తమ జీవితాలను తామే బాగు చేసుకొనే నైపుణ్యాన్ని నేర్పించడమే తమ బాధ్యత అనుకున్నారు.
పుస్తకాలుండవు
ఇక్కడ గురువు ఉంటాడు, పాఠం ఉంటుంది... కానీ పుస్తకాలుండవు. అది పాఠశాలే.. కానీ పిల్లలకు ప్రత్యేకమైన రూల్స్ ఉండవు. క్రమశిక్షణ పేరుతో శిక్షలుండవు. ఆటలు, పాటలు, కార్యక్రమాలన్నీ ఉంటాయి. వాటితో పాటు ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దే శిక్షణ ఉంటుంది. ఫలానా సబ్జెక్టుపై పట్టు పెంపొందించుకోవాలనే ఒత్తిడి ఉండదు. ఎవరికి నచ్చిన సబ్జెక్టు గురించి వారు ఆలోచించవచ్చు. అలా వారికి నచ్చిన అంశాలపైనే ఆటలు పాటలతోనే విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందిస్తూ వారిని తీర్చిదిద్దడం ఈ సంస్థ బాధ్యతగా తీసుకొంది. 1998లో మొదలు పెట్టిన ప్రయత్నం ఇప్పటికీ కొనసాగుతోంది. ఒక్కో పిల్లాడినీ ఎనిమిది నుంచి పదేళ్ల పాటు ఈ సంస్థ సంరక్షిస్తుంది. తర్వాత అతడిని ఒక పౌరుడిగా సంస్థ నుంచి బయటకు పంపుతుంది.
ఇక్కడి బాలలకు వసతి, ఆహారం, బట్టలు, వైద్యం..అన్నీ ఈ సంస్థే చూసుకుంటుంది. వారు ఇంటికి వెళ్లి వస్తామంటే రవాణా కూడా ఇస్తుంది. అనన్యలో టీచింగ్ నాన్ టీచింగ్ కలుపుకొని మొత్తం పది మంది స్టాఫ్ ఉన్నారు. టీచర్లు కూడా సబ్జెక్టుల వారీగా కాదు.. పీహెచ్‌డీ స్థాయి వాళ్లు అంతా. పిల్లలకు అహ్లాదాన్ని కలిగిస్తూ బోధించడంలో, చెదిరిన చిన్నారుల మనసులను తీర్చిదిద్దడంలో వారు ప్రావీణ్యులు. గత పదహారేళ్లుగా నడుస్తున్న ఈ పాఠశాలలో ఇప్పటి వరకూ దాదాపు మూడువందల మంది పిల్లలు ఇక్కడికి బాల కార్మికులుగా ప్రవేశించి సొంత కాళ్లమీద నిలబడే స్థాయికి చేరుకొని వీడ్కోలు తీసుకున్నారు. అనన్య సంస్థ కార్యాచరణను చూసి కొంతమంది విదేశీయులు కూడా ఇక్కడ వలంటీర్లుగా మారారు. అనన్యతో కలిసి పనిచేస్తున్నారు. ఈ విధంగా బుడతలు చేరదీసి బువ్వను పెట్టి వారి భవితను తీర్చిదిద్దుతున్న అనన్య కృషి అభినందనీయమైనది.
అసూయ కలిగేటంత స్పెషల్!
మన స్కూళ్లలో పుస్తకాలు, మార్కుల వేట తప్ప ఏమీ ఉండదు. అలాంటిది ఆ బాధే లేకుండా నచ్చింది నేర్చుకునే అదృష్టం ఎక్కడ ఉంటుంది. అది కూడా ఉచితంగా! ఈ స్కూల్లో జీవిత పాఠాలే కాదు, యోగా, క్రీడలు, కంప్యూటరు, సామాజిక విద్యలు, వ్యక్తిత్వ వికాసాలు, కొన్ని వృత్తి పనులు, ఇంటి పనులు వంటి జీవితంలో పనికొచ్చేవన్నీ నేర్పుతారు. ఒక విధంగా ఇక్కడ లైఫ్ ట్రయల్ ఉంటుంది. మనిషి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. విశాలమైన స్థలంలో, ప్రకృతి ఒడిలో, ఒత్తిడిలేకుండా తిండి బట్టతో సహా ఇచ్చి చదివించే స్కూలును చూస్తుంటే కార్పొరేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు కూడా అసూయ కలిగినా ఆశ్చర్యమే లేదు.