Home Remedies to Fight With CoronaVirus | కరోనాను ఎదుర్కొనేందుకు వంటింటి చిట్కాలు.. - Sakshi
Sakshi News home page

కరోనాను ఎదుర్కొనేందుకు వంటింటి చిట్కాలు..

Published Mon, Jul 13 2020 10:34 AM | Last Updated on Mon, Jul 13 2020 4:32 PM

People Approaching Kitchen Room Tips To Face Corona - Sakshi

పాలలో పసుపు వేసుకుని తాగమంటే అదోలా చూసేవారు. కషాయం పేరు చెబితే మూతి ముడుచుకునేవారు. తులసి నీళ్లు గుడిలో మాత్రమే తాగాలని డాంబికాలు పలికేవారు. కరోనా వచ్చి ఈ పరిస్థితులను సమూలంగా మార్చేసింది. ఇప్పుడు ప్రతి వంటిల్లు ఓ ఆస్పత్రి అయిపోయింది. గతంలో వదిలేసిన కషాయాలను మళ్లీ తయారు చేస్తున్నారు. పూర్వం నుంచి వస్తున్న వంటింటి చిట్కాలను అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఈ వైఖరి మంచిదేనని వైద్యులు కూడా అంటున్నారు. 

ఇంటి వైద్యం మళ్లీ అక్కరకు వచ్చింది. అయిన దానికీ కాని దానికీ గుప్పెడు గుప్పెడు మాత్రలు మింగే దౌర్భాగ్యం నుంచి జనం మెల్లగా మళ్లీ దారి మార్చుకుంటున్నారు. పోపుల పెట్టె గొప్పదనాన్ని తెలుసుకుంటున్నారు. వంటింటిలో ఉండే దినుసు ల గురించి ఎవరైనా చెబితే మనసు పెట్టి వింటున్నారు. కరోనా భయం అలముకున్న తర్వాత మళ్లీ పాత పద్ధతిలో కషాయాలు తయారు చేయడం మొదలుపెట్టారు. గోరు వెచ్చని పాలలో ప సుపు కలిపి సేవిస్తున్నారు. అల్లం టీ, లెమన్‌ టీ అంటూ ప్రాధాన్యత ఇస్తున్నారు. కషాయం ఉదయం, రాత్రి రెండు పూటలా ఇష్టపడి మరీ తాగుతున్నారు. కరోనా వైరస్‌ ప్రబలిన నేపథ్యంలో అటు సాధారణ వ్యక్తి నుంచి ఇటు ప్రజా ప్రతినిధులు, ఉన్న తాధికారులు, వ్యాపారస్తులు, ఉద్యోగుల వరకూ ప్రతి ఒక్కరూ ఇలా చిట్కాలు పాటిస్తున్నారు.  

ఏ మాత్రం అనుమానం ఉన్నా.. 
వానలు పడుతుండడంతో కరోనాను పోలిన లక్షణాలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా జలుబు, దగ్గు కనిపిస్తే చాలు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే ప్రతి ఇంట్లో ఆరోగ్య చిట్కాలు ప్రారంభమయ్యాయి. ప్రతి రోజు కషాయం, లెమన్, అల్లం టీలు తప్పనిసరిగా మారాయి. జలుబు వచ్చిందంటే చాలు వేడి నీటి ఆవిరిని పట్టడం, వెంటనే కషాయం తాగడం చేస్తున్నారు. గొంతు వద్ద నొప్పిగా ఉన్నా, ద గ్గు ఉన్నా వెంటనే పసుపు కలిపిన పాలను సేవిస్తున్నారు. వీటికి తోడు దగ్గర్లో తులసి మొక్కలు ఉంటే వాటి ఆకులను గోరు వెచ్చని నీటిలో కలిపి తాగుతున్నారు. ఈ చిట్కాలు ఎంతో మంచివని వైద్యులు కూడా నిర్ధారిస్తున్నారు.
 
కషాయానికి భలే డిమాండ్‌.. 
గతంలో కషాయం అంటే ఎవరికీ నచ్చేది కాదు. ఇప్పుడు ఈ కషాయానికి చాలా డిమాండ్‌  ఉంది. మిరియాలు, సొంఠి కొమ్ము, అల్లం, లవంగాలు మిళితంగా ఈ కషాయం తయారు చేస్తున్నారు. రాత్రి నిద్రపోయే ముందు, ఉదయం లేచి న వెంటనే ఈ కషాయం సేవించడం చేస్తున్నారు. కొంతమంది ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు గోరు వెచ్చని పాలలో పసుపు వేసుకుని, ఇంకొందరు మిరియాల చారు, మిరియాలు ఉండే కూరలు తయారు చేస్తున్నారు. ఈ వైఖరి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. 

సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌... 
గృహ వైద్యంగా చెప్పే కషాయం ఇప్పుడు అన్ని సామాజిక మాద్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది. ఆయుర్వేద వైద్యులతో పాటు పెద్దపెద్ద ఆస్పత్రుల వైద్యులు కూడా కషాయానికి ప్రాధాన్యత ఇవ్వమంటున్నారు. దీంతో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో కషాయం, తులసి ఆకుల నీరు, అల్లం టీ, లెమన్‌ టీల ప్రచారం ఎక్కువైంది.  

అల్లం టీ కామన్‌.. 
గతంలో ప్రతి ఇంట్లో టీ సాధారణంగా చేసుకునేవారు. ఇప్పుడు ఏ ఇంట్లో చూసిన అల్లంకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్నచిన్న కుటుంబాలు కూడా తాము తాగే టీలో అల్లం కలిపి టీ చేస్తున్నారు. వేడివేడి అల్లం టీ తాగి వ్యాధినిరోధ క శక్తి పెంచుకుంటున్నారు. ఇంకొందరు నిమ్మరసంతో తయారు చేసిన టీని సేవిస్తున్నారు. ఇందులో తులసి, పుదీనా ఆకులను వేసి వ్యాధినిరోధక శక్తిని పెంచే పద్ధతులు పాటిస్తున్నారు.  

ఇలా కూడా.. 
వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు కొంతమంది మరికొన్ని పద్ధతులు పాటిస్తున్నారు. రోజు ఉదయమే పది గ్రాముల చ్యవన్‌ప్రాస్‌ తీ సుకుంటున్నారు. హెర్బల్‌ టీ తాగడం, తులసి, దా ల్చిన చెక్క, నల్లమిరియాలు, శొంటి వేసిన కషాయం సేవిస్తున్నారు. బెల్లం, నిమ్మ రసాన్ని అందులో మిక్స్‌ చేస్తున్నారు. రోజులో రెండు పర్యాయాలు ఎండు ద్రాక్ష తింటున్నారు. పాల లో పసుçపు కలిపి సేవిస్తున్నారు. కృష్ణతులసి ఆకుల రసాన్ని తేనెతో కలిపి నిరంతరం సేవిస్తున్నారు. 

ఆరోగ్యానికి చాలా మంచిది.. 
కరోనా వచ్చిన తర్వాత చర్యల కంటే కరోనా రాక ముందు జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రధానంగా ఇంటి వద్ద చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు పాటించాలి. జలుబు, తలనొప్పి వంటివి రాకుండా ఉండేందుకు కషాయం, అల్లం, లెమన్‌ టీ వంటివి సేవించాలి. పాలు తాగడం, గుడ్లు తినడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి రోజు పసుపు కలిపిన పాలు తీసుకోవాలి. బయటకు రాకుండా ఉండడం మంచిది. భౌతిక దూరం పాటించాలి.  
– డాక్టర్‌ ఎం.సీ.హెచ్‌.నాయుడు, సూపరింటెండెంట్, రాజాం సీహెచ్‌సీ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement