బడి బాటేదీ? | No doubt the school? | Sakshi
Sakshi News home page

బడి బాటేదీ?

Published Wed, Jun 11 2014 2:47 AM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM

బడి బాటేదీ? - Sakshi

బడి బాటేదీ?

ఈ విద్యా సంవత్సరం లేనట్టే!  పలు చోట్ల స్వచ్ఛందంగా నిర్వహణ
విద్యార్థులు లేక మూతబడుతున్న సర్కారు స్కూళ్లు  
 ఈసారి మరింత తగ్గనున్న సంఖ్య    ప్రైవేట్ స్కూళ్లలో చేరుతున్న విద్యార్థులు

 
 ఏటా వేలాది మందిని పాఠశాలల్లో చేర్పించే బృహత్తర కార్యక్రమం ‘బడిబాట’ ఈ విద్యా సంవత్సరం లేనట్టేనని తేలిపోయింది. విద్యా, కార్మిక, మున్సిపల్, పోలీస్‌శాఖలు సంయుక్తంగా బడీడు, మధ్యలో చదువు మానేసిన పిల్లలను బడి ఒడికి చేర్చే ఈ కార్యక్రమంపై రాష్ట్ర విభజన ప్రతికూల ప్రభావం చూపింది. రాష్ట్ర, ఉద్యోగుల విభజన నేపథ్యంలో విద్యాశాఖ రెండుగా చీలిపోవడం.. డెరైక్టర్లు వేరుపడి ఇన్‌చార్జీలుగా కొనసాగడంతో బడిబాట మార్గదర్శకాలు, ఆదేశాలు జారీకాలేదు. దీంతో విద్యార్థుల సంఖ్య ఈసారి మరింతగా తగ్గే పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
 
- సాక్షి, కరీంనగర్
 
చదుకోవాల్సిన వయసులో ఎంతో మంది చిన్నారులు రైళ్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్లలో భిక్షాటన చేస్తూ కనిపిస్తున్నారు. కార్ఖానాలు, ఫ్యాక్టరీలు, ఇళ్లు, గోదాములు, హోటళ్లు, రెస్టారెంట్లలో బాలకార్మికులుగా పనిచేస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి బడిలో చేర్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఉపాధ్యాయులు, వివిధ శాఖల ఉద్యోగులు స్కూల్‌కు వెళ్లని, మధ్యలో చదువు మానేసినవారిని, అనాథలు, బాలకార్మికులు, వీధిబాలలను గుర్తించి వారిని బడిలో చేర్పిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రతీ విద్యాసంవత్సరం రెండు వేల మందికి పైగా చిన్నారులు పాఠశాల బాట పడుతున్నారు. గత విద్యా సంవత్సరం జూన్ 2 నుంచి 11వ వరకు జిల్లాలో బడిబాట నిర్వహించారు. ఈ విద్యాసంవత్సరం కూడా ఇదే నెలలో బడిబాట నిర్వహించాల్సి ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జగదీశ్వర్ (తెలంగాణ) నుంచి ఆదేశాలు అందకపోవడంతో బడిబాట ఖరారు కాలేదు.

స్వచ్ఛందం ఫలితమిచ్చేనా..?

 బడిబాట నిర్వహణపై ఆదేశాలు రాకపోవడంతో జిల్లాలో స్వచ్ఛందంగా బడిబాట నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్య నిర్ణయించారు. ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఉపాధ్యాయులను ప్రోత్సహించాలని కోరారు. దీంతో జిల్లాలో కొందరు ప్రధానోపాధ్యాయులు స్కూళ్లకు వెళ్లి అడ్మిషన్లు తీసుకోవడంతోపాటు పాఠశాల పరిధిలో తిరిగి బడీడు పిల్లలను బడిలో చేర్పిస్తున్నారు. సింహభాగం హెచ్‌ఎంలు విద్యార్థులను స్కూల్ బాట పట్టించేందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

 కొనసాగుతున్న ప్రైవేట్ హవా...

 పాఠశాలల్లో పడిపోతున్న విద్యాప్రమాణాలు, అపరిష్కృతంగా ఉన్న సమస్యలు నిరుపేద విద్యార్థులను సర్కార్ స్కూళ్లకు దూరం చేస్తున్నాయని అధికారికంగా తేలింది. విద్యకు ప్రాముఖ్యత ఇచ్చే తల్లిదండ్రులు ఎంతోమంది తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి క్రమంగా మూతబడుతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం కావడంతో జిల్లాలో చాలామంది ఆయా స్కూళ్లలో చేరిపోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లు గాలం వేస్తున్నాయి. దీంతో స్కూళ్లు తెరిచే నాటికీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఇంకా పడిపోయే ప్రమాదముంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందకపోయినా జిల్లాలో నిర్బంధంగా బడిబాటను అమలు చేస్తే.. సర్కారు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముండేదని ప్రభుత్వ ఉపాధ్యాయుడు కె.దయానంద్ అభిప్రాయపడ్డారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement