sot police
-
బాయ్స్ హాస్టల్ లో డ్రగ్స్
-
హైదరాబాద్ మల్కాజిగిరిలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు
-
యాదాద్రి భువనగిరి జిల్లా భీమనపల్లిలో కల్తీ పాల కలకలం
-
రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కీలక నిర్ణయం.. కబ్జాపై ‘ఎస్ఓటీ’
సాక్షి, హైదరాబాద్: మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, వ్యభిచారం వంటి నేరస్తులను పట్టుకోవటంలో దిట్టయిన స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు.. ఇక నుంచి భూ ఆక్రమణదారులపైనా దృష్టి సారించనున్నారు. భూ తగాదాలు పెరిగిపోతుండటం, వీటిని ఆసరాగా చేసుకొని కొందరు పోలీసులు అక్రమాలకు పాల్పడటం, చివరికి హత్యలకూ దారితీస్తున్న నేపథ్యంలో... రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. భూ ఆక్రమణలు, కబ్జాలపై పోలీసులకు మార్గదర్శకాలు ఖరారు చేశారు. ఆయా విధి విధానాలకు లోబడే చర్యలు తీసుకోవాలని సూచించారు. వేల సంఖ్యలో ఫిర్యాదులు.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్ పరిధిలో భూముల విలువలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీంతో కబ్జాదారులు నకిలీ పత్రాలను సృష్టించి ఖాళీ స్థలాలను విక్రయించడం లేదా కబ్జాలకు పాల్పడటం వంటి వాటికి పాల్పడుతున్నారు. దీంతో రోజుకు వేల సంఖ్యలో పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిలో చాలా వరకు కేసులను ‘సివిల్ మ్యాటర్’ అని పోలీసులు పక్కన పెడుతుండగా.. తమ వారి కేసులను మాత్రం ప్రత్యేక దృష్టి సారించి మరీ పరిష్కరిస్తున్నారు. కొన్ని పీఎస్‌లలో సబ్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఏసీపీలు కబ్జాదారులకు ఒత్తాసు పలుకుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి పలు కేసులలో భూ యజమానులు ఆగ్రహం కట్టలు తెంచుకొని.. హత్యలు చేసే స్థాయికి వెళ్లిపోతుండటం గమనార్హం. ఇటీవలి కాలంలో ఇలాంటి భూ తగాదాల నేపథ్యంలో హత్యలు జరగడమే ఇందుకు నిదర్శనం. చదవండి: మరోసారి తెరపైకి సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ పేరు అన్ని కేసుల్లో పోలీసుల ప్రమేయం ఉండదు.. చాలా మంది భూ యజమానులు వారి భూమి ఆక్రమణలకు గురైతే చాలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇది సివిల్ కేసు అని, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించినా సరే పోలీసులు పట్టించుకోవటం లేదని పలువురు భూ యజమానులు ‘పెద్ద’ మనుషులతో ఫోన్లు చేయించి, ఒత్తిడి తెస్తున్నారు. ప్రతి భూ ఆక్రమణ కేసులో పోలీసుల ప్రమేయం ఉండదు. సివిల్, పోలీస్‌ల మధ్య ఉన్న స్పష్టమైన లక్ష్మణ రేఖను దాటకుండా.. పోలీసులు చర్యలు తీసుకుంటారు. సివిల్ కేసులకు న్యాయస్థానాలు, సబ్–రిజిస్ట్రేషన్ ఆఫీసులు వంటివి ఉన్నాయి. ఎవరి అధికారాల పరిధిలో వాళ్లు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. భూ తగాదాలపై పోలీసులు, బాధితులకు సూచనలు చేసేందుకు ఇద్దరు న్యాయ సలహాదారులను నియమించారు. ఏ తరహా కేసులపై పోలీసులు జోక్యం చేసుకోవాలి, ఏ తరహా విధానాలను అనుసరించాలనే పలు అంశాలపై సూచనలు ఇస్తుంటారు. రోజుకు 15 ఇలాంటి కేసులే.. కమిషనరేట్‌లో నన్ను కలిసేందుకు రోజుకు 20 మంది సందర్శకులు వస్తే.. ఇందులో 15 మంది భూమి తగాదాల బాధితులే ఉంటున్నారు. ఇందులో 5 కేసులు న్యాయబద్ధంగా ఉంటే.. మిగిలినవి క్రిమినల్ కేసులుంటున్నాయి. బాధితులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి దిశా నిర్దేశం చేస్తున్నాం. – మహేశ్ భగవత్, సీపీ, రాచకొండ -
ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
సాక్షి, శంషాబాద్: రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నఅంతర్ రాష్ట్ర ముఠాను శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలోని నలుగురు సభ్యుల్లో సర్వేష్ సాహు, అబ్ధుల్ మాజిద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు మిశ్రా, దినేష్‌లు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి ఆరు లక్షల నగదు, ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్, ఐడి కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బులిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా సంప్రదిస్తే వారిని నమ్మొద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. కాగా, నిందితులు కేంద్ర రైల్వే సర్వీసెస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వందలాది మంది నిరుద్యోగుల నుండి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. బాధితులకు ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి నమ్మించిన నిందితులు.. ఫేక్ మెడికల్ టెస్ట్ సైతం నిర్వహించారు. రైల్వే డిపార్ట్మెంట్ నుండి మెయిల్ వచ్చినట్లు ఫేక్ ఐడితో మెయిల్స్ పంపి, ఢిల్లీ, బెంగాల్‌లలో ట్రైనింగ్ క్లాసులంటూ నమ్మించారు. నార్త్ సెంట్రల్ రైల్వే పేరుతో బాధితుల పేరిట ఫేక్ ఐడి కార్డులను సృష్టించారు. ఉద్యోగం కోసం బాధితులు రైల్వే కార్యాలయాన్ని సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. -
నకిలీ.. మకిలీ!
మేకల కళ్యాణ్ చక్రవరి రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు అలా ప్రవేశించాయో లేదో మళ్లీ నకిలీ విత్తనాల మకిలీ అంటుకుంది. ప్రతి సంవత్సరం మాది రిగానే ఈ వానాకాలంలోనూ ఈ మాయదారి విత్తనాల ముప్పు పొంచి ఉందని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్, పాలమూరు జిల్లాల్లో సోయాబీన్, కంది రైతాంగానికి నకిలీల బెడద పట్టుకోగా, ఇప్పుడిప్పుడే విత్తనాల కొనుగోళ్లు ప్రారంభించిన పత్తి రైతు కూడా ఈ నకిలీల బారిన పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ వానాకాలంలోనూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోతే అందరి కళ్లుగప్పి రాష్ట్రంలో ప్రతియేటా చెలామణి అయ్యే నకిలీ విత్తన మాఫియా యథేచ్ఛగా తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సోయా... చలే గయా! రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.70 లక్షల ఎకరాల్లో రైతులు సోయాబీన్ సాగు చేస్తుంటారు. ఇందులో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఎక్కువ సాగవుతుంది. ఇందుకు గాను 1.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ, ప్రభుత్వం వద్ద 18 వేల క్వింటాళ్లే అందుబాటులో ఉండటంతో మిగిలిన విత్తనాల కోసం రైతులు వ్యాపారుల మీద ఆధారపడాల్సి వస్తోంది. దీంతో తెలంగాణ సీడ్స్ సంస్థ నిజామాబాద్ జిల్లాలోని పలు పీఏసీఎస్‌ల ద్వారా రెండు, మూడు రకాల కంపెనీల సోయాబీన్ విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేసింది. ఇందులో, వీకేర్ అగ్రిటెక్, అక్షయ అగ్రిటెక్ జేఎస్335 రకాల విత్తనాలు 10 నుంచి 15 శాతం కూడా మొలకెత్తలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇవి నకిలీవేనని బల్లగుద్ది చెబుతున్నాయి. ప్రభుత్వ సంస్థలే మొలకెత్తని విత్తులను రైతులకు అంటగడితే పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నాయి. ఇక పాలమూరు జిల్లాలో కంది విత్తన మాఫియా తన కార్యక్రమాలను ప్రారంభించింది. అలంపూర్ ప్రాంతంలో కాలం చెల్లిన కంది విత్తన ప్యాకెట్లు బయటపడ్డట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది మార్చిలో పరీక్షించి 2019 నవంబర్ వరకు మాత్రమే గడువున్న విత్తనాలను ప్రస్తుతం రైతులకు అంటగడుతున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇవి కూడా పీఏసీఎస్‌ల ద్వారానే సబ్సిడీపై ఇస్తున్నారని, సొసైటీల్లో ఇచ్చే విత్తనాలే ఇలా ఉంటే ప్రైవేటు కంపెనీల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. జర్మినేషన్ పూర్తిస్థాయిలో లేకుండానే విత్తనాల గడువు తేదీలను మార్చి అవే విత్తనాలను రీసైక్లింగ్ చేసి మార్కెట్లో అమ్ముతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాస్‌్కఫోర్స్ అధికారులు ఏం చేస్తున్నారంటూ రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వాణిజ్య పంటల్లో మరీ నష్టం నియంత్రిత వ్యవసాయంలో భాగంగా పత్తి సాగు పెంచాలని, రైతులను ఆ మేరకు ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానంలో స్పష్టంగా పేర్కొంది. దీంతో గతేడాది కంటే ఏకంగా 10 లక్షల ఎకరాల వరకు అదనంగా పత్తి సాగు పెంచాలని నిర్ణయించింది. అందుకోసం వ్యవసాయశాఖ అధికారులు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. అయితే పెరిగే పత్తి సాగును ఆధారం చేసుకొని రైతులను మోసం చేసేందుకు అక్రమార్కులు సన్నాహాలు చేసుకుంటున్నారు. నకిలీ విత్తనాలను అంటగట్టడం, నిషేధిత బీజీ–3 విత్తనాలను విక్రయించడం వంటి చర్యలకు పాల్పడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. గతంలో కూడా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పత్తి, మిర్చి పంటలకు సంబంధించి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను విక్రయించడంతో రైతులు నష్టపోయిన అనుభవాలున్నాయి. అయితే, ఈ సందర్భాల్లో విత్తన కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగా యథేచ్ఛగా మళ్లీ మార్కెట్లోకి నకిలీ విత్తనాలు వచ్చేందుకు ఆస్కారం ఏర్పడిందని, అప్పట్లో విత్తులు అమ్మిన వ్యాపారుల నుంచి విత్తనాల రేటుకు డబుల్ రేటు రైతులకు ఇప్పించి వ్యవసాయ శాఖ చేతులు దులుపుకుందని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా వాణిజ్య పంటల విత్తనాలు నాణ్యత ఉండేలా తగిన జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోవాలని వారు కోరుతున్నారు. సమయాన్ని ఆసరాగా చేసుకుని.. గత ఆరేళ్లలో పత్తి సాగు విస్తీర్ణం ఏడాదికేడాదికి పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచడం వల్ల కూడా సాగు పెరిగిందని అంచనా వేస్తున్నారు. పత్తి మద్దతు ధర పెరుగుతుండటంతో రైతుల్లో ఆశలు మరింత రేకెత్తాయి. దీంతోపాటు ఉత్పత్తి కూడా అమాంతం పెరుగుతుండటం గమనార్హం. సకాలంలో వర్షాలు కురవడం వల్లే దిగుబడులు మరింత పెరుగుతున్నాయని వ్యవసాయ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2014–15లో పత్తి 42.32 లక్షల ఎకరాల్లో సాగైతే, 18.44 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చింది. గతేడాది ఏకంగా 54.45 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ ఏడాది ప్రభుత్వం దాన్ని ఏకంగా 65 లక్షల ఎకరాలకు పెంచాలని నిర్ణయించింది. అంటే అదనంగా 10.54 లక్షల ఎకరాలు ఈ ఏడాది సాగు కానుంది. అందుకోసం ఈసారి పత్తి విత్తన ప్యాకెట్లు 1.30 కోట్లు అవసరం పడతాయని అంచనా వేశారు. దీనికి అదనంగా మరో 10 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని కూడా అంటున్నారు. అయితే ఇప్పటివరకు దేశంలో బీజీ–1, బీజీ–2 పత్తి విత్తనానికి మాత్రమే అనుమతి ఉంది. బీజీ–2 పత్తి విత్తనం వేస్తున్నా గులాబీరంగు పురుగు ఆశిస్తుండటంతో బీజీ–3 రంగప్రవేశం చేసింది. బీజీ–2కు బీజీ–3 పత్తి విత్తనానికి తేడా గుర్తించలేని పరిస్థితి ఉండటంతో దీన్నే అవకాశంగా తీసుకొని కంపెనీలు, వ్యాపారులు నిషేధిత బీజీ–3ని రైతులకు అంటగడుతున్నారు. ఏడాదికేడాది బీజీ–3 సాగు చాపకింద నీరులా పెరుగుతోంది. రాష్ట్రంలో పత్తి చేలల్లో బీజీ–3 ఉన్నట్లు గతంలోనే నిర్ధారణకు వచ్చారు. అయితే మనదేశంలో బీజీ–3కి అనుమతి నిరాకరించడంతో దీన్ని అడ్డదారిలో విస్తరించే పనిలో కంపెనీలు నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులు, దళారులను గుర్తించడం, ఆయా గోదాములను పసిగట్టడం ద్వారా పత్తి, మిర్చి లాంటి వాణిజ్య పంటల రైతాంగం నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘టాస్్క’లోనే ఉన్నాం: వ్యవసాయ శాఖ తాము అప్రమత్తంగానే ఉన్నామని వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి చెప్పారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్‌్కఫోర్స్ కమిటీలు క్రియాశీలంగానే పనిచేస్తున్నాయన్నారు. ఈ ఏడాది జూన్ 19 నాటికి నకిలీ విత్తనాలకు సంబంధించి 15 మందిపై 60 కేసులు, 122 మందిపై 420 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇందులో 10,705 క్వింటాళ్ల పత్తి విత్తనాలను సీజ్ చేశామని, వీటి విలువ రూ.4 కోట్లకు పైగానే ఉంటుందని వెల్లడించారు. మరో రూ.4 కోట్లకు పైగా విలువ గల పలు రకాల పంటల విత్తనాలను అదుపులోకి తీసుకుని వాటికి సంబంధించి విచారణ జరుపుతున్నామని చెప్పారు. నకిలీ ‘మార్గాలివే’... నకిలీ విత్తన మాఫియా తన కార్యకలాపాల కోసం పలు రకాలుగా విత్తనాలు, వాటి ప్యాకెట్లను ఉపయోగించుకుంటోంది. ప్యాక్ చేయకుండా విత్తనాలు అమ్మడం, జీఈఏసీ అనుమతి లేకుండా విక్రయించడం, గడువు ముగిసిన విత్తనాలను రీసైక్లింగ్ చేయడం, నకిలీ విత్తనాలను స్థానికంగా తయారు చేయడం, లేబుళ్లు మార్చడం, స్టాక్‌లో తేడాలుండటం, స్టాక్ రిజిస్టర్లలో విత్తనాలను నమోదు చేయకపోవడం, అనధికారికంగా విత్తనాలను ప్యాక్ చేయడం లాంటి మార్గాల ద్వారా నకిలీ విత్తనాలను మార్కెట్లోకి పంపుతుంటారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వీటి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, అన్నింటినీ సరిచూసుకున్న తర్వాతే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు గంగుల నరేందర్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వడ్యాట్ గ్రామానికి చెందిన ఈయన మోర్తాడ్ పీఏసీఎస్‌లో సబ్సిడీపై సోయాబీన్ విత్తనాలు కొనుగోలు చేసి పది రోజుల కింద నాటాడు. రెండెకరాలకు విత్తనం కోసం రూ.3,600, రోటవేటర్ కోసం రూ.1,200, అడుగు మందు కోసం రూ.950, డ్రిప్ పైప్‌లను వేయడం కోసం కూలీలకు రూ.వెయ్యి చొప్పున ఖర్చు చేశాడు. రూ.6,750 ఖర్చు చేసి పొలంలో ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలు విత్తితే అవి తీరా మొలకరాలేదు. దీనిపై వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తే పొలం దున్నేసి మళ్లీ విత్తుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఇప్పుడు ఈ రైతు మళ్లీ సోయా విత్తులు పెట్టాలంటే రూ.8,000 వరకు ఖర్చవుతుంది. -
మసాజ్ సెంటర్‌పై ఎస్ఓటీ పోలీసుల దాడి
మల్లాపూర్: మసాజ్ సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకొని నాచారం పోలీసులకు అప్పగించారు. మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ నవీన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాచారం పోస్టాఫీస్ సమీపంలో శ్రీరామ్ అనే వ్యక్తి ఎస్సెన్జ్ స్పా ఎన్ సెలూన్ నిర్వహిస్తున్నాడు. కొందరు యువతలను రప్పించి క్రాస్ మసాజ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి నిర్వాహకులు శ్రీరామ్, మణికంఠ, రాజేష్‌తో పాటు నాగేశ్వర్రావు, సంతోష్, మరో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.7570 నగదు, బిల్ బుక్స్, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని నాచారం పోలీసులకు అప్పగించారు. -
టెక్నాలజీతో మోసాలు.. ముగ్గురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : టెక్నాలజీ సహాయంతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు టెక్నాలజీ సహాయంతో మొబైల్ కొనుగోలు చేసేటప్పడు ఆన్లైన్ ద్వారా డబ్బులు చెలించినట్టు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. వీరి వద్ద నుంచి పోలీసులు 5 లక్షల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. ఈ కేసులో అరెస్టయిన నిందితులు గతంలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. వీరిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు ఐదు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని తెలిపారు. టెక్నాలజీ ఉపయోగించి వీరు మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు వీరు 9 కేసుల్లో నిందితులుగా ఉన్నారని అన్నారు. నిందితుల దగ్గర నుంచి 11 ఒప్పో, 8 వివో, 2 సామ్సంగ్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలిచామని తెలిపారు. -
బాచుపల్లిలో భారీగా డ్రగ్స్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్వోటీ పోలీసులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 200 లీటర్ల బెంజిల్ సైనైడ్, 400 కేజీల ఆల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మత్తు పదార్థాలను తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నకిలీ కుర్కురే కంపెనీ సీజ్.. ఓనర్ అరెస్ట్
శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలో నకిలీ కంపెనీలు, వాటి ఉత్పత్తులపై ఎస్ఓటీ పోలీసులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా శంషాబాద్‌లో నకిలీ కుర్కురే కంపనీపై పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడులు చేశారు. నకిలీ కుర్కురే కంపెనీని సీజ్ చేసిన ఎస్ఓటీ పోలీసులు కంపెనీ యజమాని మహ్మద్ ఇర్ఫాన్‌ను అరెస్టు చేసి శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ కంపెనీ రెండు లక్షల విలువ చేసే ఉత్పత్తులు చేస్తున్నట్లు సమాచారం. -
రూ.10 లక్షల విలువైన నకిలీ కారం పట్టివేత
హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ కారం తయారు చేస్తున్న గోదాం పై ఎస్ఓటి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. బూజు పట్టిన మిరపకాయలతో కారం తయారు చేస్తూ, చెక్క పౌడర్, అయిల్ కలిపి కారం తయారు చేస్తున్నారని సమాచారం రవడంతో ఎస్ఓటి పోలీసులు సోదాలు నిర్వహించారు. పట్టుబడిన కారం విలువ రూ.10లక్షల విలువ ఉంటుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం!
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నడుపుతున్న మసాజ్ సెంటర్‌పై పోలీసులు దాడి చేసి 9మందిని అదుపులోకి తీసుకున్నారు. పనామా సెంటర్ సమీపంలోని ఒక కాంప్లెక్స్‌లో గుట్టు చప్పుడు కాకుండా మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నడుపుతున్నట్లు ఎల్బీ నగర్ జోన్ ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు వారు బుధవారం సాయంత్రం అకస్మికంగా దాడి చేశారు. తనిఖీల్లో భాగంగా సెంటర్ నిర్వాహకుడు సహా 9 మందిని అరెస్టు చేశారు. పట్టుబడ్డవారిలో ముగ్గురు యువతులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.4,050 నగదు స్వాధీనం చేసుకుని నిందితులను వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
సూడో ఎస్ఓటీ పోలీసుల అరెస్ట్
హైదరాబాద్: వ్యాపారులను బెదిరించి డబ్బులు గుంజుతున్న ముగ్గురు నకిలీ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు అయ్యారు. కోమటి మధు, శ్రీ రామోజి జానయ్యచారి, జంగాల మహేష్ అనే ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ పంపులు, రేషన్ డీలర్లు, ఆస్పత్రులు, చిల్లర వ్యాపారులను ఎస్ఓటీ పోలీసుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరు గతంలో హోంగార్డు ఉద్యోగాలు చేశారు. విధుల నుంచి తప్పించడంతో ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. శుక్రవారం ఎల్బీ నగర్‌లోని పెట్రోల్ పంపు వద్దకు డబ్బుల వసూలు కోసం వీరు రాగా తమకందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు వలపన్ని వీరిని అరెస్టు చేశారు. తరచుగా ఎస్ఓటీ పోలీసులు దాడులు జరుపుతున్న వార్తలను పేపర్లు, టీవీ చానెల్స్‌లో చూస్తూ వీరు తమ అక్రమార్జనకు ఈ దారిని ఎంచుకున్నారని రాచకొండ పోలీసులు తెలిపారు. వీరినుంచి రూ.1550 నగదు, 5 సెల్ఫోన్లను, మధు నుంచి రెండు హోంగార్డు గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. -
19 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్ : నగరంలో బైలార్దేవులపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఇంటిపై పోలీసులు ఆదివారం దాడి చేసి... 19 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 92 వేల నగదుతోపాటు 20 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న పేకాటపై ఎస్వోటీ పోలీసులకు ఆగంతకులు సమాచారం అందించారు. దీంతో ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. -
వ్యభిచార గృహంపై దాడి.. నలుగురి అరెస్ట్
హైదరాబాద్: నగరంలో వ్యభిచార గృహాలపై పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారు. నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోషిమాత నగర్‌లోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం గృహం నడుపుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే స్పందించి రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ముగ్గురు మహిళలతో పాటు దీంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
మసాజ్ సెంటర్‌పై దాడి: ఆరుగురి అరెస్ట్
హైదరాబాద్ : కేపీహెచ్‌బీ కాలనీలోని గ్రీన్స్పా మసాజ్ సెంటర్‌పై ఎస్వోటీ పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా కస్టమర్, నలుగురు మహిళలతోపాటు నిర్వాహకురాలని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 6,300 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేలుడు పదార్థాలు స్వాధీనం
అనుమతులు లేని వెంచర్లో అక్రమంగా డిటోనేటర్స్‌తో పేలుళ్లు జరుపుతుండటాన్ని గుర్తించిన ఎస్వోటీ పోలీసులు భారీగా చేసుకున్నారు. నగరంలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచర్లలో అనుమతి లేని వెంచర్లో అక్రమంగా పేలుళ్లు జరుపుంతుండటంతో.. గురువారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. పేలుళ్లు నిర్విహ స్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 28 డిటోనేటర్స్, 50 కేజీల క్యాల్షియం హైడ్రాక్సైడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
పేకాటస్థావరం పై పోలీసుల దాడి..
-11 మంది అరెస్ట్ హైదరాబాద్‌సిటీ మల్కాజిగిరిలో ఓ పేకాటస్థావరంపై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడిచేశారు. పేకాటాడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి రూ.76 వేల నగదు,11 సెల్ఫోన్లు, ఒక సీసీ కెమెరా, ఒక డిజిటల్ వీడియో రికార్డర్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
పేకాట స్థావరం పై దాడి చేసినే పోలీసులు పది మంది పేకాట రాయుళ్లను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 8 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గగన్‌పహాడ్‌లో బుధవారం చోటుచేసకుంది. గగన్‌పహాడ్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు పదిమంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. -
బేకరీలో బెల్ట్ షాపు
బోడుప్పల్: పేరుకు బేకరీ..కానీ లోపల జరిగేది మద్యం వ్యాపారం..నగరంలోని బోడుప్పల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం బాటిల్స్ పెట్టి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సోమవారం ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న 51 బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఆయనను మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. ఎస్ఐ నాగయ్య సమాచారం మేరకు... పర్వతాపూర్‌కు చెందిన సుర్వి రవిగౌడ్ స్థానికంగా బేకరీ నిర్వహిస్తున్నాడు. మద్యం దుకాణాలను నుంచి బాటిల్స్ తీసుకొచ్చి బేకరిలో వాటిని విక్రయిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు సోమవారం ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల దాడిలో 51 మద్యం బాటిల్స్ దొరికాయి. దీంతో అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
పేకాట స్థావరంపై ఎస్వోటీ దాడి
హైదరాబాద్: సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హుడా కాంప్లెక్స్ ఆదిత్య అపార్టుమెంట్‌లోని ఓ ప్లాట్‌పై ఎస్వోటీ పోలీసులు బుధవారం సాయంత్రం దాడి చేశారు. ఈ సందర్భంగా గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.3,770తోపాటు ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సరూర్‌నగర్ పోలీసులకు అప్పగించారు. -
డ్రగ్స్ ముఠాపై ఎస్ఓటీ పోలీసుల దాడులు
హైదరాబాద్: నిషేధిత డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ముఠాపై సైబరాబాద్‌లో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. మాదాపూర్‌లోని సన్‌సిటీ లో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పంపిణీ చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులో ఇద్దరిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. గత 2013 నుంచి గోవా, బెంగళూరు, హైదరాబాద్ వంటి పలు నగరాల్లో ఈ ముఠా నిషేధిత మాదక పదార్థాలను పంపిణీ చేస్తోంది. ఈ ముఠా సభ్యుల్లో నైజీరియా నివాసి, సిమాన్ సహా పలువురు నిషేధిత మాదక పదార్థాలను పలుమార్లు హైదరాబాద్ నగరంలో విక్రయించినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 44 గ్రాముల మాదక పదార్థాలు 50 చిన్న ప్యాకెట్లతో పాటు నగదు 30 వేల రూపాయలు, రెండు మొబైల్ ఫోన్లు, రెండు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముగ్గురిలో ఒకరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. రాజేంద్ర నగర్ పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు. -
క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై దాడి: బుకీల అరెస్టు
హైదరాబాద్: రాజేంద్రనగర్ మండలం హైదర్షాకోట్ గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై బుధవారం అర్థరాత్రి ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు బుకీలను అదుపులోకి తీసుకుని, రూ.87వేలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 8 సెల్ఫోన్లు, ఒక కారు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకుని, నిందితులను నార్సింగి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గడువు తీరిన చాక్లెట్ల రూపు మార్చి..
రాజేంద్రనగర్ (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సులేమాన్‌నగర్‌లో కల్తీ చాక్లెట్ల తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. పోలీసుల కథనం మేరకు... అఫ్సర్ అనే వ్యక్తి గడువు తీరిపోయిన చాక్లెట్లను ఏజెన్సీల ద్వారా సేకరించి సులేమాన్‌నగర్‌లోని గోదాముకు తరలించేవాడు. అనంతరం వివిధ రసాయనాలను వినియోగించి చాక్లెట్లను తయారు చేయడం ప్రారంభించారు. ప్రముఖ కంపెనీలతో పాటు లోకల్ కంపెనీల పేరు మీద భారీ యంత్రాలతో నిమిషాలలోనే వేలాది చాక్లెట్లను తయారు చేస్తున్నాడు. దీనిపై స్థానికులు ఎస్ఓటి పోలీసులకు సమాచారం అందించగా... ఈరోజు మధ్యాహ్నం గోదాములో పోలీసులు సోదాలు నిర్వహించి అఫ్సర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూ.10 లక్షల విలువైన ముడిసరుకు, రెండు భారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. -
దాబాలపై ఎస్వోటీ పోలీసుల దాడి
రంగారెడ్డి: రంగారెడ్డి యాచారం మండలం తమ్మలోనిగూడ గేట్ సమీపంలో ఉన్న ఓ దాబాలపై సోమవారం ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. దాబాలో పేకాటాడుతున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 27 వేల నగదుతో పాటు 8 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
130 లీటర్ల నీలి కిరోసిన్ స్వాధీనం
ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరామల్ గూడ లో అక్రమంగా నిల్వ ఉంచిన నీలి కిరోసిన్ పోలీసులు ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా రేషన్ డీలర్ సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారం తో ఎస్ ఓటీ పోలీసులు దాడి చేసి 130 లీటర్ల నీలి కిరోసిన్ తో పాటు ఒక లారీ, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. -
రంగారెడ్డి జిల్లాలో ఎస్వోటీ తనిఖీలు
మైలార్దేవ్ పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి- శాస్త్రిపురంలోని ఓ గోడౌన్‌పై ఎస్ఓటీ పోలీసులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 4 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, ఓ డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్వోటీ పోలీస్ పేరుతో వసూళ్లు: కానిస్టేబుల్ అరెస్ట్
హైదరాబాద్: ఎస్వోటీ పోలీసుల పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న ఓ కానిస్టేబుల్‌ను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న గణేష్ గత కొద్ది రోజులుగా ఎస్వోటీ పోలీసునని చెప్పి మామూళ్లు వసూలు చేస్తున్నాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న ఎస్వోటీ పోలీసులు అతని పై నిఘా పెంచారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిని ఎస్వోటీ పోలీసునని బెదిరించి బలవంతంగా డబ్బులు తీసుకుంటున్న సమయంలో రంగ ప్రవేశం చేసిన ఎస్వోటీ పోలీసులు గణేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం విచారణ చేపడుతున్నారు. -
హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి, 60మంది అరెస్ట్
-
పెద్ద ఎత్తున రేషన్ సరుకుల పట్టివేత
పహాడీషరీఫ్: రేషన్ బియ్యాన్ని నల్లబజార్‌కు తరలించేందుకు నిల్వ ఉంచిన గోదాముపై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు బుధవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రేషన్ సరుకులను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఇసామియా బజార్‌కు చెందిన శంకర్ లాల్ అనే వ్యక్తి సరూర్‌నగర్ మండలం కొత్తపేట పంచాయతీ ఫాతిమానగర్‌లో ఓ గోదాము తీసుకొని రేషన్ సరుకులను నిల్వ ఉంచుతున్నాడు. బాలాపూర్‌కు చెందిన మధు కిరణ్, రాంబాగ్‌కు చెందిన రాజు కమల్ అనే వారు నగరంలోని వివిధ రేషన్ దుకాణాల నుంచి సరుకులు తీసుకొచ్చి ఇక్కడ వేయడంతో పాటు, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుంటారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్వోటీ ఇన్స్పెక్టర్లు నర్సింగ్‌రావు, రంగ స్వామి, ఎస్సైలు ఆంజనేయులు, రమేష్ బుధవారం సాయంత్రం ఆ గోదాముపై దాడులు చేశారు. ఈ దాడులలో శంకర్ లాల్, మధుకిరణ్, రాజు కమల్‌తో పాటు డీసీఎం డ్రైవర్ గఫార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు గోదాములో నిల్వ ఉంచిన 228 క్వింటాళ్ల బియ్యం, 21 క్వింటాళ్ల చక్కెర, 17.5 క్వింటాళ్ల గోధుమలు, మూడున్నర క్వింటాళ్ల కందిపప్పు, రెండు క్వింటాళ్ల ఉప్పు, రూ. లక్ష నగదు, నాలుగు సెల్ఫోన్లు, డీసీఎం, స్కూటీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు. -
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు
హైదరాబాద్ : మాదాపూర్ పత్రికా నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా ఇద్దరు యువతులు, నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందటంతో ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. పట్టుబడ్డవారిలో ఓ విదేశీ యువతి ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బాల కార్మికులున్నారంటూ సెటిల్మెంట్!
ఎస్ఓటీ పోలీసులమంటూ దబాయింపు దబ్బులు తీసుకొని వదిలేసిన వైనం శంషాబాద్ : హోటల్లో బాల కార్మికులున్నారని ఎస్ఓటీ పోలీసులుగా పరిచయం చేసుకున్న నలుగురు వ్యక్తులు యజమాని నుంచి డబ్బులు దండుకున్నారు. ఈ సంఘటన శనివారం శంషాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. శంషాబాద్ ప్రధాన చౌరస్తాలో కొనసాగుతున్న ఓ శాఖహార హోటల్ నుంచి పద్దెనిమిదేళ్లు నిండిన ముగ్గురు సిబ్బందితో పాటు కౌంటర్‌పై కూర్చున్న వ్యక్తిని శనివారం ఉదయం నలుగురు వ్యక్తులు ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న మైదానంలోని చెట్టుకిందికి తీసుకెళ్లారు. తాము ఎస్ఓటీ పోలీసులమని వారు పరిచయం చేసుకున్నారు. హోటల్లో పనిచేస్తున్న వారు బాలకార్మికులంటూ దబాయించారు. వారిని కనీసం స్టేషన్‌లోనికి తీసుకెళ్లకుండా చెట్టుకిందే బేరసారాలాడారు. అయితే, హోటల్ నుంచి తీసుకెళ్లిన సిబ్బంది అంతా కూడా పద్దెనిమిదేళ్ల వయస్సు పైబడిన వారే కావడంతో చేసేది లేక ఎంతో కొంత ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోటల్ యజమానిని దబాయించడంతో అతడు కొంత మొత్తాన్ని ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చేశాడు. తాము బాలకార్మికులం కాకపోయినా బెదిరించి తీసుకెళ్లారని హోటల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తాము తప్పు చేసి ఉంటే పోలీస్‌స్టేషన్‌లోకి తీసుకెళ్లి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి కాని, దబాయించి డబ్బులు దండుకోవడం ఏంటి..? అని వారు వాపోయారు. కాగా, హోటల్లో బాలకార్మికులు ఉన్నారంటూ పోలీస్‌స్టేషన్ ఆవరణ వరకు తీసుకెళ్లింది ఇంతకు పోలీసులేనా లేక ఇతరులా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం శనివారం శంషాబాద్ పట్టణంలో చర్చనీయాంశమైంది. -
'బాహుబలి' బ్లాక్ టికెట్లు స్వాధీనం
చైతన్యపురి (హైదరాబాద్) : బాహుబలి సినిమా టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గురువారం సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్‌లోని రెండు థియేటర్లపై దాడి చేశారు. ఇన్స్పెక్టర్ నర్సింగ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపేట మహాలక్ష్మీ థియేటర్‌పై దాడి చేసి మొత్తం 1275 టికెట్లు, రూ.95,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. థియేటర్ మేనేజర్ విక్రంను చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. థియేటర్ నిర్వాహకుడు సాంబశివరావు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే దిల్‌సుఖ్‌నగర్‌లోని మెగా థియేటర్ ఆవరణలో బ్లాక్ టికెట్లు అమ్ముతున్న పి.ఆంజనేయులు (37), ఎల్.కృష్ణ (30)లను అదుపులోకి తీసుకుని 66 టికెట్లు, రూ.2820 నగదును స్వాధీనం చేసుకున్నారు. థియేటర్ మేనేజర్ సత్యనారాయణగౌడ్‌తో పాటు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం సరూర్‌నగర్ పోలీసులకు అప్పగించారు. -
ప్రత్యర్థుల అంతానికి పథకం
- ఘరానా రౌడీషీటర్ అరెస్టు - రెండు తపంచాల స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: తన ప్రత్యర్థులను అంతం చేసేందుకు పేరు మోసిన ఓ రౌడీషీటర్ రెండు తపంచాలను సిద్ధం చేసుకున్నాడు. వెస్ట్‌జోన్ ఎస్ఓటీ పోలీసులు సదరు రౌడీషీటర్‌ను అరెస్టు చేసి తపంచాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫతేనగర్‌కు చెందిన తడకల లక్ష్మణ్‌గౌడ్ బోయిన్‌పల్లిలో అర్వింద్ అనే వ్యక్తి వద్ద కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో మద్యానికి బానిసైన లక్ష్మణ్‌కు నేరగాళ్లతో సంబంధాలు ఏర్పడ్డాయి. డ్రైవర్ వృత్తి ద్వారా వచ్చే జీతం డబ్బు వ్యసనాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు సుపారీ తీసుకొని తన సహచరులతో కలిసి నేరాలు చేయడం మొదలెట్టాడు. దీంతో 1996లో సనత్‌నగర్ పోలీసులు లక్ష్మణ్గౌడ్పై రౌడీషీట్ తెరిచారు. ఇదీ నేరచరిత్ర... నార్సింగి నివాసి కృష్ణను హత్య చేసేందుకు అదే ప్రాంతానికి చెందిన కమ్మరి కృష్ణ.. లక్ష్మణ్‌కు రూ. 20 వేల సుపారీ ఇచ్చాడు. ఆ తర్వాత బోయిన్‌పల్లికి చెందిన కన్నారావుతో ఒప్పందం చేసుకొని మెదక్ జిల్లా కుకూనూర్పల్లి ఠాణా పరిధిలో రమేశ్ అనే వ్యక్తిని లక్ష్మణ్ సు పారీ హత్య చేసి... వేలల్లో డబ్బు తీసుకున్నాడు. కర్నూల్ పట్టణంలో మూర్తిని హత్య చేసేందుకు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. ఆ తర్వాత తన యజమాని అర్వింద్‌ను మోసం చేసి రూ.5 లక్షలను సొంతానికి వాడుకున్నాడు. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండే రౌడీషీటర్లు రవీంద్రచారి, ప్రశాంత్‌లతో ఆర్థిక వివాదాలు రావడంతో వారిని హత్య చేయాలని లక్ష్మణ్ నిర్ణయించుకున్నాడు. ఇందులో భా గంగా ఐదు నెలల క్రితం యూపీలోని పాట్నా వెళ్లి రెండు దేశవాళీ తుపాకులు కొనుగోలు చేశాడు. కాగా, రౌడీషీటర్లు రవీంద్రచారి, ప్రశాంత్‌ల హత్యకు లక్ష్మణ్ పథకం పన్నాడని వెస్ట్‌జోన్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో అతడి కదలికలపై నిఘా పెట్టారు. బుధ వారం ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ రామచంద్రారెడ్డి నేతృ త్వంలో ఇన్స్పెక్టర్లు గురురాఘవేంద్ర, వెంకట్‌రెడ్డిల బృందం లక్ష్మణ్‌ను పట్టుకుంది. అతడి నుంచి రెండు తపంచాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. -
అల్లం ఫ్యాక్టరీపై ఎస్వోటీ దాడి
రాజేంద్రనగర్ ( హైదరాబాద్) : నకిలీ అల్లం పచ్చడిని తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీపై ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఒక ఫ్యాక్టరీలో నకిలీ అల్లం పచ్చడి తయారు చేస్తున్నట్లు సోమవారం పోలీసులకు సమాచారం అందింది. దాంతో స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు దాడి చేసి రూ. 15 లక్షలు విలువ చేసే అల్లంను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఫ్యాక్టరీ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యభిచారం కేసులో బంగ్లాదేశీ యువతులు అరెస్ట్
రంగారెడ్డి: బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు యువతులు వ్యభిచారం చేస్తూ గురువారం ఎస్ఓటీ పోలీసులకు పట్టుబట్టారు. వారితో మరో యువకుడ్ని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.18వేల నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరు బంగ్లాదేశ్ యువతులు దొంగ పాస్‌పోర్టు కలిగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. (వనస్థలిపురం) -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
* 14.42 లక్షల రూపాయలతో పాటు * మారణాయుధాలు, డమ్మీ పిస్తోల్లు,వాహనాలు స్వాధీనం * ప్రధాన బుకీ పరార్ మల్కాజిగిరి(హైదరాబాద్‌సిటీ) : మల్కాజిగిరి: ప్రపంచ క్రికెట్ కప్ టోర్నీ సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠా ఆటకు ఎస్ఓటీ పోలీసులు చెక్ పెట్టారు. ముఠాలోని ఇద్దరు నిర్వాహకులతో పాటు ముగ్గురు కలెక్షన్ ఏజెంట్లు, బెట్టింగ్‌లో పాల్గొన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. బుధవారం మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఓటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్ఆర్ కడపజిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహ్మద్ గౌస్ ఐదేళ్ల క్రితం మౌలాలి ప్రాంతానికి వచ్చి ఏపీఐఐసీ కాలనీలోని వైభవ్ అపార్ట్మెంట్ పెంట్‌హౌస్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయాల్లో బెట్టింగ్ నిర్వహిస్తూ నగరంలోనే ప్రధాన బుకీగా గౌస్ పేరు పొందాడు. ఇటీవల ఎస్ఓటీ టీం వనస్థలిపురంలో బుకీతో పాటు బెట్టింగ్‌లో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసినపుడు గౌస్ పై కేసు నమోదైంది. అతను ఉంటున్న చిరునామా పక్కాగా తెలుసుకున్న ఎస్ఓటీ విభాగం ఇన్స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, వి.ఉమేందర్‌లు బుధవారం పెంట్ హౌస్ పై దాడి చేశారు. ఆ సమయంలో ప్రధాన బుకీ గౌస్ కుమారుడు సివిల్ ఇంజనీర్ మహ్మద్ అలి(25), గ్రాఫిక్ వర్క్ చేసే మరో కుమారుడు షౌకత్ అలి(22) తో పాటు పంటర్స్( బెట్టింగ్ చేసేవారు) నుంచి డబ్బులు కలెక్షన్ చేసే ఏజెంట్లు కుషాయిగూడకు చెందిన శ్రీనివాస్(29),ఏపీఐఐసీ కాలనీకి చెందిన వాహీద్(39), సలీం(39) తో పాటు బెట్టింగ్‌లో పాల్గొన్న నాగారంకు చెందిన మోకు జగన్మోహన్రెడ్డి(46), కుషాయిగూడకు చెందిన వీరేష్(33), కాప్రాకు చెందిన దీపక్(32)లను అరెస్ట్ చేశారు.గౌస్ కుమారుల నుంచి 12,82,000 ఏజెంట్లు, బెట్టింగ్‌లో పాల్గొన్న వారి నుంచి 1,60,000 రూ మొత్తం 14.42 లక్షలు, రెండు తల్వార్లు, రెండు డమ్మీ పిస్టోల్స్, ఒక ఎయిర్‌గన్, ఒక ల్యాప్‌టాప్, ఒక ట్యాబ్,18 మొబైల్స్, రెండు వాహనాలను స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్‌కు తరలించారు. ప్రధాన బుకీ గౌస్‌తో పాటు అతని అనుచరులు ఆరుగురు పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు. గౌస్ ఇతర రాష్ట్రాలో కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని ప్రధానంగా విధ్యార్థులు, చిరు వ్యాపారులను ఈ బెట్టింగ్ లోకి ఆకర్షిస్తాడని డీసీపీ తెలిపారు. బెట్టింగ్‌లో ఓడిపోయిన వారు గొడవకు దిగితే బెదిరించడానికి కత్తులు, పిస్టోల్స్ ఉపయోగించేవాడన్నారు. తనకు ఉన్న డీడీ కాలనీలో విలాసవంతమైన ఫ్లాట్, దమ్మాయిగూడలో గెస్ట్గౌస్ లో కూడా బెట్టింగ్ నిర్వహించేవాడని ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఎస్ఓటీ ఇన్స్పెక్టర్లతో పాటుసిబ్బంది రాములు, ఆంజనేయులును అభినందిస్తున్నామని రివార్డు కోసం సిఫార్స్ చేస్తామన్నారు. -
హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి, 17మంది అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని పలు హుక్కా సెంటర్లు నిబంధనలు పాటించడంలేదని ఇటీవల ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫలితంగా గడిచిన రెండు నెలల కాలంలో హుక్కా సెంటర్లపై 40 కేసులు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో అనుమతి లేకుండా నడుపుతున్న హుక్కా సెంటర్లపై ఎస్వోటీ పోలీసులు సోమవారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు హుక్కా సెంటర్లపై దాడులు నిర్వహించినట్టు తెలిపారు. పట్టబడిన వారిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. -
'ఆర్ఆర్సీ' మాస్ కాపీయింగ్ కేసులో ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: ఆర్ఆర్సీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పాల్పడిన ముగ్గురిని స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారి మశ్చేందర్తోపాటు సీనియర్ రైల్వేశాఖ అధికారి రాజశేఖర్‌తో పాటుమరో వ్యక్తిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రైల్వేశాఖలో గ్రేడ్-1 ఆఫీసర్‌గా పనిచేస్తున్న మశ్చేందర్ 2008, 2010 ఆర్ఆర్బీ, వీఆర్ఓ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీకి విఫలయత్నం చేశాడు. కాగా, ఈ కేసులో మరో రైల్వేశాఖ ఉద్యోగి మహేందర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. గత నెల్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బి) గ్రూప్-బి పరీక్షను హైటెక్ పద్దతిలో మాస్ కాపీయింగ్ చేస్తున్న 34 మందితో కూడిన ముఠాను స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రైల్వే క్వార్టర్స్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఈ ముఠా మానిటరింగ్ చేస్తూ మాస్ కాపీయింగ్ కు పాల్పడింది. అప్పట్నుంచీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మశ్చేందర్ ను తాజాగా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
ఆర్ఆర్సీ కేసులో పురోగతి
-
కుషాయిగూడలో ఐదుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్: కుషాయిగూడ లక్ష్మీనరసింహ కాలనీలో బుధవారం ఎస్ఓటీ పోలీసులు పేకాటస్థావరాలపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారితోపాటు 5 సెల్ఫోన్లు, 20వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేశారు. -
నకిలీ ఇంజిన్ ఆయిల్ కేంద్రంపై పోలీసుల దాడులు
రంగారెడ్డి: జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం రామదాసుపల్లిలో ఆదివారం పోలీసులు దాడులు జరిపారు. నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారు చేస్తున్న కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 42 డ్రమ్ముల నకిలీ ఇంజిన్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
బ్లాక్ మార్కెట్‌కు గ్యాస్ సిలిండర్లు
ఆటోనగర్, న్యూస్‌లైన్: ప్రజలకు పంపిణీ చేయాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చర్లపల్లి నుంచి కరీంనగర్‌కు వెళ్లాల్సిన 279 హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల లారీ హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ గ్రామంలో డంప్ చేసేందుకు వెళ్లింది. దీనిపై సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అక్కడికి చేరుకుని లారీడ్రైవర్ గట్టయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, కరీంనగర్‌లోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ డీలర్ శ్రీని వాస్ ఇంజాపూర్ గ్రామానికి చెందిన సంజీవరెడ్డికి వీటిని అప్పగించాలని చెప్పాడని వారికి చెప్పాడు. ఈ సిలిండర్లను ఇక్కడి నుంచి సింగరేణికాలనీలో ఉన్న స్వామినాయక్ ఇతర ప్రాంతాలకు రీఫిలింగ్ చేస్తూ పెద్ద ఎత్తున అక్రమ సంపాదనకు అల వాటు పడినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. పో లీసులు లారీతో పాటు ఒక ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు. లారీడ్రైవర్ గట్టయ్య, ఆటోడ్రైవర్ వాసు, స్వామినాయక్‌లను అదుపులోకి తీసుకోగా, సంజీవరెడ్డి, కరీంనగర్ గ్యాస్ డీలర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.