ఎన్ని సౌందర్య సాధనాలు వచ్చినా ఇవే ఎవర్‌గ్రీన్‌..! | Beauty Tips: Homemade Beauty Products | Sakshi
Sakshi News home page

ఎన్ని సౌందర్య సాధనాలు వచ్చినా ఇవే ఎవర్‌గ్రీన్‌..!

Published Tue, Dec 31 2024 10:54 AM | Last Updated on Wed, Jan 1 2025 8:16 AM

Beauty Tips: Homemade Beauty Products

అందాన్ని పెంపొందించుకునేందుకు కొన్ని సాధారణ పదార్థాలను ఎప్పటి నుంచో మనం వాడుతూనే ఉన్నాం. ఇప్పటికే  ఎన్నో కొత్త కొత్త సౌందర్యసాధనాలు అందుబాటులోకి వచ్చాయి గానీ నేచురల్‌గా లభ్యమయ్యే ఈ మామూలు పదార్థాలతోనే మేనినీ, జీవితాన్ని చాలా అందంగా చేసుకోవచ్చని అనాది కాలం నుంచి నిరూపితమైంది. ఎన్ని రకాల సౌందర్య సాధనాలు వచ్చినా ఇవి మాత్రం ఆరోగ్యకరమైనవిగా కాలపరీక్షను తట్టుకుని నిలబడ్డాయి. సౌందర్య సాధానాలుగా మనం ఉపయోగిస్తున్న కొన్ని ఇంటి, వంటింటి పదార్థాల గురించి తెలుసుకుందాం. 

శనగపిండి: ముఖానికి ఉన్న జిడ్డును తొలగించడానికి శనగపిండిని ప్యాక్‌లా వేసుకోవడమన్నది చాలామంది ఎప్పటి నుంచో అనుసరిస్తున్న పద్ధతే. దీన్ని పసుపు, పాలు, వెన్న, తేనె వంటి వాటితో కలిపి మిశ్రమంలా ముఖానికి రాసుకోవడం వల్ల మేని ఛాయ మెరుగవుతుందని చాలామంది నమ్మకం.

పసుపు : పసుపును పసుపు మొక్క వేళ్ల నుంచి తయారుచేస్తారు. పసుపుకొమ్ములుగా పేర్కొనే ఆ మొక్కల వేళ్లను పొడిగా మార్చి పొడి చేసి, అలా వచ్చిన పౌడర్‌ను ఓ  సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. పసుపును వంటలో సైతం వాడతారు.  ఇది క్రిమినాశినిగా పనిచేస్తుంది. తెలుగువారి ఎన్నో సాంస్కృతిక ఉత్సవాల్లో  కాళ్లకు పసుపు రాసుకునే సంప్రదాయం ఉంది. 

దాంతోపాటు ముఖానికి కూడా సౌందర్యసాధనంగా పసుపు రాసుకుంటారు. దాంతో మెరుగైన చాయ వస్తుంది. అయితే దీర్ఘకాలం పసుపును ముఖానికి రాయడం అంత మంచిది కాదు. దాని వల్ల ముఖం తడి కోల్పోయి విపరీతంగా పొడిబారి ముఖంపై ముడుతలు వచ్చే అవకాశం ఉంది.

చందనం : తెలుగు వారి సంస్కృతిలోని ఎన్నో ఉత్సవాల్లో కాళ్లకు పసుపుతోపాటు... మెడపై గంధం రాసుకునే సంప్రదాయం కూడా ఉంది. అందుకే చాలా సందర్భాల్లో పసుపూ–చందనం అంటూ ఈ రెండింటినీ కలిపి చెబుతుంటారు. దీన్నిబట్టి సౌందర్య సా«ధనాలను ఆరోగ్యకరమైన రీతిలో వేడుకలకు ఉపయోగించడం మన సంస్కృతిలో ఎప్పటినుంచో ఉన్నదే అన్న విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. 

చందనాన్ని ఒక పరిమళ ద్రవ్యంగా ఉపయోగించడంతో పాటు చలువ చేసేందుకు వాడే వస్తువుగా కూడా పరిగణిస్తారు. సంప్రదాయంగా చందనం చెక్కను రాతి మీద అరగదీసి గంధాన్ని తయారు చేసి వాడతారు. ఇటీవల ఈ చందనాన్ని ముఖానికి రాసుకునే పౌడర్లలో, పెర్‌ఫ్యూమ్స్‌లో, సబ్బుల్లో ఉపయోగిస్తున్నారు. చందంతో ముఖానికి ప్యాక్‌ వేయడం వల్ల నిగారింపు వస్తుందన్న నమ్మకం అనాదిగా ఉన్నదే.

గోరింటాకు : ఇటీవల మెహందీ పేరిట చెబుతున్న ఈ ఆకును నూరి తయారు చేసే  ఈ ఉత్సాదనను మన సంస్కృతిలో ఎప్పటినుంచో ఓ సౌందర్య సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఇది రంగును ఇచ్చే కలరింగ్‌ ఏజెంట్‌గా మాత్రమే కాకుండా... చల్లదనాన్ని ఇచ్చే సౌందర్య సాధనంగా పేరు పొందింది. 

ఇటీవల దీన్ని తలకు వేసే రంగుల కోసం ‘హెన్నా’ అని కూడా ఉపయోగిస్తున్నారు. నిజానికి పెండ్లి వేడుకల సందర్భంగా, అలాగే అనేక పర్వదినాల్లో... ముందుగా దీన్ని రాసుకోవడం అన్నది అనాదిగా మన సంప్రదాయంలో ఒక సాంస్కృతిక వేడుక.

సాంబ్రాణి : ఇది కొన్ని రసాయనాలతోపాటు కొన్ని మొక్కల బెరడుల నుంచి తీసే మిశ్రమం. ఇది సుగంధ పరిమళ సాధనమే అయినా చిన్న పిల్లల్లో ఆరోగ్యం కోసం దీన్ని ఉపయోగిస్తారు. ప్రతిరోజూ చంటి పిల్లల స్నానం తర్వాత సాంబ్రాణిని నిప్పులపై వేస్తారు. 

అందులోంచి వచ్చే పొగ క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. దానితో పాటు చంటిపిల్లలు ఉన్న గదిలో వచ్చే దుర్వాసనను పోగొడుతుంది. అంటే అక్కడ పేరుకునే హానికారక బ్యాక్టీరియాను దూరం చేస్తుండటం వల్ల దుర్వాసన దూరమవుతుంది. 

కొబ్బరి నూనె : ఇది ముదురు కొబ్బరి నుంచి తీసే నూనె. శుభ్రమైన ఈ నూనెను మన సంస్కృతిలో తలకు రాయడం ఒక ఆనవాయితీ. తలకు రాసే ఎన్నో నూనెల కంటే అది శ్రేష్ఠమైనదని నమ్మకం. దీనితోపాటు ఆరోగ్యకరమైన కేశాల కోసం మందార ఆకులు, ఉసిరి కలిపి వాడటం కూడా సాధారణంగా జరుగుతుంటుంది. 

(చదవండి:  దటీజ్‌ మధురిమ బైద్య..! మైండ్‌బ్లాక్‌ అయ్యే గెలుపు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement