Lift Irrigation Project works
-
‘పాలమూరు’ కోసంమళ్లీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి పర్యావరణ అనుమతుల ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అనుమతులు పొందే వరకు నిర్మాణ పనులు పూర్తిగా నిలిపివేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించిన నేపథ్యంలో అనుమతుల సాధన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే అవసరమైన అన్ని నివేదికలు సిద్ధం చేసిన ఇంజనీర్లు.. ప్రభుత్వం అనుమతించిన వెంటనే అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ శాఖకు దరఖాస్తు చేయనున్నారు. ఈఏసీ ఓకే అంటేనే అనుమతి.. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, ఇతర నిర్మాణాలకు 27,193 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా మరో 205.48 హెక్టార్ల మేర అటవీ భూములు అవసరం కానున్నాయి. ఇందులో ఇప్పటికే 26 వేల ఎకరాల మేర భూసేకరణ పూర్తికాగా ఆగస్టులో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ వివరాలతోపాటు ఇతర అంశాలపై ఇరిగేషన్ శాఖ అధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖకు ఈ వివరాలు సమర్పించాల్సి ఉన్నా ప్రభుత్వం మొదట గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను ముగించి ఆ తర్వాత కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ మొదలు పెట్టాలని భావించడంతో దీన్ని పక్కనపెట్టింది. అయితే ఎన్జీటీ పర్యావరణ అనుమతులు వచ్చేవరకు పనుల కొనసాగింపుపై ముందుకెళ్లొద్దని స్పష్టం చేయడంతో ఇప్పటికే సిద్ధం చేసిన నివేదికలను కేంద్ర పర్యావరణ శాఖకు పంపాలని ఇరిగేషన్ శాఖ భావిస్తోంది. ఈ నివేదికలను ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) పరిశీలించి పర్యావరణంపై పడే ప్రభావాన్ని మదింపు చేస్తుంది. ప్రాజెక్టు నిర్మాణాలకు ఎలాంటి అభ్యంతరం లేదని కమిటీ తేలిస్తేనే అనుమతుల ప్రక్రియ పూర్తి కానుంది. కేంద్రానికి దరఖాస్తు చేసిన రెండు నెలల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంటుందని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు. -
‘పాలమూరు–రంగారెడ్డి’ని ఆపాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయాల్సిందేనని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. పిటిషన్లకు విచారణ అర్హత లేదన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. పర్యావరణ అనుమతులు తప్పించుకోవడానికే తాగునీటి పేరు చెప్పి సాగునీటి ప్రాజెక్టు చేపడుతోందన్న ఏపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. పిటిషనర్లు పర్యావరణ అంశంతో ఆశ్రయించిన నేపథ్యంలో విచారణ పరిధి తమకుందని పేర్కొంది. పర్యావరణ అనుమతులు పొందే వరకూ ప్రాజెక్టుపై తెలంగాణ ముందుకు వెళ్లకూడదని ఆదేశాల్లో పేర్కొంది. సంయుక్త కమిటీలో తెలంగాణ సభ్యులు మినహా మిగతా సభ్యులు పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని పేర్కొన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని తాము విశ్వసిస్తున్నామని జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాల్లో స్పష్టం చేసింది. ‘పాలమూరు–రంగారెడ్డి’ని తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తోందని, ఇది ఆంధ్రప్రదేశ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందంటూ డి.చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, అవ్వ వెంకటసుబ్బారెడ్డి, ఎస్కే.జానీబాషా, వజ్రాల కోటిరెడ్డి, నరబోయిన వెంకటరావు, సిద్దదాపు గాంధీ, గరికపాటి వెంకటరామనాయుడు, అన్నెం సోరెడ్డి, పండిపాటి వెంకయ్యలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు వెలువరించింది. అనుమతులు తీసుకున్నాకే... తెలంగాణ, ఏపీ, పిటిషనర్ల, కేంద్రం తరఫున న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. ‘కేంద్ర పర్యావరణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అనుమతించింది. అయితే ఇది ప్రాజెక్టు నిర్మాణానికి కాదని గుర్తుచేసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిన ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని తెలంగాణకు కేంద్రం సూచించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించలేదని.. ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని కృష్ణా బోర్డు కూడా స్పష్టం చేసింది. ఇవన్నీ ఇలా ఉన్నా.. తెలంగాణ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించింది. ఈ నిర్ణయం పర్యావరణంపై ప్రభావం చూపడంతోపాటు ఏపీ ప్రజలు, పిటిషనర్ల (రైతులు) ప్రయోజనాలపైనా ప్రభావం చూపుతుంది. చెంచు గిరిజనులు ఉన్న ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం(పంప్‌హౌస్) చేపట్టడానికి తెలంగాణకు అనుమతి లేదు. 90 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తే ఇక సాగునీటికి కాలువలు తీయడం మినహా ఏమీ లేదు’అని తెలంగాణ సర్కార్‌కు తేల్చిచెబుతూ ఉత్తర్వులు జారీచేసింది. ► ‘ఎన్జీటీ చట్టంలోని సెక్షన్ 14(3) ప్రకారం కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన ఆరు నెలల్లోనే పిటిషన్ దాఖలు చేయాలనడం వాస్తవమే, సెక్షన్ 15 ప్రకారం పిటిషన్‌ను పరిశీలించే అధికారం మాత్రం మాకుంది’ ► ‘తెలంగాణ పేర్కొన్నట్లు 7.5 టీఎంసీలు తాగునీటికి అవసరం కాగా.. 90 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు కడుతున్నారంటే సాగునీటి అవసరాలకు కూడా అని భావిస్తున్నాం. పర్యావరణ అనుమతులు కూడా తాగునీటికే ఉన్నాయి.. సాగునీటికి కాదని కమిటీ స్పష్టం చేసింది’. ► ‘అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించి అనుమతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత.. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతితో పనులు చేపట్టాలి’ – పాలమూరు–రంగారెడ్డి కేసులో ఎన్జీటీ -
‘హుజురాబాద్ ఎన్నిక కోసమే భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు’
సాక్షి, వైఎస్సార్ కడప: జలయజ్ఞం ద్వారా సాగు నీటి ప్రాజెక్ట్‌లు నిర్మించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ సీ. రామచంద్రయ్య అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారని, రాష్ట్రానికి కేటాయించిన నీటినే తాము వాడుకుంటున్నాని అన్నారు. హుజురాబాద్ ఎన్నిక కోసమే భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం చాలా సున్నితమైన అంశమని, దాన్ని తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. కేటాయించిన జలాలనే వాడుకుంటున్నామని, అంతకు మించి వాడుకోవడంగాని, కొత్త ప్రాజెక్టును నిర్మించడం గాని చేయడంలేదని స్పష్టం చేశారు. లేని సమస్యను ఉన్నట్లుగా సృష్టిస్తూ ప్రజలను తెలంగాణ మంత్రులు రెచ్చగొడుతున్నారని, సీఎం కేసీఆర్ మంత్రులను కంట్రోల్ చేయాలన్నారు. ఇరు రాష్ట్రాల్లో సంపూర్ణ సాగు ప్రాజెక్టులకు జలయజ్ఞం ద్వారా లక్షల కోట్ల రూపాయల కేటాయించి నిర్మించిన మహానేత దివంగత వైఎస్సార్ అని గుర్తుచేశారు. ఆయన్ను నిందిస్తూ ఆరోపణలు చేయడం దారుణమని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి వైఎస్ ఎనలేని కృషి, పోరాటం చేశారని తెలిపారు. గతంలో తెలంగాణలోని చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభించారని, ఆ ప్రాంత నాయకులు గుర్తు పెట్టుకోవాలన్నారు. అన్ని ప్రాంతాలకు వైఎస్సార్ సాగునీరు అందించారని గుర్తుచేశారు. వైఎస్సార్‌పై విమర్శలు చేస్తున్న తెలంగాణ మంత్రులు చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. రైతాంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుంటుందని కృషి చేసిన వ్యక్తి వైఎస్సార్ అని తెలిపారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని గతంలో కేసీఆర్ కూడా అన్నారని ఎమ్మెల్సీ రామచంద్రయ్య గుర్తుచేశారు. చదవండి: భావోద్వేగాలను రెచ్చగొట్టడం తగదు -
అనుమతులు వచ్చే వరకు పనులు ఆపండి
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల విషయంలో ముందుకెళ్లొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. కేంద్రం జల సంఘం, కృష్ణా బోర్డు పరిశీలనకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను అందించాలని కోరామని, అయితే ఆ డీపీఆర్‌లను ఇంత వరకు ఇవ్వలేదని గుర్తుచేసింది. తక్షణమే డీపీఆర్‌లను అందించాలని, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు వచ్చే వరకు పనులు నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు సభ్యుడు హరికేశ్ మీనా గురువారం ఏపీ జల వనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి లేఖ రాశారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పనుల టెండర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళుతోందంటూ ఈ నెల 5న తెలంగాణ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్పందించిన కృష్ణా బోర్డు ఈ లేఖ రాసింది. ఇప్పటికే జూలై 29న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన జీవో 203పై ముందుకెళ్లరాదని, బోర్డు, కేంద్ర జల సంఘం పరిశీలనకోసం డీపీఆర్‌లు పంపాలని, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందాలని సూచించినట్లు ఈ లేఖలో బోర్డు గుర్తు చేసింది. కల్వకుర్తి ప్రమాదంపై నివేదికివ్వండి.. ఇటీవల కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌లో మోటార్లు నీట మునిగిన ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డు తెలంగాణను ఆదేశించింది. ఈ నివేదికను కేంద్ర జల శక్తి శాఖకు పంపిప్తామని ఓ లేఖలో స్పష్టం చేసింది. -
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు, జాతీయ హరిత న్యాయస్థానం(ఎన్జీటీ)లో పెండింగ్‌లో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పిటిషన్‌పై తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేత వంశీచందర్‌రెడ్డి, సామాజిక కార్యకర్త శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టుకు విచారణ పరిధి ఉంటుందని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు తెలిపారు. సుప్రీంకోర్టులో నదీ జలాల కేటాయింపు అంశం ఉందని ఏజీ తెలియజేశారు. అనుమతులు లేకుండా ఏపీ ప్రాజెక్టు పనులు చేపడుతోందని తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఎలా ఆదేశించగలదని హైకోర్టు ప్రశ్నించింది. డీపీఆర్ సమర్పించి, టెండర్లకు వెళ్లేందుకు ఏపీకి ఎన్జీటీ అనుమతిచిందని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్జీటీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదని హైకోర్టు ప్రశ్నించింది.(తీర్పును రిజర్వ్‌లో పెట్టిన ఎన్జీటీ) ఎన్జీటీకి విచారణ పరిధి లేదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. విచారణ పరిధిపై ముందు ఎన్జీటీ తేల్చాలని హైకోర్టు పేర్కొంది. పిటిషన్‌లోని అన్ని అంశాలు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఏజీ శ్రీరాం తెలిపారు. సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని ఏపీ ఏజీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు నిరవధిక వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టులో తేలిన తర్వాత తమ దృష్టికి తీసుకురావచ్చునని పిటిషనర్లకు తెలంగాణ హైకోర్టు సూచించింది. -
టెండర్ దక్కించుకున్న ఎస్పీఎంఎల్
సాక్షి, విజయవాడ: రాయలసీమ ఎత్తిపోతల టెండర్‌ను రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ ఆమోదించింది. రూ.3,307.07 కోట్లకు కోట్ చేసి.. ఎల్-1గా నిలిచిన ఎస్పీఎమ్మెల్(సుభాష్ ప్రాజెక్ట్స్ మ్యానుఫాక్చరర్స్ లిమిటెడ్-జేవీ)కి పనులను అప్పగించడానికి మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కర్నూల్ జిల్లా ప్రాజెక్ట్స్ సీఈకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా శ్రీశైలం జలాశయంలో 797 అడుగుల నుంచి రోజుకు మూడు టీఎంసీలను పీహెచ్ఆర్(పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్) దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో 4 కిమీ వద్దకు ఎత్తిపోసి, తెలుగుగంగ, గాలేరు-నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్ ఆయకట్టుకు నీళ్లందించే ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతలను రూపొందించిన విషయం తెలిసిందే.(రాయలసీమ ఎత్తిపోతల గురించి షెకావత్‌కు జగన్ లేఖ) ఈ నేపథ్యంలో ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా గత నెల 27న ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో సోమవారం ప్రైస్ బిడ్‌ను తెరిచి, ఈ-ఆక్షన్(రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. ఈ ప్రక్రియలో 0.88 శాతం అధిక ధర(రూ.3,307.07 కోట్లు)కు కోట్ చేసిన ఎస్పీఎమ్మెల్(జేవీ) ఎల్-1గా నిలిచింది. నవయుగ, మాక్స్ ఇన్ఫ్రాలతో పోటీ పడి పనులు దక్కించుకుంది. ఈ టెండర్ ప్రక్రియను కర్నూల్ ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్‌రెడ్డి ఎస్‌ఎల్‌టీసీకి పంపారు. ఈ క్రమంలో ఈఎన్సీ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన మంగళవారం విజయవాడలో సమావేశమైన ఎస్‌ఎల్‌టీసీ.. రాయలసీమ ఎత్తిపోతల టెండర్‌ను ఆమోదించింది. ఎల్-1గా నిలిచిన ఎస్పీఎమ్మెల్(జేవీ)కి పనులు అప్పగిస్తూ వర్క్ ఆర్డర్ జారీ చేయడానికి అనుమతి ఇచ్చింది. -
గాలేరు–నగరి.. హంద్రీ–నీవా అనుసంధానం
సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంతో హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ అనుసంధానం, చిత్రావతి రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి పులివెందుల, లింగాల మండలాల్లోని చెరువులను నింపడంతోపాటు యూసీఐఎల్ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ప్రభావిత ఏడు గ్రామాల ప్రజలకు నీటిని అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వైఎస్సార్ జిల్లా రాయచోటిలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు పథకాల ద్వారా కృష్ణా వరద జలాలను ఒడిసిపట్టి వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 1.41లక్షల ఎకరాలు సస్యశ్యామలం వైఎస్సార్ కడప జిల్లా గాలివీడు మండలం వెలిగల్లు వద్ద పాపాఘ్ని నదిపై 4.56 టీఎంసీల సామర్థ్యంతో వెలిగల్లు జలాశయాన్ని నిర్మించారు. కానీ, నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులవల్ల ఇది నిండటంలేదు. దీనివల్ల ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి నెలకొనడంతోపాటు చక్రాయిపేట మండలంలోని కాలేటివాగు జలాశయానికి కూడా నీరు చేరడంలేదు. అలాగే, హంద్రీ–నీవా సుజల స్రవంతి సామర్థ్యం తక్కువగా ఉండటంతో ఆ ప్రాజెక్టు రెండో దశలో భాగమైన శ్రీనివాసపురం రిజర్వాయర్, అడవిపల్లి రిజర్వాయర్లకు కూడా నీళ్లందించడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో.. కృష్ణా వరద జలాలను ఒడిసి పట్టి, ఆ జలాశయాలను నింపడం ద్వారా మెట్ట ప్రాంతాల్లోని 1.41 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. వెలిగల్లుకు కృష్ణా జలాలు కృష్ణా వరద నీటిని ఒడిసి పట్టడానికి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం సామర్థ్యాన్ని పెంచాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. గాలేరు–నగరి ప్రధాన కాలువ 56 కి.మీ. పాయింట్ నుంచి రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున కాలేటివాగు జలాశయంలోకి ఎత్తిపోసి ఆయకట్టుకు నీళ్లందిస్తారు. అలాగే, కాలేటివాగు జలాశయం నుంచి రోజుకు 450 క్యూసెక్కులను ఎత్తిపోసి.. చక్రాయిపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లోని చెరువులను నింపుతారు. ఇదే జలాశయం నుంచి రోజుకు 1,550 క్యూసెక్కుల చొప్పున లిఫ్ట్‌చేసి.. హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి 473 కి.మీ. వద్ద పోస్తారు. ఈ జలాలతో వెలిగల్లు, శ్రీనివాసపురం, అడవిపల్లి జలాశయాలను నింపి ఆయకట్టుకు నీళ్లందిస్తారు. కాగా, గాలేరు–నగరి ప్రధాన కాలువ నుంచి 48 రోజుల్లో 8.164 టీఎంసీలను తరలించేలా ఈ పథకం పనులు చేపట్టడానికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ పనులను ఇప్పటికే సర్వే సంస్థకు అప్పగించారు. ఈ పథకం పనులు చేపట్టడానికి రూ.1,272 కోట్లు అవసరం అవుతాయని అంచనా. యురేనియం సమస్యకు విరుగుడు పులివెందుల, లింగాల మండలాల్లో వర్షాభావ పరిస్థితులవల్ల చెరువుల్లోకి నీరు చేరడంలేదు. యురేనియం పరిశ్రమవల్ల మబ్బుచింతలపల్లి, కనంపల్లి, తుమ్మలపల్లి, కొట్టాలు భూమయ్యగారిపల్లి, రాచకుంటపల్లి, వేల్పుల గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమవడంవల్ల ఆ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి చిత్రావతి రిజర్వాయర్ నుంచి రోజుకు 350 క్యూసెక్కుల చొప్పున రెండు టీఎంసీలను తరలించి.. పులివెందుల, లింగాల మండలాల్లో చెరువులను నింపి, యురేనియం ప్రభావిత గ్రామాలకు జలాలను సరఫరా చేసి 25వేల ఎకరాలను సస్యశ్యామలం చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ పథకం పనులు చేపట్టడానికి వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ బాధ్యతలను ఇప్పటికే సర్వే సంస్థకు అప్పగించారు. ఈ పథకం పనులు చేపట్టడానికి రూ.108 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. -
లక్ష్యం చేరని చంద్రఘడ్ ఎత్తిపోతల పథకం
ఎగువ పరీవాహక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు కావాల్సినంత నీరు వచ్చి చేరింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ ఎత్తిపోతల పథకాలు విజయవంతంగా సాగుతున్నాయి. దీంతో ఆయకట్టు దారులు ఈ ఏడాది రెట్టింపు సాగు చేశారు. కానీ నర్వ మండలంలోని చంద్రఘడ్ ఎత్తిపోతలను పాలకులు, అధికారులు విస్మరించడంతో ఈ ప్రాంత రైతులకు నిరాశే మిగిలింది. సాక్షి, నారాయణపేట: రైతులకు సాగునీరు అందించడానికి చేపట్టిన చంద్రఘడ్ ఎత్తిపోతల పథకం డీలా పడిపోయింది. కృష్ణమ్మ చెంతనే ఉన్నా సాగునీరుకు నోచుకోక వేల ఎకరాలన్ని బీడు భూములుగా మారాయి. మండలానికి మంజూరైన ప్రధాన ఎత్తిపోతలు చంద్రఘడ్, కొండాదొడ్డి ఎత్తిపోతల పథకాలు కాంట్రాక్టుల కక్కుర్తికి ఏడాది కూడా నడవని పరిస్థితి దాపురించింది. కొండాదొడ్డి మూత పడగా, చంద్రఘడ్ ఎత్తిపోతల పథకం పరిస్థితి కూడా అలాగే అయ్యేలా ఉంది. ముచ్చటగా మూడు లిఫ్టులు.. చంద్రఘడ్ ఎత్తిపోతలలో ప్రధానంగా మూడు లిప్టులు ఉన్నాయి. ఇందులో చంద్రఘడ్ కింద 5 వేల ఎకరాలు, నాగిరెడ్డిపల్లి కింద 5 వేలు, బెక్కర్‌పల్లి కింద 5 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 2005 సంవత్సరంలో వీటి పనులను చేపట్టారు. ఇందుకుగాను ఒక్కో ఫేజుకు 5 వేల ఎకరాలతో 15 వేల ఎకరాల లక్ష్యంతో పనులను రూ.58 కోట్లు కేటాయించగా ఇందులో నాబార్డు ద్వారా రూ.36 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.18 కోట్లతో అప్పట్లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 18 నెలల గరిష్ట గడువుతో ఓ ప్రముఖ కంపెనీ పనులను చేపట్టింది. ఇందులో నాబార్డు ద్వారా రూ.36 కోట్లు మంజూరుకాగా ఈ నిధులతో పనులను చేపట్టిన కంపెనీ కృష్ణానది నిల్వ నీటి వద్ద పంప్‌హౌస్ నిర్మాణం, విద్యుత్ ఉపకేంద్రం, చంద్రఘడ్ పథకం మూడు దశలకు అందజేసే పంప్‌హౌస్‌కు పైప్‌లైన్ పనులు చేపట్టింది. అప్పట్లో పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో ప్రధాన కంపెనీ పనులు నాసిరకంగా చేయడంతో ప్రారంభంలో ట్రయల్ రన్‌లోనే చాలా చోట్ల పైపులు పగిలిపోయాయి. నిధుల అడ్డంకితో.. నాబార్డు ద్వారా మంజూరైన రూ.36 కోట్లను సింహబాగం పైప్‌లైన్ కొనుగోలు కోసం ఖర్చుచేశారు. చిన్న నీటి పారుదల సంస్థ నుంచి నిధులు విడుదల జాప్యంతో కాంట్రాక్టర్లు పనుల కోసం అదనపు నిధులు వ్యయం చేశారు. దీం తో ఐడీసీ అధికారులు అనేక మార్లు నిధుల విడుదల కోసం ప్రతిపాదనలు పంపినా ఏడేళ్ళ వరకు నిధుల కేటాయింపులే లేవు. దీంతో అదనపు కేటాయింపులు లేక పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వెనకాడారు. తదనాంతరం ప్రభుత్వం నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతలకు రూ.4.76 కోట్లు, చంద్రఘడ్‌కు రూ.4.95 కోట్లు, బెక్కర్‌పల్లికి రూ.5.66 కోట్ల చొప్పున నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ గతంలో అదనపు పనుల చేసిన వాటికి బిల్లులు పోను మిగిలిన నిధులతో పనులను ప్రారంభించారు. 15 వేల నుంచి 9,770 ఎకరాలకు.. జీఓ ఆర్టి 986 ప్రకారం నవంబర్ 4, 2012న ప్రభుత్వం ఈ మూడు లిఫ్టుల ఆయకట్టును 15 వేల నుంచి 9,770 ఎకరాలకు తగ్గించింది. ఇందులో 9,770 ఎకరాల భూమి ఐడీసీ స్కీం, రాజీవ్‌భీమ లిఫ్టు సంగంబండ రిజర్వాయర్, భూత్పూరు రిజర్వాయర్ ఆయకట్టు కింద ఉన్నదని గ్రహించి రెండు శాఖల సమన్వయం లేనందున ఈ జీఓ ద్వారా రాజీవ్ భీమ లిఫ్టు ఆధీనంలో కాలువలు పూర్తిచేసి ఐడీసీ వారికి ఇచ్చేందుకు ఆదేశాలు జారిచేసింది. రాజీవ్ భీమానా..? ఐడీసీనా..? రైతులు ఉన్న 9,770 ఎకరాల భూమికి ఐడీసీ నుంచో రాజీవ్ లిఫ్టు నుంచి నీరు కోరుకుంటే ఇందులో ఒక తిరకాసు ఉంది. ఐడీసీ నుంచి కాలువలు ఏర్పాటైతే పంట కాలువలకు భూమి నష్ట పరిహారం చెల్లించరు. రాజీవ్ లిఫ్టు నుంచి నీరు కోరుకుంటే రైతుల పొలాలకు నష్ట పరిహారం వస్తుంది. దీంతో రైతులు రాజీవ్‌లిఫ్టు వైపే మొగ్గు చూపారు. కానీ ల్యాండ్ యాక్వేషన్ లేకపోవడంతో నష్టపరిహారం రాదని పిల్లకాల్వల తవ్వేందుకు రైతులు ఉత్సాహం చూపడం లేదు. మేజర్ ఇరిగేషన్లో కలపాలి 1500 హార్స్‌పవర్స్ కలిగిన మోటర్లను రైతులే నిర్వహణ చేయాలంటే చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ పథకాన్ని మేజర్ ఇరిగేషన్లో కలిపితేనే నిర్వాహణ సాధ్యమవుతుంది. కనీసం ఒక్క మాన్‌సూన్‌లోనైన పూర్తి ఆయకట్టుకు నీరు ఇవ్వలేక పోతున్నాం. దీంతో రైతులు నిర్వాహణకు డబ్బులు కట్టడం లేదు. ఎమ్మెల్యే నిధులను వాడుకునేందుకు అధికారులు ఎస్టిమేషన్ వేయడంలేదు. దీంతో అడుగడుగున లీకేజీలతో ఈ ఖరీఫ్‌లో సాగు కష్టమే అనిపిస్తుంది. – సత్యనారాయణరెడ్డి అధ్యక్షుడు, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకం -
‘పాలమూరు’ పనులకు పునాదిరాయి!
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా సాగు అవసరాలను తీర్చుతూ, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ఆయకట్టుకు సాగు సదుపాయం కల్పించేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథక పనులకు నేడు పునాదిరాయి పడనుంది. మొత్తంగా 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి తాగునీరు, పరిశ్రమలకు నీటి వసతిని కల్పించే ఉద్దేశంతో చేపడుతున్న పథకం పనులకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తంగా 18 ప్యాకేజీలుగా విభజించిన ప్రాజెక్టులోని ఆరు ప్యాకేజీల పనులు శుక్రవారం మొదలు కానున్నాయి. నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల పరిధిలోని పనులను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఆయనతోపాటు జిల్లా మంత్రు లు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటలకు కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేస్తారు. 10.15 గంటలకు గోపాల్పేట మండలం ఏదుల వద్ద రిజర్వాయర్ పనులను ప్రారంభించి, సభలో మాట్లాడతారు. 12 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూ. 35,200 కోట్లతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా శ్రీశైలం నుంచి 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని, వరద జలాలను తీసుకొని మహబూబ్‌నగర్ జిల్లాలోని 11 నియోజకవర్గాల్లోని 37 మండలాల్లో కరువు కోరల్లో చిక్కుకున్న 718 గ్రామాల్లోని 7లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 7 నియోజకవర్గాల్లోని 26 మండలాల్లోని 400 గ్రామాల్లో ఉన్న 5లక్షల ఎకరాలు, నల్లగొండలోని 2 నియోజకవర్గాల్లోని 5 మండలాల్లోని 13 గ్రామాల్లోని 30వేల ఎకరాలకు కలిపి మొత్తంగా 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని సంకల్పించారు. దీనికోసం మొత్తంగా 6 రిజర్వాయర్లు, 5 లిఫ్టులను ప్రతిపాదించారు. నార్లాపూర్ (8.61 టీఎంసీ), ఏదుల (6.55 టీఎంసీ), వట్టెం (16.58 టీఎంసీ), కరివెన (19.15 టీఎంసీ), ఉద్దండాపూర్ (15.91 టీఎంసీ), కేపీ లక్ష్మీదేవునిపల్లి (2.80 టీఎంసీ)ల సామర్థ్యాలతో నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని 5 రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులను 18 ప్యాకేజీలుగా విభజించి, రూ. 30వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి, వాటిని దక్కించుకున్న కాంట్రాక్టర్లకు పనులను అప్పగించారు. సమాంతరంగా అన్ని పనులు పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు నిర్ణీత కాలవ్యవధి పెట్టుకొని పనులన్నింటినీ ఏకకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టుకు ఇప్పటికే 9 వేల ఎకరాల సేకరణ పూర్తయింది. మిగతా సేకరణను త్వరగా పూర్తి చేసి ఏజెన్సీలకు సహకరించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల ద్వారా 8 లక్షల ఎకరాలు, నిర్మాణంలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా మరో 7లక్షల ఎకరాలకు నీరందించి, జిల్లాను కరువు నుంచి విముక్తి చేయాలని సూచించారు.