అడకత్తెరలో పోకచెక్క... భారత్‌ | Cover Story About India And China Issue In Sakshi Funday | Sakshi
Sakshi News home page

అడకత్తెరలో పోకచెక్క... భారత్‌

Published Sun, Jun 14 2020 8:06 AM | Last Updated on Sun, Jun 14 2020 1:40 PM

Cover Story About India And China Issue In Sakshi Funday

అటునుంచైనా... ఇటునుంచైనా... ఎటునుంచైనా... ప్రపంచంపై ఆధిపత్యాన్ని సాధించాలనే మొండిపట్టుతో బలప్రదర్శనకు సిద్ధపడుతున్న చైనాకు ముకుతాడు వేయడానికి అమెరికా సన్నాహాలు చేసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితులు అంతర్జాతీయ వేదికలపై జరిగే చర్చల ద్వారా సద్దుమణిగితే సరేసరి. లేకుంటే, ఇవి విషమించి మూడో ప్రపంచయుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

‘కరోనా’ మహమ్మారి వ్యాపిస్తున్నంత వేగంగానే ప్రపంచ దేశాల నడుమ సమీకరణలూ మారిపోతున్నాయి. ‘కరోనా’ వ్యాప్తికి చైనానే ప్రధాన కారణంగా భావిస్తున్న అమెరికా, అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేననే సంకేతాలు ఇస్తోంది. అమెరికా ఆరోపణలను తోసిపుచ్చుతున్న చైనా, తాను సైతం యుద్ధానికి సిద్ధమేననే రీతిలో సైనిక విన్యాసాలను ముమ్మరం చేస్తోంది. అంతేకాదు, భారత భూభాగాన్ని కబళించే లక్ష్యంతో బలగాలను ముందుకు నడుపుతోంది. మరోవైపు, దక్షిణ చైనా సముద్రంలో జనావాసాలు లేని ఖాళీ దీవులను సైతం కబళించి, వాటిపై తన సార్వభౌమత్వాధికారాన్ని చాటుకునే దిశగా పావులు కదుపుతోంది. 

ప్రపంచదేశాలన్నీ ఒకవైపు ‘కరోనా’ మహమ్మారి తాకిడికి విలవిలలాడుతుంటే, మరోవైపు చైనా తన దూకుడును ముమ్మరం చేస్తోంది. కొద్దిరోజులుగా భారత్‌–చైనా సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. లడాఖ్‌లోని గాల్వాన్‌ లోయ వద్ద యథాతథ స్థితిని ఉల్లంఘించిన చైనా బలగాలు, వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి చొరబాటు జరిపాయి. చైనా బలగాలు జరిపిన ఈ దుందుడుకు చర్య ఉభయ దేశాల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. అయితే, పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉభయ దేశాలూ లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి సైనికాధికారుల చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేయడం తాజా పరిణామం. చర్చలతోనే పరిస్థితి సద్దుమణిగితే చాలని చాలామంది ఆశిస్తున్నారు. అయితే, ‘కరోనా’ ధాటికి ప్రపంచమంతా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, చైనా అకస్మాత్తుగా ఎందుకు ఇలాంటి దుందుడుకు చర్యలకు తెగబడుతోంది, ఈ దూకుడు వెనుక చైనా ఉద్దేశం ఏమిటి, ఆకాంక్షలేమిటి అనే అనుమానాలులు ఎవరికైనా తలెత్తుతాయి. వర్తమాన రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తే, ఇలాంటి అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి.

ఇదీ చైనా ఎత్తుగడ
‘కరోనా’ వ్యాప్తికి సంబంధించి చైనా ప్రపంచదేశాలను ఉద్దేశపూర్వకంగానే అప్రమత్తం చేయలేదని, ‘కరోనా’ వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రపంచదేశాలతో పంచుకోలేదని ఆరోపిస్తూ అమెరికా అగ్గి మీద గుగ్గిలమవుతోంది. ఈ వ్యవహారంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పాత్రను కూడా అమెరికా తప్పుపడుతోంది. డబ్ల్యూహెచ్‌వో పద్ధతిని మార్చుకోకుంటే, దానికి శాశ్వతంగా నిధులు నిలిపివేసేందుకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

‘కరోనా’ నేపథ్యంలో అంతర్జాతీయ వేదికలపై చైనాను ముద్దాయిగా నిలబెట్టేందుకు అమెరికా సన్నద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ వేదికలపై భారత్‌ తమకు వ్యతిరేకంగా అమెరికాకు వత్తాసు పలకకుండా చూసే లక్ష్యంతోనే చైనా ఇటీవల దూకుడు పెంచింది. టిబెట్‌ భూభాగంలో సైనిక విన్యాసాలు, లడఖ్‌ భూభాగంలోకి చొరబాట్లు వంటి చర్యల ద్వారా భారత్‌ను ఆత్మరక్షణలో పడేసి, తన పట్టు నెగ్గించుకోవాలనేదే చైనా ప్రస్తుత లక్ష్యంగా కనిపిస్తోంది.

కేవలం ‘కరోనా’ విషయంలోనే కాదు, హాంకాంగ్‌కు యాభయ్యేళ్ల పాటు స్వయంప్రతిపత్తి కల్పించేందుకు ఇదివరకు 1997లో అంగీకరించిన చైనా, ఇప్పుడు మాట మార్చి, హాంకాంగ్‌లో తన జాతీయ భద్రతా చట్టం అమలును పొడిగించేందుకు సిద్ధపడుతుండటాన్ని కూడా అమెరికా వ్యతిరేకిస్తోంది. ఇక తైవాన్‌ జలసంధి, దక్షిణ చైనా సముద్ర జలాలు, ఖాళీ దీవుల వరకు తన సార్వభౌమత్వాన్ని విస్తరించుకునేందుకు చైనా సాగిస్తున్న ప్రయత్నాలపై కూడా ఆగ్నేయాసియాలోని పలు దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చైనా సాగిస్తున్న ఈ దుందుడుకు చర్యలన్నింటినీ అమెరికా బాహాటంగానే తప్పుపడుతూ వస్తోంది. అమెరికాతో భారత్‌ మెరుగైన దౌత్య సంబంధాలనే కలిగి ఉంది. అంతర్జాతీయ వేదికలపై చైనా దుందుడుకు చర్యలు చర్చకు వచ్చినట్లయితే, భారత్‌ సహజంగానే అమెరికాకు వత్తాసు పలికే అవకాశాలు ఉన్నట్లు పసిగట్టిన చైనా, తాను తలచుకుంటే సరిహద్దుల వద్ద సమస్యలను సృష్టించగలననే విషయాన్ని భారత్‌కు స్పష్టం చేయదలచుకుందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ వేదికలపై అమెరికాకు వత్తాసు పలకకుండా భారత్‌ను తటస్థ వైఖరి అవలంబించేలా చేయడమే చైనా లక్ష్యమని, నయానో భయానో తన లక్ష్యాన్ని సాధించుకునే దిశగానే ఇటీవల దూకుడు పెంచిందని చెబుతున్నారు. భారత్‌ను అన్నివైపుల నుంచి ఇరకాటంలో పెట్టే ఉద్దేశంతోనే చైనా కొంతకాలంగా పాకిస్తాన్, నేపాల్, శ్రీలంకలను దువ్వుతోంది. భారత్‌ నుంచి తమ దేశానికి వచ్చే వాళ్ల కారణంగానే ‘కరోనా’ వైరస్‌ వ్యాపిస్తోందంటూ ఇటీవల నేపాల్‌ ప్రధాని చేసిన ఆరోపణల వెనుక చైనా ప్రోద్బలం ఉండే ఉంటుందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా కోపానికి కారణాలు
అమెరికా–చైనా సంబంధాలు ఏనాడూ అంత స్నేహపూర్వకంగా ఉన్న దాఖలాల్లేవు. అగ్రరాజ్యంగా ప్రపంచంపై పెత్తనం చలాయిస్తున్న అమెరికాను అధిగమించి, తిరుగులేని ఆర్థికశక్తిగా ఎదగడానికి చైనా చాలాకాలంగా చాలారకాలుగా ప్రయత్నిస్తోంది. రెండు దేశాల మధ్య అసలే అంతంత మాత్రంగా ఉన్న సరాగాలు ‘కరోనా’ వైరస్‌ విజృంభణతో పూర్తిగా బెడిసికొట్టాయి. ‘కరోనా’ వైరస్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‘చైనీస్‌ వైరస్‌’గా అభివర్ణించడంతో చిర్రెత్తిన చైనా, ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎదురుదాడికి దిగింది.

చైనాలోని వుహాన్‌ నగరంలో ‘కరోనా’ వైరస్‌ వ్యాప్తి తొలిసారిగా మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వైరస్‌ను చైనా ఉద్దేశపూర్వకంగా లాబొరేటరీలో సృష్టించిందని, వైరస్‌ వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని ప్రపంచానికి వెల్లడించడంలో కూడా ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసిందని ఆరోపణలు గుప్పించిన ట్రంప్, చైనాను కట్టడి చేసేందుకు ఆర్థికపరమైన ఆంక్షలకు తెరలేపారు. మరోవైపు చైనాలో పనిచేస్తున్న అమెరికన్‌ కంపెనీలు కూడా అక్కడి నుంచి బిచాణా ఎత్తేసి ఇతర దేశాలకు తరలిపోయేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. ‘కరోనా’ మహమ్మారి వ్యాప్తి తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అవకాశం దొరికినప్పుడల్లా చైనాపై విరుచుకుపడుతూనే ఉన్నారు.

ఈ ఏడాది మార్చి నుంచి జూన్‌ వరకు గల త్రైమాసికంలో అమెరికా ఆర్థిక పరిస్థితి దారుణంగా కుదేలైంది. ‘కరోనా’ సంక్షోభం దెబ్బకు దాదాపు మూడు కోట్ల మంది అమెరికన్లు ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారారు. ఈ ఏడాది ముగిసే నాటికి అమెరికాలో నిరుద్యోగం 14 శాతానికి చేరుకోగలదని, అలాగే అమెరికా ఆర్థిక వృద్ధి 12 శాతం మేరకు తగ్గిపోగలదని అమెరికా బడ్జెట్‌ కార్యాలయం అంచనా వేస్తోంది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత అమెరికాలో ఈ స్థాయిలో నిరుద్యోగ సమస్య తలెత్తడం ఇదే మొదటిసారి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్ధపడుతున్న ట్రంప్‌కు గెలుపు సాధించడం అంత తేలిక కాదు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల్లో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత తలెత్తే సూచనలు ప్రబలంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు ముంచుకొచ్చేలోగా కుదేలైన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం ఎటూ సాధ్యం కాదు. అందుకే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలనే ఉద్దేశంతో ట్రంప్‌ తన ప్రజలకు చైనాను బూచిగా చూపిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. 

చైనా వ్యతిరేకతే ట్రంప్‌ ప్రచారాస్త్రం
చైనా వ్యతిరేక ప్రచారంతోనే ట్రంప్‌ ఈ ఎన్నికల్లో నెగ్గడానికి ప్రయత్నిస్తారని, చైనా వ్యతిరేక ప్రచారమే ఆయన తిరిగి ఎన్నికయ్యేందుకు ఉపయోగపడగలదని ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’లో ప్రముఖ కాలమిస్ట్‌ వాల్టర్‌ రస్సెల్‌ మీడ్‌ అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ సెనేటోరియల్‌ కమిటీ రూపొందించిన 57 పేజీల ఎన్నికల ప్రచార సారాంశంపై కూడా అమెరికన్‌ పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దీని సారాంశమేమిటంటే... ‘కరోనా’ వైరస్‌ వ్యాప్తికి చైనా నిర్వాకమే కారణమని, డెమోక్రాట్లకు చైనాతో సత్సంబంధాలు ఉన్నాయని విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులందరికీ మార్గదర్శకాలను విడుదల చేశారు.

ట్రంప్‌ తన ప్రత్యర్థి బైడెన్‌ను ‘బీజింగ్‌ బైడెన్‌’గా అభివర్ణిస్తూ భారీ స్థాయిలో విడుదల చేసిన ప్రకటనలు రిపబ్లికన్‌ పార్టీ ప్రచార వ్యూహంపై వెలువడిన కథనాలకు బలం చేకూర్చేవిగానే కనిపిస్తున్నాయి. ట్రంప్‌ ఏప్రిల్‌ నెలాఖరులో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎన్నికల్లో తనను ఓడించడానికి చైనా ఎంతకైనా తెగిస్తుందని ఆరోపించారు. ఒకవేళ పరిస్థితులు మరీ శ్రుతిమించితే యుద్ధానికైనా సిద్ధమేననే సంకేతాలు ఇచ్చేందుకు అమెరికా అణుపాటవ పరీక్షలు చేసేందుకు సైతం సమాయత్తమవుతోంది. ట్రంప్‌ ఆదేశిస్తే మరోసారి అణుపాటవ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా భద్రతాధికారులు ఇటీవల ప్రకటించారు. ఇదివరకు 1992లో చివరిసారిగా అణు పరీక్షలు నిర్వహించిన అమెరికా, ఇన్ని దశాబ్దాల్లో తిరిగి ఎన్నడూ వాటిని పరీక్షించలేదు. చైనా నుంచి సవాళ్లు ఎదురవుతుండటంతో ఇప్పుడు మళ్లీ అణుపరీక్షల వైపు మొగ్గుతుండటం ప్రపంచానికి కొంత ఆందోళనకర పరిణామమే! 

అడకత్తెరలో పోకచెక్క భారత్‌
అటు అమెరికా, ఇటు చైనా... మధ్యనున్న భారత్‌ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా ఉన్నట్లే చెప్పుకోవచ్చు. భారత్‌కు అటు అమెరికాతోను, ఇటు చైనాతోను ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఆర్థికంగానైనా, ఆయుధ సంపత్తిలోనైనా అమెరికా, చైనాల కంటే భారత్‌ వెనుకబడి ఉన్నమాట వాస్తవం. చైనాతో పోల్చుకుంటే అమెరికాతో భారత్‌ సంబంధాలు కొంత మెరుగ్గా ఉన్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం గడచిన మూడు దశాబ్దాలలో గణనీయంగా పెరిగింది. ఒకవైపు అమెరికాతో వాణిజ్య లావాదేవీలు పెరుగుతూ వస్తున్నా, ఆర్థిక అంశాల్లో ఉభయ దేశాల మధ్య ఇప్పటికీ పరిష్కారం కాని భిన్నాభిప్రాయాలు ఉండనే ఉన్నాయి.

విదేశీ పెట్టుబడులపై పరిమితులు, సుంకాల ధరలు, మేధా సంపత్తి హక్కులు వంటి అంశాల్లో పలుసార్లు చర్చలు కొనసాగినా, ఉభయదేశాలు ఇప్పటి వరకు ఏకాభిప్రాయానికి రావడంలో విఫలమయ్యాయి. ఆర్థిక వ్యవహారాల్లో అమెరికా ఏకపక్ష నిర్ణయాలతో పెత్తనం చలాయిస్తూ ఉండటం భారత్‌కు ఇబ్బందికరమే అయినా, వీలైనంత వరకు చర్చల ద్వారా పరిష్కారానికే ప్రయత్నిస్తూ వస్తోంది. అత్యధిక జనాభా గల భారత్‌ను అమెరికా తన లాభసాటి మార్కెట్‌గా పరిగణిస్తూ వస్తోంది. ఈ మార్కెట్‌పై తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు కొన్ని ఆంక్షలు, కొన్ని సడలింపులతో దాగుడుమూతలు ఆడుతూ వస్తోంది. ఇటీవలి పరిణామాలతో అటు అమెరికాకు, ఇటు భారత్‌కు చైనా ఉమ్మడి తలనొప్పిగా మారింది. చైనా సేనలు సరిహద్దుల వద్ద సాగిస్తున్న దుందుడుకు చర్యలను వీలైనంత వరకు చర్చల ద్వారానే పరిష్కారానికి భారత్‌ ప్రయత్నిస్తోంది.

