ఎస్‌ఓటీ పోలీసులమంటూ దబాయింపు
దబ్బులు తీసుకొని వదిలేసిన వైనం
శంషాబాద్ : హోటల్‌లో బాల కార్మికులున్నారని ఎస్‌ఓటీ పోలీసులుగా పరిచయం చేసుకున్న నలుగురు వ్యక్తులు యజమాని నుంచి డబ్బులు దండుకున్నారు. ఈ సంఘటన శనివారం శంషాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. శంషాబాద్ ప్రధాన చౌరస్తాలో కొనసాగుతున్న ఓ శాఖహార హోటల్ నుంచి పద్దెనిమిదేళ్లు నిండిన ముగ్గురు సిబ్బందితో పాటు కౌంటర్‌పై కూర్చున్న వ్యక్తిని శనివారం ఉదయం నలుగురు వ్యక్తులు ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న మైదానంలోని చెట్టుకిందికి తీసుకెళ్లారు. తాము ఎస్‌ఓటీ పోలీసులమని వారు పరిచయం చేసుకున్నారు. హోటల్‌లో పనిచేస్తున్న వారు బాలకార్మికులంటూ దబాయించారు. వారిని కనీసం స్టేషన్‌లోనికి తీసుకెళ్లకుండా చెట్టుకిందే బేరసారాలాడారు.
అయితే, హోటల్ నుంచి తీసుకెళ్లిన సిబ్బంది అంతా కూడా పద్దెనిమిదేళ్ల వయస్సు పైబడిన వారే కావడంతో చేసేది లేక ఎంతో కొంత ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోటల్ యజమానిని దబాయించడంతో అతడు కొంత మొత్తాన్ని ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చేశాడు. తాము బాలకార్మికులం కాకపోయినా బెదిరించి తీసుకెళ్లారని హోటల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తాము తప్పు చేసి ఉంటే పోలీస్‌స్టేషన్‌లోకి తీసుకెళ్లి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి కాని, దబాయించి డబ్బులు దండుకోవడం ఏంటి..? అని వారు వాపోయారు. కాగా, హోటల్‌లో బాలకార్మికులు ఉన్నారంటూ పోలీస్‌స్టేషన్ ఆవరణ వరకు తీసుకెళ్లింది ఇంతకు పోలీసులేనా లేక ఇతరులా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం శనివారం శంషాబాద్ పట్టణంలో చర్చనీయాంశమైంది.
బాల కార్మికులున్నారంటూ సెటిల్‌మెంట్!
Published Sat, Jul 11 2015 11:44 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement