ప్రత్యర్థుల అంతానికి పథకం
- ఘరానా రౌడీషీటర్ అరెస్టు
- రెండు తపంచాల స్వాధీనం
సాక్షి, సిటీబ్యూరో: తన ప్రత్యర్థులను అంతం చేసేందుకు పేరు మోసిన ఓ రౌడీషీటర్ రెండు తపంచాలను సిద్ధం చేసుకున్నాడు. వెస్ట్‌జోన్ ఎస్‌ఓటీ పోలీసులు సదరు రౌడీషీటర్‌ను అరెస్టు చేసి తపంచాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫతేనగర్‌కు చెందిన తడకల లక్ష్మణ్‌గౌడ్ బోయిన్‌పల్లిలో అర్వింద్ అనే వ్యక్తి వద్ద కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో మద్యానికి బానిసైన లక్ష్మణ్‌కు నేరగాళ్లతో సంబంధాలు ఏర్పడ్డాయి. డ్రైవర్ వృత్తి ద్వారా వచ్చే జీతం డబ్బు వ్యసనాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు సుపారీ తీసుకొని తన సహచరులతో కలిసి నేరాలు చేయడం మొదలెట్టాడు. దీంతో 1996లో సనత్‌నగర్ పోలీసులు లక్ష్మణ్‌గౌడ్‌పై రౌడీషీట్ తెరిచారు.
ఇదీ నేరచరిత్ర...
నార్సింగి నివాసి కృష్ణను హత్య చేసేందుకు అదే ప్రాంతానికి చెందిన కమ్మరి కృష్ణ.. లక్ష్మణ్‌కు రూ. 20 వేల సుపారీ ఇచ్చాడు. ఆ తర్వాత బోయిన్‌పల్లికి చెందిన కన్నారావుతో ఒప్పందం చేసుకొని మెదక్ జిల్లా కుకూనూర్‌పల్లి ఠాణా పరిధిలో రమేశ్ అనే వ్యక్తిని లక్ష్మణ్ సు పారీ హత్య చేసి... వేలల్లో డబ్బు తీసుకున్నాడు. కర్నూల్ పట్టణంలో మూర్తిని హత్య చేసేందుకు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. ఆ తర్వాత తన యజమాని అర్వింద్‌ను మోసం చేసి రూ.5 లక్షలను సొంతానికి వాడుకున్నాడు.
సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండే రౌడీషీటర్లు రవీంద్రచారి, ప్రశాంత్‌లతో ఆర్థిక వివాదాలు రావడంతో వారిని హత్య చేయాలని లక్ష్మణ్ నిర్ణయించుకున్నాడు. ఇందులో భా గంగా ఐదు నెలల క్రితం యూపీలోని పాట్నా వెళ్లి రెండు దేశవాళీ తుపాకులు కొనుగోలు చేశాడు. కాగా, రౌడీషీటర్లు రవీంద్రచారి, ప్రశాంత్‌ల హత్యకు లక్ష్మణ్ పథకం పన్నాడని వెస్ట్‌జోన్ ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో అతడి కదలికలపై నిఘా పెట్టారు. బుధ వారం ఎస్‌ఓటీ అడిషనల్ డీసీపీ రామచంద్రారెడ్డి నేతృ త్వంలో ఇన్‌స్పెక్టర్లు గురురాఘవేంద్ర, వెంకట్‌రెడ్డిల బృందం లక్ష్మణ్‌ను పట్టుకుంది. అతడి నుంచి రెండు తపంచాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు.