♦ వందశాతం బడిబాట పడితే ప్రోత్సాహకం
♦ సదరు పంచాయతీకి రూ.లక్ష
♦ పారితోషికం కలెక్టర్ రోనాల్డ్‌రోస్నజరానా
పాపన్నపేట: బడిబాటలో వందశాతం విద్యార్థుల నమోదు సాధించిన గ్రామ పంచాయతీలకు రూ.లక్ష పారితోషికం ఇస్తామని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం ఎంఈఓలు, హెచ్‌ఎంలు, తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ... రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గి మూతబడుతన్నాయన్నారు. వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
అందుకోసం సోమవారం నుంచి జరిగే బడిబాటలో అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కనీసం 10 శాతం విద్యార్థుల్ని అధికంగా నమోదు చేయాలని సూచించారు. తమిళనాడులో ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల కోసం జనాలు క్యూ కడతారని, ఆ పరిస్థితి తెలంగాణలో రావాలని సూచించారు. వంద శాతం నమోదు సాధించిన గ్రామ పంచాయతీలకు రూ.లక్ష నగదు, ప్రధానోపాధ్యాయులకు మంచి బహుమతులు అందజేస్తామని ప్రకటించారు.