సూడో ఎస్‌ఓటీ పోలీసుల అరెస్ట్
Published Sat, Jan 7 2017 3:24 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: వ్యాపారులను బెదిరించి డబ్బులు గుంజుతున్న ముగ్గురు నకిలీ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు అయ్యారు. కోమటి మధు, శ్రీ రామోజి జానయ్యచారి, జంగాల మహేష్ అనే ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ పంపులు, రేషన్ డీలర్లు, ఆస్పత్రులు, చిల్లర వ్యాపారులను ఎస్‌ఓటీ పోలీసుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరు గతంలో హోంగార్డు ఉద్యోగాలు చేశారు. విధుల నుంచి తప్పించడంతో ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
శుక్రవారం ఎల్‌బీ నగర్‌లోని పెట్రోల్ పంపు వద్దకు డబ్బుల వసూలు కోసం వీరు రాగా తమకందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు వలపన్ని వీరిని అరెస్టు చేశారు. తరచుగా ఎస్‌ఓటీ పోలీసులు దాడులు జరుపుతున్న వార్తలను పేపర్లు, టీవీ చానెల్స్‌లో చూస్తూ వీరు తమ అక్రమార్జనకు ఈ దారిని ఎంచుకున్నారని రాచకొండ పోలీసులు తెలిపారు. వీరినుంచి రూ.1550 నగదు, 5 సెల్‌ఫోన్లను, మధు నుంచి రెండు హోంగార్డు గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement