అక్షరంపై నిర్లక్ష్యం | Increasing child labors | Sakshi
Sakshi News home page

అక్షరంపై నిర్లక్ష్యం

Published Sun, May 11 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM

అక్షరంపై  నిర్లక్ష్యం

అక్షరంపై నిర్లక్ష్యం

 అధికారుల నిర్లక్ష్య వైఖరి మండలంలోని విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది.. చదువుకోవాలనే ఆసక్తి పిల్లల్లో ఉన్నా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు.. అందుకే పుస్తకాలు పట్టి బడిలో ఉండాల్సిన బాలలు పలుగు, పారలు పట్టి పొలాల్లో శ్రమిస్తున్నారు.. ప్రమాదమని తెలిసినా నిర్మాణ రంగంలో పనులు చేస్తున్నారు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యాభివృద్ధికి తోడ్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు..
 
 కోసిగి, న్యూస్‌లైన్ : కోసిగి మండలం రాష్ట్రంలోనే అక్షరాస్యతలో అత్యంత వెనుకబడిన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో అక్షరాస్యతను పెంచేందుకు కృషి చేయాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. విద్యాభివృద్ధిలో భాగంగా ప్రతి మండలంలో మోడల్ స్కూల్, హాస్టల్‌ను ఏర్పాటు చేసేందుకు 2011లో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మోడల్ స్కూల్ నిర్మాణం కోసం రూ.3 కోట్లు, హాస్టల్ కోసం రూ.1.50 కోట్ల బడ్జెట్‌ను 2011లోనే కేటాయించింది. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2013-14 విద్యా సంవత్సరం నాటికి జిల్లాలోని 32 మండలాల్లో మోడల్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. అయితే కోసిగి మండలంలో భవనాల నిర్మాణానికి స్థలం లేకపోవడంతో పనులు త్వరగా మొదలు కాలేదు.
 
విషయం తెలుసుకున్న కోసిగికి చెందిన నరసింహమూర్తి తన పొలంలో మూడు ఎకరాలను భవన నిర్మాణాల కోసం విరాళంగా అందజేశారు. దీంతో మోడల్‌స్కూల్, హాస్టల్  వస్తున్నాయని ప్రజలు ఎంతో సంతోషించారు. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారి ఆశ నెరవే రలేదు. 2013-14 విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి భవనాలు పూర్తికాలేదు. దీంతో ఆ ఏడాది అడ్మిషన్లు నిర్వహించలేదు. 2014-15 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి వస్తుందని అధికారులు, కాంట్రాక్టర్ చెప్పినా అది కూడా సాధ్యమయ్యేలా లేదు. మరో నెల రోజుల్లో తరగతులు మొదలు కావాల్సిన పరిస్థితుల్లోనూ ఇంకా పనులు చేస్తూనే ఉండడమే దానికి కారణం.
 
 పెరుగుతున్న బాలకార్మికులు
 మండలంలో బాలకార్మికులు రోజు రోజుకూ అధికమవుతున్నారు. 280 మంది బాలకార్మికులు ఉన్నట్లు అధికారులు రికార్డులు చూపిస్తున్నారు. అయితే దాదాపు 2 వేలకు మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం మోడల్ స్కూల్ నిర్మాణ పనులలో బాలకార్మికులు పనులు చేస్తున్నారు. అలాగే ప్రతి రోజూ రైళ్లలో పల్లీలు అమ్ముడం, సిమెంట్ పనులు, కట్టెల కొట్టుట, చిత్తుకాగితాలు ఏరడం తదితర పనులు బాలల జీవితాలు మగ్గిపోతున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
 
 జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం : ఆంజనేయులు, ఎంఈఓ
 మోడల్ స్కూల్ తరగతులు ప్రారంభించాలని జిల్లా ఉన్నతాధికారులను కోరాం. అయితే తరగతి గదులు నిర్మాణంలో ఉండడంతో అధికారులు విముఖత చూపుతున్నారు. కాంట్రాక్టర్లు త్వరితగతిన పనులు చేపడితే తరగతులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement