![మోడల్ స్కూళ్లు](/styles/webp/s3/article_images/2017/09/2/71387222463_625x300.jpg.webp?itok=tsfiF5NY)
మోడల్ స్కూళ్లు
=అక్షరాస్యత పెంపు ధ్యేయం
=ప్రత్యేక పాఠశాలల రాష్ట్ర మోనటరింగ్ అధికారి రవికాంత్ వెల్లడి
మునగపాక, న్యూస్‌లైన్ : మహిళల్లో అక్షరాస్యత శాతం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పలు మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుందని ప్రత్యేక పాఠశాలల రాష్ట్ర మోనటరింగ్ అధికారి కె. రవికాంత్ అన్నారు. మండలంలోని పాటిపల్లి మోడల్ స్కూల్‌ను ఆయన సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల పరిశీలనలో భాగంగా ఆయన ఇక్కడి స్కూల్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. హాస్టల్ నిర్మాణం పూర్తయితే మోడల్ స్కూల్‌కు సంబందించిన ఉపాధ్యాయులలో ఒకరిని వార్డెన్‌గా నియమిస్తామన్నారు. హాస్టల్ మోనటరింగ్‌ను వార్డెన్ చూసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.
]
మోడల్ స్కూళ్లలో చేరేందుకు ఉత్సాహం : రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లలో చదువుకునేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారని రవికాంత్ అన్నారు. మోడల్ స్కూల్ తనిఖీలో భాగంగా తనను కలిసిన విలేకరులతో రవికాంత్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 356 పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మరో 324 పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయుల నియామకం వల్ల విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. పలు పాఠశాలల్లో హాస్టల్ నిర్మాణాలు పూర్తి కావచ్చాయన్నారు.
ఇవి పూర్తయితే బాలికలకు ఎంతగానో సదుపాయం ఉంటుందన్నారు. ఇంతవరకు గ్రామీణప్రాంతాల్లో జూనియర్ కళాశాలలు లేకపోవడంతో మహిళలు చదువులకు దూరంగా ఉండేవారని చెప్పారు. ఈ మోడల్ స్కూళ్ల ఏర్పాటు వలన ఇటువంటి సమస్య ఉండదని తెలిపారు. మహిళల ఉన్నత విద్యాభ్యాసానికి మోడల్ స్కూళ్లు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. రవాణా సమస్య గురించి మాట్లాడుతూ, బస్సు ఏర్పాటుకు సంబంధిత ఆర్టీసీ డిపోనుంచి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు.
పిల్లల్లో ఒకరిగా.. : తనిఖీల సందర్భంగా రవికాంత్ ఉపాధ్యాయుల పనితీరును, విద్యార్థుల హాజరుశాతాన్ని గమనించారు. విద్యాబోధన తీరును గమనించేందుకు పాఠశాల గదుల్లో విద్యార్థుల మధ్య కూర్చుని పాఠాలు విన్నారు. బాలుర, బాలికల టాయ్‌లెట్లను, ప్రయోగశాలలను పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న హాస్టల్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.