Badibata
-
బడిబాటలో కీలకం అమ్మ కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు మరింత గురుతర బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించించిది. మౌలిక వసతుల కల్పనలో కీలక భూమిక పోషించబోయే ఈ కమిటీలు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమ నిర్వహణలోనూ క్రియాశీలంగా వ్యవహరించనున్నాయి. బడిబాట కార్యక్రమం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది. ఈ నెల 19వ తేదీ వరకూ ఇది కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడం, విద్యార్థుల చేరికల శాతాన్ని పెంచడం దీని ముఖ్యోద్దేశం. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో జరుగుతున్న కార్యక్రమమే అయినా, ఈసారి వినూత్నంగా నిర్వహించాలని, ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లకు మధ్య ఉన్న తేడాలను తల్లిదండ్రులకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లపై అపోహలు తొలగించేలా.. ప్రైవేటు స్కూళ్లపై ప్రజల్లో ఉన్న మోజును తగ్గించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కన్పిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందదనే అపోహ ఉందని, ఈ కారణంగానే ప్రైవేటు బాట పడుతున్నారనేది ప్రభుత్వ పరిశీలన. దీన్ని దూరం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సర్కారీ స్కూళ్లలో ఉండే నాణ్యత, విద్యా ప్రమాణాలు, ఖర్చుపై బడిబాటలో భాగంగా అవగాహన కల్పించాలని, ఈ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాలలు సమర్థవంతంగా నిర్వహించగలవని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేటు స్కూల్లో చేరితే రూ.50 వేల నుంచి రూ 1.50 లక్షల వరకు ఖర్చవుతుందని, అలా కాకుండా ప్రభుత్వ స్కూళ్లల్లో చేర్పించి, ఆదా చేసే డబ్బును ఉన్నత చదువులకు ఉపయోగించవచ్చనే ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటూ కమిటీలకు చెబుతున్నారు. ఇంగ్లిష్ విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం లాంటి అంశాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సౌకర్యాల కల్పనలో కమిటీలు.. రాష్ట్రంలో మొత్తం 26,823 ప్రభుత్వ పాఠశాలల్లో 20,680 చోట్ల ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన బాధ్యతను ఆ కమిటీలకు అప్పగించారు. 17,729 పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులన్నీ ఈ కమిటీలకు అప్పగించారు. పాఠశాలల్లో తలుపులు, కిటికీలు, బ్లాక్ బోర్డులు, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్ల తాత్కాలిక మరమ్మతుల పనులన్నింటినీ ప్రభుత్వం ఈసారి వేసవిలోనే మొదలు పెట్టింది. ఈ పనులకు రూ.667.25 కోట్లు కేటాయించింది. అందులో ఇప్పటికే రూ.147 కోట్లు కమిటీలకు అడ్వాన్సుగా చెల్లించింది. -
ఎమ్మెల్యే లక్ష్మణ్‌కు వింత అనుభవం
► కవాడిగూడ ప్రభుత్వ పాఠశాలకు నేత ► మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టకపోవడంపై విస్మయం ► అధికారుల నుంచి మంత్రి వరకు ఫోన్లు... ముషీరాబాద్: కవాడిగూడ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం బడిబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్‌కు ‘అవాక్కయ్యే’ అనుభవం ఎదురైంది. పాఠశాలలో మంజూరు చేసిన మరుగుదొడ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చిందని ఉపాధ్యాయులను అడిగితే అసలు మొదలే కాలేదని సమాధానం చెప్పడంతో ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే డీఈఓ రమేష్‌కు ఫోన్ చేశారు. నిర్మాణాలు చేసే సిబ్బంది తమ దగ్గర లేనందున కలెక్టర్ చూస్తున్నారని ఒకసారి, సర్వశిక్ష అభియాన్ వారు పనులు చేస్తున్నారని మరోసారి రమేష్ సమాధానం ఇచ్చారు. దీంతో రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్, విద్యా సంచాలకులు కిషన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. అక్కడి నుండి కూడా అరకొర సమాధానమే రావడంతో విసిగిపోయిన లక్ష్మణ్ నేరుగా విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి ఫోన్ చేసి మాట్లాడారు. ‘అన్నా...ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు చేపట్టేందుకు ఆర్నెళ్ల క్రితం రూ. 4 కోట్లు మంజూరు చేశారు. విద్యా సంవత్సరం మొదలైనా ఇప్పటివరకు ఒక్క పనీ మొదలు పెట్టలేదు. ఎందుకని?’ అని ప్రశ్నించారు. అందుకు కడియం శ్రీహరి స్పందిస్తూ...‘లక్ష్మణ్..నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు రంగులు వేయమని రూ. 60 కోట్లు మంజూరు చేశాం. ఇప్పటికీ పనులు జరగడం లేదు. ఏం చేద్దాం.కొన్ని సమస్యలున్నాయి. మీరు నా దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటాం. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించేలా చూస్తాను’ అని సమాధానమిచ్చారు. -
ఇంటింటికీ.. బడిబాట
నేటి నుంచి ఐదు రోజుల పాటు జిల్లాలో రెండో విడత కార్యక్రమం ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయుల ఇంటింటి ప్రచారం నల్లగొండ : కొత్త విద్యాసంవత్సరం సోమవారం నుంచి పునః ప్రారంభమైంది. వేసవి సెలవుల నుంచి ఉపశమనం పొందిన విద్యార్థులు నూతన విద్యాసంవత్సరానికి స్వాగతం పలుకుతూ కొత్త ఒరవడితో పాఠశాలలకు పరుగులు తీశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, గురుకులాలకు చెందిన 2,44,270 మంది విద్యార్థులు పాఠశాల గడప తొక్కారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు మంగళవారం నుంచి ఇంటింటికీ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నద్ధమైంది. ఉపాధ్యాయులు, కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు, మండల విద్యాశాఖ సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 13 నుంచి 17 వరకు ఐదు రోజుల పాటు జరిగే బడిబాట కార్యక్రమంలో ప్రధానంగా పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచడంతోపాటు సున్నా విద్యార్థులు ఉన్న పాఠశాలలు, 30 మంది విద్యార్థుల్లోపు ఉన్న పాఠశాలలు, బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంపై ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు దృష్టిసారించనున్నారు. పాఠశాలల్లో పరిస్థితులు ఇలా... జిల్లా వ్యాప్తంగా ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు 67 ఉన్నా యి. ఇవన్నీ అత్యధికంగా మారుమూల గిరిజన తండాల్లోనే ఉన్నాయి. 1 నుంచి 10 మంది విద్యార్థులోపున్న పాఠశాలలు 112, 11 నుంచి 20 మంది విద్యార్థులోపున్న పాఠశాలలు 189 ఉన్నాయి. ఈ పాఠ శాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు, సబ్జెక్టు టీచర్లు కొరత ఉన్న పాఠశాలల్లో పనిచేసేందుకు 393 మంది విద్యావలంటీర్లను నియమించనుంది. మొదటి విడతలో చేరని విద్యార్థులు... విలేజ్ ఎన్రోల్మెంట్ రిజిస్టర్ (వీఈఆర్)లో నమోదైన ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు 59,166 మంది కాగా... దాంట్లో పాఠశాలల్లో తిరిగి చేర్పించిన విద్యార్థులు 49,100 మాత్రమే. ఇంకా 10,066 మంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంది. ప్రాథమికోన్నత స్థాయిలో మరొక 480 మంది విద్యార్థులను కూడా బడిలో చేర్పిం చాలి. ఇవిగాక బడిబాట పట్టని విద్యార్థులు 421 మంది ఉన్నారు. దీంట్లో 274 మందిని బడిగడప తొక్కిం చారు. వీరిలో కేజీబీవీలో 91 మంది, రెగ్యులర్ పాఠశాలల్లో 183 మంది విద్యార్థులు చేర్పించినట్లు రికార్డుల్లో నమోదు చేశా రు. మిగిలిన 147 మంది పిల్లలు బడిబయటే ఉన్నారు. ఇవి గాక అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు దాటిన పిల్లలు 8,946 మంది ఉన్నట్లు గుర్తించారు. ఉపాధ్యాయులు మాత్రం అం గన్‌వాడీల్లో ఐదేళ్లు దాటిన పిల్లలు 17,004 మంది ఉన్నట్లు తేల్చారు. ఈ పిల్లలను గుర్తించడంలో ఐసీడీఎస్, విద్యాశాఖ మధ్య సమన్వయం లోపించింది. 8 వేల మంది పిల్లల విషయంలో సరైన స్పష్టత లేకపోవడంతో వారి ఎన్రోల్మెంట్ గందరగోళంగా మారింది. -
12 నుంచి మళ్లీ బడులు
సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవులు ముగించుకొని ఈనెల 12వ తేదీ నుంచి బడులు ప్రారంభం కాబోతున్నాయి. క్షేత్ర స్థాయిలో ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా డైరెక్టర్ ఆదేశించారు. అలాగే ఈనెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బడిబాట నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు అకాడమిక్ క్యాలెండర్‌ను కూడా ఖరారు చేసినట్లు తెలిసింది. బడిబాటలో ప్రధానంగా బడిబయట ఉన్న పిల్లలను స్కూళ్లలో చేర్పించాలని విద్యాశాఖ సూచించింది. ఐదో తరగతి, ఏడో తరగతి, 8వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు పైతరగతుల్లో చేరేలా అవసరమైన అన్ని చర్యలు ప్రధానోపాధ్యాయులు చేపట్టాలని పేర్కొంది. ఇంగ్లిషు మీడియం విషయంలో జిల్లాల్లో కలెక్టర్లు అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. బడిబాట పర్యవేక్షణకు డైరెక్టరేట్ నుంచి సీనియర్ అధికారులను వివిధ జిల్లాలకు ఇన్ఛార్జిలుగా నియమించారు. -
పిల్లలపైనే ‘బడిబాట’ భారం..!
♦ విద్యార్థులను వీధుల వెంట తిప్పుతున్న ఉపాధ్యాయులు ♦ ర్యాలీలు నిర్వహించడమే బడిబాట ఉద్దేశమా.. జోగిపేట : రాష్ట్ర ప్రభుత్వం బడీడు పిల్లలు బడి బయట ఉండవద్దనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఈనెల 6వ తేదీన ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులంతా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి పిల్లలు చదువుకోవడానికి వెళుతున్నారా.. లేదా.. వెళ్లకపోతే అందుకుగల కారణాలు తెలుసుకోవడంతో పాటు వెళ్లని పిల్లలను తప్పకుండా పాఠశాలలో చేర్పించేలా తల్లిదండ్రులకు నచ్చజెప్పాలి. అయితే అందోలు మండలంలోని కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఇంటింటికి వె ళ్ల కుండా విద్యార్థులను ఇళ్ల నుంచి పిలిపించి వారికి బ్యాండు మేళాలు అప్పగించి గ్రామ వీధుల్లో తిప్పుతున్నారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించాలన్న నిబంధనలను మాత్రం విద్యాశాఖ సూచించలేదని సమాచారం. అయినా సెలవుల్లో ఉన్న పిల్లలను పాఠశాలకు పిలిపించి వారిని ఎండలో తిప్పుతున్నారు. కొన్ని గ్రామాల్లో మా పిల్లలు పాఠశాలకు వస్తున్నారు కదా...మరి మా పిల్లలను ఎందుకు తిప్పుతున్నారని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. సెలవుల్లో ఆడుకుంటున్న పిల్లల్ని పిలిపించి బ్యాండుతో ఊరేగింపు నిర్వహిస్తున్నారు. చదువుకోని పిల్లలను ఈనెల 12, 13 తేదీల్లో పాఠశాలలో చేర్పించాలన్న నిబంధనలు ఉన్నాయని, పిల్లలతో ర్యాలీల విషయమై ఆదేశాలు మాత్రం లేవని ఎంఈఓ దామోదర్ అన్నారు. ఏది ఏమైనా పిల్లలతో ర్యాలీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలున్నాయి. బడి బాట అంటే ఇదేనా..! రేగోడ్ : విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ఒక్క విద్యార్థి బడిలో చదువుకోవాలి. చదువుకోవాల్సిన పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవు. బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించేందుకు బటి బాట వంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినా.. లక్ష్యం మాత్రం నీరుగారుతోంది. మండల కేంద్రమైన రేగోడ్ బస్టాండ్‌లో మహాత్మాగాంధీ విగ్రహం సమీపంలో ఇద్దరు చిన్నారులు సంచీ చేతపట్టుకుని చెత్త కాగితాలను ఏరుకుంటుండగా మంగళవారం ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. -
నేటి నుంచి బడిబాట
* ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పెంపునకు కృషి చేయాలి * అదనపు జేసీ తిరుపతిరావు విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపుదలే లక్ష్యంగా మంగళవారం చేపట్టనున్న ‘బడి బాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు జేసీ, తెలంగాణ సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) జిల్లా ఇన్చార్జి ప్రాజెక్టుఅధికారి ఎస్.తిరుపతిరావు సూచించారు. బడిబాటకు సంబంధించి విధివిధానాలను వివరించేందుకు హన్మకొండలోని కలెక్టరేట్ నుంచి హెచ్ఎంలు, ఎంఈవోలు, సీఆర్పీలు, ఐఈఆర్టీలు, సీడీపీవోలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లను ఉద్దేశించి ఏజేసీ వీడియో కాన్ఫరెన్స ద్వారా మాట్లాడారు. బడిబాట కార్యక్రమాన్ని షెడ్యూల్ వారీగా నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛ పాఠశాల ఏర్పాటు, బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో కనీసం ఐదు శాతం నమోదు సంఖ్య పెంచాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి బడిబాటను విజయవంతం చేయాలని సూచించారు. అలాగే, వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డీఈఓ పి.రాజీవ్ కార్యక్రమ విజయవంతానికి పలు సూచనలు చేశారు. ఇదీ షెడ్యూల్ * అన్ని మండలాల్లోని పాఠశాలల పరిధిలో మంగళవారం నుంచి బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఎంపీడీవోలు, ఎంఈవోలు, సీడీపీవోలు, సూపర్వైజర్లు పాఠశాల స్థాయి లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు సమావేశం ఏర్పాటుచేసుకుని బృందాల వారీగా కుటుం బాలను కలవాల్సి ఉంటుంది. * ఈనెల 8న బుధవారం పాఠశాల స్థాయిలో హెచ్ఎం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు ఎస్ఎంసీ సభ్యులు సమావేశమై విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రణాళిక రూపొందించాలి. ఇంటిం టికి హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సభ్యులు వెళ్లి పాఠశాలల్లో పిల్లలను చేర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే పాఠశాలల్లో చదివి పైతరగతులకు వెళ్లిన విద్యార్థులకు టీసీలు ఇవ్వడంతో సమీపం స్కూళ్లలో చేర్పించాలి. * ఈనెల 9, 10వ తేదీల్లో న ఇంటింటా ప్రచారం చేస్తూ బడి ఈడు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి వారిని బడిలో చేర్పించేలా అవగాహన కల్పించాలి. మధ్యలో బడి మానేసిన, అసలే బడికి పోని పిల్లలు, సీడబ్ల్యూఎన్ఎన్ పిల్లలను కూడా గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలి. అలాగే, తెలంగాణ హరితహారం కోసం ప్రణాళిక తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పాఠశాలల్లో మౌలిక వసతుల పెంపుదలపై చర్చించాలి. * ఈనెల 11న ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టే విషయమై తల్లిదండ్రులతో చర్చించి వారు అంగీకరిస్తే ఒకటో తరగతి నుంచి ప్రారంభించాలి. ప్రతీ తరగతికి ఎన్ని పాఠ్యపుస్తకాలు అవసరమో జాబితా రూపొందించాలి. * ఈనెల 12న పాఠశాలల ఆవరణశుభ్రం చేయటంతోపాటు, భవనాలు, బోర్డులకు రంగులు వే యించాలి. తాగునీటి వసతి, తరగతులు, ఉపాధ్యాయుల గదులను శుభ్రం చేయించాలి. * ఈనెల 13న పాఠశాలల అభివృద్ధి కోసం హెచ్ఎం, టీచర్లు, ఎస్ఎంసీలు సమావేశమై చర్చిం చాలి. అదేరోజు పాఠశాలల్లో విద్యార్థులు పాఠ్యపుస్తకాలను స్థానిక ప్రజాప్రతినిధులు, ఎస్ఎంఎసీ సభ్యులతో పంపిణీ చేయించాలి. * ఈనెల 14న గ్రామాల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలి. * ఈనెల 15న అంగన్వాడీ కార్యకర్తలను కలిసి సెంటర్లలోని పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలి. ప్రాథమిక పాఠశాలల్లో చదువు పూర్తిచేసిన పిల్లలను యూపీఎస్‌ల్లో, అక్కడ పూర్తయిన వారిని హైస్కూళ్లలో చేర్పించాలి. * ఈనెల 16న ఒకటో తరగతి పిల్లలకు సామూహిక అక్షరాభ్యాస విషయమై ప్రచారం చేయా లి. కార్యక్రమానికి తల్లిదండ్రులు, ఎస్‌ఎంసీల సభ్యులు, ప్రజాప్రతినిధులు ఆహ్వానించి పల కలు, నోట్‌బుక్కులు, పెన్సిళ్లు సిద్ధం చేయాలి. * ఈనెల 17న ప్రతీపాఠశాలలో ఉదయం 10గంటలకు ఒకటో తరగతి పిల్లలకు సామూహిక అక్షరాభాస్యం చేయించాలి. కమ్యూనిటీ సపోర్టుతో ఉచితంగా పలకలు, నోట్‌బుక్కులు, పెన్సిళ్లును అందజేయాలి. మిగతా తరగతుల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలి. -
వందశాతం బడిబాట పడితే ప్రోత్సాహకం
♦ వందశాతం బడిబాట పడితే ప్రోత్సాహకం ♦ సదరు పంచాయతీకి రూ.లక్ష ♦ పారితోషికం కలెక్టర్ రోనాల్డ్‌రోస్నజరానా పాపన్నపేట: బడిబాటలో వందశాతం విద్యార్థుల నమోదు సాధించిన గ్రామ పంచాయతీలకు రూ.లక్ష పారితోషికం ఇస్తామని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం ఎంఈఓలు, హెచ్ఎంలు, తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ... రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గి మూతబడుతన్నాయన్నారు. వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందుకోసం సోమవారం నుంచి జరిగే బడిబాటలో అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కనీసం 10 శాతం విద్యార్థుల్ని అధికంగా నమోదు చేయాలని సూచించారు. తమిళనాడులో ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల కోసం జనాలు క్యూ కడతారని, ఆ పరిస్థితి తెలంగాణలో రావాలని సూచించారు. వంద శాతం నమోదు సాధించిన గ్రామ పంచాయతీలకు రూ.లక్ష నగదు, ప్రధానోపాధ్యాయులకు మంచి బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. -
బడిబాటను ఘనంగా నిర్వహించండి
పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ మంచిర్యాల సిటీ : దివంగత ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో ఈ నెల 16 తేదీ నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు నిర్వహించనున్న బడిబాట కార్యక్రమాన్ని జిల్లా ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ కోరారు. ఆదివారం మంచిర్యాలలోని సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బడిబాటకు ప్రభుత్వం జయశంకర్ పేరు పెట్టడం అభినందనీయమన్నారు. పాఠశాల కమిటీ, గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని పండుగను మరిపించే విధంగా విజయవంతం చేయాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల ప్రవేశపు సంఖ్యను పెంచడంతోపాటు, ప్రతీ పిల్లవాడు బడికి ఆకర్షితులయ్యేలా కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులు విద్యాభివృద్ధిలో కూడా అంత కంటే ఎక్కువ శ్రమించాలన్నారు. సమావేశంలో మంచిర్యాల, మందమర్రి సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.గంగాధర్, డి.మల్లేశ్, డి.అరవింద్‌కుమార్ పాల్గొన్నారు. -
రేపటి నుంచి ‘జయశంకర్ బడి పండుగ’
- పాఠశాలల్లో వంద శాతం విద్యార్థుల నమోదే లక్ష్యం - ఆదేశాలు జారీచేసిన పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జగదీశ్వర్ విద్యారణ్యపురి : గతంలో బడిబాట, విద్యాసంబురాలు పేరుతో కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించేవారు. తెలంగాణ రాష్ర్టం ఆవిర్భవించిన నేపథ్యంలో సోమవారం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడి పండుగ పేరు తో జిల్లాలో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఐదు సంవత్సరాల నిండిన పిల్లలను ఒకటో తరగతిలో చేర్పించడం, బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పిస్తారు. వంద శాతం విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించే లక్ష్యంతో ప్రొఫెసర్ జయంశంకర్ పేరుమీదుగా బడి పండుగను నిర్వహించనున్నారు. రేపటి నుంచి 21వ తేదీ వరకు విద్యావారోత్సవాలను జిల్లాలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, సర్వశిక్షాభియాన్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్ ఆదేశాలు జారీచేశారు. విజయవంతం చేయాలి : శ్యాంప్రసాద్‌లాల్, ఎస్ఎస్ఏ పీఓ ప్రొఫెసర్ జయశంకర్ బడి పండుగ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని సర్వశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ శ్యాంప్రసాద్‌లాల్ శనివారం కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాలని సూచించారు. మండల స్థాయిలో మండల విద్యాశాఖాధికారి సమన్వయకర్తగా వ్యవహరించి అన్ని పాఠశాలల్లో బడి పండుగ నిర్వహణకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల అధికారులు టాస్క్‌పోర్స్ కమిటీని ఏర్పాటుచేసి మండలంలోని బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ప్రతి మండలంలోని క్లస్టర్ రిసోర్స్‌పర్సన్(సీఆర్పీ)లు తమ పరిధిలోని పాఠశాలల్లో బడి పండుగను నిర్వహించే ందుకు హెచ్ఎంలకు సహకరించాలన్నారు. ప్రతి రోజు పాఠశాలల నుంచి వివరాలు సేకరించి నిర్దేశించిన ప్రొఫార్మాలో మండలంలో సమర్పించాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు బడి పండుగను ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. కార్యక్రమాల వివరాలు.. - 16న పాఠశాలల్లో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీల సభ్యులు సమావేశాలు నిర్వహించి, పాఠశాల అభివృద్ధిపై చర్చించాలి. - 17న పాఠశాలల్లో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, విద్యార్థులు ఇతర సభ్యులతో ర్యాలీ నిర్వహించాలి. విద్యాహక్కుచట్టంపై విస్తృతంగా ప్రచారం చేయాలి. - 18న ఇంటింటి సర్వే నిర్వహించి బడిఈడు పిల్లలందరిని బడిలో చే ర్పించాలి. పండుగ వాతావరణంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలి. - 19న విద్యాహక్కు చట్టం దినోత్స వం నిర్వహించాలి. విద్యార్థులను పై తరగతులకు పంపించాలి. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫాం పంపిణీ చేయాలి. - 20న బాలికా దినోత్సవం, బాలికల విద్య ప్రాధాన్యాన్ని తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించాలి. - 21న ప్రత్యేక అవసరాల పిల్లల దినోత్సవాన్ని నిర్వహించాలి. వారికి కావాల్సిన ఉపకరణాలను పంపిణీ చే యాల్సి ఉంటుంది. మధ్యాహ్న భోజనం పథకం ప్రాధాన్యతను అందరికి తెలియజేయాలి. -
బడి బాటేదీ?
ఈ విద్యా సంవత్సరం లేనట్టే! పలు చోట్ల స్వచ్ఛందంగా నిర్వహణ విద్యార్థులు లేక మూతబడుతున్న సర్కారు స్కూళ్లు ఈసారి మరింత తగ్గనున్న సంఖ్య ప్రైవేట్ స్కూళ్లలో చేరుతున్న విద్యార్థులు ఏటా వేలాది మందిని పాఠశాలల్లో చేర్పించే బృహత్తర కార్యక్రమం ‘బడిబాట’ ఈ విద్యా సంవత్సరం లేనట్టేనని తేలిపోయింది. విద్యా, కార్మిక, మున్సిపల్, పోలీస్‌శాఖలు సంయుక్తంగా బడీడు, మధ్యలో చదువు మానేసిన పిల్లలను బడి ఒడికి చేర్చే ఈ కార్యక్రమంపై రాష్ట్ర విభజన ప్రతికూల ప్రభావం చూపింది. రాష్ట్ర, ఉద్యోగుల విభజన నేపథ్యంలో విద్యాశాఖ రెండుగా చీలిపోవడం.. డెరైక్టర్లు వేరుపడి ఇన్‌చార్జీలుగా కొనసాగడంతో బడిబాట మార్గదర్శకాలు, ఆదేశాలు జారీకాలేదు. దీంతో విద్యార్థుల సంఖ్య ఈసారి మరింతగా తగ్గే పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. - సాక్షి, కరీంనగర్ చదుకోవాల్సిన వయసులో ఎంతో మంది చిన్నారులు రైళ్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్లలో భిక్షాటన చేస్తూ కనిపిస్తున్నారు. కార్ఖానాలు, ఫ్యాక్టరీలు, ఇళ్లు, గోదాములు, హోటళ్లు, రెస్టారెంట్లలో బాలకార్మికులుగా పనిచేస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి బడిలో చేర్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఉపాధ్యాయులు, వివిధ శాఖల ఉద్యోగులు స్కూల్‌కు వెళ్లని, మధ్యలో చదువు మానేసినవారిని, అనాథలు, బాలకార్మికులు, వీధిబాలలను గుర్తించి వారిని బడిలో చేర్పిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రతీ విద్యాసంవత్సరం రెండు వేల మందికి పైగా చిన్నారులు పాఠశాల బాట పడుతున్నారు. గత విద్యా సంవత్సరం జూన్ 2 నుంచి 11వ వరకు జిల్లాలో బడిబాట నిర్వహించారు. ఈ విద్యాసంవత్సరం కూడా ఇదే నెలలో బడిబాట నిర్వహించాల్సి ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జగదీశ్వర్ (తెలంగాణ) నుంచి ఆదేశాలు అందకపోవడంతో బడిబాట ఖరారు కాలేదు. స్వచ్ఛందం ఫలితమిచ్చేనా..? బడిబాట నిర్వహణపై ఆదేశాలు రాకపోవడంతో జిల్లాలో స్వచ్ఛందంగా బడిబాట నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్య నిర్ణయించారు. ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఉపాధ్యాయులను ప్రోత్సహించాలని కోరారు. దీంతో జిల్లాలో కొందరు ప్రధానోపాధ్యాయులు స్కూళ్లకు వెళ్లి అడ్మిషన్లు తీసుకోవడంతోపాటు పాఠశాల పరిధిలో తిరిగి బడీడు పిల్లలను బడిలో చేర్పిస్తున్నారు. సింహభాగం హెచ్ఎంలు విద్యార్థులను స్కూల్ బాట పట్టించేందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కొనసాగుతున్న ప్రైవేట్ హవా... పాఠశాలల్లో పడిపోతున్న విద్యాప్రమాణాలు, అపరిష్కృతంగా ఉన్న సమస్యలు నిరుపేద విద్యార్థులను సర్కార్ స్కూళ్లకు దూరం చేస్తున్నాయని అధికారికంగా తేలింది. విద్యకు ప్రాముఖ్యత ఇచ్చే తల్లిదండ్రులు ఎంతోమంది తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి క్రమంగా మూతబడుతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం కావడంతో జిల్లాలో చాలామంది ఆయా స్కూళ్లలో చేరిపోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లు గాలం వేస్తున్నాయి. దీంతో స్కూళ్లు తెరిచే నాటికీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఇంకా పడిపోయే ప్రమాదముంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందకపోయినా జిల్లాలో నిర్బంధంగా బడిబాటను అమలు చేస్తే.. సర్కారు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముండేదని ప్రభుత్వ ఉపాధ్యాయుడు కె.దయానంద్ అభిప్రాయపడ్డారు.