
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచే వాటా నీటిని వినియోగించుకుని రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి సౌకర్యాలను మెరుగుపర్చడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి కాలువ), టీజీపీ (తెలుగుగంగ), గాలేరు–నగరి, కేసీ కెనాల్‌ల ఆయకట్టుకు ఇప్పటికే నీటిని అందిస్తున్నారని, ఆ ఆయకట్టును స్థిరీకరించేందుకు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పనులకు పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 6న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) సాంకేతిక పరిశీలనకు పంపేందుకు జలవనరుల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. పాత ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించడం కోసం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు నిబంధనల ప్రకారం సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇస్తుందని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఎత్తిపోతలకు వర్తించదని గతంలోనే నివేదిక..
రాయలసీమ ఎత్తిపోతల వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ తెలంగాణకు చెందిన ఒక రైతు ఎన్జీటీ(జాతీయ హరిత న్యాయస్థానం)ని ఆశ్రయించడంతో పర్యావరణ అనుమతితో ఆ పథకాన్ని చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఎన్జీటీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ)–2006 నోటిఫికేషన్ పరిధిలోకి రాయల సీమ ఎత్తిపోతల రాదని స్పష్టం చేస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ జూలై 29న నివేదిక ఇచ్చింది. పాత ఆయకట్టుకు నీళ్లందించడానికే రాయలసీమ ఎత్తి పోతల చేపట్టారని, ఈ పథకం ద్వారా విద్యుదుత్పత్తి చేయడం లేదని, జలాశయాలను కొత ్తగా నిర్మించడం లేదని పేర్కొంది. అందువల్ల ఈ పథకానికి పర్యా వరణ అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతలకు పర్యా వరణ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు.
అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాల ప్రకారం..
కృష్ణా, గోదావరి జలాల విని యోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఈనెల 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ సర్కార్ కొత్తగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, తుమ్మిళ్ల ఎత్తిపోతల, నెట్టంపాడు, కల్వకుర్తి, ఎస్సెల్బీసీ సామర్థ్యం పెంపు, మిషన్ భగీరథ, భక్తరామదాస ఎత్తిపోతల డీపీఆర్‌లు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఇదే తరహాలో రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించారు. ఈ మేరకు సీడబ్ల్యూసీకి డీపీఆర్ పంపేందుకు జలవనరుల శాఖ సిద్ధమైంది. నీటి కేటాయింపులు ఉన్న పాత ప్రాజెక్టుల ఆయకట్టు స్థిరీకరణకు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నిబంధనల ప్రకారమే సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇస్తుందని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment