Nidhi: బామ్మ మాట.... బిజినెస్‌ బాట | Mom-in-Law and Daughter-in-Law Use Grandma Secrets to Launch Hair Oil | Sakshi
Sakshi News home page

Nidhi: బామ్మ మాట.... బిజినెస్‌ బాట

Published Fri, Mar 15 2024 12:22 AM | Last Updated on Fri, Mar 15 2024 12:22 AM

Mom-in-Law and Daughter-in-Law Use Grandma Secrets to Launch Hair Oil - Sakshi

పెద్దల మాట పెరుగన్నం మూట అని ఊరికే అనలేదు. పెద్దల మాట నెలకు లక్షలాది రూపాయల ఆదాయాన్ని ఆర్జించే పెద్ద వ్యాపార సూత్రంగా మారింది.

ముంబైకి చెందిన రజని, నిధి ‘గ్రాండ్‌మా సీక్రెట్‌’ పేరుతో సరదాగా ప్రారంభించిన హోమ్‌ మేడ్‌ హెయిల్‌ ఆయిల్‌ బిజినెస్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు ఉద్యోగంలో వచ్చే జీతం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆదాయాన్ని చేకూర్చుతోంది. దీనిని బట్టి ఏదైనా పాతకాలం నాటి కబుర్లు చెప్పినా, పాతపద్ధతులు పాటించినా, అంతా పాత చింతకాయ పచ్చడిలే అని తేలిగ్గా తీసేసే వారు ఇకపై ఆచితూచి మాట్లాడాలేమో! ఎందుకంటే అప్పటి పాత ఫార్ములానే కదా... ఇప్పుడు సక్సెస్‌ సూత్రంగా మారిపోయింది.

నిధి టుటేజాకి ఆదివారం సెలవును అమ్మమ్మ ఇంటిలో సరదాగా గడపటం అలవాటు. నిధి అమ్మమ్మ రకరకాల ఔషధ మూలికలను మేళవించి ఒక విధమైన తలనూనెను తయారు చేసేది. అలా ఆమె  సొంతంగా తయారు చేసిన ఆయిల్‌తో నిధి తలకు మర్దనా చేసి కాసేపటి తర్వాత తలస్నానం చేయించేది. అమ్మమ్మ చేతి నూనె మహాత్మ్యం వల్ల నిధికి తోటి విద్యార్థినులందరూ కుళ్లుకునేంత నల్లటి ఒత్తైన కేశనిధి ఉండేది. చదువు తర్వాత అమ్మమ్మ ఊరికి వెళ్లడం బాగా తగ్గిపోయింది.

ఇంతలో దేశాన్నంతటినీ కుదిపేస్తున్న కోవిడ్‌ మహమ్మారి గురుగ్రామ్‌ను కూడా వదల్లేదు. అక్కడే ఉన్న నిధిని కూడా అసలు వదల్లేదు. ఫలితంగా నిధి జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడటం మొదలు పెట్టింది. క్రమంగా ఆమెను ఇతరులెవరూ పోల్చుకోలేనట్లు తయారైంది. అది చూసిన నిధి తల్లికి చాలా బాధ వేసింది. తన అమ్మ నుంచి  ఆ నూనె తయారీ ఫార్ములాను తెలుసుకుని, తన అత్తగారు ఈ విషయంలో ఏమైనా సాయం చేయగలరా అని అడిగింది. కోడలు చెప్పిన ఫార్మూలాను ప్రయత్నించింది అత్తగారైన రజని. ఎట్టకేలకు తయారైన ఆ ఆయిల్‌ను నిధి తలకు రాసి మర్దనా చెయ్యడం మొదలు పెట్టారు ఆ అత్తాకోడళ్లు.

ఆశ్చర్యం! కొద్దిరోజుల్లోనే ఆ నూనె మంచి ఫలితాన్నిచ్చింది. పోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావడం మొదలైంది. ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని ఇతర ఫ్లాట్ల వాళ్లు అది గమనించి, ఎలా సాధ్యమైంది ఇదంతా అని అడిగి విషయాన్ని తెలుసుకున్నారు. తమకు కూడా అలాంటి ఆయిల్‌ తయారు చేసి ఇమ్మని అడగడమే కాదు, అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని చేతిలో పెట్టడం మొదలు పెట్టారు. ఇదేదో బాగుంది అనిపించింది నిధికి. దాంతో తన నానమ్మ రజని సాయంతో, అమ్మ సహకారంతో ఆయిల్‌ తయారీ ఆరంభించింది.

వీరి ఆయిల్‌ గురించి ఆ నోటా ఈ నోటా కాదు... కొన్ని డజన్ల వాట్సాప్‌ గ్రూపులలో పడి మొదట్లో కొద్ది లీటర్లకే పరిమితం అయిన ఆయిల్‌ తయారీ పెద్దఎత్తున తయారు చేయాలన్న నిర్ణయం తీసుకునేలా చేసింది. దాంతో గత సంవత్సరం మార్చిలో నిధి, రజిని దువా కలిసి ‘నిధిస్‌ గ్రాండ్‌ మా సీక్రెట్‌’ పేరుతో ఒక సరికొత్త ఆయిల్‌ బ్రాండ్‌ ఉత్పత్తిని ప్రారంభించారు.

ఫలితంగా అందరి జుట్టు పెరగడం మాట ఎలా ఉన్నా, వీరి ఆదాయం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది.
ఇప్పుడు నిధి, రజిని తయారు చేస్తున్న ఈ ఆయిల్‌ 67,000 ఇళ్లకు చేరింది. నెలకు లక్ష బాటిళ్ల తయారీతో నెలకు సుమారు యాభై లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది.

అమ్మమ్మ ఫార్మూలా ప్రకారం ఇప్పుడు నిధి, ఆమెతో పాటు ఆమె నానమ్మగారు... స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో 13 రకాల వనమూలికల కలగలుపుతో పెద్ద ఇనుప మూకుడులో కొన్ని గంటలపాటు మరగబెడుతూ, కలుపుతూ తయారు చేసిన ఈ హోమ్‌ మేడ్‌ ఆయిల్‌ ఇప్పుడు పెద్దపెద్ద యంత్రాలతో లక్షల బాటిళ్ల తయారీ లక్ష్యాన్ని చేరుకుంది.
పాత కాలం నాటి ఫార్ములాను తేలికగా చూసే వాళ్లు ఇకనైనా ఇలాంటి విద్యను అందిపుచ్చుకుంటే ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడటం సాధ్యం అవుతుందేమో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement