సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి పర్యావరణ అనుమతుల ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అనుమతులు పొందే వరకు నిర్మాణ పనులు పూర్తిగా నిలిపివేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించిన నేపథ్యంలో అనుమతుల సాధన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే అవసరమైన అన్ని నివేదికలు సిద్ధం చేసిన ఇంజనీర్లు.. ప్రభుత్వం అనుమతించిన వెంటనే అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ శాఖకు దరఖాస్తు చేయనున్నారు.
ఈఏసీ ఓకే అంటేనే అనుమతి..
ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, ఇతర నిర్మాణాలకు 27,193 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా మరో 205.48 హెక్టార్ల మేర అటవీ భూములు అవసరం కానున్నాయి. ఇందులో ఇప్పటికే 26 వేల ఎకరాల మేర భూసేకరణ పూర్తికాగా ఆగస్టులో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ వివరాలతోపాటు ఇతర అంశాలపై ఇరిగేషన్ శాఖ అధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖకు ఈ వివరాలు సమర్పించాల్సి ఉన్నా ప్రభుత్వం మొదట గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను ముగించి ఆ తర్వాత కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ మొదలు పెట్టాలని భావించడంతో దీన్ని పక్కనపెట్టింది. అయితే ఎన్జీటీ పర్యావరణ అనుమతులు వచ్చేవరకు పనుల కొనసాగింపుపై ముందుకెళ్లొద్దని స్పష్టం చేయడంతో ఇప్పటికే సిద్ధం చేసిన నివేదికలను కేంద్ర పర్యావరణ శాఖకు పంపాలని ఇరిగేషన్ శాఖ భావిస్తోంది.
ఈ నివేదికలను ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) పరిశీలించి పర్యావరణంపై పడే ప్రభావాన్ని మదింపు చేస్తుంది. ప్రాజెక్టు నిర్మాణాలకు ఎలాంటి అభ్యంతరం లేదని కమిటీ తేలిస్తేనే అనుమతుల ప్రక్రియ పూర్తి కానుంది. కేంద్రానికి దరఖాస్తు చేసిన రెండు నెలల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంటుందని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment