సాక్షి, హైదరాబాద్: మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, వ్యభిచారం వంటి నేరస్తులను పట్టుకోవటంలో దిట్టయిన స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు.. ఇక నుంచి భూ ఆక్రమణదారులపైనా దృష్టి సారించనున్నారు. భూ తగాదాలు పెరిగిపోతుండటం, వీటిని ఆసరాగా చేసుకొని కొందరు పోలీసులు అక్రమాలకు పాల్పడటం, చివరికి హత్యలకూ దారితీస్తున్న నేపథ్యంలో... రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. భూ ఆక్రమణలు, కబ్జాలపై పోలీసులకు మార్గదర్శకాలు ఖరారు చేశారు. ఆయా విధి విధానాలకు లోబడే చర్యలు తీసుకోవాలని సూచించారు.
వేల సంఖ్యలో ఫిర్యాదులు..
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్ పరిధిలో భూముల విలువలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీంతో కబ్జాదారులు నకిలీ పత్రాలను సృష్టించి ఖాళీ స్థలాలను విక్రయించడం లేదా కబ్జాలకు పాల్పడటం వంటి వాటికి పాల్పడుతున్నారు. దీంతో రోజుకు వేల సంఖ్యలో పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిలో చాలా వరకు కేసులను ‘సివిల్ మ్యాటర్’ అని పోలీసులు పక్కన పెడుతుండగా.. తమ వారి కేసులను మాత్రం ప్రత్యేక దృష్టి సారించి మరీ పరిష్కరిస్తున్నారు.
కొన్ని పీఎస్‌లలో సబ్ ఇన్‌స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఏసీపీలు కబ్జాదారులకు ఒత్తాసు పలుకుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి పలు కేసులలో భూ యజమానులు ఆగ్రహం కట్టలు తెంచుకొని.. హత్యలు చేసే స్థాయికి వెళ్లిపోతుండటం గమనార్హం. ఇటీవలి కాలంలో ఇలాంటి భూ తగాదాల నేపథ్యంలో హత్యలు జరగడమే ఇందుకు నిదర్శనం.
చదవండి: మరోసారి తెరపైకి సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ పేరు
అన్ని కేసుల్లో పోలీసుల ప్రమేయం ఉండదు..
చాలా మంది భూ యజమానులు వారి భూమి ఆక్రమణలకు గురైతే చాలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇది సివిల్ కేసు అని, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించినా సరే పోలీసులు పట్టించుకోవటం లేదని పలువురు భూ యజమానులు ‘పెద్ద’ మనుషులతో ఫోన్లు చేయించి, ఒత్తిడి తెస్తున్నారు. ప్రతి భూ ఆక్రమణ కేసులో పోలీసుల ప్రమేయం ఉండదు. సివిల్, పోలీస్‌ల మధ్య ఉన్న స్పష్టమైన లక్ష్మణ రేఖను దాటకుండా.. పోలీసులు చర్యలు తీసుకుంటారు.
సివిల్ కేసులకు న్యాయస్థానాలు, సబ్–రిజిస్ట్రేషన్ ఆఫీసులు వంటివి ఉన్నాయి. ఎవరి అధికారాల పరిధిలో వాళ్లు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. భూ తగాదాలపై పోలీసులు, బాధితులకు సూచనలు చేసేందుకు ఇద్దరు న్యాయ సలహాదారులను నియమించారు. ఏ తరహా కేసులపై పోలీసులు జోక్యం చేసుకోవాలి, ఏ తరహా విధానాలను అనుసరించాలనే పలు అంశాలపై సూచనలు ఇస్తుంటారు.
రోజుకు 15 ఇలాంటి కేసులే..
కమిషనరేట్‌లో నన్ను కలిసేందుకు రోజుకు 20 మంది సందర్శకులు వస్తే.. ఇందులో 15 మంది భూమి తగాదాల బాధితులే ఉంటున్నారు. ఇందులో 5 కేసులు న్యాయబద్ధంగా ఉంటే.. మిగిలినవి క్రిమినల్ కేసులుంటున్నాయి. బాధితులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి దిశా నిర్దేశం చేస్తున్నాం.
– మహేశ్ భగవత్, సీపీ, రాచకొండ
Comments
Please login to add a commentAdd a comment