లడక్, అరుణాచల్‌ప్రదేశ్‌ భూభాగాల్లోకి చైనా సేనలు ఇప్పటికే పలుసార్లు చొరబాట్లు జరిపాయి. చైనా అధినేత జిన్‌పింగ్‌ భారత్‌ వచ్చినప్పుడు మోడీతో ఆయన జరిపిన చర్చలు సామరస్యపూర్వకంగానే జరిగినట్లు కనిపించినా, ఆ తర్వాత సైతం చైనా సేనల తీరు ఏమాత్రం మారలేదు. ఆర్థిక పరిస్థితులు, ఆయుధ సంపత్తి దృష్ట్యా భారత్‌ తనంతట తానుగా చైనాతో యుద్ధానికి దిగే పరిస్థితులు లేవు. చైనా గనుక దురహంకారంతో యుద్ధ ప్రకటన చేస్తే మాత్రం భారత్‌కు సైతం యుద్ధరంగంలోకి దిగడమే ఏకైక మార్గమవుతుంది. ప్రస్తుత గందరగోళ పరిస్థితులు అమెరికా–చైనా మధ్య యుద్ధానికి దారితీసినా, భారత్‌–చైనా మధ్య యుద్ధం అనివార్యమయ్యే పరిస్థితులు ఏర్పడినా, యుద్ధ ప్రభావం ఏ రెండు దేశాలకో పరిమితమయ్యే అవకాశాలు మాత్రం  కనిపించడం లేదు.

ఆధిపత్యమే చైనా అంతిమ లక్ష్యం...
అత్యధిక జనాభా గల చైనా, అతిపెద్ద ఆర్థిక శక్తుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ‘కరోనా’ దెబ్బకు అమెరికా ఆర్థిక పరిస్థితి కుదేలైన దశలో ఆర్థిక ఆధిపత్యాన్ని సాధించడానికి ఇదే తగిన అదనుగా చైనా భావిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేస్తున్న ఆరోపణలను ఏమాత్రం జంకుగొంకు లేకుండా ఘాటైన సమాధానాలతో తిప్పికొడుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనానే కారణమంటూ ట్రంప్‌ మాటిమాటికీ నిందించడంపై చైనా విదేశాంగ ప్రతినిధి జెంగ్‌ షువాంగ్‌ ఘాటుగా ప్రతిస్పందించారు. ‘‘ఎయిడ్స్‌కు దారితీసే హెచ్‌ఐవీ వైరస్‌ను 1980లలో తొలుత అమెరికాలోనే గుర్తించడం జరిగింది. స్వైన్‌ఫ్లూకు కారణమైన హెచ్‌1ఎన్‌1 వైరస్‌ను కూడా 2009లో మొదట అమెరికాలోనే గుర్తించడం జరిగింది.

స్వైన్‌ఫ్లూ 214 దేశాలకు విస్తరించి, దాదాపు రెండు లక్షల మంది మరణాలకు కారణమైంది. వీటన్నింటికీ పరిహారం కోసం ఎవరైనా అమెరికాను డిమాండ్‌ చేశారా?’’ అని ప్రశ్నించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అమెరికా– చైనాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. అమెరికా ఒకవేళ యుద్ధానికి కవ్విస్తే, అందుకు సిద్ధపడే రీతిలో చైనా తన సైన్యాన్ని సన్నద్ధం చేసుకుంటోంది. చైనా ఇటీవల తక్కువ తీవ్రత గల అణ్వాయుధాలను రహస్యంగా పరీక్షించిందనే వార్తలు వెలువడ్డాయి. చైనా ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించకపోయినా, చైనా వద్ద అణ్వాయుధ సంపత్తి బహిరంగ రహస్యమే. అమెరికా–చైనాల కీచులాట యుద్ధానికే దారిసేటట్లయితే, ఆ యుద్ధం ఆ రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాదని, అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం లేకపోలేదనే ఊహాగానాలపై కూడా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
- పన్యాల జగన్నాథదాసు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement