Home made
-
మసాబా మెచ్చిన చ్యవన ప్రాశ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా!
ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా ఓ సెలబ్రిటీ. ఆమె శీతాకాలంలో తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చ్యవన్రప్రాశ తీసుకుంటోంది. చరక సంహిత, భావప్రకాశ, రస రత్న సముచ్చయ వంటి ఆయుర్వేద గ్రంథాలు చెప్పిన ఔషధం ఇది. దీనిలోని ఆరోగ్యకారకాలను వివరించాలంటే ఒక్కమాటలో ఆల్ఇన్వన్ అని చెప్పవచ్చు. చ్యవన ముని కనుక్కున్న ఫార్ములా ఇది. ఈ ఔషధం ఎనర్జీ బూస్టర్, ఇమ్యూనిటీని పెంచుతుంది. శక్తినిస్తుంది, జీవనకాలాన్ని పెంచుతుంది. మూలికల సూక్ష్మమైన ΄ోషకాల సమ్మిళితం ఇది. తన కంటిచూపు తగ్గినప్పుడు ఈ ఔషధాన్ని వాడడం ద్వారా తిరిగి మునుపటి చూపును పొందినట్లు రాశాడు చ్యవనుడు. అయితే చ్యవన ప్రాశను ఇంట్లో సులువుగా తయారు చేసుకునే విధానాన్ని సెలబ్రిటీ షెఫ్ అనన్యా బెనర్జీ ఇలా వివరించారు. కావలసినవి: ఉసిరి కాయలు– అర కేజీ; బెల్లం లేదా తేనె– 300 గ్రాములు; నెయ్యి– 100 గ్రాములు; నువ్వుల నూనె – టేబుల్ స్పూన్; దాల్చిన చెక్క పొడి– టీ స్పూన్; యాలకుల పొడి– టీ స్పూన్; లవంగాల పొడి– అర టీ స్పూన్; జాజికాయ పొడి– అర టీ స్పూన్; అశ్వగంధ పొడి– టీ స్పూన్; శతావరి పొడి– టీ స్పూన్; డ్రై ఫ్రూట్స్ : కిస్మిస్, డేట్స్, ఫిగ్స్ – 50 గ్రాములు (అన్నీ కలిపి). తయారీ: డ్రైఫ్రూట్స్‌ను సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ఆవిరి మీద కానీ నేరుగా నీటిలో కానీ ఉడికించాలి. చల్లారిన తర్వాత కాయలను కొద్దిగా చిదిమి గింజలు తొలగించి గుజ్జు అంతటినీ ఒక పాత్రలో వేసుకోవాలి ∙మందపాటి పాత్రను వేడి చేసి అందులో నెయ్యి, నువ్వుల నూనె వేయాలి. అవి వేడెక్కిన తర్వాత ఉసిరికాయల గుజ్జు వేసి గరిటెతో కలుపుతూ పది నుంచి పదిహేను నిమిషాలపాటు మగ్గనివాలి. మిశ్రమం చిక్కబడి, దగ్గరగా అయిన తర్వాత అందులో బెల్లం పొడి లేదా తేనె కలిపి చిన్న మంట మీద ఉంచాలి. మిశ్రమం అడుగుపట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ తీపి... ఉసిరితో సమంగా కలిసిన తర్వాత యాలకుల పొడి, లవంగాల పొడి, దాల్చినచెక్క పొడి, జాజికాయ పొడి, అశ్వగంధ, శతావరి, కిస్మిస్తో పాటు మిగిలిన డ్రైఫ్రూట్స్ పలుకులను వేసి సమంగా కలిసేవరకు గరిటెతో కలియబెట్టి దించేయాలి. దించిన తర్వాత కూడా పాత్ర వేడికి అడుగున ఉన్న మిశ్రమం మాడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దించిన తర్వాత చల్లారేలోపు రెండు –మూడు సార్లు గరిటెతో కలపాలి.చల్లారిన తరవాత తేమ లేని బాటిల్లోకి తీసుకుని గాలి దూర కుండా గట్టిగా మూత పెట్టాలి. ఫ్రిజ్‌లో పెట్టుకుని శీతాకాలమంతా వాడుకోవచ్చు దించిన తర్వాత ఒకసారి రుచి చూసుకుని తీపి సరిపోలేదంటే మరికొంత తేనె కలుపుకోవచ్చు ఉసిరికాయలు వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి, అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడానికి, నెయ్యితోపాటు ఇతర సుగంధద్రవ్యాలు జఠరాగ్నిని పెంచి పోషకాలను దేహం సమర్థంగా శోషించుకోవడానికి దోహదం చేస్తాయి.రోజుకు పెద్దవాళ్లు రోజూ ఉదయం ఒక టేబుల్ స్పూన్ తినాలి (15–20 గ్రాములు). పిల్లలకైతే టీ స్పూన్ (5–10 గ్రాములు) చాలు. చ్యవన్ర΄ాశ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత కఫం సమస్యలు కనిపిస్తే మోతాదు తగ్గించాలి లేదా చ్యవన ప్రాశను వేడినీటిలో కలిపి తీసుకోవాలి. -
నేచురల్‌గా ఇంట్లోనే లిప్ బామ్ తయారు చేసుకోండిలా!
సీజన్ ఏదైనా పెదవుల రక్షణకు లిప్ బామ్ వాడటం తప్పనిసరి. పెదవులు ఆరోగ్యంగా ఉండాలన్నా, పొడిబారిపోకుండా ఉండాలన్నా అంతా వాటి సంరక్షణ అవసరం. పెదవుల్ని హైడ్రేటెడ్‌గా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ కల్పించేందుకు లిప్ బామ్ తోడ్పడుతుంది. పెదాలు పగిలిపోవడం లాంటి సమస్యల నివారణతోపాటు, యూవీ కిరణాల నుంచిరక్షణ కల్పిస్తాయి. కానీ మార్కెట్లో దొరికే ఖరీదైన, రసాయన బామ్‌లకు బదులుగా ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వస్తువులను ఎంపిక చేసుకొని, ఇంట్లోనే వాటిని తయారు చేసుకొని సరైన పోషణ లభించేలా చేయవచ్చు.లిప్ బామ్ తయారీరెండు టీ స్పూన్ల మైనం, టీ స్పూన్ కోక్ పౌడర్, రెండు టీ స్పూన్లు బాదం నూనె, 5–6 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి. ముందుగా మైనాన్ని కరిగించాలి. దీంట్లో కోక్ పౌడర్ వేసి బాగా కలపాలి. కోక్ పౌడర్ బాగా కలిసిపోయాక బాదం నూనె, ఎసెన్షియల్ ఆయిల్ వేసి కలపాలి. దీన్ని ఒక చిన్న బాటిల్లో భద్రపరుచుకొని రోజుకు రెండు మూడుసార్లు పెదవులకు రాసుకోవాలి. ఈ బామ్ పెదవుల పగుళ్ల సమస్యను నివారిస్తుంది. ఇంట్లో లిప్ బామ్‌ను తయారు చేసుకోవడం వల్ల హానికరమైన రసాయన పదార్థాలను నియంత్రించవచ్చు. అలాగే కృత్రిమ సువాసనలను లేదా ఇతర హానికరమైన పదార్థాలకు దూరంగా ఉండవచ్చు. -
వందేళ్లనాటి కాను(టు)క ఇది : ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
ఇంట్లో పసిపాప వస్తోంది అంటే చాలు అమ్మమ్మ, నానమ్మల హడావిడి మొదలవుతుంది. పొత్తిళ్లలో బిడ్డకు కావాల్సిన మెత్తటి బట్టలు సేకరించడం, పాపాయికి సౌకర్యంగా ఉండేలా పాత చీరలతో చేసిన బొంతలు తయారీ మొదలు, కాటుక, ఆముదం లాంటివి సిద్ధం చేసుకునేందుకు రడీ అయిపోయేవారు. సహజంగాఇంట్లోనే కాటుకునే తయారుచేసుకునే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పత్తి దారంతో కొద్దిగా వామ్ము గింజలు వేసి వత్తి తయారు చేసిన దాన్ని ఆవ నూనెలో ముంచి మట్టి ప్రమిదలో దీపం వెలిగించింది. దానిపై వెడల్పాటి మూతను పెట్టింది. వత్తి మొత్తం కాలి ఆ మసి అంతా పళ్లానికి అంటుకుంది. ఈ మసిని తీసి కాజల్( కాటుక)గా తయారు చేసింది. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఆముదం, నూలు బట్ట సహాయంతో తమ నాన్నమ్మ, అమ్మమ్మ ఇలానే చేసేది అంటూ నెటిజన్లు గుర్తు చేసు కున్నారు. ఇందులో కెమికల్స్ ఉండవు. పైగా చిన్నపిల్లలకు కంటికి శీతలం కూడా అని వ్యాఖ్యానించారు.సహజమైన పదార్థాలతో ఇంట్లో తయారు చేసుకున్న కాటుక అయితే అందమైన అమ్మాయి కళ్ళు మరింత విశాలంగా బ్రైట్‌గా, బ్యూటీఫుల్‌గా మెరిసి పోతాయి. కళ్ళకి కాటుక పెట్టుకోవడం వల్ల కంటిలోని ఎర్రటి చారలు తొలగిపోతాయి. పైగా కాటుక పెట్టుకోవడం వల్ల దుమ్ము, ధూళి కణాలు కళ్ళలో పడకుండా ఉంటుంది. Did you know this 100 years old technique of Kajal making? Ingredients: Cotton, Ajwain, Mustard Oil and Ghee… pic.twitter.com/K6rF6yRcal — Aparajite | ಅಪರಾಜಿತೆ (@amshilparaghu) April 15, 2024 నోట్: చాలావరకు డాక్టర్లు శిశువులకు కాటుక పెట్టవద్దని చెబుతారు. ఎందుకంటే రసాయనాలతో తయారు చేసిన కాటుకల వల్ల కంటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుందనేది గమనించ గలరు. -
ఇంట్లోనే హార్లిక్స్ ఇలా చేద్దామా!
బయట మార్కెట్లో దొరికే హార్లిక్స్ కొనాలంటే అందరి వల్ల కాకపోవచ్చు. ఎంత కొందామన్నా.. కనీసం వందల్లో.. ఉంటుంది దాని ధర. మరోవైపు పిల్లలుకు ఇలాంటి ఇవ్వలేకపోతున్నానే అనే బాధ కూడా ఉంటుంది. అలాంటి వారు చక్కగా కాస్త శ్రద్ధ పెట్టి ఇంట్లోనే హార్లిక్స్ చేసుకోండి ఇలా. అదీగాక మార్కెట్లో ఉండే హార్లిక్స్ రుచి కోసం ఏవేవో కలుపుతారనే పలు ఆరోపణలు ఉన్నాయి. అందులో కాస్త షుగర్, కోకో వంటి క్వాండెటీ ఎక్కువని రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. దాని బదులు ఇంట్లోనే హానికరం కానీ విధంగా మంచి హోం మేడ్ హార్లిక్స్ చేసుకోండి. అందుకు ఏం కావాలంటే.. హార్లిక్స్ తయారీకి ప్రధానంగా కావలసింది గోధుమలు. ముందుగా నాణ్యమైన గోధుమలను ఒకరోజు రాత్రి మొత్తం నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం కాటన్ వస్త్రంలో బాగా వడకట్టాలి. ఆ గోధుమలను చక్కగా ఆరబెట్టాలి. అనంతరం వాటిని దోరగా వేయించాలి. ఆ తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటిలో గుప్పెడు వేరుశనగలు, బాదం గింజలు జోడించాలి. అంటే వీటిని వేరువేరు పాత్రల్లో పోసుకొని దోరగా వేయించాలి. ఆ తర్వాత విడివిడిగా మిక్సీ పట్టాలి. ఇలా ఈ మూడింటి మిశ్రమాలను చక్కగా జల్లెడతో జల్లించుకోవాలి. జల్లించిన తర్వాత.. అందులో మెత్తటి చక్కెర పొడిని కలపాలి.. ఇలా అన్నింటిని కలిపిన పొడిని ఒక శుభ్రమైన గాజు గ్లాసులో పోసుకోవాలి. ప్రతిరోజు ఉదయం పాలల్లో ఒక స్పూన్ వేసుకుని తాగితే ఎంత హాయిగా అనిపిస్తుంది. ఇంట్లోనే మన చేత్తో తయారు చేసిన హార్లిక్స్ పిల్లలకు ఇస్తే ఆ ఫీలే వేరేలెవెల్. దీనివల్ల కృత్రిమ పదార్థాలు, కోకో పౌడర్ కలపని హార్లిక్స్ రుచిని మనం ఆస్వాదించవచ్చు. పైగా మన ఇంట్లో తయారు చేసుకున్నామనే సంతృప్తి ఉంటుంది. పోషకాహార నిపుణులు కూడా ఇలా ఇంట్లో చేసుకోవడమే మంచిదని చెబతున్నారు. మన ఆరోగ్యం కోసం ఈ మాత్రం కష్టపడలేమా? చెప్పండి!. (చదవండి: 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు! అసలైన పద్ధతి ఇదే..!) -
Nidhi: బామ్మ మాట.... బిజినెస్ బాట
పెద్దల మాట పెరుగన్నం మూట అని ఊరికే అనలేదు. పెద్దల మాట నెలకు లక్షలాది రూపాయల ఆదాయాన్ని ఆర్జించే పెద్ద వ్యాపార సూత్రంగా మారింది. ముంబైకి చెందిన రజని, నిధి ‘గ్రాండ్మా సీక్రెట్’ పేరుతో సరదాగా ప్రారంభించిన హోమ్ మేడ్ హెయిల్ ఆయిల్ బిజినెస్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఉద్యోగంలో వచ్చే జీతం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆదాయాన్ని చేకూర్చుతోంది. దీనిని బట్టి ఏదైనా పాతకాలం నాటి కబుర్లు చెప్పినా, పాతపద్ధతులు పాటించినా, అంతా పాత చింతకాయ పచ్చడిలే అని తేలిగ్గా తీసేసే వారు ఇకపై ఆచితూచి మాట్లాడాలేమో! ఎందుకంటే అప్పటి పాత ఫార్ములానే కదా... ఇప్పుడు సక్సెస్ సూత్రంగా మారిపోయింది. నిధి టుటేజాకి ఆదివారం సెలవును అమ్మమ్మ ఇంటిలో సరదాగా గడపటం అలవాటు. నిధి అమ్మమ్మ రకరకాల ఔషధ మూలికలను మేళవించి ఒక విధమైన తలనూనెను తయారు చేసేది. అలా ఆమె సొంతంగా తయారు చేసిన ఆయిల్‌తో నిధి తలకు మర్దనా చేసి కాసేపటి తర్వాత తలస్నానం చేయించేది. అమ్మమ్మ చేతి నూనె మహాత్మ్యం వల్ల నిధికి తోటి విద్యార్థినులందరూ కుళ్లుకునేంత నల్లటి ఒత్తైన కేశనిధి ఉండేది. చదువు తర్వాత అమ్మమ్మ ఊరికి వెళ్లడం బాగా తగ్గిపోయింది. ఇంతలో దేశాన్నంతటినీ కుదిపేస్తున్న కోవిడ్ మహమ్మారి గురుగ్రామ్‌ను కూడా వదల్లేదు. అక్కడే ఉన్న నిధిని కూడా అసలు వదల్లేదు. ఫలితంగా నిధి జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడటం మొదలు పెట్టింది. క్రమంగా ఆమెను ఇతరులెవరూ పోల్చుకోలేనట్లు తయారైంది. అది చూసిన నిధి తల్లికి చాలా బాధ వేసింది. తన అమ్మ నుంచి ఆ నూనె తయారీ ఫార్ములాను తెలుసుకుని, తన అత్తగారు ఈ విషయంలో ఏమైనా సాయం చేయగలరా అని అడిగింది. కోడలు చెప్పిన ఫార్మూలాను ప్రయత్నించింది అత్తగారైన రజని. ఎట్టకేలకు తయారైన ఆ ఆయిల్‌ను నిధి తలకు రాసి మర్దనా చెయ్యడం మొదలు పెట్టారు ఆ అత్తాకోడళ్లు. ఆశ్చర్యం! కొద్దిరోజుల్లోనే ఆ నూనె మంచి ఫలితాన్నిచ్చింది. పోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావడం మొదలైంది. ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోని ఇతర ఫ్లాట్ల వాళ్లు అది గమనించి, ఎలా సాధ్యమైంది ఇదంతా అని అడిగి విషయాన్ని తెలుసుకున్నారు. తమకు కూడా అలాంటి ఆయిల్ తయారు చేసి ఇమ్మని అడగడమే కాదు, అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని చేతిలో పెట్టడం మొదలు పెట్టారు. ఇదేదో బాగుంది అనిపించింది నిధికి. దాంతో తన నానమ్మ రజని సాయంతో, అమ్మ సహకారంతో ఆయిల్ తయారీ ఆరంభించింది. వీరి ఆయిల్ గురించి ఆ నోటా ఈ నోటా కాదు... కొన్ని డజన్ల వాట్సాప్ గ్రూపులలో పడి మొదట్లో కొద్ది లీటర్లకే పరిమితం అయిన ఆయిల్ తయారీ పెద్దఎత్తున తయారు చేయాలన్న నిర్ణయం తీసుకునేలా చేసింది. దాంతో గత సంవత్సరం మార్చిలో నిధి, రజిని దువా కలిసి ‘నిధిస్ గ్రాండ్ మా సీక్రెట్’ పేరుతో ఒక సరికొత్త ఆయిల్ బ్రాండ్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఫలితంగా అందరి జుట్టు పెరగడం మాట ఎలా ఉన్నా, వీరి ఆదాయం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఇప్పుడు నిధి, రజిని తయారు చేస్తున్న ఈ ఆయిల్ 67,000 ఇళ్లకు చేరింది. నెలకు లక్ష బాటిళ్ల తయారీతో నెలకు సుమారు యాభై లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది. అమ్మమ్మ ఫార్మూలా ప్రకారం ఇప్పుడు నిధి, ఆమెతో పాటు ఆమె నానమ్మగారు... స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో 13 రకాల వనమూలికల కలగలుపుతో పెద్ద ఇనుప మూకుడులో కొన్ని గంటలపాటు మరగబెడుతూ, కలుపుతూ తయారు చేసిన ఈ హోమ్ మేడ్ ఆయిల్ ఇప్పుడు పెద్దపెద్ద యంత్రాలతో లక్షల బాటిళ్ల తయారీ లక్ష్యాన్ని చేరుకుంది. పాత కాలం నాటి ఫార్ములాను తేలికగా చూసే వాళ్లు ఇకనైనా ఇలాంటి విద్యను అందిపుచ్చుకుంటే ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడటం సాధ్యం అవుతుందేమో! -
ఒక్క చార్జింగ్‌తో గంటకు 40 కి.మీ: హొంమేడ్ ఎలక్ట్రిక్ సైకిల్ మేకింగ్ వీడియో
సాక్షి,హైదరాబాద్: మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ముఖ్యంగా కార్బన ఉద్గారాలను తగ్గించే లక్క్ష్యంతోపాటు, ఇంధన భారాని తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ వాహనాలకు రానురాను ఆదరణ పెరుగుతోంది. ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ వేవ్ టూవీలర్, త్రీవీలర్ సెగ్మెంట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. సైకిళ్లు ఎలక్ట్రిక్ మోడ్‌లో వచ్చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు హై రేంజ్లోఉండటంతో, కార్లు , బైక్స్‌తో సహా అన్ని రకాల ఆటోమొబైల్స్ కోసం ఇటువంటి కన్వర్షన్ కిట్లను చూశాం. దీంతో ప్యాసింజర్ కార్ సెగ్మెంట్, టూవీలర్ సెగ్మెంట్లో ఈ-వాహనాల భారాన్నిమోయలేని వారు కన్వర్షన్ కిట్వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ట్రెండ్ లో భాగంగానే స్వయంగా ఇంట్లోనే తయారు చేసుకునే ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ విశేషంగా నిలుస్తోంది. ఇంట్లో తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్ ప్రముఖ యూట్యూబర్ ఇలాంటి వీడియోనొకదాన్ని అప్లోడ్ చేశారు. కన్వర్షన్ కిట్ సహాయంతో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వీడియోను పబ్లిష్ చేశాడు. ఎలక్ట్రిక్ మోటారు, 36 V 7.5 Ah లిథియం-అయాన్ బ్యాటరీ, కంట్రోలర్, పెడల్ అసిస్ట్, కొత్త థొరెటల్, బ్రేక్ లివర్లు ఇలా ప్రతి భాగం ఎలా మరియు ఎక్కడ అమర్చాడో యూట్యూబర్ వివరించాడు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పూర్తి ఛార్జింగ్‌తో గంటకు 40 కిమీ వేగంతో దూసుకుపోవచ్చట. మరి ఈ ఇంట్రస్టింగ్ వీడియోను మీరు కూడా ఒకసారి చూసేయండి. అయితే దీనికి నిపుణుల పరిశీలన అవసరమని గుర్తించండి. కేవలం సమాచారం కోసమే ఈ వీడియోను అందిన్నామని గమనించగలరు. -
రసాయనాలు వాడకుండా ఇంట్లోనే షాంపు తయారు చేసుకోవచ్చు.. అదెలాగంటే..
కాలుష్యం, జీవనశైలిలో మార్పులు, సరిగా పట్టించుకోకపోవడం, రసాయన షాంపుల వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతిని నిర్జీవంగా మారుతుంది. ఫలితంగా విపరీతంగా జుట్టు రాలడం, త్వరగా రంగు మారడంతోపాటు, వెంట్రుకలు చిట్లిపోతుంటాయి. ఈ సమస్యలన్నింటిని అధిగమించేందుకు ఇంట్లోనే ఎంచక్కా ఎటువంటి రసాయనాలు వాడకుండా షాంపు తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.. ► ఉసిరి పొడి, కుంకుడు కాయలు, శీకాకాయ, మెంతులను వందగ్రాముల చొప్పున తీసుకోవాలి. వీటన్నింటిని బాగా ఎండబెట్టాలి. ► తడిలేకుండా ఎండిన తరువాత అన్నింటిని ఒక గిన్నెలో వేసి కొన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ► ఉదయం దీనిలో ఒక గ్లాసు నీళ్లు పోసి సన్నని మంటమీద ఉడికించాలి. ► అరగంట తరువాత చల్లారనిచ్చి వడగట్టి సీసాలో నిల్వచేసుకోవాలి. తలస్నానం చేయాలనుకున్నప్పుడల్లా ఈ నీటిని షాంపుగా వాడుకోవాలి. ► ఈ షాంపు తలలో అధికంగా ఉన్న ఆయిల్, దుమ్ము దూళిని వదిలించి కుదుళ్లకు పోషణ అందిస్తుంది. ► ఈ షాంపుని క్రమం తప్పకుండా వాడితే జుట్టురాలడం తగ్గి, కొత్త జుట్టువస్తుంది. చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు ►ఐదారు ఉల్లిపాయ తొక్కలు, వందగ్రాముల మెంతులు, యాభై గ్రాముల అలోవెరా జెల్, యాభై గ్రాముల టీ పొడి, విటమిన్ ఈ క్యాప్య్సూల్ ఒకటి, బేబి షాంపు యాభై గ్రాములు తీసుకోవాలి. ► ఉల్లిపాయ తొక్కలు, మెంతులు, టీ పొడిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి మరిగించాలి. అన్ని మరిగి, నీళ్లు రంగు మారాక స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ► చల్లారాక ఈ నీటిని సీసాలో వేసి విటమిన్ ఈ క్యాప్సూయల్, అలోవెరా జెల్, బేబి షాంపు వేసి బాగా షేక్ చేయాలి. ►పదిగంటలపాటు కదల్చకుండా పక్కన పెట్టేయాలి. తరువాత దీనిని షాంపులా వాడుకోవచ్చు. ► ఈ షాంపు జుట్టుకు పోషణ అందించడంతోపాటు, చుండ్రును దరిచేరనివ్వద్దు. ► ఉల్లిపాయ తొక్కలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గించి, మందంగా పెరిగేలా చేస్తాయి. చదవండి: రంగుల కేళీ హోలీ రోజున ఈ స్వీట్ రుచి చూడాల్సిందే.. -
హోమ్ మేడ్... మటన్ హలీమ్
కావల్సిన పదార్థాలు: బోన్‌లెస్ మటన్ –500 గ్రాములు; నెయ్యి– అరకప్పు; జీలకర్ర – ఒకస్పూన్; తోక మిరియాలు –ఒకస్పూన్; దాల్చిన చెక్క –మీడియం సైజు ఒకటి; లవంగాలు – మూడు; సాజిరా –ఒక స్పూన్; యాలకులు – మూడు; పెద్ద ఉల్లిపాయలు –మూడు; అల్లంవెల్లుల్లి పేస్టు –రెండు స్పూన్లు; గరం మసాల–ఒక స్పూన్; పచ్చిమిర్చి –నాలుగు; పెరుగు –ఒక కప్పు; పసుపు –ఒక స్పూను; గోధుమ రవ్వ –ఒకటిన్నర కప్పు; శనగపప్పు –ఒకస్పూన్; పెసరపప్పు –ఒక స్పూన్; ఎర్ర పప్పు(మసూరి పప్పు) –ఒక స్పూన్; కొత్తిమీర – మీడియం సైజు కట్ట ఒకటి; పుదీనా – మీడియం సైజు కట్ట ఒకటి; నిమ్మకాయ –ఒకటి; అల్లం –చిన్న ముక్క; నీళ్లు– 12 కప్పులు; ఉప్పు – తగినంత; జీడిపలుకులు– కొద్దిగా. తయారీ విధానం: ► ముందుగా గోధుమరవ్వ, పెసరపప్పు, శనగపప్పు, ఎర్ర పప్పులను విడివిడిగా కడిగి రాత్రంతా నానపెట్టుకోవాలి. రాత్రి నానపెట్టుకోవడం కుదరనివారు కనీసం రెండు గంటలైనా నానపెట్టాలి. తరువాత మటన్‌ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో అల్లంవెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు, పెరుగు, పసుపు, గరం మసాల వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కిన తరువాత కలిపి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని దానిలో వేయాలి. ఒక ఐదు నిమిషాలపాటు నెయ్యిలో మటన్ వేగిన తరువాత దానిలో రెండు కప్పులు నీళ్లుపోయాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి పది విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి. ► మటన్ ఉడికిన తరువాత చల్లారనిచ్చి మిక్సీలో మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత నాన పెట్టుకున్న అన్ని రకాల పప్పులను ఒక గిన్నెలో వేసి ఉడికించాలి. ఇవి ఉడుకుతుండగానే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, తోక మిరియాలు, జీలకర్ర, సాజిరా వేసి దానిలో పది కప్పుల నీళ్లు పోసి బాగా ఉడికించాలి. ఇవన్నీ ఉడికిన తరువాత వీటన్నింటిని మిక్సీలో వేసి ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి వాటిని ఎర్రగా వచ్చేంతవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ► ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టుకుని దానిలో మూడు స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కిన తరువాత దానిలో ఉడికించి మెత్తగా రుబ్బి పెట్టుకున్న మటన్‌ను వేసి రెండు–మూడు నిమిషాలపాటు వేగనివ్వాలి. తరువాత గోధుమ రవ్వ, పప్పులన్నింటిని కలిపి గ్రైండ్ చేసిన ప్యూరీని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం ఉడికేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఉడికి పైకి నెయ్యి తేలినప్పుడు దానిలో ఎర్రగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, నిమ్మరసం వేసి కలిపితే హలీమ్ తయారైనట్లే. స్టవ్ ఆపేసి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు పలుకులను పైన చల్లి వడ్డిస్తే హలీమ్ చాలా రుచిగా ఉంటుంది. -
కరోనాను ఎదుర్కొనేందుకు వంటింటి చిట్కాలు..
పాలలో పసుపు వేసుకుని తాగమంటే అదోలా చూసేవారు. కషాయం పేరు చెబితే మూతి ముడుచుకునేవారు. తులసి నీళ్లు గుడిలో మాత్రమే తాగాలని డాంబికాలు పలికేవారు. కరోనా వచ్చి ఈ పరిస్థితులను సమూలంగా మార్చేసింది. ఇప్పుడు ప్రతి వంటిల్లు ఓ ఆస్పత్రి అయిపోయింది. గతంలో వదిలేసిన కషాయాలను మళ్లీ తయారు చేస్తున్నారు. పూర్వం నుంచి వస్తున్న వంటింటి చిట్కాలను అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఈ వైఖరి మంచిదేనని వైద్యులు కూడా అంటున్నారు. ఇంటి వైద్యం మళ్లీ అక్కరకు వచ్చింది. అయిన దానికీ కాని దానికీ గుప్పెడు గుప్పెడు మాత్రలు మింగే దౌర్భాగ్యం నుంచి జనం మెల్లగా మళ్లీ దారి మార్చుకుంటున్నారు. పోపుల పెట్టె గొప్పదనాన్ని తెలుసుకుంటున్నారు. వంటింటిలో ఉండే దినుసు ల గురించి ఎవరైనా చెబితే మనసు పెట్టి వింటున్నారు. కరోనా భయం అలముకున్న తర్వాత మళ్లీ పాత పద్ధతిలో కషాయాలు తయారు చేయడం మొదలుపెట్టారు. గోరు వెచ్చని పాలలో ప సుపు కలిపి సేవిస్తున్నారు. అల్లం టీ, లెమన్ టీ అంటూ ప్రాధాన్యత ఇస్తున్నారు. కషాయం ఉదయం, రాత్రి రెండు పూటలా ఇష్టపడి మరీ తాగుతున్నారు. కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో అటు సాధారణ వ్యక్తి నుంచి ఇటు ప్రజా ప్రతినిధులు, ఉన్న తాధికారులు, వ్యాపారస్తులు, ఉద్యోగుల వరకూ ప్రతి ఒక్కరూ ఇలా చిట్కాలు పాటిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా.. వానలు పడుతుండడంతో కరోనాను పోలిన లక్షణాలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా జలుబు, దగ్గు కనిపిస్తే చాలు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే ప్రతి ఇంట్లో ఆరోగ్య చిట్కాలు ప్రారంభమయ్యాయి. ప్రతి రోజు కషాయం, లెమన్, అల్లం టీలు తప్పనిసరిగా మారాయి. జలుబు వచ్చిందంటే చాలు వేడి నీటి ఆవిరిని పట్టడం, వెంటనే కషాయం తాగడం చేస్తున్నారు. గొంతు వద్ద నొప్పిగా ఉన్నా, ద గ్గు ఉన్నా వెంటనే పసుపు కలిపిన పాలను సేవిస్తున్నారు. వీటికి తోడు దగ్గర్లో తులసి మొక్కలు ఉంటే వాటి ఆకులను గోరు వెచ్చని నీటిలో కలిపి తాగుతున్నారు. ఈ చిట్కాలు ఎంతో మంచివని వైద్యులు కూడా నిర్ధారిస్తున్నారు. కషాయానికి భలే డిమాండ్.. గతంలో కషాయం అంటే ఎవరికీ నచ్చేది కాదు. ఇప్పుడు ఈ కషాయానికి చాలా డిమాండ్ ఉంది. మిరియాలు, సొంఠి కొమ్ము, అల్లం, లవంగాలు మిళితంగా ఈ కషాయం తయారు చేస్తున్నారు. రాత్రి నిద్రపోయే ముందు, ఉదయం లేచి న వెంటనే ఈ కషాయం సేవించడం చేస్తున్నారు. కొంతమంది ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు గోరు వెచ్చని పాలలో పసుపు వేసుకుని, ఇంకొందరు మిరియాల చారు, మిరియాలు ఉండే కూరలు తయారు చేస్తున్నారు. ఈ వైఖరి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో హల్ చల్... గృహ వైద్యంగా చెప్పే కషాయం ఇప్పుడు అన్ని సామాజిక మాద్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఆయుర్వేద వైద్యులతో పాటు పెద్దపెద్ద ఆస్పత్రుల వైద్యులు కూడా కషాయానికి ప్రాధాన్యత ఇవ్వమంటున్నారు. దీంతో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో కషాయం, తులసి ఆకుల నీరు, అల్లం టీ, లెమన్ టీల ప్రచారం ఎక్కువైంది. అల్లం టీ కామన్.. గతంలో ప్రతి ఇంట్లో టీ సాధారణంగా చేసుకునేవారు. ఇప్పుడు ఏ ఇంట్లో చూసిన అల్లంకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్నచిన్న కుటుంబాలు కూడా తాము తాగే టీలో అల్లం కలిపి టీ చేస్తున్నారు. వేడివేడి అల్లం టీ తాగి వ్యాధినిరోధ క శక్తి పెంచుకుంటున్నారు. ఇంకొందరు నిమ్మరసంతో తయారు చేసిన టీని సేవిస్తున్నారు. ఇందులో తులసి, పుదీనా ఆకులను వేసి వ్యాధినిరోధక శక్తిని పెంచే పద్ధతులు పాటిస్తున్నారు. ఇలా కూడా.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు కొంతమంది మరికొన్ని పద్ధతులు పాటిస్తున్నారు. రోజు ఉదయమే పది గ్రాముల చ్యవన్ప్రాస్ తీ సుకుంటున్నారు. హెర్బల్ టీ తాగడం, తులసి, దా ల్చిన చెక్క, నల్లమిరియాలు, శొంటి వేసిన కషాయం సేవిస్తున్నారు. బెల్లం, నిమ్మ రసాన్ని అందులో మిక్స్ చేస్తున్నారు. రోజులో రెండు పర్యాయాలు ఎండు ద్రాక్ష తింటున్నారు. పాల లో పసుçపు కలిపి సేవిస్తున్నారు. కృష్ణతులసి ఆకుల రసాన్ని తేనెతో కలిపి నిరంతరం సేవిస్తున్నారు. ఆరోగ్యానికి చాలా మంచిది.. కరోనా వచ్చిన తర్వాత చర్యల కంటే కరోనా రాక ముందు జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రధానంగా ఇంటి వద్ద చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు పాటించాలి. జలుబు, తలనొప్పి వంటివి రాకుండా ఉండేందుకు కషాయం, అల్లం, లెమన్ టీ వంటివి సేవించాలి. పాలు తాగడం, గుడ్లు తినడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి రోజు పసుపు కలిపిన పాలు తీసుకోవాలి. బయటకు రాకుండా ఉండడం మంచిది. భౌతిక దూరం పాటించాలి. – డాక్టర్ ఎం.సీ.హెచ్.నాయుడు, సూపరింటెండెంట్, రాజాం సీహెచ్‌సీ -
ఒంటి దుర్వాసనకు చెక్ పెట్టండి
ఒంటి నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించేందుకు చాలామంది డియోడరెంట్లను ఉపయోగిస్తారు. అయితే దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల ఇళ్లు దాటి బయటకు వెళ్లలేకపోవడం, ఎలాగోలా అడుగు బయటపెట్టినా మార్కెట్లో మనకు కావాల్సిన డియోడరెంట్లు లభ్యం కాకపోవడం జరిగింది. దీంతో చాలామంది కంగారుపడిపోయారు. మరికొందరేమో ఉన్నవాటితోనే నెట్టుకొచ్చారు. కానీ ఎలాంటి చీకూచింతా లేకుండా దీన్ని సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే.. (అరవైలోనూ స్వీట్ సిక్స్‌టీన్‌గా మెరిసిపోవచ్చు..) తయారీ విధానం ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల వెన్న వేసి, ఆపై ఒక చెంచాడు కొబ్బరి నూనె కూడా వేయండి. తర్వాత దీనిలో మూడు చెంచాల యారోరూట్ పొడి లేదా మక్కపిండి వేసి కలపండి. ఆపై సగం టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. పదార్థం జారుడుగా అవగానే 10 నుంచి 15 చుక్కాల ఎసన్షియల్ ఆయిల్‌ను వేసి మరోసారి కలపండి. అనంతరం దాన్ని చిన్న డబ్బాలోకి తీసుకొని ఫ్రిజ్‌లో ఒక గంటపాటు ఉంచండి. దీంతో నేచురల్ సాఫ్ట్ డియోడరెంట్ క్రీమ్ రెడీ అయినట్లే. దీన్ని సాధారణ డియోడరెంట్లలాగానే చెమట పట్టే ప్రదేశాల్లో రాసుకోవాలి. అయితే దీన్ని వాడే మొదటి రెండు వారాల్లో మీకు కాస్త అసౌకర్యంగా అనిపిస్తుంది. చంకల్లో చెమట ఎక్కువగా వస్తుంది. కానీ ఇది మీలోని విష పదార్థాలు బయటకు వెళుతున్నాయనడానికి సంకేతంగా భావించండి. సహజంగా తయారు చేసుకున్న ఈ డియోడరెంట్ దీర్ఘకాలం మంచి ఫలితాలనిస్తుందన్న విషయం మర్చిపోకండి. (బ్రైడ్ లుక్... ఫిల్మీ స్టైల్) -
కరోనా: హ్యాండ్ శానిటైజర్ ఇలా..
ఏదైనా వస్తువుకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగితే దాని ధర కూడా పెరిగిపోతుంది. ఇది మార్కెట్ సూత్రం. కోవిడ్-19 (కరోనా వైరస్) భారత్‌లోనూ విజృంభిస్తున్న నేపథ్యంలో శానిటైజర్స్‌కి గిరాకీ బాగా పెరిగింది. డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు దాని రేట్లు అమాంతం పెంచేస్తున్నారు. కొన్ని మెడికల్ షాపుల్లో అయితే స్టాక్ లేక కంపెనీల నుంచి ఆర్డర్లు పెడుతున్నారు. నిజానికి మార్కెట్లో దొరికే శానిటైజర్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా మనం కూడా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతోనే ఈ శానిటైజర్స్ తయారుచేసుకోవచ్చు. దీనికి కావల్సినవి: 1. రెండు కప్పుల రబ్బింగ్ ఆల్కహాల్ 2. ఒక కప్పు అలోవెరా గుజ్జు 3. పది చుక్కల టీట్రీ ఎసెన్షియల్ ఆయిల్. తయారీ విధానం రబ్బింగ్ ఆల్కహాల్, కలబంద గుజ్జును బాగా కలపాలి. చివర్లో ఎసెన్షియల్ ఆయిల్‌ను కూడా కలుపుతూ ఓ లిక్విడ్ లాగా అయ్యేంతవరకు బాగా కలపాలి. అంతే హ్యాండ్ శానిటైజర్ సిద్దమైనట్లే. ఆ మిశ్రమాన్ని బాటిళ్లలోకి పోసుకొని వాడుకోవచ్చు. -
పనిమనిషికోసం టిఫిన్ సెంటర్లో..
ముంబయిలోని కండివాలి స్టేషన్‌కు సమీపంలో గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ ఉదయపు ఉపాహారశాల వెలిసింది. పోహా, ఉప్మా, కిచిడీ, ఇడ్లీ– చట్నీ, పరాఠాలు వేడివేడిగా వడ్డిస్తారు. దీని నిర్వాహకులైన అశ్విని షెనాయ్, అంకుష్ నీలేష్ షా భార్యాభర్తలు. ఉదయం ఐదుగంటల నుంచి తొమ్మిదిగంటల వరకు మాత్రమే ఉంటుంది సర్వీస్. ఆ తర్వాత ఇద్దరూ వాళ్ల వాళ్ల ఉద్యోగాలకు వెళ్లిపోతారు. వాళ్లు ఈ ఉపాహారశాలను ప్రారంభించింది తమకు అదనపు ఆదాయం కోసం కాదు. వాళ్ల ఇంట్లో వంట చేసే భావనాబెన్ పటేల్ కోసం! భావనాబెన్ భర్త అనారోగ్యానికి గురయ్యాడు. అతడికి వైద్యం కోసం ఆమెకు డబ్బు కావాలి. వంట తప్ప మరో పని చేయడం రాదామెకు. ఆమె పరిస్థితి తెలిసిన అశ్విని, నీలేష్లు వైద్యానికి అవసరమైన డబ్బిస్తామని ధైర్యం చెప్పారు. కానీ భావనాబెన్ అందుకు అంగీకరించలేదు. తాను రోజూ చేసే పనులతోపాటు మరికొంత కష్టపడడానికి శక్తి ఉంది, పని చూపిస్తే చేసుకుంటానని అడిగింది. ఆమె కోసమే ఈ ఉపాహారశాలను ప్రారంభించారు అశ్విని దంపతులు. అందులో భావనాబెన్ వంటలు చేస్తుంది. అశ్విని, అంకుష్‌లు స్టాల్ నడుపుతారు. ఖర్చులు పోను మిగిలిన ఆదాయం మొత్తం భావనాబెన్‌దే. అశ్విని దంపతులకు మానవత్వానికి ప్రతీకలు అని ప్రశంసలు వస్తున్నాయి. కానీ ‘మానవత్వం అనే పెద్ద మాట వద్దు. ఆమెకు మేము చేయగలిగింది చేస్తున్నాం’ అంటున్నారు అశ్వని. -
వేసవిని చప్పరించేయండి
రకరకాల ఐస్‌క్రీమ్‌లు ఇంట్లోనే చేయండి... ఇంటిల్లిపాదీ ఎంజాయ్ చేయండి... మండుటెండలు నెత్తి మాడ్చేస్తున్నాయి. మండుటెండలు మనుషులను ఠారెత్తించేస్తున్నాయి. మండుటెండలు ముచ్చెమటలు పట్టించేస్తున్నాయి. మండుటెండలు ఒంట్లోని శక్తినంతా ఆవిరి చేసేస్తున్నాయి. మండుటెండలు నీరసం తెప్పిస్తున్నాయి. మండుటెండలు నిస్సత్తువలో ముంచేస్తున్నాయి. మండుటెండలు వేసవిని చూసి భయపడతారా..? నో...నెవర్.. ఠండా ఠండా ఐస్‌క్రీములను హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కూల్ కూల్‌గా, డోంట్‌కేర్‌గా వేసవిని చప్పరించేయండి. కొబ్బరి ఐస్‌క్రీమ్ కావాల్సినవి : గుడ్లు – 2, పాలు – 5 కప్పులు, చక్కెర – 1 కప్పు, బేకింగ్ సోడా – ఒక టేబుల్ స్పూన్, బటర్ – పావు కప్పు (కరిగించి), కొబ్బరి పాలు –1 కప్పు, కొబ్బరి తురుము – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, వెనీలా – 2 చుక్కలు (అభిరుచిని బట్టి) తయారీ : ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో నాలుగు కప్పుల పాలు, చక్కెర కలుపుకుని గరిటెతో తిప్పుతూ బాగా మరిగించాలి(సుమారు రెండు కప్పులు అయ్యేలా). లేత పసుపు రంగులోకి వచ్చిన పాల్లో బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత బటర్‌ను కరిగించుకుని మిగిలిన పాలల్లో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో గుడ్లు, ముందుగా కలుపుకుని పక్కనపెట్టుకున్న రెండు మిశ్రమాలను పోసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత అందులో వెనీలా ఫ్లేవర్ లేదా మీకు నచ్చిన ఫ్లేవర్‌ను యాడ్ చేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. చివరిగా ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే కోకోనట్ ఐస్‌క్రీమ్ మీ సొంతమవుతుంది. https://www.youtube.com/watch?v=vMsh179dLe4 అరటి పండ్ల ఐస్‌క్రీమ్ కావాల్సినవి : అరటిపళ్లు – 3 లేదా 4, తేనె – 1 కప్పు, పాలు – అర కప్పు తయారీ : ముందుగా అరటి పళ్లను గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వాటిని ఒక 10 లేదా 15 నిమిషాలు పాటు మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకోవాలి. తరువాత ఆ అరటి ముక్కలను ఒక మిక్సీలో వేసుకుని జ్యూస్‌లా చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమంలో తేనె, పాలు కలిపి మరో సారి మిక్సీ పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే బనానా ఐస్‌క్రీమ్ రెడీ. చల్లబడ్డాక ఈ ఐస్‌క్రీమ్‌ను లొట్టలేసుకుంటూ లాగించెయ్యొచ్చు. మామిడి ఐస్‌క్రీమ్ కావాల్సినవి : మామిడి పళ్లు – 2 లేదా 3, పాలు – 3 కప్పులు, చక్కెర – అర కప్పు, బేకింగ్ సోడా – అర టేబుల్ స్పూన్, తేనె – 1 టేబుల్ స్పూన్, పిస్తా – పావు కప్పు తయారీ : ముందుగా మామిడి ముక్కలు పిస్తా కలిపి జ్యూస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకుని పాలలో చక్కెర వేసి గరిటెతో తిప్పుతూ మరిగించాలి. పాలు బాగా చిక్కగా (గ్లాస్ పాలు అయ్యేదాకా) మరిగించి, అందులో బేకింగ్ సోడా, తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మ్యాంగో–పిస్తా జ్యూస్, పాల మిశ్రమాన్ని జోడించి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక బౌల్లోకి తీసుకుని డీప్ కూల్ చేసుకుంటే మామిడి ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత చీజ్ తురుముతో గార్నిష్ చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. https://www.youtube.com/watch?v=v5piT-6ATU4 ఆపిల్ ఐస్‌క్రీమ్ కావాల్సినవి : ఆపిల్ – 2, పాలు – 5 కప్పులు, పంచదార – అర కప్పు, వెనీలా – 1 టేబుల్ స్పూన్ తయారీ : ముందుగా నాలుగున్నర కప్పులు పాలను బాగా మరిగించి ఒక కప్పు కంటే తక్కువగా చేసుకోవాలి. తరువాత పైన పేరుకున్న మీగడను తీసి పక్కన పెట్టుకుని మిగిలిన పాలను డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అది గడ్డ కట్టిన తరువాత ముందుగా తీసి పక్కన పెట్టిన మీగడను జోడించి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆపిల్ ముక్కలు, మిగిలిన అర కప్పు పాలు, పంచదార వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో వెనీలా వేసుకుని బాగా కలుపుకుని ఒక పాత్రలో తీసుకుని డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఆపిల్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చివరగా ఆపిల్ ముక్కలు చాక్లెట్ పౌడర్లతో మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోవచ్చు. https://www.youtube.com/watch?v=etmV9Wds4IU దానిమ్మ ఐస్‌క్రీమ్ పంచదార – అర కప్పు, నీరు – ముప్పావు కప్పు, దానిమ్మ జ్యూస్ – 3 కప్పులు, నిమ్మకాయ – 1 తయారీ : ముందుగా దానిమ్మ జ్యూస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత నీటిని 10 నిమిషాలు వేడి చేసుకుని అందులో పంచదార కలుపుకుని బాగా కరగనివ్వాలి. తరువాత దానిమ్మ జ్యూస్‌లో ఈ పంచదార నీళ్లను యాడ్ చేసుకోవాలి. తరువాత నిమ్మరసం కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మెషిన్లో లేదా డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నోరూరించే దానిమ్మ ఐస్‌క్రీమ్ మీ సొంతమవుతుంది. https://www.youtube.com/watch?v=m8PAaqWK8ac సపోటా ఐస్‌క్రీమ్ కావాల్సినవి : సపోటాలు – 5 లేదా 6, పాలు – అర కప్పు, తేనె – 1 టేబుల్ స్పూన్, పంచదార పొడి – అర కప్పు, గ్లూకోజ్ – పావు కప్పు తయారీ : ముందుగా సపోటా ముక్కలను మిక్సీలో వేసుకుని జ్యూస్ చేసుకోవాలి. తరువాత అందులో పాలు, పంచదార వేసుకుని మరో సారి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని అందులో తేనె, గ్లూకోజ్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకుంటే టేస్టీ టేస్టీ సపోటా ఐస్‌క్రీమ్ సిద్ధమైపోతుంది. https://www.youtube.com/watch?v=DnQ4Ky6jIG8 ద్రాక్ష ఐస్‌క్రీమ్ కావాల్సినవి : ద్రాక్షపళ్లు – అర కిలో, నిమ్మకాయ – 1, పంచదార పొడి – ఒక కప్పు, పాలు – 1 కప్పు, గుడ్డు – 1 (తెల్ల సొన మాత్రమే) తయారీ : ముందుగా ద్రాక్షపళ్లను జ్యూస్ చేసుకుని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ జ్యూస్‌లో నిమ్మరసం, గుడ్డు కలుపుకుని ఒక 20 నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకుని అందులో పాలు, పంచదార వేసుకుని బాగా మరిగించాలి. తరువాత జ్యూస్ ఫ్రిజ్‌లోంచి బయటికి తీసి అందులో ఈ పాల మిశ్రమాన్ని యాడ్ చేసుకుని డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రుచికరమైన ద్రాక్ష ఐస్‌క్రీమ్ మిమ్మల్ని చల్లబరుస్తుందిత. https://www.youtube.com/watch?v=jWL7U1c1fqs అనాస ఐస్‌క్రీమ్ కావాల్సినవి : అనాస ముక్కలు – ఒక కప్పున్నర, పాలు – 3 కప్పులు, చక్కెర – అర కప్పు బేకింగ్ సోడా – అర టేబుల్ స్పూన్, తేనె – ఒక టేబుల్ స్పూన్, గుడ్డు – 1 (తెల్ల సొన మాత్రమే) తయారీ : ముందుగా ఒక పాన్ తీసుకుని పాలు, చక్కెర వేసుకుని బాగా (ఇంచుమించు ఒక కప్పు వాటర్ అయ్యేంత వరకు) మరిగించుకోవాలి. అందులో చివరిగా బేకింగ్ సోడా, తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అనాస ముక్కలను జ్యూస్ చేసుకుని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో జ్యూస్, గుడ్డులతో పాటు పాల మిశ్రమాన్ని జోడించి బాగా కలుపుకుని డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. బొప్పాయి ఐస్‌క్రీమ్ కావాల్సినవి : బొప్పాయి – 1 (మీడియం సైజ్), పంచదార పొడి – ఒక కప్పు, క్రీమ్ – 1 1/2 కప్పు (మార్కెట్లో దొరుకుతుంది), వెనీలా – 2 చుక్కలు తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో క్రీమ్, పంచదార పొడి వేసుకుని హ్యాండ్ మిక్సర్‌తో మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత బొప్పాయి ముక్కలను జ్యూస్ చేసుకుని అందులో వెనీలా చుక్కలతో పాటు.. క్రీమ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే పొప్పాయ ఐస్‌క్రీమ్ తయారైపోతుంది. నిమ్మ ఐస్ క్రీమ్ కావాల్సినవి : గుడ్లు – 4, పాలు – 2 కప్పులు, పాల పౌడర్ – అర కప్పు, పంచదార – 1 1/2 కప్పులు, నిమ్మకాయ – 1 (రసంతో పాటు తొక్క కూడా యూజ్ అవుతుంది) తయారీ : ముందుగా నిమ్మకాయపైన ఉండే పసుపు లేయర్‌ను కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. (పసుపు లేయర్‌కు అడుగున ఉండే తెల్ల లేయర్‌ను పూర్తిగా తొలగించాలి లేదంటే చేదు వస్తుంది) తరువాత పాలు వేడి చేసుకుని అందులో పసుపు లేయర్స్‌ను కలుపుకోవాలి. తరువాత అందులో పంచదార కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో పాల పౌడర్, గుడ్లు బాగా కలుపుకుని అందులో పాలు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. తరువాత లెమెన్ తొక్కలను వడగట్టుకొని అందులో నిమ్మరసం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఎంతో రుచికరమైన లెమెన్ ఐస్‌క్రీమ్ రెడీ అయిపోతుంది. ఖర్జూరం ఐస్ క్రీమ్ కావాల్సినవి : పంచదార – అర కప్పు, నీరు – 1 కప్పు, ఖర్జూరం – 10 లేదా 15 (గింజలు తీసినవి), పాలు –2 కప్పులు, గుడ్లు – 3 (పచ్చసొన మాత్రమే), వెనీలా – 2 చుక్కలు తయారీ : ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో పంచదార, నీరు వేసుకుని... పంచదార కరిగేదాకా మరిగించాలి. తరువాత అందులో ఖర్జూరం వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత మిక్సీలో (మరీ మెత్తగా కాకుండా) మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకుని అందులో పాలు, గుడ్లు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెండు మిశ్రమాలను ఒక బౌల్లో యాడ్ చేసుకుని ఐస్‌క్రీమ్ మేకర్లో కానీ డీప్ ఫ్రిజ్‌లో కానీ పెట్టుకుంటే నోరూరించే ఖర్జూరం ఐస్‌క్రీమ్ తయారుచేసుకోవచ్చు. పుచ్చకాయ ఐస్ క్రీమ్ కావాల్సినవి : పుచ్చకాయ – 3 కప్పులు, తేనె – 1 టేబుల్ స్పూన్, పాలు – అర కప్పు, నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్స్, చాక్లెట్ ఫ్లేక్స్ – 1 టేబుల్ స్పూన్ తయారీ : పుచ్చకాయ ముక్కలను జ్యూస్ చేసుకోవాలి. అందులో తేనె, పాలు కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి జ్యూస్ తీసుకుని అందులో నిమ్మరసం వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఆ బౌల్‌ను డీప్ ఫ్రిజ్‌లో కాసేపు ఉంచతే టేస్టీ పుచ్చకాయ ఐస్‌క్రీమ్ రెడీ. చాక్లెట్ ఫ్లేక్స్‌తో గార్నిష్ చేసుకోవచ్చు. బాదం కుల్ఫీ పాలు – 4 కప్పులు, యాలకుల పొడి – 1 టేబుల్ స్పూన్, పంచదార – పావు కప్పు, మొక్కజొన్న పిండి – 1 టేబుల్ స్పూన్, బాదంపప్పులు – 10 లేదా 15 బ్రెడ్ – 1 (చివర్లు తొలగించి ముక్కలు చేసుకోవాలి) తయారీ : ముందుగా బ్రెడ్ ముక్కలు, అరకప్పు పాలు, మొక్కజొన్న పిండి కలుపుకుని మిక్సీలో పేస్ట్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత బాదం పప్పులను ముక్కలు చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో మిగిలిన మూడున్నర కప్పులు పాలను మరిగించి కప్పున్నర పాలుగా చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పేస్ట్‌ను అందులో యాడ్ చేసుకుని (అడుగంటకుండా) గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ మిశ్రమం చిక్కపడిన తరువాత పంచదార వేసుకుని దగ్గర పడేదాకా గరిటెతో తిప్పాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో బాదం ముక్కలు, యాలకుల పొడి కలుపుకుని బాగా చల్లారనివ్వాలి. తరువాత కుల్ఫీ కప్స్‌లోకి లేదా మీకు నచ్చే ఆకారంలోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని ఒక పుల్ల వేసుకుని డీప్ ఫ్రిజ్‌లోకి పెట్టుకుంటే సరిపోతుంది. బీట్రూట్ ఐస్‌క్రీమ్ కావాల్సినవి : బీట్రూట్ – 4, నీరు – మరిగించుకోవడానికి సరిపడా, పాలు – 3 కప్పులు, పంచదార – 1 కప్పు, తేనె – పావు కప్పు, గుడ్లు – 3 (పచ్చసొన మాత్రమే) తయారీ : ముందుగా బీట్రూట్ను ఒక కుక్కర్లో వాటర్ వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకుని రెండున్నర కప్పుల పాలు, పంచదార వేసుకుని బాగా మరిగించుకోవాలి. మిగిలిన ఒక కప్పు పాలలో పచ్చసొన వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మెత్తగా ఉడికిన బీట్ రూట్‌ను ముక్కలు చేసుకుని జ్యూస్ చేసుకుని, అందులో పచ్చసొన, పాల మిశ్రమాన్ని వేసుకుని మరోసారి మిక్సీ చేసుకోవాలి. తరువాత పాలు పంచదార మిశ్రమంలో ఈ జ్యూస్‌ను వేసి డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే టేస్టీ బీట్ రూట్ ఐస్‌క్రీమ్ మీ సొంతమవుతుంది. https://www.youtube.com/watch?v=vRvBOz0gG94 క్యారెట్ ఐస్‌క్రీమ్ కావాల్సినవి : పాలు – 1 కప్పు, పాల పొడి – 1 కప్పు, పంచదార పొడి – అరకప్పు, తేనె – అరకప్పు, క్యారెట్ – 2 (మీడియం సైజ్ ), కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్స్, చెర్రీ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ తయారీ : ముందుగా క్యారెట్స్‌ను గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. తరువాత పాలు, పంచదార పొడి కలుపుకుని వేడి చేసుకోవాలి. తరువాత అందులో పాలపొడి, తేనె కలుపుకుని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, కిస్మిస్ యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఆ మిశ్రమంలో పాల మిశ్రమంతో పాటు చెర్రి ముక్కలను యాడ్ చేసుకుని మరోసారి మిక్సీ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఆ బౌల్‌ను డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సూపర్ టేస్టీ క్యారెట్ ఐస్‌క్రీమ్ మీ నోటిని తీపిచేస్తుంది. టమాటా ఐస్ క్రీమ్ కావాల్సినవి : టమాటా – 3, పంచదార పొడి – 1 కప్పు, తేనె – 4 టేబుల్ స్పూన్స్, ఉప్పు – చిటికెడు, అల్లం పేస్ట్ – పావు టేబుల్ స్పూన్, పాలపొడి – 3 టేబుల్ స్పూన్స్, బటర్ – పావు కప్పు, నీరు – మరిగించడానికి సరిపడా, చెర్రీస్ – 5 లేదా 6 (గింజలు తొలగించి) తయారీ : ముందుగా టమాటాలను 10 నిమిషాలు పాటు ఉడికించుకోవాలి. తరువాత టమాటా, బటర్, అల్లం పేస్ట్, చెర్రీస్ కలిపి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో పంచదార పొడి, తేనె, పాలపొడితో పాటు ఉప్పు యాడ్ చేసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్‌ను డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సూపర్ టేస్ట్ సొంతమవుతుంది. మొక్కజొన్న ఐస్‌క్రీమ్ కావాల్సినవి : లేత మొక్కజొన్న పొత్తులు – 2 (మీడియం సైజ్), పాలు –ఒకటిన్నర కప్పులు, పంచదార – 2 కప్పు, పాలపొడి – అర కప్పు, గుడ్లు – 2, ఉప్పు – చిటికెడు తయారీ : ముందుగా మొక్కజొన్న పొత్తుల గింజలను వలుచుకుని ఒక పాన్‌లో వేసుకోవాలి. అందులో పాలు, పంచదార వేసుకుని బాగా ఉడికించుకోవాలి. మొక్కజొన్న గింజలు బాగా మెత్తగా అయిన తరువాత ఆ మిశ్రమాన్ని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత గుడ్లు, పాలపొడి బాగా కలుపుకుని అందులో చిటికెడు ఉప్పు వేసుకుని మొక్కజొన్న మిశ్రమంలో కలుపుకోవాలి. ఇప్పుడు అంతా ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రుచికరమైన మొక్కజొన్న (కార్న్) ఐస్‌క్రీమ్ మీ సొంతమవుతుంది. https://www.youtube.com/watch?v=gaz1qZV7Mcc చిలగడ దుంప ఐస్‌క్రీమ్ కావాల్సినవి : చిలగడ దుంపలు – 3, అరటిపండు – 1, పాలు – 1 కప్పు, పంచదార – అర కప్పు, తేనె – 3 టేబుల్ స్పూన్స్, వెనీలా – 2 చుక్కలు తయారీ : ముందుగా చిలగడ దుంపలను శుభ్రం చేసుకుని కుక్కర్లో పెట్టుకుని మెత్తగా ఉండికించుకోవాలి. తరువాత దుంపల తొక్క ఒలిచి, అరటిపండు జోడించి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకుని పాలు, పంచదార వేసుకుని బాగా మరిగించాలి. ఇప్పుడు రెండు మిశ్రమాలను ఒక బౌల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా తేనె, వెనీలా వేసుకుని బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే స్వీట్ స్వీట్ ఐస్‌క్రీమ్ రెడీ అయిపోతుంది. వాల్‌నట్స్‌తో కలిపి దీనిని సర్వ్ చేసుకుంటే మరింత టేస్ట్ వస్తుంది. చెర్రీ ఐస్ట్యూబ్ కావాల్సినవి : చెర్రీస్ – ఒకటిన్నర కప్పు, తేనె – పావు కప్పు, పంచదార పొడి– అర కప్పు, పాలు – 1 కప్పు తయారీ : ముందుగా చెర్రీస్ గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని పాలు, చెర్రీస్, పంచదార వేసుకుని బాగా మరిగించుకోవాలి. బాగా దగ్గరకు అయిన తరువాత స్టవ్ మీద నుంచి దించేసుకుని మిక్సీ చేసుకోవాలి. తరువాత తేనె యాడ్ చేసుకుని బాగా కలిపి ఐస్ ట్యూబ్‌ల్లో వేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే చెర్రీ ఐస్ ట్యూబ్ రెడీ అవుతుంది. తాటి ముంజల ఐస్‌క్రీమ్ కావాల్సినవి : తాటి ముంజలు – 2, పంచదార – 1 కప్పు, పాలు – 2 కప్పులు, గుడ్డు – 1 (పచ్చసొన), కిస్మిస్ – అర కప్పు తయారీ : ముందుగా తాటి ముంజల తొక్క తీసేసి శుభ్రం చేసుకోవాలి. వాటిని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకుని పాలు, పంచదార వేసుకుని (సుమారు ఒక కప్పు పాలు అయ్యేదాకా) మరిగించాలి. తరువాత అందులో గుడ్డు కలుపుకుని బాగా తిప్పాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ముంజలు, కిస్మిస్లతో పాటు పాల మిశ్రమాన్ని యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. చివరిగా మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని డీప్ ప్రిజ్‌లో పెట్టుకుంటే చల్లచల్లని తాటి ముంజల ఐస్‌క్రీమ్ రెడీ అయిపోతుంది.