
జీన్స్ ప్యాంట్స్ తయారు చేస్తున్న మహిళలు
కర్నూలు (అర్బన్): రాయలసీమ అంటే ముఠా కక్షలు.. ఆధిపత్య పోరాటాలకు పుట్టినిల్లు అనే భావం స్థిరపడిపోయింది. ఇదంతా ఒకప్పటి మాట. రాయలసీమ గ్రామాల్లో ఇప్పుడా పరిస్థితి లేదు. ఫ్యాక్షన్ పల్లెల్లో అక్షరాస్యతా శాతం పెరిగింది. విద్యావంతులైన యువత గ్రామాలను అభివృద్ధి బాట పట్టించాలనే తపనతో సంఘాలుగా ఏర్పడి చేపడుతున్న కార్యక్రమాలు.. ప్రభుత్వం అందిస్తున్న సహకారం.. అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ఆ పల్లెలిప్పుడు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ముద్ర పడిన పి.కోటకొండ, కప్పట్రాళ్ల, వెలమకూరు, చిందుకూరు, రామాపురం, రామతీర్థం, సంగపట్నం, చెన్నంపల్లి, చెర్లోపల్లి, కాశీపురం, రెడ్డిపల్లె, నందిపాడు, బెలూం శింగవరం, హనుమంత గుండం, గొర్విమానుపల్లె, పాత కందుకూరు, ఎస్.లింగందిన్నె ఇలా... అనేక గ్రామాలు నేడు ముఠా కక్షలకు స్వస్తి పలికి వివిధ రంగాల్లో అభివృద్ధి పథాన పయనిస్తున్నాయి.
103 హత్యల పి.కోటకొండలో..
జిల్లాకు పశ్చిమాన ఉన్న పి.కోటకొండ 53 ఏళ్లపాటు ఫ్యాక్షన్ గుప్పెట్లో నలిగిపోయింది. గ్రామంలో దాదాపు 103 మంది ముఠా కక్షలకు బలయ్యారు. ప్రస్తుతం గ్రామంలో 10 వేలకు పైగా జనాభా ఉంది. నేటి తరంలో మార్పు రావడంతో చదువుకున్న యువత చైతన్య యువజన సంఘంగా ఏర్పడి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా ప్రణాళికలు రచించారు. జిల్లా కేంద్రం నుంచి పి.కోటకొండకు ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయించారు. గ్రామానికి చెందిన పింజరి హుస్సేన్ సాహెబ్ 6 ఎకరాలను దానంగా ఇవ్వడంతో జెడ్పీ హైసూ్కల్ నిర్మాణం జరిగింది. గ్రామానికే చెందిన సన్నితి రత్నమయ్యశెట్టి రెండెకరాల స్థలాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం కోసం దానమిచ్చారు. దాతల సహకారంతో విద్యుత్ సబ్‌స్టేషన్, పశు వైద్యశాల, సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించుకున్నారు.
కప్పట్రాళ్ల బ్రాండ్‌తో ఉన్న సర్ఫ్ ప్యాకెట్లు చూపుతున్న మహిళలు
సిరులు పండిస్తూ..
ఫ్యాక్షన్ వల్ల ఒరిగేదేమీ లేదనే సత్యాన్ని గ్రహించిన పి.కోటకొండ గ్రామస్తులు వ్యవసాయంలో ఆధునిక పోకడలను అందిపుచ్చుకున్నారు. దాదాపు 800 ఎకరాల్లో పండిస్తున్న గర్కిన్ (కీర) దోసకాయలను బెంగళూరు నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.40 వేల పెట్టుబడి పెడితే.. రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు చేతికొస్తున్నదని రైతులు చెబుతున్నారు.
మార్కెట్ ట్రెండ్‌ను ఒడిసిపడుతున్న కప్పట్రాళ్ల
పి.కోటకొండకు కూతవేటు దూరంలోనే ఉండే కప్పట్రాళ్ల కూడా గ్రామాధిపత్యం కోసం జరిగిన పోరులో రక్తసిక్తమైంది. ఇప్పుడా గ్రామం ఫ్యాక్షన్ భూతాన్ని వదిలించుకుని అభివృద్ధి దిశగా సాగుతోంది. 2014 నుంచి 2017 వరకు జిల్లా ఎస్పీగా పనిచేసిన ఆకే రవికృష్ణ కప్పట్రాళ్ల గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో దీని రూపురేఖలు మారిపోయాయి. సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీల సహకారంతో గ్రామంలో సిమెంట్ రోడ్లు, జిల్లా పరిషత్ హైస్కూల్‌కు సొంత భవనం, ప్రహరీ గోడ వంటివి ఎస్పీ నిర్మింపజేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఓర్వకల్లు మహిళా సంఘం సహకారంతో మహిళా పొదుపు గ్రూపులను ఏర్పాటు చేయించారు. ఇప్పుడు గ్రామంలో 92 మహిళా సంఘాల్లో 941 మంది సభ్యులున్నారు. ఈ గ్రూపుల ద్వారా దాదాపు రూ.10 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. గ్రామానికి చెందిన 10 మంది పొదుపు మహిళలు సర్‌్ఫ, ఫినాయల్‌ను కప్పట్రాళ్ల బ్రాండ్ నేమ్‌తో తయారు చేస్తున్నారు. మరో 15 మంది మహిళలు జీన్స్ ప్యాంట్స్ తయారీలో రాటు తేలారు. బళ్లారి నుంచి ముడి సరుకు తెచ్చి ఇక్కడ జీన్స్ ప్యాంట్స్ కుట్టించి పంపుతున్నారు. ఒక్కో మహిళ రోజుకు కనీసం రూ.250 ఆదాయం వస్తోంది. ప్రస్తుతం గ్రామానికి చెందిన 15 మంది మహిళలు సీఆర్‌పీలుగా పని చేస్తుండగా, 10 మంది ప్రకృతి వ్యవసాయ శాఖలో చేరి వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
మహిళా సాధికారతతో ముందుకు
గతంలో ఎస్పీగా పనిచేసిన ఆకే రవికృష్ణ అందించిన సహకారంతో గ్రామంలోని మహిళల్లో వినూత్న మార్పులు వచ్చాయి. మహిళలు పొదుపు సంఘాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నందున ఆర్థిక వనరులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం గ్రామంలో బ్యాంక్ ఏర్పాటు కావడం, రుణాలు ఇవ్వడంతో స్వయం ఉపాధి కార్యక్రమాలు పెరిగి వలసలు భారీగా తగ్గాయి.
– నారాయణ, స్టేషన్ హౌస్ ఆఫీసర్, కప్పట్రాళ్ల
హంద్రీనీవా జలాలు వస్తే..
కప్పట్రాళ్ల గ్రామం వరకు వచ్చిన హంద్రీనీవా జలాలను పి.కోటకొండకు విస్తరిస్తే వ్యవసాయపరంగా గ్రామం మరింత అభివృద్ధి చెందుతుంది. 10 వేలకు పైగా జనాభా కలిగిన గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం నిర్మించాలి. ఇందుకు దాత ఇచ్చిన స్థలం సిద్ధంగా ఉది.
– ఆర్ సీతారామిరెడ్డి,మాజీ సర్పంచ్, పి.కోటకొండ
ఉపకారం ఊరకే పోదు
ఊరికి చేసిన ఉపకారం ఊరకే పోదన్న నమ్మకంతోనే గ్రామాభివృద్ధి కోసం చదువుకున్న యువత సహకారంతో అనేక కార్యక్రమాలను చేపట్టి విజయవంతం అవుతున్నాం. రైతుల్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కొత్త పంటలను పరిచయం చేస్తున్నాం. 300 మందితో రైతు గ్రూపులను ఏర్పాటు చేశాం.
– ఎ.రంగస్వామి, అధ్యక్షుడు, చైతన్య యువజన సంఘం, కప్పట్రాళ్ల
Comments
Please login to add a commentAdd a comment