సాక్షి, ఫన్‌డే:
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో అంధులు భారత్‌లోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3.9 కోట్ల మంది అంధులు ఉంటే, వారిలో 1.2 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారు. దేశంలో ఉన్న అంధుల్లో దాదాపు 26 శాతం మంది 15 ఏళ్ల లోపు చిన్నారులే కావడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), వివిధ దేశాల ప్రభుత్వాలు, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థలు చేపడుతున్న చర్యల వల్ల అంధత్వ సమస్య, కంటిచూపు సమస్యలు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. కంటిచూపు సమస్యల్లో దాదాపు 80 శాతం సమస్యలను తగిన ముందు జాగ్రత్తలతో నివారించవచ్చు లేదా వైద్య చికిత్సతో నయం చేయవచ్చు.
భారత్, బ్రెజిల్, మొరాకో వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు గడచిన రెండు దశాబ్దాల్లో కంటిచూపు సమస్యలను నివారించడంలో గణనీయమైన పురోగతిని సాధించాయి. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లో 2019 నాటికి కంటిచూపు సమస్యలతో బాధపడేవారి సంఖ్యను కనీసం 25 శాతం మేరకు తగ్గించాలని 2013లో సమావేశమైన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానం మేరకు 2014–19 కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ కార్యాచరణ ప్రణాళిక మేరకు డబ్ల్యూహెచ్‌ఓ వివిధ దేశాల ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలతో కలసి కంటిచూపు సమస్యల నివారణ దిశగా కృషి కొనసాగిస్తోంది.
► కొన్ని అరుదైన కంటి సమస్యలు
♦సాధారణంగా కనిపించే రిఫ్రాక్టివ్ సమస్యలు, కాటరాక్ట్, గ్లకోమా వంటి కంటి సమస్యలు అందరికీ తెలిసినవే. ఇలాంటి సాధారణ సమస్యలే కాకుండా కొన్ని అరుదైన కంటి సమస్యలు చూపును దెబ్బతీస్తాయి. చాలా సందర్భాల్లో కంటి సమస్యల కారణంగా చూపు క్రమక్రమంగా దెబ్బతింటుంది. అరుదుగా ఒక్కోసారి ఆకస్మికంగా చూపు కోల్పోయే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు.
♦ కంటి వెనుక ఉండే రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడటం వల్ల ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండానే చూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితిని ‘రెటీనల్ వీన్ అండ్ ఆర్టరీ అక్కల్షన్’ అంటారు.
♦ కంటి లోపల జరిగే అంతర్గత రక్తస్రావం వల్ల కూడా ఆకస్మికంగా చూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిని ‘విట్రియస్ హెమరేజ్’ అంటారు.
♦ తలలోను, మెడలోను ఉండే రక్తనాళాల్లో వాపు ఏర్పడటం వల్ల కూడా చూపు ఆకస్మికంగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. తలలోను, మెడలోను ఉండే రక్తనాళాల్లో వాపు ఏర్పడటం వల్ల కంటిలోని ఆప్టిక్ నెర్వ్‌కు పోషకాలు అందకుండాపోతాయి. ఫలితంగా చూపు దెబ్బతింటుంది.
♦ పక్షవాతం, మైగ్రేన్ తలనొప్పి వంటి కారణాల వల్ల కూడా ఒక్కోసారి ఆకస్మికంగా చూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. మైగ్రేన్ కారణంగా చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పక్షవాతం కారణంగా మెదడులో రక్తం గడ్డకడితే ఒక్కోసారి తాత్కాలికంగా, ఒక్కోసారి శాశ్వతంగా చూపు కోల్పోయే పరిస్థితులు తలెత్తుతాయి.
♦ కంటి నల్లగుడ్డుపై ఉండే పొర మీద, రెటీనా మీద ఇన్ఫెక్షన్లు, వాపులు ఏర్పడినప్పుడు చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితిని ‘కోరియో రెటీనైటిస్’ అంటారు. క్షయ, లైమ్ డిసీజ్, సిఫిలిస్ వంటి వ్యాధులతో బాధపడే వారిలోను, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడే వారిలోను ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉంటాయి.
♦ డయాబెటిస్ వల్ల, జన్యులోపాల కారణంగా వచ్చే రెటినో పిగ్మెంటోసా, రెటీనల్ డిస్ట్రోఫీ వంటి వ్యాధుల వల్ల, కంటి కండరాల క్షీణత వల్ల, కంటిలోను, మెదడులోను ఏర్పడే ట్యూమర్ల వల్ల కూడా కంటిచూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment