బడిని ఇంటికి తెచ్చింది!
సహాయాన్ని అర్థించి వచ్చేవారికి సాయపడటం వేరు. అవసరంలో ఉన్నవారిని వెతుక్కుంటూ వెళ్లి మరీ సాయం చేయడం వేరు. మొదటిది చేయడానికి మంచి మనసుండాలి. రెండోది చేయడానికి మంచి మనసుతో పాటు గొప్ప ఔన్నత్యం కూడా ఉండాలి. ఆ రెండూ ఉన్న వ్యక్తి రజనీ పరాంజపే. ఓ ఉన్నత లక్ష్యంతో ఆవిడ వేసిన అడుగు... ఎందరో పేద చిన్నారులకు అక్షరభిక్ష పెట్టింది!
మన దేశంలో ఉన్న అతి పెద్ద సమస్యల్లో నిరక్షరాస్యత ఒకటి. వేళకింత ముద్దే పెట్టలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు తమ బిడ్డలకు చదువులెలా చెప్పించగలరు! అందుకే పేద చిన్నారుల్లో కొందరు బాల కార్మికులుగా మారుతుంటే మరికొందరు దుర్వ్యసనాలకు బలైపోతున్నారు. అలాంటివారందరినీ చూసి ఓ అమ్మ మనసు చలించింది. నాలుగక్షరాలు నేర్పి ఆ చిన్నారుల భవితకు బంగారు బాట వేసేందుకు ఆమె పాదం పయనమయ్యింది. బడికెళ్లలేని పిల్లల దగ్గరకు బడినే తీసుకెళ్లింది.
ముంబైకి చెందిన రజనీ పరాంజపే అందరిలాగా తన ఉద్యోగం, కాపురమే జీవితం అనుకోలేదు. ఉపాధ్యాయినిగా, ఓ ఇల్లాలిగా తన బాధ్యతలు నిర్వరిస్తూనే...పెళ్లయిన పదిహేనేళ్ల తర్వాత తనకెంతో ఇష్టమైన సోషల్‌వర్‌క కోర్సును పూర్తి చేశారు. సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆమె దృష్టి మురికివాడల్లోని పిల్లల మీద పడింది. చదువు లేక వారి అందమైన బాల్యం వీధుల పాలవుతుంటే చూసి తట్టుకోలేకపోయారు. వారి భవిష్యతుకు తానే బాటలు వేయాలనుకున్నారు. అయితే అది అంత తేలిక కాదు. ఎందుకంటే, మురికివాడల్లో ఉండేవారు రోజూ ఎక్కడ పని దొరికితే అక్కడకు వెళ్లిపోతుంటారు. పిల్లల్ని చదివించుకోవాలన్న ఆలోచనే ఉండదు వారికి. పైగా పిల్లలు ఇంటి దగ్గరుంటే ఇంటికి కాపలా ఉంటారు, మంచినీళ్లు పడతారు అనుకుంటుండంతో పిల్లల్ని బడికి రప్పించడం అంత సులువు కాదని అర్థమైందామెకి. దాంతో బడినే వాళ్ల దగ్గరకు తీసుకెళ్లాల నుకున్నారు. తన పూర్వ విద్యార్థి అయిన బీనాసేథ్ లష్కారీతో కలిసి 1989లో ‘డోర్ స్టెప్ స్కూల్’ని స్థాపించారు. ఇద్దరూ వాడవాడకీ తిరిగేవారు. ఎక్కడ చిన్నారులు కనబడితే అక్కడే పాఠాలు మొదలయ్యేవి. మొదట్లో ఇది అక్కడివాళ్లకి వింతగా అనిపించినా... పిల్లలకు జ్ఞానం పెరుగుతుండటం, వాళ్లు చిన్న చిన్న ఇంగ్లిషు పదాలు పలుకుతుండటం చూసి సంతోషమేసింది. దాంతో డోర్ స్టెప్ స్కూల్‌కి ఆదరణ పెరిగింది. వేల మంది పేద పిల్లలను చదువులతల్లి ఒడికి చేర్చింది.
ప్రస్తుతం ఎంతోమంది వాలంటీర్లు, స్పాన్సర్లు రజని వేసిన బాటలో సాగుతున్నారు. రోడ్ల పక్కన, కుళాయిల దగ్గర, పొలం గట్ల మీద, రైల్లే ప్లాట్‌ఫాముల మీద ఎక్కడ పిల్లలు కనిపిస్తే అక్కడే చదువు చెప్తున్నారు. ఎన్ని ఆటంకా లొచ్చినా ఏదో ఒకరోజు తమ రాష్ట్రంలో వందశాతం అక్షరాస్యతను సాధిస్తామంటున్నారు. ఆశయం గొప్పదైనప్పుడు, ఆచరణలో ఆటంకాలు ఓ లెక్కా?! వాళ్లు తప్పకుండా అనుకున్నది సాధిస్తారు!!