literacy rate
-
International Literacy Day: అందరికీ విద్య అందేదెన్నడు?
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ అక్షరాస్యతలో ఇంక వెనుకబడే ఉన్నాం. 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. విద్యా రంగంలో నెలకొన్న సవాళ్లతో పాటు పులి మీద పుట్రలా కరోనా మహమ్మారి విసిరిన పంజాతో 100% అక్షరాస్యత సుదూర స్వప్నంగా మారింది. ప్రజల్లో విద్యపై అవగాహన పెంచడానికి యూనెస్కో ప్రతీ ఏడాది సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.1966 నుంచి విద్యపై విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రపంచ నిరక్షరాస్యుల్లో 34% మంది భారత్‌లోనే ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత 2.4 కోట్ల మంది తిరిగి బడిలో చేరలేదు. వారిలో 1.1 కోట్ల మంది అమ్మాయిలున్నారు. కరోనా ప్రభావం కరోనా లాక్డౌన్లతో దేశంలో 15లక్షల స్కూళ్లు మూత పడ్డాయని, 24.7 కోట్ల విద్యార్థులు ఏడాది పాటు చదువుకి దూరమయ్యారని యునెస్కో వెల్లడించింది. తర్వాత కూడా 30% విద్యార్థులు తిరిగి స్కూళ్లలో చేరలేదని చెబుతోంది. సాధించిన పురోగతి ఇదీ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు అక్షరాస్యతలో గణనీయమైన పురోగతి సాధించాం. ఏడేళ్ల వయసు కంటే ఎక్కువ ఉన్న వారు ఏదో ఒక భాషలో చదవడం, రాయడం వస్తే వారిని అక్షరాస్యులుగా పరిగణిస్తారు. 1951లో 18.3% ఉన్న అక్షరాస్యత రేటు 2022 వచ్చేసరికి 77.7శాతానికి పెరిగింది. మొదట్లో అక్షరాస్యతలో లింగ వివక్ష అధికంగా ఉండేది. దానిని కూడా క్రమక్రమంగా దాటుకుంటూ వస్తున్నప్పటికీ అమ్మాయిల్లో అక్షరాస్యత ఇంకా సవాళ్లు విసురుతోంది. 1961లో కేవలం 15.4% మంది మహిళా జనాభా అక్షరాస్యులైతే ఆ తర్వాత పదేళ్లకి 1971లో 22% 2001 నాటికి 53.7% , 2022 నాటికి 70శాతం మహిళలు అక్షరాస్యులయ్యారు. అన్నింటికంటే మైనార్టీ విద్యార్థుల్లో డ్రాప్అవుట్ల నివారించడంలో భారత్ కొంతమేరకు విజయం సాధించింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం 2015–16లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు దాదాపుగా 9% ఉన్న డ్రాపవుట్లు 2020–21కి 0.8శాతానికి తగ్గాయి. ప్రాథమిక పాఠశాలలు 10 రెట్లు పెరిగాయి. ఎదురవుతున్న సవాళ్లు సంపూర్ణ అక్షరాస్యత సాధనకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. పేదరికం, తల్లిదండ్రుల అవగాహన లేమి, లింగ, కుల వివక్ష, సదుపాయాల లేమి, సాంకేతిక పరిజ్ఞానం అందకపోవడం వంటివన్నీ భారత్‌లో అనుకున్న స్థాయిలో అక్షరాస్యతను పెంచలేకపోతున్నాయి. గ్రామీణ నిరుపేదలకు స్కూళ్లు అందుబాటులో ఉండటం లేదు. పూట గడవని ఉండే కుటుంబాలు పిల్లల్ని పలక బలపం బదులు పలుగు పార పట్టిస్తున్నారు. దేశంలో ఏకంగా కోటి మంది చిన్నారులు బడికి వెళ్లడానికి బదులుగా బాలకార్మికులుగా మారారు. 2022 నాటికి పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత 87.7% ఉంటే గ్రామీణ భారతంలో 73.5% ఉన్నట్టుగా నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక చెబుతోంది. దీనికి కారణం గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులకే అక్షరజ్ఞానం లేకపోవడంతో వారికి చదువు ప్రాధాన్యం గురించి తెలియక పిల్లల్ని బడికి పంపించడం లేదు. అమ్మాయిల్లో అక్షరాస్యత తక్కువగా ఉండడానికి బాల్య వివాహాలు, పాఠశాలల్లో టాయిలెట్ సదుపాయం లేకపోవడమే ప్రధాన కారణాలని పలు సర్వేల్లో తేలింది. ఇప్పటికీ దేశంలో 40% పాఠశాలల్లో టాయిలెట్ సదుపాయం లేదు. జీడీపీలో 6% విద్యా రంగానికి ఖర్చు చేస్తేనే అక్షరాస్యత రేటు పెరుగుతుందని నిపుణులు సూచిస్తూ ఉంటే 3% కూడా పెట్టడం లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పసిడి కాంతులు 'పల్లె'విస్తున్నాయ్!
కర్నూలు (అర్బన్): రాయలసీమ అంటే ముఠా కక్షలు.. ఆధిపత్య పోరాటాలకు పుట్టినిల్లు అనే భావం స్థిరపడిపోయింది. ఇదంతా ఒకప్పటి మాట. రాయలసీమ గ్రామాల్లో ఇప్పుడా పరిస్థితి లేదు. ఫ్యాక్షన్ పల్లెల్లో అక్షరాస్యతా శాతం పెరిగింది. విద్యావంతులైన యువత గ్రామాలను అభివృద్ధి బాట పట్టించాలనే తపనతో సంఘాలుగా ఏర్పడి చేపడుతున్న కార్యక్రమాలు.. ప్రభుత్వం అందిస్తున్న సహకారం.. అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ఆ పల్లెలిప్పుడు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ముద్ర పడిన పి.కోటకొండ, కప్పట్రాళ్ల, వెలమకూరు, చిందుకూరు, రామాపురం, రామతీర్థం, సంగపట్నం, చెన్నంపల్లి, చెర్లోపల్లి, కాశీపురం, రెడ్డిపల్లె, నందిపాడు, బెలూం శింగవరం, హనుమంత గుండం, గొర్విమానుపల్లె, పాత కందుకూరు, ఎస్.లింగందిన్నె ఇలా... అనేక గ్రామాలు నేడు ముఠా కక్షలకు స్వస్తి పలికి వివిధ రంగాల్లో అభివృద్ధి పథాన పయనిస్తున్నాయి. 103 హత్యల పి.కోటకొండలో.. జిల్లాకు పశ్చిమాన ఉన్న పి.కోటకొండ 53 ఏళ్లపాటు ఫ్యాక్షన్ గుప్పెట్లో నలిగిపోయింది. గ్రామంలో దాదాపు 103 మంది ముఠా కక్షలకు బలయ్యారు. ప్రస్తుతం గ్రామంలో 10 వేలకు పైగా జనాభా ఉంది. నేటి తరంలో మార్పు రావడంతో చదువుకున్న యువత చైతన్య యువజన సంఘంగా ఏర్పడి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా ప్రణాళికలు రచించారు. జిల్లా కేంద్రం నుంచి పి.కోటకొండకు ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయించారు. గ్రామానికి చెందిన పింజరి హుస్సేన్ సాహెబ్ 6 ఎకరాలను దానంగా ఇవ్వడంతో జెడ్పీ హైసూ్కల్ నిర్మాణం జరిగింది. గ్రామానికే చెందిన సన్నితి రత్నమయ్యశెట్టి రెండెకరాల స్థలాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం కోసం దానమిచ్చారు. దాతల సహకారంతో విద్యుత్ సబ్‌స్టేషన్, పశు వైద్యశాల, సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించుకున్నారు. కప్పట్రాళ్ల బ్రాండ్‌తో ఉన్న సర్ఫ్ ప్యాకెట్లు చూపుతున్న మహిళలు సిరులు పండిస్తూ.. ఫ్యాక్షన్ వల్ల ఒరిగేదేమీ లేదనే సత్యాన్ని గ్రహించిన పి.కోటకొండ గ్రామస్తులు వ్యవసాయంలో ఆధునిక పోకడలను అందిపుచ్చుకున్నారు. దాదాపు 800 ఎకరాల్లో పండిస్తున్న గర్కిన్ (కీర) దోసకాయలను బెంగళూరు నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.40 వేల పెట్టుబడి పెడితే.. రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు చేతికొస్తున్నదని రైతులు చెబుతున్నారు. మార్కెట్ ట్రెండ్‌ను ఒడిసిపడుతున్న కప్పట్రాళ్ల పి.కోటకొండకు కూతవేటు దూరంలోనే ఉండే కప్పట్రాళ్ల కూడా గ్రామాధిపత్యం కోసం జరిగిన పోరులో రక్తసిక్తమైంది. ఇప్పుడా గ్రామం ఫ్యాక్షన్ భూతాన్ని వదిలించుకుని అభివృద్ధి దిశగా సాగుతోంది. 2014 నుంచి 2017 వరకు జిల్లా ఎస్పీగా పనిచేసిన ఆకే రవికృష్ణ కప్పట్రాళ్ల గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో దీని రూపురేఖలు మారిపోయాయి. సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీల సహకారంతో గ్రామంలో సిమెంట్ రోడ్లు, జిల్లా పరిషత్ హైస్కూల్‌కు సొంత భవనం, ప్రహరీ గోడ వంటివి ఎస్పీ నిర్మింపజేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఓర్వకల్లు మహిళా సంఘం సహకారంతో మహిళా పొదుపు గ్రూపులను ఏర్పాటు చేయించారు. ఇప్పుడు గ్రామంలో 92 మహిళా సంఘాల్లో 941 మంది సభ్యులున్నారు. ఈ గ్రూపుల ద్వారా దాదాపు రూ.10 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. గ్రామానికి చెందిన 10 మంది పొదుపు మహిళలు సర్్ఫ, ఫినాయల్‌ను కప్పట్రాళ్ల బ్రాండ్ నేమ్‌తో తయారు చేస్తున్నారు. మరో 15 మంది మహిళలు జీన్స్ ప్యాంట్స్ తయారీలో రాటు తేలారు. బళ్లారి నుంచి ముడి సరుకు తెచ్చి ఇక్కడ జీన్స్ ప్యాంట్స్ కుట్టించి పంపుతున్నారు. ఒక్కో మహిళ రోజుకు కనీసం రూ.250 ఆదాయం వస్తోంది. ప్రస్తుతం గ్రామానికి చెందిన 15 మంది మహిళలు సీఆర్పీలుగా పని చేస్తుండగా, 10 మంది ప్రకృతి వ్యవసాయ శాఖలో చేరి వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మహిళా సాధికారతతో ముందుకు గతంలో ఎస్పీగా పనిచేసిన ఆకే రవికృష్ణ అందించిన సహకారంతో గ్రామంలోని మహిళల్లో వినూత్న మార్పులు వచ్చాయి. మహిళలు పొదుపు సంఘాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నందున ఆర్థిక వనరులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం గ్రామంలో బ్యాంక్ ఏర్పాటు కావడం, రుణాలు ఇవ్వడంతో స్వయం ఉపాధి కార్యక్రమాలు పెరిగి వలసలు భారీగా తగ్గాయి. – నారాయణ, స్టేషన్ హౌస్ ఆఫీసర్, కప్పట్రాళ్ల హంద్రీనీవా జలాలు వస్తే.. కప్పట్రాళ్ల గ్రామం వరకు వచ్చిన హంద్రీనీవా జలాలను పి.కోటకొండకు విస్తరిస్తే వ్యవసాయపరంగా గ్రామం మరింత అభివృద్ధి చెందుతుంది. 10 వేలకు పైగా జనాభా కలిగిన గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం నిర్మించాలి. ఇందుకు దాత ఇచ్చిన స్థలం సిద్ధంగా ఉది. – ఆర్ సీతారామిరెడ్డి,మాజీ సర్పంచ్, పి.కోటకొండ ఉపకారం ఊరకే పోదు ఊరికి చేసిన ఉపకారం ఊరకే పోదన్న నమ్మకంతోనే గ్రామాభివృద్ధి కోసం చదువుకున్న యువత సహకారంతో అనేక కార్యక్రమాలను చేపట్టి విజయవంతం అవుతున్నాం. రైతుల్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కొత్త పంటలను పరిచయం చేస్తున్నాం. 300 మందితో రైతు గ్రూపులను ఏర్పాటు చేశాం. – ఎ.రంగస్వామి, అధ్యక్షుడు, చైతన్య యువజన సంఘం, కప్పట్రాళ్ల -
అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి
ఏ దేశాభివృద్ధి అయినా ఆ దేశ ప్రజల అక్షరాస్యతపై ఆధారపడి ఉంటుంది. అక్షరా స్యులైన ప్రజలు వస్తుసేవల ఉత్పత్తిలో పాల్గొని దేశ జీడీపీ పెరుగుదలకు తమ వంతు సహకారాన్ని అందిస్తారు. అభివృద్ధిలో మాత్రమే కాదు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాల్లో ఆరోగ్యకరమైన మార్పులకు తోడ్పడుతారు. యునెస్కో తన 14వ సర్వసభ్య సమా వేశం అక్టోబర్ 26, 1966న జరిపి, సెప్టెంబర్ 8వ తేదీని అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంగా జరు పుకోవాలని ప్రకటించింది. తరువాతి సంవత్సరం 1967 నుంచి జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా 86.3 శాతం ప్రజలు అక్షరాస్యులుగా ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అక్షరాస్యత 99.2 శాతంగా ఉంది. ప్రపంచంలోని 78.1 కోట్ల నిరక్షరాస్యుల్లో 75 శాతానికి పైగా దక్షిణాసియా, పశ్చిమాసియా, ఉప సహార ఆఫ్రికాల్లో ఉన్నారు. యునెస్కో వారి ‘గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ ఆన్ ఎడ్యుకేషన్’ ప్రకారం దక్షిణాసియా అత్యల్ప ప్రాంతీయ వయోజన అక్షరాస్యతా శాతాన్ని కలిగి ఉంది. దేశాల జాబితాలో చైనా 62, శ్రీలంక 93, బంగ్లాదేశ్ 129, నేపాల్ 137, భూటాన్ 138, పాకిస్తాన్ 148వ స్థానాల్లో ఉంటే, భారత్ 128వ స్థానంలో ఉంది. భారతదేశంలో అక్షరాస్యత వృద్ధి రేటు పురుషుల్లో 6.9 శాతంగా, మహిళల్లో 11.8 శాతంగా, ఉమ్మడిగా 9.2 శాతంగా ఉంది. మహిళల వృద్ధి రేటు ఎక్కువగా ఉండటం శుభపరిణామం. ఈ వృద్ధిరేటుతో భారతదేశం నూరు శాతం అక్షరాస్యత సాధించాలంటే 2060 వరకూ ఆగాల్సిందే. ఏడు సంవత్సరాల పైబడ్డవారు ఏ భాషలోనైనా చదవగల, రాయగల వారిని అక్షరాస్యులు అంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో 74.04 శాతం ప్రజలు అక్షరాస్యులుగా ఉన్నారు. ఇది పురు షుల్లో 82.14 శాతం, మహిళల్లో 65.46 శాతం. అత్యధికంగా కేరళలో 93.4 శాతంగా, అతి తక్కువగా బిహార్‌లో 63.82 శాతంగా నమోదైంది. దేశంలో అక్షరాస్యతా స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ 32, తెలంగాణ 35, బిహార్ 36వ స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ అక్షరాస్యత 2011 లెక్కల ప్రకారం 66.46 శాతం. అత్యధికంగా హైదరాబాద్‌లో 80.96 శాతం ఉండగా, అతితక్కువగా మహబూబ్‌నగర్‌లో 56.6 శాతంగా ఉంది. తెలంగాణ ఆర్థిక సర్వే 2018 ప్రకారం రాష్ట్రంలో 2018 నాటికి అక్షరాస్యత 84.11 శాతానికి పెరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరక్షరాస్యతకు అనేక కారణాలు ఉన్నాయి. విద్యా ఉపయోగాలు తెలియకపోవటం, పేదరికం, వలసలు, తల్లిదం డ్రులు ఎక్కువగా వ్యవసాయ రంగంపై ఆధారపడి పిల్లలను ఆయా పనుల్లో నిమగ్నం చేయడం, పాఠ శాల సౌకర్యాలు లేకపోవడం, సామాజిక అసమాన తలు ముఖ్యమైనవి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ఉచిత నిర్బంధ విద్యా సౌకర్యాలు కల్పించాలని స్పష్టంగా పేర్కొంది. కొఠారి కమిషన్ విద్యకు జీడీ పీలో 6 శాతం నిధులను ఖర్చు చేయాలని చెప్పింది. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం కూడా 4 శాతం కంటే ఎక్కువగా ఖర్చు చేయలేదు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, 1 ఏప్రిల్ 2010 నుంచి అమల్లోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితి సుస్థి రాభివృద్ది ఎజెండా– 2015 నాలుగవ లక్ష్యంగా అందరికీ నాణ్యమైన విద్యను 2030 నాటికి సాధిం చాలని నిర్దేశించింది. దీనికిగానూ తల్లిదండ్రులకు ఉపాధి కల్పించి పిల్లల చదువుపై అవగాహన పెంచడం, సౌకర్యవంతమైన పాఠశాల సమయాన్ని అందించడం, పాఠశాల స్థాయిలోనే వృత్తివిద్యా శిక్షణ ఇవ్వడం మొదలైన చర్యలు అవసరం. నూతన విద్యా విధానం 2020లో పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్యా స్థాయిలో ఆశించిన సంస్కరణలు ఉన్నప్పటికీ ఆచరణలో ఎలా ఉంటుందో చూడాలి. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినా అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఒక దృఢ ప్రణాళికతో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన ప్పుడే భవిష్యత్ తరం తమ కాళ్ళపై తాము నిల బడుతుంది, దేశాన్ని నిలబెడుతుంది. వ్యాసకర్త : జుర్రు నారాయణ యాదవ్, టీటీయూ జిల్లా అధ్యక్షులు, మహబూబ్‌నగర్ ‘ మొబైల్ : 94940 19270 -
‘అక్షరం’రాలే..!
వయోజనులకు అక్షరాలు నేర్పించే సాక్షరభారత్ కేంద్రాల మూసివేత తప్పదా? సంపూర్ణ అక్ష్యరాస్యత సాధన కోసం 2010 సెప్టెంబర్ 8న కేంద్రప్రభుత్వం ప్రారంభించిన సాక్షరభారత్ మిషన్ గడువు 2015తోనే ముగిసింది. నిర్దేశిత లక్ష్యం సాధించలేదనే కారణంతో గతరెండేళ్లలో మూడుసార్లు దీని కాలపరిమితిని పొడిగిస్తూ వచ్చింది. ఇప్పుడు మరో ఐదురోజులే గడువు ఉండడంతో సర్కారు నేటికీ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. దీంతో ఈనెల 31 తర్వాత అభ్యసన కేంద్రాల భవిష్యత్ ఏమిటనే దానిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. సిరిసిల్ల: వేలిముద్రవేసే వారికి అక్షరాలు నేర్పించి అక్షరాస్యులగా తీర్చిదిద్దడమే సాక్షర భారత్ లక్ష్యం. 2009 సెప్టెంబరు 8న ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ సాక్షర భారత్ పథకం ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో 2010 సెప్టెంబర్ 8న అభ్యసన కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో గ్రామానికోటి చొప్పున 211 కేంద్రాలను నెలకొ ల్పారు. వీటి ద్వారా చదువుకున్న వయోజనులకు వి ద్యను నిరంతరం అందించడం, దినపత్రికలు, కథల పుస్తకాలు అందించి చదువు కొనసాగించడం ముఖ్య ఉద్దేశం. చదువురాని వారికి అక్షరాలు నేర్పించాలి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, సాక్షర భారత్ గ్రామ కో ఆర్డినేటర్ల అలసత్వంతో కేంద్రాలు మొక్కుబడిగానే సాగుతున్నా యి. ప్రతీ గ్రామంలో ఇద్దరు కో ఆర్డినేటర్లను నియమించారు. వీరికి నెలకు రూ.2000 వేతనం చెల్లిస్తున్నారు. మండలస్థాయిలో కో ఆర్డినేటర్లకు రూ.6000 వేతనం అందిస్తున్నారు. అయితే, 15 నెలలుగా వేతనాలు అందక కో ఆర్డినేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. కొనసాగింపుపై సందిగ్ధం..! సాక్షర భారత్ కొనసాగింపుపై సందిగ్ధం ఉంది. దీని స్థానంలో కొత్త పథకం ప్రారంభించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. వేతనాలు పెంచి సమర్ధవంతంగా పథకం నిర్వహించాలని భా విస్తున్నా.. ఎంత వేతనం ఇవ్వాలనే అంశంపై స్పష్టత లేదు. కొత్తజిల్లాలు ఏర్పాటైనా ఉమ్మడి జిల్లాలోనే నే టికీ ఈ పథకం నిర్వహణ సాగుతోంది. కొత్త మండలాల్లోనూ కేంద్రాల విభజన జరగలేదు. జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన, వయోజన విద్య డెప్యూటీ డైరెక్టర్ పర్యవేక్షణలో ఉండగా.. కొత్త జిల్లాలో పర్యవేక్షణ క రువైంది. వయోజనులు చదువుకునే సామాగ్రి కూడా సరఫరా కాలేదు. జిల్లాకు సూపర్వైజర్ రాంరెడ్డి వ్య వహరిస్తున్నా.. ఆయనఒక్కడే ఉండడంతో పనిఒత్తిడి పెరిగింది. జిల్లాలో ఆరు నెలలకోసారి ప్రారంభించా ల్సిన స్కీం(కొత్త బ్యాచ్)ల విషయంలోనూ నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. నిజానికి జీతాలు సరిగా.. ఇవ్వకపోవడం.. పర్యవేక్షణ లోపంతో మొక్కు‘బడి’గా మారింది. కానీ చిత్తశుద్ధితో పనిచేస్తే.. క్షేత్రస్థాయిలో మంచిఫలితాలు రానున్నాయి. -
అక్షరాస్యత పెరిగితేనే అభివృద్ధి
మార్టూరు : అక్షరాస్యత శాతం పెరిగితేనే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. సమాజంలో గుర్తింపు రావాలన్నా.. మంచి జీవితం గడపాలన్నా విద్య ఎంతో అవసరమన్నారు. మార్టూరు జెడ్పీహెచ్ఎస్లో శనివారం బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత కలెక్టర్ మాట్లాడారు. వివిధ కార్యక్రమాలు నిర్వహించి పిల్లలు బడిబయట లేకుండా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. చదువుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని, డబ్బుతో కూడా పనిలేదన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఆరు నుంచి 14 ఏళ్లలోపు వయసున్న పిల్లలు పాఠశాలలో ఉండేలా చూడాలన్నారు. విద్య మంచి ఆలోచనా శక్తిని, జ్ఞానాన్ని పెంపొందిస్తుందన్నారు. బడిఈడు పిల్లలను బడిలో చేర్చడంలో మార్టూరు మండలం ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తోందని చెప్పారు. పిల్లలంతా పాఠశాలలకు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కూడా పిల్లలు పాఠశాలకు వెళ్లేలా చూడాలని కోరారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. ఇప్పటికీ వందకు 29 మంది విద్యార్థులు బడి బయట ఉన్నారని, వారిని పాఠశాలలో చేర్పించాలన్నారు. డీఈఓ విజయభాస్కర్ మాట్లాడుతూ.. బడిబయట ఉన్న పిల్లలను ఇప్పటికే పాఠశాలలో చేర్పించామని స్పష్టం చేశారు. ఇంకా ఎవరైనా బడి బయట ఉంటే బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా పాఠశాలకు వచ్చేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ తిరుపతి కిషోర్‌బాబు, ఎంపీడీఓ సింగయ్య, మార్టూరు సర్పంచ్ దేవుని దయానాయక్, మార్టూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం జెన్నెట్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అక్షరంపై నిర్లక్ష్యం
అధికారుల నిర్లక్ష్య వైఖరి మండలంలోని విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది.. చదువుకోవాలనే ఆసక్తి పిల్లల్లో ఉన్నా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు.. అందుకే పుస్తకాలు పట్టి బడిలో ఉండాల్సిన బాలలు పలుగు, పారలు పట్టి పొలాల్లో శ్రమిస్తున్నారు.. ప్రమాదమని తెలిసినా నిర్మాణ రంగంలో పనులు చేస్తున్నారు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యాభివృద్ధికి తోడ్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు.. కోసిగి, న్యూస్‌లైన్ : కోసిగి మండలం రాష్ట్రంలోనే అక్షరాస్యతలో అత్యంత వెనుకబడిన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో అక్షరాస్యతను పెంచేందుకు కృషి చేయాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. విద్యాభివృద్ధిలో భాగంగా ప్రతి మండలంలో మోడల్ స్కూల్, హాస్టల్‌ను ఏర్పాటు చేసేందుకు 2011లో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మోడల్ స్కూల్ నిర్మాణం కోసం రూ.3 కోట్లు, హాస్టల్ కోసం రూ.1.50 కోట్ల బడ్జెట్‌ను 2011లోనే కేటాయించింది. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2013-14 విద్యా సంవత్సరం నాటికి జిల్లాలోని 32 మండలాల్లో మోడల్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. అయితే కోసిగి మండలంలో భవనాల నిర్మాణానికి స్థలం లేకపోవడంతో పనులు త్వరగా మొదలు కాలేదు. విషయం తెలుసుకున్న కోసిగికి చెందిన నరసింహమూర్తి తన పొలంలో మూడు ఎకరాలను భవన నిర్మాణాల కోసం విరాళంగా అందజేశారు. దీంతో మోడల్‌స్కూల్, హాస్టల్ వస్తున్నాయని ప్రజలు ఎంతో సంతోషించారు. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారి ఆశ నెరవే రలేదు. 2013-14 విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి భవనాలు పూర్తికాలేదు. దీంతో ఆ ఏడాది అడ్మిషన్లు నిర్వహించలేదు. 2014-15 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి వస్తుందని అధికారులు, కాంట్రాక్టర్ చెప్పినా అది కూడా సాధ్యమయ్యేలా లేదు. మరో నెల రోజుల్లో తరగతులు మొదలు కావాల్సిన పరిస్థితుల్లోనూ ఇంకా పనులు చేస్తూనే ఉండడమే దానికి కారణం. పెరుగుతున్న బాలకార్మికులు మండలంలో బాలకార్మికులు రోజు రోజుకూ అధికమవుతున్నారు. 280 మంది బాలకార్మికులు ఉన్నట్లు అధికారులు రికార్డులు చూపిస్తున్నారు. అయితే దాదాపు 2 వేలకు మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం మోడల్ స్కూల్ నిర్మాణ పనులలో బాలకార్మికులు పనులు చేస్తున్నారు. అలాగే ప్రతి రోజూ రైళ్లలో పల్లీలు అమ్ముడం, సిమెంట్ పనులు, కట్టెల కొట్టుట, చిత్తుకాగితాలు ఏరడం తదితర పనులు బాలల జీవితాలు మగ్గిపోతున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం : ఆంజనేయులు, ఎంఈఓ మోడల్ స్కూల్ తరగతులు ప్రారంభించాలని జిల్లా ఉన్నతాధికారులను కోరాం. అయితే తరగతి గదులు నిర్మాణంలో ఉండడంతో అధికారులు విముఖత చూపుతున్నారు. కాంట్రాక్టర్లు త్వరితగతిన పనులు చేపడితే తరగతులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. -
మోడల్ స్కూళ్లు
=అక్షరాస్యత పెంపు ధ్యేయం =ప్రత్యేక పాఠశాలల రాష్ట్ర మోనటరింగ్ అధికారి రవికాంత్ వెల్లడి మునగపాక, న్యూస్‌లైన్ : మహిళల్లో అక్షరాస్యత శాతం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పలు మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుందని ప్రత్యేక పాఠశాలల రాష్ట్ర మోనటరింగ్ అధికారి కె. రవికాంత్ అన్నారు. మండలంలోని పాటిపల్లి మోడల్ స్కూల్‌ను ఆయన సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల పరిశీలనలో భాగంగా ఆయన ఇక్కడి స్కూల్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. హాస్టల్ నిర్మాణం పూర్తయితే మోడల్ స్కూల్‌కు సంబందించిన ఉపాధ్యాయులలో ఒకరిని వార్డెన్‌గా నియమిస్తామన్నారు. హాస్టల్ మోనటరింగ్ను వార్డెన్ చూసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ] మోడల్ స్కూళ్లలో చేరేందుకు ఉత్సాహం : రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లలో చదువుకునేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారని రవికాంత్ అన్నారు. మోడల్ స్కూల్ తనిఖీలో భాగంగా తనను కలిసిన విలేకరులతో రవికాంత్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 356 పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మరో 324 పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయుల నియామకం వల్ల విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. పలు పాఠశాలల్లో హాస్టల్ నిర్మాణాలు పూర్తి కావచ్చాయన్నారు. ఇవి పూర్తయితే బాలికలకు ఎంతగానో సదుపాయం ఉంటుందన్నారు. ఇంతవరకు గ్రామీణప్రాంతాల్లో జూనియర్ కళాశాలలు లేకపోవడంతో మహిళలు చదువులకు దూరంగా ఉండేవారని చెప్పారు. ఈ మోడల్ స్కూళ్ల ఏర్పాటు వలన ఇటువంటి సమస్య ఉండదని తెలిపారు. మహిళల ఉన్నత విద్యాభ్యాసానికి మోడల్ స్కూళ్లు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. రవాణా సమస్య గురించి మాట్లాడుతూ, బస్సు ఏర్పాటుకు సంబంధిత ఆర్టీసీ డిపోనుంచి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. పిల్లల్లో ఒకరిగా.. : తనిఖీల సందర్భంగా రవికాంత్ ఉపాధ్యాయుల పనితీరును, విద్యార్థుల హాజరుశాతాన్ని గమనించారు. విద్యాబోధన తీరును గమనించేందుకు పాఠశాల గదుల్లో విద్యార్థుల మధ్య కూర్చుని పాఠాలు విన్నారు. బాలుర, బాలికల టాయ్లెట్లను, ప్రయోగశాలలను పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న హాస్టల్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.