పిల్లలపైనే ‘బడిబాట’ భారం..!
♦ విద్యార్థులను వీధుల వెంట తిప్పుతున్న ఉపాధ్యాయులు
♦ ర్యాలీలు నిర్వహించడమే బడిబాట ఉద్దేశమా..
జోగిపేట : రాష్ట్ర ప్రభుత్వం బడీడు పిల్లలు బడి బయట ఉండవద్దనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఈనెల 6వ తేదీన ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులంతా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి పిల్లలు చదువుకోవడానికి వెళుతున్నారా.. లేదా.. వెళ్లకపోతే అందుకుగల కారణాలు తెలుసుకోవడంతో పాటు వెళ్లని పిల్లలను తప్పకుండా పాఠశాలలో చేర్పించేలా తల్లిదండ్రులకు నచ్చజెప్పాలి. అయితే అందోలు మండలంలోని కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఇంటింటికి వె ళ్ల కుండా విద్యార్థులను ఇళ్ల నుంచి పిలిపించి వారికి బ్యాండు మేళాలు అప్పగించి గ్రామ వీధుల్లో తిప్పుతున్నారు.
విద్యార్థులతో ర్యాలీ నిర్వహించాలన్న నిబంధనలను మాత్రం విద్యాశాఖ సూచించలేదని సమాచారం. అయినా సెలవుల్లో ఉన్న పిల్లలను పాఠశాలకు పిలిపించి వారిని ఎండలో తిప్పుతున్నారు. కొన్ని గ్రామాల్లో మా పిల్లలు పాఠశాలకు వస్తున్నారు కదా...మరి మా పిల్లలను ఎందుకు తిప్పుతున్నారని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. సెలవుల్లో ఆడుకుంటున్న పిల్లల్ని పిలిపించి బ్యాండుతో ఊరేగింపు నిర్వహిస్తున్నారు. చదువుకోని పిల్లలను ఈనెల 12, 13 తేదీల్లో పాఠశాలలో చేర్పించాలన్న నిబంధనలు ఉన్నాయని, పిల్లలతో ర్యాలీల విషయమై ఆదేశాలు మాత్రం లేవని ఎంఈఓ దామోదర్ అన్నారు. ఏది ఏమైనా పిల్లలతో ర్యాలీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలున్నాయి.
బడి బాట అంటే ఇదేనా..!
రేగోడ్ : విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ఒక్క విద్యార్థి బడిలో చదువుకోవాలి. చదువుకోవాల్సిన పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవు. బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించేందుకు బటి బాట వంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినా.. లక్ష్యం మాత్రం నీరుగారుతోంది. మండల కేంద్రమైన రేగోడ్ బస్టాండ్‌లో మహాత్మాగాంధీ విగ్రహం సమీపంలో ఇద్దరు చిన్నారులు సంచీ చేతపట్టుకుని చెత్త కాగితాలను ఏరుకుంటుండగా మంగళవారం ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది.