మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థుల చేరికల బాధ్యత కూడా..
ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లకు మధ్య ఉన్న తేడాలపై తల్లిదండ్రులకు వివరణ
ప్రభుత్వ స్కూళ్లలోని సౌకర్యాలపై అవగాహన కల్పించనున్న కమిటీలు
19వ తేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు మరింత గురుతర బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించించిది. మౌలిక వసతుల కల్పనలో కీలక భూమిక పోషించబోయే ఈ కమిటీలు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమ నిర్వహణలోనూ క్రియాశీలంగా వ్యవహరించనున్నాయి. బడిబాట కార్యక్రమం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది.
ఈ నెల 19వ తేదీ వరకూ ఇది కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడం, విద్యార్థుల చేరికల శాతాన్ని పెంచడం దీని ముఖ్యోద్దేశం. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో జరుగుతున్న కార్యక్రమమే అయినా, ఈసారి వినూత్నంగా నిర్వహించాలని, ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లకు మధ్య ఉన్న తేడాలను తల్లిదండ్రులకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వ స్కూళ్లపై అపోహలు తొలగించేలా..
ప్రైవేటు స్కూళ్లపై ప్రజల్లో ఉన్న మోజును తగ్గించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కన్పిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందదనే అపోహ ఉందని, ఈ కారణంగానే ప్రైవేటు బాట పడుతున్నారనేది ప్రభుత్వ పరిశీలన. దీన్ని దూరం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సర్కారీ స్కూళ్లలో ఉండే నాణ్యత, విద్యా ప్రమాణాలు, ఖర్చుపై బడిబాటలో భాగంగా అవగాహన కల్పించాలని, ఈ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాలలు సమర్థవంతంగా నిర్వహించగలవని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రైవేటు స్కూల్‌లో చేరితే రూ.50 వేల నుంచి రూ 1.50 లక్షల వరకు ఖర్చవుతుందని, అలా కాకుండా ప్రభుత్వ స్కూళ్లల్లో చేర్పించి, ఆదా చేసే డబ్బును ఉన్నత చదువులకు ఉపయోగించవచ్చనే ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటూ కమిటీలకు చెబుతున్నారు. ఇంగ్లిష్ విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం లాంటి అంశాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
సౌకర్యాల కల్పనలో కమిటీలు..
రాష్ట్రంలో మొత్తం 26,823 ప్రభుత్వ పాఠశాలల్లో 20,680 చోట్ల ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన బాధ్యతను ఆ కమిటీలకు అప్పగించారు. 17,729 పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులన్నీ ఈ కమిటీలకు అప్పగించారు.
పాఠశాలల్లో తలుపులు, కిటికీలు, బ్లాక్ బోర్డులు, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్ల తాత్కాలిక మరమ్మతుల పనులన్నింటినీ ప్రభుత్వం ఈసారి వేసవిలోనే మొదలు పెట్టింది. ఈ పనులకు రూ.667.25 కోట్లు కేటాయించింది. అందులో ఇప్పటికే రూ.147 కోట్లు కమిటీలకు అడ్వాన్సుగా చెల్లించింది.
Comments
Please login to add a commentAdd a comment