క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
* 14.42 లక్షల రూపాయలతో పాటు
* మారణాయుధాలు, డమ్మీ పిస్తోల్లు,వాహనాలు స్వాధీనం
* ప్రధాన బుకీ పరార్
మల్కాజిగిరి(హైదరాబాద్‌సిటీ) : మల్కాజిగిరి: ప్రపంచ క్రికెట్ కప్ టోర్నీ సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠా ఆటకు ఎస్‌ఓటీ పోలీసులు చెక్ పెట్టారు. ముఠాలోని ఇద్దరు నిర్వాహకులతో పాటు ముగ్గురు కలెక్షన్ ఏజెంట్లు, బెట్టింగ్‌లో పాల్గొన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. బుధవారం మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఓటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్‌ఆర్ కడపజిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహ్మద్ గౌస్ ఐదేళ్ల క్రితం మౌలాలి ప్రాంతానికి వచ్చి ఏపీఐఐసీ కాలనీలోని వైభవ్ అపార్ట్‌మెంట్ పెంట్‌హౌస్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయాల్లో బెట్టింగ్ నిర్వహిస్తూ నగరంలోనే ప్రధాన బుకీగా గౌస్ పేరు పొందాడు. ఇటీవల ఎస్‌ఓటీ టీం వనస్థలిపురంలో బుకీతో పాటు బెట్టింగ్‌లో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసినపుడు గౌస్ పై కేసు నమోదైంది. అతను ఉంటున్న చిరునామా పక్కాగా తెలుసుకున్న ఎస్‌ఓటీ విభాగం ఇన్‌స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, వి.ఉమేందర్‌లు బుధవారం పెంట్ హౌస్ పై దాడి చేశారు.
ఆ సమయంలో ప్రధాన బుకీ గౌస్ కుమారుడు సివిల్ ఇంజనీర్ మహ్మద్ అలి(25), గ్రాఫిక్ వర్క్ చేసే మరో కుమారుడు షౌకత్ అలి(22) తో పాటు పంటర్స్( బెట్టింగ్ చేసేవారు) నుంచి డబ్బులు కలెక్షన్ చేసే ఏజెంట్లు కుషాయిగూడకు చెందిన శ్రీనివాస్(29),ఏపీఐఐసీ కాలనీకి చెందిన వాహీద్(39), సలీం(39) తో పాటు బెట్టింగ్‌లో పాల్గొన్న నాగారంకు చెందిన మోకు జగన్‌మోహన్‌రెడ్డి(46), కుషాయిగూడకు చెందిన వీరేష్(33), కాప్రాకు చెందిన దీపక్(32)లను అరెస్ట్ చేశారు.గౌస్ కుమారుల నుంచి 12,82,000 ఏజెంట్లు, బెట్టింగ్‌లో పాల్గొన్న వారి నుంచి 1,60,000 రూ మొత్తం 14.42 లక్షలు, రెండు తల్వార్లు, రెండు డమ్మీ పిస్టోల్స్, ఒక ఎయిర్‌గన్, ఒక ల్యాప్‌టాప్, ఒక ట్యాబ్,18 మొబైల్స్, రెండు వాహనాలను స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్‌కు తరలించారు.
ప్రధాన బుకీ గౌస్‌తో పాటు అతని అనుచరులు ఆరుగురు పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు. గౌస్ ఇతర రాష్ట్రాలో కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని ప్రధానంగా విధ్యార్థులు, చిరు వ్యాపారులను ఈ బెట్టింగ్ లోకి ఆకర్షిస్తాడని డీసీపీ తెలిపారు. బెట్టింగ్‌లో ఓడిపోయిన వారు గొడవకు దిగితే బెదిరించడానికి కత్తులు, పిస్టోల్స్ ఉపయోగించేవాడన్నారు. తనకు ఉన్న డీడీ కాలనీలో విలాసవంతమైన ఫ్లాట్, దమ్మాయిగూడలో గెస్ట్‌గౌస్ లో కూడా బెట్టింగ్ నిర్వహించేవాడని ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్లతో పాటుసిబ్బంది రాములు, ఆంజనేయులును అభినందిస్తున్నామని రివార్డు కోసం సిఫార్స్ చేస్తామన్నారు.