సమావేశంలో మంత్రులు సబితా, ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభానికి ఈనెల 30 నాటికే సన్నద్ధం కావాలని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులంతా గురువారం నుంచి ప్రతీరోజు పాఠశాలలకు హాజరుకావాలని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనల అమలులో రాజీపడొద్దని సూచించారు. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి ఆమె మంగళవారం జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు.
విద్యార్థులంతా కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడటం అత్యవసరమని మంత్రులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వసతి గృహాలను 30వ తేదీలోగా శానిటైజేషన్ చేసి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సర్పంచ్‌లు, పంచాయతీ సెక్రటరీలు ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ శుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని కోరారు. జెడ్పీచైర్మన్లు, సీఈవోలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రతిరోజూ పాఠశాలను పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, ఇంటర్మీడియెట్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.
సూచనలు ఇవీ...
►విద్యా సంస్థల్లో పారిశుద్ధ్య బాధ్యతలను గ్రామ పంచాయతీలే చూసుకోవాలి. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సర్పంచ్, అధికారులపై చర్యలు తీసుకుంటారు.
►విద్యార్థులకు సర్పంచ్‌లే మాస్క్‌లు అందించాలి.
►విద్యార్థుల్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే తక్షణమే వైద్య పరీక్షలు చేపట్టాలి. కోవిడ్ నిర్ధార ణ అయితే, మిగతా విద్యార్థులకు, బాధితుడి కుటుంబీకులకు కోవిడ్ పరీక్షలు చేయాలి. అవసరమైన వైద్య సేవలు అందించాలి.
►ప్రైవేటు విద్యా సంస్థల్లో కోవిడ్ నిబంధనలు అమలయ్యే తీరును అధికారులు పరిశీలించాలి.
►ఈ నెల 30లోగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత ప్రధానోపాధ్యాయులు సర్టిఫికెట్ ఇవ్వాలి.
►ఈనెల 26 నుంచి బోధన, బోధనేతర సిబ్బంది విద్యా సంస్థలకు విధిగా హాజరుకావాలి.
►ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులను తరలించే వాహనాల్లో ప్రత్యేకంగా శానిటైజేషన్ చర్యలు చేపట్టాలి. విద్యార్థులు విద్యా సంస్థలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఒత్తిడి చేయొద్దు.
5 గంటలకల్లా నివేదిక ఇవ్వాలి...
పాఠశాలల పరిస్థితిపై ఎంఈవోలు ప్రతి రోజూ 5 గంటల కల్లా ఆర్‌డీలకు నివేదిక ఇవ్వాలని మునిసిపల్ పరిపాలన విభాగం కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ.. కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, విద్యాసంస్థల పునరుద్ధరణ చేపడు తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనల అమలు, శానిటేషన్ విధానాలపై పాఠశాల విద్యాశాఖ జిల్లా అధికారులకు మార్గదర్శకాలు పంపింది. ఈమేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేన అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30లోగా ఉచిత పుస్తకాల పంపిణీ జరగాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment