రేపటి నుంచి ‘జయశంకర్ బడి పండుగ’
- పాఠశాలల్లో వంద శాతం విద్యార్థుల నమోదే లక్ష్యం
- ఆదేశాలు జారీచేసిన పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జగదీశ్వర్
విద్యారణ్యపురి : గతంలో బడిబాట, విద్యాసంబురాలు పేరుతో కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించేవారు. తెలంగాణ రాష్ర్టం ఆవిర్భవించిన నేపథ్యంలో సోమవారం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడి పండుగ పేరు తో జిల్లాలో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఐదు సంవత్సరాల నిండిన పిల్లలను ఒకటో తరగతిలో చేర్పించడం, బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పిస్తారు. వంద శాతం విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించే లక్ష్యంతో ప్రొఫెసర్ జయంశంకర్ పేరుమీదుగా బడి పండుగను నిర్వహించనున్నారు. రేపటి నుంచి 21వ తేదీ వరకు విద్యావారోత్సవాలను జిల్లాలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, సర్వశిక్షాభియాన్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్ ఆదేశాలు జారీచేశారు.
విజయవంతం చేయాలి : శ్యాంప్రసాద్‌లాల్, ఎస్‌ఎస్‌ఏ పీఓ
ప్రొఫెసర్ జయశంకర్ బడి పండుగ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని సర్వశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ శ్యాంప్రసాద్‌లాల్ శనివారం కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాలని సూచించారు.
మండల స్థాయిలో మండల విద్యాశాఖాధికారి సమన్వయకర్తగా వ్యవహరించి అన్ని పాఠశాలల్లో బడి పండుగ నిర్వహణకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల అధికారులు టాస్క్‌పోర్స్ కమిటీని ఏర్పాటుచేసి మండలంలోని బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ప్రతి మండలంలోని క్లస్టర్ రిసోర్స్‌పర్సన్(సీఆర్‌పీ)లు తమ పరిధిలోని పాఠశాలల్లో బడి పండుగను నిర్వహించే ందుకు హెచ్‌ఎంలకు సహకరించాలన్నారు. ప్రతి రోజు పాఠశాలల నుంచి వివరాలు సేకరించి నిర్దేశించిన ప్రొఫార్మాలో మండలంలో సమర్పించాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు బడి పండుగను ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు.
కార్యక్రమాల వివరాలు..
- 16న పాఠశాలల్లో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీల సభ్యులు సమావేశాలు నిర్వహించి, పాఠశాల అభివృద్ధిపై చర్చించాలి.
- 17న పాఠశాలల్లో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, విద్యార్థులు ఇతర సభ్యులతో ర్యాలీ నిర్వహించాలి. విద్యాహక్కుచట్టంపై విస్తృతంగా ప్రచారం చేయాలి.
- 18న ఇంటింటి సర్వే నిర్వహించి బడిఈడు పిల్లలందరిని బడిలో చే ర్పించాలి. పండుగ వాతావరణంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలి.
- 19న విద్యాహక్కు చట్టం దినోత్స వం నిర్వహించాలి. విద్యార్థులను పై తరగతులకు పంపించాలి. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫాం పంపిణీ చేయాలి.
- 20న బాలికా దినోత్సవం, బాలికల విద్య ప్రాధాన్యాన్ని తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించాలి.
- 21న ప్రత్యేక అవసరాల పిల్లల దినోత్సవాన్ని నిర్వహించాలి. వారికి కావాల్సిన ఉపకరణాలను పంపిణీ చే యాల్సి ఉంటుంది. మధ్యాహ్న భోజనం పథకం ప్రాధాన్యతను అందరికి తెలియజేయాలి.