సాక్షి, హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల విషయంలో ముందుకెళ్లొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. కేంద్రం జల సంఘం, కృష్ణా బోర్డు పరిశీలనకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను అందించాలని కోరామని, అయితే ఆ డీపీఆర్‌లను ఇంత వరకు ఇవ్వలేదని గుర్తుచేసింది. తక్షణమే డీపీఆర్‌లను అందించాలని, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు వచ్చే వరకు పనులు నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు బోర్డు సభ్యుడు హరికేశ్ మీనా గురువారం ఏపీ జల వనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి లేఖ రాశారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పనుల టెండర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళుతోందంటూ ఈ నెల 5న తెలంగాణ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్పందించిన కృష్ణా బోర్డు ఈ లేఖ రాసింది. ఇప్పటికే జూలై 29న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన జీవో 203పై ముందుకెళ్లరాదని, బోర్డు, కేంద్ర జల సంఘం పరిశీలనకోసం డీపీఆర్‌లు పంపాలని, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందాలని సూచించినట్లు ఈ లేఖలో బోర్డు గుర్తు చేసింది.
కల్వకుర్తి ప్రమాదంపై నివేదికివ్వండి..
ఇటీవల కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌లో మోటార్లు నీట మునిగిన ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డు తెలంగాణను ఆదేశించింది. ఈ నివేదికను కేంద్ర జల శక్తి శాఖకు పంపిప్తామని ఓ లేఖలో స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment